బయటి నుంచి వేగంగా దూసుకువస్తోంది ఓ మోటారు బైక్. దాని వెనుకగా చాలా దూరంలో ఒకటొకటిగా వస్తున్నాయి టాక్సీలు, కార్లు ఆటోలు.
అప్పుడే ఎయిర్ పోర్టు క్యాంపస్ లోకి ట్రాఫిక్ ని అనుమతించారు.
దూసుకు వచ్చిన ఆ బైక్ కీచుమన్న బ్రేకుతో ఆమె ముందు ఆగింది.
అదిరిపడిందామె.
దాని మీద నుండి దూకాడో వ్యక్తి.
అతని చేతిలో తళతళ మెరుస్తోంది ఓ బటన్ నైఫ్.
గిర్రున వెనక్కి తిరిగింది ఆమె.
సంజుకు పది అడుగుల దూరంలో వెనక నుండి ఆమె వైపు పరిగెత్తుకు రాసాగాడు నీగ్రో వ్యక్తి.
గుండెలు అవిసిపోయేలా పరిగెడుతోంది ఆమె.
ఆ వెనుకనే పరుగెత్తుతున్నాడు నైఫ్ పట్టుకున్న ఆ వ్యక్తి.
సరిగ్గా అదే సమయంలో ఆమె కళ్ళకొక వ్యక్తి కనిపించాడు.
ఖాకీ దుస్తుల్లో వున్నాడతను. అతని పక్కనే ఒక జీప్ వుంది. దాని మీద పోలీస్ అన్న ఇంగ్లీషు అక్షరాలు తెల్లగా మెరుస్తున్నాయి.
భారతీయ పోలీసులు ఖాకీ రంగు యూనిఫాం ధరిస్తారు అన్న ఆలోచన ఆమెకు లేకపోయినా, జీప్ మీద పోలీస్ అని ఉన్న అక్షరాల వల్ల ఆమెకు ఆ వ్యక్తి ఎవరో తెలియచెప్పాయి.
"హెల్ప్" గుండెలు పగిలేలా అరిచిందామె.
ఆ పోలీస్ అధికారి చెవిన అవి చేరలేదు .అతను జీప్ లోకి ఎక్కాడు.
శక్తినంతటిని కాళ్ళలో కేంద్రీకరించి పరిగెడుతోంది ఆమె.
ఆమె కాళ్ళకి ధరించిన హైహీల్స్....ఆమె పరుగు వేగాన్ని తగ్గిస్తున్నాయి.
కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగుతున్నాయి ఆమెకు.
"హెల్ప్" రక్తనాళాలు తెగిపోయేలా అరిచింది ఆమె.
ఆ పోలీస్ అధికారి జీపు స్టార్ట్ చేసిన శబ్దంలో కలిసిపోయిందా అరుపు.
ఆమెను చంపితీరాలన్న కసితో దూసుకు వస్తున్నాడా వ్యక్తి.
"హెల్ప్" ఆమె చివరిసారి అరిచింది.
అది వినపడని ఆ పోలీస్ అధికారి జీప్ ఎయిర్ పోర్టు క్యాంపస్ నుండి బయటకి దూకింది.
* * * *
కాలింగ్ బెల్ మోగగానే లేచి వెళ్ళి డోరు తెరిచింది అర్చన.
"ఏమిటమ్మా చాలా హడావిడి పెట్టి పిలిచావు?" అంటూ లోపలికి వచ్చాడు ఆమె మేనమామ శేషగిరిరావు.
సోఫాలో కూర్చుంటూ కాళ్ళకున్న చెప్పులు విడిచాడు.
కొంచెం ఒళ్ళు విరుచుకున్నట్లుగా చేసి 'కాసిని మంచినీళ్ళు తెచ్చి పెట్టమ్మా' అన్నాడు.
"జస్ట్ మినిట్ అంకుల్" అంటూ ఫ్రిజ్ వైపు కదిలి దాని డోరు ఓపెన్ చేసి అందులో నుండి బాటిల్ తీయబోతూ ఏదో గుర్తుకు రావటంతో ఫ్రిజ్ తలుపు మూసి కిచెన్ లోకి వెళ్ళి స్టీల్ బిందెలో వున్న నీళ్ళు గ్లాసులో తీసుకుని తిరిగి వచ్చి శేషగిరిరావుకి యిచ్చింది.
ఆమెకు తెలుసు .శేషగిరిరావుకి గొంతు సంబంధమైన ఎలర్జీ వుందని. చల్లని నీళ్ళుకానీ, కూల్ డ్రింక్స్ కానీ తాగాడంటే గొంతునెప్పి వస్తుంది. అందుకే ఎక్కడా చల్లటి వస్తువులు ముట్టుకోడు.
ఖాళీ గ్లాసు క్రింద వుంచుతూ "ఇప్పుడు చెప్పమ్మా! ఏమిటా ముఖ్య విషయం? నీ భర్త గురించా?"
ఆమె ముఖంలో రంగులు మారాయి.
కాదు అన్నట్లుగా తల అడ్డంగా వూపింది.
"మరేమిటో....అంత ఇంపార్టెంట్ మేటర్"
"ఇది....పవన్....గురించి"
"పవన్ గురించా!"
"అవును"
"పవన్ గురించి ఏముంది? అడగటానికి? మాట్లాడటానికి. చిన్న వయస్సులోనే నూరేళ్ళు నిండిపోయాయి. ఆ భగవంతుడు తీసుకు వెళ్ళిపోయాడు."
"అది అబద్ధమని అనుమానం."
ఆమె అన్నది ఏమిటో అర్ధం కాలేదు శేషగిరిరావుకి.
"అర్ధం కాలేదా! అంకుల్....పవన్....బ్రతికే వున్నాడని నా నమ్మకం."
ఒకసారి ఎగాదిగా ఆమెను చూశాడు ఆయన.
ఆమెకు మతిభ్రమించిందేమోనని అనుమానం వచ్చింది. అదే మాట అన్నాడు.
"ఆర్ యూ మాడ్?"
"నిజం....అంకుల్....పవన్ బ్రతికే వున్నాడని గట్టిగా అనిపిస్తోంది."
"చూడమ్మా....నువ్వు ఆ రోజు శవాన్ని చూడలేకపోయావు. అందువల్ల అతను చనిపోలేదేమోననే భ్రమలో వుండడం సహజం. బట్ నేను చూశాను కదమ్మా!"
"అంకుల్....నేను భ్రమలో లేను. మీరు కూడా పవన్ శవాన్ని చూశారు కానీ ముఖం చూశారా?"
"ముఖం అంతా గుర్తుపట్టలేనంతగా క్రష్ అయింది. బట్....నా చేతుల మీదుగా పెరిగిన పవన్ ని గుర్తుపట్టలేనా? ఆ రోజు డ్రస్ కూడా నేను పవన్ పుట్టిన రోజున కొని ఇచ్చినదే!"
"మీరు పవన్ ని స్మశానంలో ఖననం చేసిన టైంకి ప్రాణం పోయిందా?"
"ఈ పిచ్చి ప్రశ్నలేమిటమ్మా? ప్రాణం వున్న మనిషిని పాతిపెడతామా?"
"ఒకవేళ....ప్రాణం అప్పటికి పోలేదేమో?"
శేషగిరిరావు ముఖంలో అసహనం తొంగిచూసింది.
"ఇప్పుడు ఏమంటావు?"
"ఒకసారి...."
"ఆ....ఒక్కసారి?"
"మనం....ఆ శ్మశానానికి వెళ్ళి...."
"వెళ్ళి" ఆమె ఏం చెప్పబోతోందో అర్ధంకాక అయోమయంగా చూశాడు.
"వెళ్ళి....పవన్ ని పాతిపెట్టిన చోట....ఒకసారి....త్రవ్వి....చూస్తే"
అదిరిపడ్డాడు శేషగిరిరావు.
అతని నాలుక ఎండిపోయినట్లనిపించింది.
* * * *
"హెల్ప్"
స్వరపేటిక తెగిపోయేలా ఆమె అరిచిన అరుపు వేగం అందుకున్న జీపు శబ్దంలో కలిసిపోయింది.
గిర్రున వెనక్కి తిరిగి చూసిందామె.
సుమారు ఇరవై అడుగుల దూరంలో వున్నాడా వ్యక్తి.
ఆ వెనుకనే పరిగెడుతూ తనని సమీపించే ప్రయత్నం చేస్తున్నాడు ఆ నీగ్రో వ్యక్తి కూడా.
తిరిగి పరిగెత్తనారంభించింది ఆమె.
గుండెలు అవిసిపోయేలా పరుగెడుతోంది.
'జీవితపు చివరిక్షణాలు అవి' అనిపించింది ఆమెకు.
వారి మధ్య దూరం తరుగుతోంది.
ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
శరీరంలోని రక్తం అంతా ముఖంలోకి పంప్ అవుతున్నట్లుంది.
అతను ఆమెకు పదడుగుల దూరంలోకి వచ్చాడు.
సరిగ్గా అదే సమయంలో....
కీచుమన్న శబ్దం అవటంతో, అదిరిపడి తలతిప్పి వెనక్కి చూసింది సంజు.
ఆమెకు, ఆ వ్యక్తికి మధ్యలో సడన్ బ్రేకుతో ఆగిందో అంబాసిడర్ కారు. అదిరిపడి రెండడుగులు వెనక్కి వేశాడు ఆ వ్యక్తి కూడా.
వెంట్రుకవాసిలో ఘోర ప్రమాదం తప్పిపోయిందతనికి.
ఒక్క అడుగు ముందుకు వేసి వుంటే....
ఆ కారు క్రిందపడి మరణించి వుండేవాడు.
ఆ కారు ఎవరిదో....వాళ్ళిద్దరి మధ్యకు ఎందుకు అలా వచ్చిందో అర్ధం చేసుకోవలసి చేసిన ప్రయత్నంలో క్షణకాలం ఆగాడతను.
కారుకు అవతలివైపు ఆమె వుండాలి.
రెండు సెకన్ల తరువాత తిరిగి దూసుకుపోయింది కారు.
కారు తనని దాటగానే అటు చూసిన ఆ వ్యక్తికి కళ్ళు మసకలు కమ్మినట్లయింది.
కారణం....
ఆమె లేదు.
చుట్టూ కలయచూశాడు. ఆమె కనిపించలేదు.
అప్పటికి ఆ కారు వందగజాల దూరం పైగా దూసుకుపోయింది.
అంటే....
ఆమెని ఎవరో కారులోకి లాగేశారు.
ఆ కారులో ఆమె వెళ్ళిపోయింది.
ఆ కారులో ఎవరైనా వచ్చి ఆమెను రక్షించారా! లేక మరెవరైనా కిడ్నాప్ చేశారా! ఏమో!
* * * *
"పవన్ తాలూకు జ్ఞాపకాలు నిన్ను ఇంకా వదలలేదమ్మా! దట్స్ ది రీజన్ యువార్ టాకింగ్ దిస్ వే!" నుదిటిమీది స్వేదాన్ని కర్చేఫ్ తో తుడుచుకుంటూ అన్నాడు శేషగిరిరావు.
ఆమె మాట్లాడలేదు.
ఆమె చూపులు ఆ గదికి మూలగా వున్న ఇండోర్ ప్లాంట్ మీద వున్నాయి.
రెండు నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా గడిచాయి.