"అదే సమయంలో....
ఆ షాపులోకి పదిమంది వ్యక్తులు ప్రవేశించారు. అందరి చేతులలోనూ మారణాయుధాలు తళతళా మెరుస్తున్నాయి.
వాళ్ళ వెనుకనే వచ్చిన వ్యక్తి....శంకర్ దాదా!
అతనిని చూడడంతో కౌంటర్ లో వున్న సేఠ్ జీకి వెన్నులోనుంచి చలి మొదలైంది.
అనుచరుల మధ్యనుంచి ఠీవిగా నడుచుకుంటూ సేఠ్ జీని సమీపించాడు శంకర్ దాదా.
షాపులో ఉన్న కస్టమర్లు అందరూ ఖంగారుగా చేతులోని నగలను అలానే వదిలేసి ఎక్కడ వారక్కడ బొమ్మల్లా నిలిచి, జరిగే దారుణాన్ని చూస్తుండిపోయారు.
శ్రీప్రియ గుండె కొట్టుకునే వేగం పెరిగింది.
ఆ బస్తీలో శంకర్ దాదాను గురించి ఆమె కూడా వినివున్నది. రెండు రోజుల క్రితం అతని దారుణాలు ఎలా వుంటాయో దూరంనుంచి స్వయంగా చూసింది కూడా!
కానీ అతనిని అంత స్పష్టంగా దగ్గరగా చూడడం అదే తొలిసారి.
అతని కంటపడిన అందమైన ఆడపిల్లలు ఎందరో అతని కామదాహానికి బలైపోయారన్న విషయం ఆమెకు తెలియనిదేమీ కాదు.
అందుకే బిక్కుబిక్కుమంటూ అతన్నే పరిశీలనగా చూస్తుందామె!
"ఏరా బేవకూఫ్....నా మామూలు పంపలేదేంటిబే....నన్నేరప్పిస్తావురా బద్మాష్....ఈ శంకర్ దాదా తడాఖా ఏమిటో ఇప్పుడు నీకు చూపించమంటావా."
ఇనుపగొలుసులు ఒకదాని కొకటి తగిలిన శబ్దాలు ఎలా వుంటాయో అంతకర్ణభీకరంగా వున్నాయి శంకర్ దాదా మాటలు.
సేఠ్ జీ నోట పలుకు లేకుండా గజగజావణికిపోతున్నాడు.
నిజానికి....అతను మామూళ్ళు పంపకపోవడానికి కారణం వుంది....అతన్ని తుదముట్టించడానికి రాణా దగ్గర డీలింగ్స్ కుదుర్చుకున్న పెద్ద మనుషుల్లో ఈ సేఠ్ జీ కూడా ఒకడు. ఎలాగూ అతన్ని ఈ లోకంలో నుంచి లేపెయ్యడానికి బేరం సెటిలైపోయింది కదా అనే ధీమాతో మామూళ్ళు అడగడానికి వచ్చిన శంకర్ దాదా మనుషులను తన మనుషులచేత వెళ్ళగొట్టించాడు.
ఫలితం....ఇప్పుడు అనుభవించబోతున్నాడు.
"సేఠ్ జీ....ముందు మర్యాదగా అడిగినప్పుడు ఇచ్చివుంటే బాగుండేది....ఇవ్వకుండా నా మనుషుల్ని అవమానించి నన్ను రప్పించినందుకు, ఇప్పుడు ఇక్కడ నీ షాపులోవున్న కస్టమర్లందరినీ నిలువు దోపిడీ చేయిస్తాను.... వాళ్ళంతా నీపై తిరగబడి నిన్ను గుల్ల చేయకమానరు....నేను దోచుకుని పోగా మిగిలింది వాళ్ళకు పంచిపెడితే నీకు మిగిలేది చివరకు చిప్పే...."అంటూ మిగిలిన మాటలను మధ్యలోనే ఆపేశాడు శంకర్ దాదా.
కస్టమర్లు అందరూ అతని నిర్ణయం వినడంతో కనిపించని దేవుళ్ళకు మొక్కుకోసాగారు.
"వ్వా....ఏం అందం....ఏం చందం....మార్వలెస్...."
శంకర్ దాదా చూపులు ఒక్కసారిగా శ్రీప్రియ మీద నిలిచిపోయాయి. ఆమెను చూసిన మరుక్షణం అతని కాళ్ళు ఆమె దగ్గరకు నడిచాయి.
తనవైపే వస్తున్న శంకర్ దాదాను చూస్తూ గుటకలు మ్రింగడం మినహా ఏమీ చేతకాని అసహాయతతో తల్లడిల్లిపోతోంది శ్రీప్రియ.
ఏం జరగబోతుందో అర్ధంకాక కస్టమర్స్ గుండెలలో రైళ్ళు పరుగెడుతున్నాయి.
ఏమాత్రం అవకాశం దొరికినా కన్నుమూసి తెరిచేలోగా ఆ షాపులోనుంచి పారిపోయి వుండేవాళ్ళు కానీ లోపలి వాళ్ళు బయటకు వెళ్ళే అవకాశం లేకుండా దాదా మనుషులు తమ ఆయుధాలతో డోర్ దగ్గర ధ్వజస్తంభాల్లా నిలిచివున్నారు.
అందుకే ఎవ్వరూ అలాంటి సాహసం చేయలేకపోయారు.
శ్రీప్రియ సమీపించాడు శంకర్ దాదా.
"అందంగా వున్నావు పాపా...ఈ షాపులోని నగలన్నీ నీకు ప్రజెంట్ చేస్తా...నాతో వుంటావా?" ఆ మాట అన్నది ఇంకెవరయినా అయివుంటే అతని ముఖం షేపులు మారిపోయి వుండేది. కాని పోలీసులు కూడా శంకర్ దాదా విషయంలో కలుగ చేసుకోరన్న విషయం రెండు రోజుల క్రితమే ఆమె తెలుసుకున్నది.
అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనం వహించింది.
"ఏం పిల్లా....మాట్లాడవు....నీ మీద ఎలాంటి జబర్దస్తీ చేయనులే....అందమైన సుకుమారిని బాధించేటంత కరుకువాడిని కాదులే...."
శ్రీప్రియ పెదవులు బిగపట్టి కళ్ళెర్రచేసింది.
"ఏమిటి పాపా....కళ్ళెర్రబడుతున్నట్టున్నాయి....పిచ్చిమొహమా....నన్ను పెళ్ళి చేసుకున్నావంటే చిలకలగూడా రాసిస్తా....బిర్లామందిరంలో పెళ్ళి చేసుకుని ఎంచక్కా రవీంద్రభారతిలో శోభనం జరుపుకుందాం__ఏమంటావ్?"
ఆవేశంతో ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
శ్రీప్రియకు కరాటే వచ్చు....అయినంత మాత్రాన తను నరరూప రాక్షసుడివంటి ఆ దాదాను ఎదిరించి ప్రాణాలతో బయటపడడం కల్ల అని తెలుసు కాబట్టి మౌనం వహించింది.
ఆమె చేయి పట్టుకుని తనమీదకు లాగడానికి ముందుకు వంగాడు శంకర్ దాదా.
అంతటితో శ్రీప్రియలో సహనం చచ్చిపోయింది.
"ఒరేయ్....పందిలా బలిశావు. అమ్మకు, ఆలికి తేడా తెలియని వాడివి. నీ ముఖానికి పెళ్ళాం కావలసి వచ్చిందిరా వెధవా....కంటికి కనిపించిన ప్రతి ఆడపిల్లనూ కామించడానికి నీకు సిగ్గులేదూ....నా జోలికి వచ్చావంటే నేను ఆదిశక్తి అవతారం ఎత్తుతాను....జాగ్రత్త" తన పౌరుషాన్ని బయటపెట్టింది శ్రీప్రియ.
ఊహించని ఆమె సమాధానానికి శంకర్ దాదా దవడ కండరాలు బిగపట్టాడు.
ఆ ఏరియాలలో తనను ఎదిరించగలిగే అమ్మాయిలే లేరు....తొలిసారిగా ఒక పొగరుబోతుపిల్ల తనను ఎదిరించి మాట్లాడుతోంది....