"ఒరేయ్! అన్నీ ఒక్కరోజే తింటే అజీర్తి చేసి చస్తావ్"
"అజీర్తి మీలాంటి డబ్బున్న వాళ్ళకిరా! బీదాళ్ళకు ఆకలిరోగం ఒక్కటే! ఇంకో రోగమూ వాళ్ళ దరికి కూడా చేరదు."
"సరే కానీ- నా సొమ్మేం పోయింది!"
వంటవాడు వెళ్ళిపోయాడు.
"ఓ చెస్ ఆట వేద్దామా?" అడిగాడు రాజశేఖరం.
"ఓ రడీ!"
నౌఖర్ చెస్ బోర్డ్ తీసుకొచ్చి వాళ్ళ ముందుంచాడు. "ఒరేయ్! నేను గెలుస్తే నువ్వు ఒక రూపాయి ఇవ్వాలి. నువ్వు గెలిస్తే నేను పది వేలిస్తాను"
రెండో ఆట కూడా ఓడిపోయేసరికి కనకారావ్ కి చిరాకేసుకొచ్చింది.
"చెస్ ఆటలోనే కాదురా! ఎందులో అయినా డబ్బున్నవాడే గెలుస్తాడు. ఎందుకంటే వాడి తెలివితేటల్ని పెంచుకునే అవకాశాలుంటాయ్, వాడికే డబ్బుతో అన్నీ కొనుక్కునే అవకాశాలుంటాయ్! బీదాడికేం వుంది? అన్నిచోట్లా అన్యాయమే. అన్నిచోట్లా అమ్ముడు పోవటమే" అన్నాడు.
రాజశేఖరానికి నవ్వొచ్చింది.
"ఒరేయ్! నువ్వు శుభ్రంగా ఒక పూటయినా తిండి తింటున్నావ్, కానీ అది కూడా లేనివాళ్ళు చాలామంది వున్నారు కదా! వాళ్ళంతా కలిసి నిన్ను ధనిక వర్గం మనిషి అంటే ఏం చేస్తావ్?"
"అదెలా కుదురుతుంది? ఒకపూట తిననీ, పస్తులుండనీ మేమంతా ఒకటే! బీదాడి రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తూ సర్వ సుఖాలనూ అనుభవించే కాపిటలిస్ట్ లే మా బద్ధ శత్రువులు."
"భోజనం రండి సార్" అన్నాడు వంటవాడు.
"కమాన్! ముందు భోజనం చేద్దాం పద! తరువాత కాపిటలిస్ట్ ల గురించి లెక్చర్ యిద్దువుగాని!" అన్నాడు రాజశేఖరం.
ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకున్నారు.
రకరకాల వంటకాలు పొగలుకక్కుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించేసరికి కనకారావ్ కి నోరూరింది.
ఆత్రుతగా త్వరత్వరగా తినేయటం ప్రారంభించాడు.
రాజశేఖరం అతని వంకే సంతృప్తిగా చూస్తుండిపోయాడు.
తను అంత ఆకలితో భోజనం చేసి ఎంత కాలమయిందో!
బహుశా రెండేళ్ళు---
లేదా ఇంకొంచెం ఎక్కువ---
టైమ్ చూసుకుని భోజనం చేయడమేగానీ ఆకలితో భోజనం చేయటం జరగలేదీ మధ్య!
తనూ రెండు ముద్దలు తిని చేయి కడిగేసుకున్నాడతను.
కనకారావ్ మాత్రం ఇంకా వేగంగా తింటూనే వున్నాడు.
చాలావరకూ గిన్నెలన్ని ఖాళీ అయాక అప్పుడు పెద్దగా త్రేన్చి రాజశేఖరం వైపు చూశాడు.
"అబ్బ! చాలా బాగా చేశాడ్రా కూరలు! బీదాళ్ళందరినీ కొల్లగొట్టి ఇంతమంచి భోజనం చేస్తున్న ధనికులందరినీ కాల్చి చంపాల్రా! నా జీవితంలో ఏనాడన్నా నా కుటుంబంతో ఇంత అద్భుతమైన భోజనం చేయగలనా నేను? ఎందుకని? నా ఖర్మ ఎందుకిలా కాలిపోయింది. నీ అదృష్టం ఎందుకిలా వెలిగిపోతోంది? కేవలం నీ కాపిటలిస్ట్ దృక్పధం వల్ల! బిచ్చగాడెప్పటికీ బిచ్చగాడిగానే మిగిలిపోతాడు. కార్మికుడు జీవితాంతం కార్మికుడిగానే మిగిలిపోతాడు. కార్మికుడు బీదాడి కొడుకు కూడా బీదాడయితే ధనవంతుడి కొడుకు కూడా బీదాడయితే ధనవంతుడి కొడుకు ఎప్పటికి ధనవంతుడుగానే వుంటాడు. అందుకే వెంటనే విప్లవం రావాలి! ధనవంతులందరినీ సజీవసమాధి చేయాలి!" ఆవేశంగా అన్నాడతను.
"అంటే నేను కూడా సజీవసమాధి అయిపోవాలంటావా?"
"నీ సంగతి వేరు! నా స్నేహితుడిగా నీ క్షేమంనే కోరుకుంటాన్రా! కానీ వర్గ శత్రువుగా నీ నాశనాన్ని హర్షిస్తాను...."