రవి తనకొడుకు క్లాస్ మేట్ అనీ, అంత బాగా చదవకపోయినా ప్రెసిడెంట్ అనీ, తన కొడుకును అభిమానిస్తాడనీ మాత్రమే తెలుసు సత్యవతికి. తనకు తెలియని మరొక స్వరూపం రవికి ఉందని ఆవిడ ఏ నాడూ ఊహించలేదు.
6
"ఇంకా మంజు ఎందుకు రాలేదూ?" అప్పటికి అయిదోసారి అడిగింది సుమతి. నిజానికి ఆ ప్రశ్న ఎవరినో అడగటం కాదు, తనలో తను అనుకోవటం. తన భయాన్ని పక్కవాళ్ళతో పంచుకోవాలని ఆరాటపడటం. సుమతితోపాటు చంద్రశేఖరం ఇంట్లోనే ఉన్నాడు. మంజులత ఎందుకు రాలేదో, సుమతి కెంత తెలుసో, చంద్రశేఖర్ కీ అంతే తెలుసు. సుమతి గాభరా అర్ధంచేసుకున్న చంద్రశేఖర్ నవ్వుతూ "వస్తుందిలే! ఎందుకంత కంగారు? తోడుగా ఉండి తీసుకురమ్మని కుమార్ ని పంపించానుగా! ఫరవాలేదులే! కుమార్ పక్కన ఉండగా, నీ కూతురిమీద ఈగ వాలనివ్వడు" అన్నాడు.
సుమతి కొంచెం స్థిమితపడి "ఏమిటోనండీ! దానికి పెళ్ళిచేసి లక్షణంగా ఒక ఇంటిదాన్ని చేసేవరకూ నాకు శాంతిలేదు" అంది.
అచ్చు పల్లెటూరి సంప్రదాయ గృహిణిలా మాట్లాడుతోన్న సుమతిని తెల్లబోయి చూశాడు చంద్రశేఖరం. ఒకనాడు ఇంట్లో బంధువులనూ, బయటి సంఘాన్నీ ఎదిరించి అత్యంత సాహసంతో కుమార్ ని తన వళ్ళోకి తీసుకున్న సుమతేనా, ఇలా మాట్లాడుతోంది? పరిస్థితులు ఎలాంటివాళ్ళనైనా మార్చేస్తాయి.
పెళ్ళయిన అయిదేళ్ళ వరకూ చంద్రశేఖరం దంపతులకు సంతానం కలగలేదు. సుమతి లోలోపల ఏమనుకునేదో, పైకి ఏమీ తేలేది కాదు.
సుబ్బులు చాలా చిన్నతనంనుండీ చంద్రశేఖరం ఇంట్లో పనిచేస్తూ ఆ కుటుంబంలో ఒక మనిషిగా కలిసిపోయింది. దానికి తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి అక్కడా, ఇక్కడా కూలిపనులు చేసుకుంటూ కూతుర్ని పోషించుకుంటూ బ్రతుకీడుస్తోంది. ఆ కులాల్లో ఏం ఉన్నా, ఏం లేకపోయినా, తప్పులు మాత్రం లెక్కలేనన్ని-కులం వాళ్ళతో పడలేక సుబ్బులుకి చిన్నతనంలోనే పెళ్ళిచేసింది. సుబ్బులు తల్లి-ఆ పెళ్ళికి చంద్రశేఖరం తల్లి ఉన్నదాన్లో ఉన్నంత ఒక కొత్త చీర కొనిచ్చింది. కొత్తకోడలు సుమతి అంటే సుబ్బులు ప్రాణం పెట్టేది. "అమ్మాయిగారు, అమ్మాయిగారు" అంటూ కూడా కూడా తిరిగేది. అప్పట్లో సుమతి ఒక ఆఫీస్ స్టెనోగా పనిచేస్తూ వుండేది. సుమతి ఆఫీస్ కెళ్ళేవరకు సుబ్బులు సుమతితోనే ఉండి ఏం కావాలన్నా అందిస్తూ ఉండేది. సుమతికి కూడా అమాయకంగా తిరిగే సుబ్బులంటే అభిమానం ఏర్పడింది. తనకు జీతంరాగానే, ఇంట్లో ఎవరికీ తెలియకుండా, ఒకరూపాయో, రెండు రూపాయలో సుబ్బులు చేతుల్లో పెట్టేది. దానికే పొంగిపోయేది సుబ్బులు.
సుబ్బులుకి ఒక కొడుకు పుట్టాడు. ఒక్క నెల నిండగానే, వాడిని ఎత్తుకుని పనిలో కొచ్చేసింది సుబ్బులు. వాడిని చంద్రశేఖరం ఇంట్లో అందరూ అభిమానంగా చూసేవారు. "కుమార్" అనే పేరు చంద్రశేఖర్ పెట్టినదే! పనిమనిషి కొడుకనే మాట మరచిపోయి కుమార్ ని చాలా ముద్దుచేసేది సుమతి. తనకు జీతాలందగానే వాడికి చొక్కాలు, ఆటబొమ్మలు తెచ్చేది. కుమార్ చాలా ముద్దుగా ఉండేవాడు. ఎవరికైనా వాడిని ముద్దుచెయ్యాలనిపించేది. సుబ్బులు దురదృష్టం! కుమార్ కి ఏడాది నిండకుండానే దాని మొగుడు పోయాడు. సుబ్బులు గుండెబాదుకుని ఏడుస్తోంటే చంద్రశేఖరం కుటుంబమంతా దాని కష్టానికి కంటతడిపెట్టింది. ఆ తరువాత జీవచ్చవంలా తయారయింది సుబ్బులు-కొడుకుని కూడా పట్టించుకునేది కాదు. కుమార్ ఇంచుమించు సుమతి చేతుల్లోనే పెరిగాడు. చంద్రశేఖర్ తల్లీ, తండ్రీ కూడా వాడిని సానుభూతితోనే చూసేవారు.
"మొగుడు పోయిన దిగులికితోడు ఏదో జబ్బుచేసి కుమార్ కి అయిదేళ్ళు కూడా నిండకుండానే, సుబ్బులు కూడా చచ్చిపోయింది. చంద్రశేఖర్ కుంటుంబం తనకుటుంబంలో ఎవరో వ్యక్తి పోయినట్లుగానే బాధపడ్డారు. మరో పనిమనిషిని పెట్టుకున్నారు. కానీ, కుమార్ లేని వెలితి ఇంట్లో అందరికీ తోచేది. అందరికంటె ఎక్కువగా కుమిలిపోయింది సుమతి. చంద్రశేఖర్ ఎన్నివిధాలుగా ప్రయత్నించినా సుమతి దిగులు పోగొట్టలేక పోయాడు. చివరకు సుబ్బులు తల్లిని పిలిపించాడు.
"కుమార్ ని తీసుకుని మా ఇంటికి వస్తూ ఉండు. నువ్వు పని చెయ్యలేవని తెలుసులే! ఊరికే రా!" అన్నాడు.
సుబ్బులుతల్లి రాగాలు తీస్తూ "నే నీడ ఉంటం లేదు దొరా! నా కీడ ఏటుంది? మా ఊరికి పోతన్న!" అంది.
సుమతి వెంటనే చంద్రశేఖర్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఆ పట్టుకోవటంలో ఆవిడ హృదయారాటం చంద్రశేఖర్ కి చక్కగా అర్ధమయింది. కానీ ఏం చెయ్యగలడు? కుమార్ ని తను పెంచుతానని అనగలడా?
చంద్రశేఖర్ అనలేనిమాట సుమతి అనేసింది.
"మీ కుమార్ ని ఇక్కడ ఉంచెయ్యి. నేను పెంచుతా!"
ఈ మాటలకు సుబ్బులు తల్లి ఆనందించలేదు. సరికదా, ముఖం ముడుచుకుంది.
"ఆడిని బంగారయ్యగారి కిస్తానన్నా! యాబయి రూపాయలిస్తానన్నారు" అంది.