విజయ్ ఉలిక్కిపడ్డాడు.
"గుడిశెలా? గుడిశెలేమిటి?"
"అదేనోయ్...గుడిశెలు...లేదా పాకలు...లేదా పూరిళ్ళు..." తండ్రి ధోరణి గమనించి చప్పున మృదుల అడ్డు పడింది.
"డాడీ! ఇతనుండేది కాంక్రీట్ బిల్డింగ్ లో!"
సుధీర్ కుమార్ బాధతో విలవిలలాడుతూ చూశాడతని వైపు. "ఆ! కాంక్రీట్ బిల్డింగులోనా? అక్షయ్! కాంక్రీట్ బిల్డింగులు మనిషికి శాపమోయ్! అదే గుడిశెలో వుంటూ ఎన్నో కష్టాలు అనుభవించి, పగలంతా కష్టపడి గూటికి చేరుకుని కిరసనాయిల్ బుడ్డి వెలిగించుకుని నులకమంచం మీద పడుకుని 'సుక్కల్లో సెందురుడు ఓ సందమామ' అని పాడుకుంటూ... ఆహా ఆ జీవితాన్ని ఒక్కసారి వూహించుకుంటే వళ్ళు పులకరిస్తుంది. ఆ జీవితం ఎంత అద్భుతమో నీకు తెలుసా?"
విజయ్ అతని ధోరణి చూసి కొంచెం కంగారుపడ్డాడు. భయంగా మృదుల వైపు చూశాడు.
"డాడీ ఇప్పటికే ఆలస్యమైంది. పదండి భోజనానికి" అందామె అతని పరిస్థితి చూసి భయపడిపోయి.
"ఓ, నేను రడీ ఏమోయ్ విక్రమ్" అంటూ విజయ్ భుజం మీద చేయి వేశాడు.
"నా పేరు విజయ్ సార్! విక్రమ్ కాదు" ఇబ్బందిగా అన్నాడు విజయ్.
"మరి ఇందాక విక్రమ్ అని ఎందుకన్నావ్? అలా పేర్లు తప్పు చెప్పటం చాలా చెడ్డ అలవాటోయ్! మా సెక్రటరీ శ్యామల్రావ్ అంతే! ఉండుండి ఫోన్ లో తన పేరు మార్చేసి చెపుతుంటాడు."
ముగ్గురూ డైనింగ్ హాల్లోకొచ్చారు.
వరహాల్రావు ముగ్గురికీ భోజనాలు వడ్డించసాగాడు. వడ్డిస్తూనే బయటకు వినబడేటట్లు సన్నగా ఓ పాట అందుకున్నాడు. "సుక్కల మధ్యా సెందురుడు ఓ సందమామా ఎన్నెలసాటున సెందురుడు ఓ సందమామా-సీకటి ముందర సెందురుడు ఓ సందమామా"
అతని పాటకు సుధీర్ కుమార్ థ్రిల్ అయిపోయాడు. ఆ ఆనందంలో అతనికి భోజనం కూడా సహించటం లేదు.
"వరహాల్రావ్?" ఆనందంగా పిలిచాడతను.
"ఏం సార్?"
"నువ్వు చిన్నప్పటినుంచీ నీ జీవితం గుడిశెల్లో గడిపేశావ్ కదా?"
"అవున్సార్!"
"ఆహా ఎంత అదృష్టవంతుడివోయ్! అక్కడ పచ్చడి మెతుకులతో చాలీ చాలని తిండి తింటూ, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్తూ ఎన్నో దిగుళ్ళు మనసులో వుంచుకుని... ఆహా! ఆ జీవితం ఎంత బాగుంటుందోయ్?"
"చాలా అద్భుతమైన జీవితం సార్ అది. నేను రాత్రుళ్ళు గుడిశె చేరుకుని గంజి అన్నం తిని వెన్నెల్లో కటిక నేలమీద పడుకుని, పక్కనే పడుకున్న మేకపిల్ల తల నిమురుతూ గొంతెత్తి పాడుకుంటుంటే..." తన్మయత్వంతో మాట్లాడసాగాడు వరహాల్రావ్.
సుధీర్ కుమార్ కళ్ళు ఆనందంతో చెమర్చసాగాయి. "ఏం పాటలు పాడేవాడివోయ్ వరహాల్రావ్?"
"ఒకటనేమిటండీ? బోలెడు పాటలు- గేదెలను కాసేవాళ్ళు పాడుకునేవి, మేకల మందలు తోలేవాళ్ళు పాడుకునేవి, పొలం పనులు చేసుకుంటూ పాడుకునేవి, పండగలకూ, పబ్బాలకూ పాడుకునేవి, పడవ సరంగులు పాడుకునేవి..."
"ఏదీ ఇందాక పాడావే సుక్కల మధ్య సెందురుడు ఓ సందమామా... ఆ పాట పూర్తిగా వినిపించవూ?"
"పూర్తిగా అదివరకు పాడేవాడినండీ! ఈ మధ్య మర్చిపోయాను"
సుధీర్ కుమార్ కి అతనిమీద కోపం ముంచుకొచ్చింది.
"చూశావుటోయ్ రాజేష్! ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ లో కొచ్చి అన్ని సౌకర్యాలకూ అలవాటుపడేసరికి మనిషి మనిషిగా వుండలేకపోతున్నాడు. తనను తాను మర్చిపోతున్నాడు. అందుకే నాకు డబ్బంటే అసహ్యమోయ్! మనిషిని మనిషిగా వుండనీయదది."
"నా పేరు విజయ్ సార్" అన్నాడతను. కానీ ఎవరూ అతనిని పట్టించుకోలేదు.
"అవున్సార్! డబ్బు మనిషిని కోతిగా మారుస్తుందని మా ఫ్రెండ్ సుబ్బారావు అంటూండేవాడు" తనూ సపోర్ట్ చేశాడు వరహాల్రావు.
సుధీర్ ఆనందంగా వరహాల్రావు వైపు చూశాడు.
"ఎవరు? సుబ్బారావా?"
"అవున్సార్"
"అంటే అతను కూడా గుడిశెల్లోనే వుండేవాడా?"
"అవున్సార్! వాడిది మరీ పూరిగుడిశెండీ! ఆరడుగుల ఎత్తే వుండేది."
"డాడీ!" చిరాకుగా అతని మాటలకు అడ్డుపడింది మృదుల.
"ఎస్ బేబీ!"
"ముందు భోజనం చేయండి! అన్నీ చల్లారిపోతున్నాయి."
"ఏమిటోనమ్మా! ఇంకెంత కాలం ఈ భయంకరమైన జుగుప్సాకరమైన జీవితం గడపాలో ఏమో?" అనుకుంటూ భోజనం చేయటం ప్రారంభించాడు.
ముగ్గురూ భోజనాలు ముగించాక హాలులోకి రాగానే మృదుల తన మనసులోనిమాట బయట పెట్టటానికి సన్నాహాలు ప్రారంభించింది.
"డాడీ!"
"ఏంటమ్మా!" దూరంగా రేడియోలో వినబడుతున్న జానపదగీతం వింటూ అడిగాడు.
"మీకో విషయం చెప్పాలని విజయ్ ని పిలిపించాను డాడీ!"
"అంటే ఇప్పుడు విజయ్ అనే అతను కూడా మనింటికొస్తాడా?"
"అయ్యో! ఇతనే విజయ్ డాడీ!"
"మరి మనింటికొచ్చే అతనెవరు?"
"అతనే ఇతను డాడీ!"
"అతనే ఇతనా?" మరింత ఆశ్చర్యంగా అడిగాడతను.
"అవును డాడీ!"