Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 11


    "మా చిన్నారి చిరంజీవి బాబు బాగా చదువుకుంటాడు. ఫస్ట్ న పాసవుతాడు, పెద్ద చదువులు చదువుతాడు, కలెక్టరవుతాడు, మహారాజవుతాడు, కార్లలో తిరుగుతాడు, విమానాల్లో వెళతాడు, పదిమంది నౌకర్లతో సేవలు చేయించుకుంటాడు."
    ఆమె మాటలు వింటూ తనూ కలలు కంటుండేవాడు.
    స్కూల్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు...
    క్లాస్ రూంలో కూర్చున్నప్పుడూ...
    తిరిగి ఇంటికి నడిచి వస్తున్నప్పుడూ...
    తల్లి మాటలే గుర్తుకొస్తుండేవి. ఆ సమయంలో నిజంగానే తను చాలా గొప్పవాడిలా ఫీలింగ్ కలిగేది. తనకూ, మిగతా పిల్లలకూ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉన్నట్లనిపించేది.
    వాళ్ళంతా సాదాసీదా మనుషులనీ, వాళ్ళంతా కేవలం స్కూల్ టీచర్లుగానూ, తాలూకాఫీస్ గుమాస్తాలుగానూ, పోస్ట్ మేన్ లుగానూ, రైల్వే కలాసీలగానూ జీవితాలు గడుపుతారనీ, తనొక్కడే ఐ.ఏ.ఎస్. అవుతాడనీ, కార్లల్లో, విమానాల్లో తిరుగుతాడనీ, ప్రభుత్వాన్ని నడిపిస్తాడనీ ఇలా ఎన్నో కలలు.    
    కానీ ఆ కలలన్నీ ఏమయినాయ్?
    ఆ తల్లి ఆశలన్నీ ఎలా నీట గలసినయ్?
    ఎలాంటి దారుణమయిన జీవితం గడపాల్సి వచ్చింది?
    కారు షెడ్ మెకానిక్ గా, డ్రయివర్ గా, సినిమా హాల్ లో బ్లాక్ లో టికెట్లమ్మేవాడిగా, దొంగగా, ఓ రాజకీయ పార్టీ తరపున గూండాగా...
    ఇప్పుడు కార్లెక్కేవారికి డోర్ తెరచి పట్టుకుంటూ, సమయానికి తెరవకపోతే చెంప దెబ్బలు తింటూ, మోకాలి చిప్పల మీద తన్నించుకుంటూ ఏమిట్రా ఇడియట్ అనిపించుకుంటూ-
    డోర్ మూసేసి డ్రయివింగ్ వీల్ ముందు కూర్చున్నాడతను.
    కారు చాలా స్మూత్ గా నడపవలెను. జర్క్ లు ఇవ్వరాదు. గేర్లు మార్చుతున్న విషయం కూడా కార్లో కూర్చున్న ప్రభువులకు తెలీకూడదు. సడెన్ బ్రేక్ లు వేయరాదు. కారు స్పీడ్ అవసరమయినంత మెయింటెన్ చేయవలెను.
    కారు స్మూత్ గా వెళుతోంది.
    వెనుక కూర్చున్న ముగ్గురు యువతులూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
    "ఫెంటాస్టిక్ మూవీ యార్. సిక్స్ అకాడమీ అవార్డు యూనో...రియల్లీ వండర్ ఫుల్ ఫోటోగ్రఫీ అండ్ డైరెక్షన్."
    "ప్రజ్ఞా యూ బెట్ యార్-డెఫినిట్ గా నేను సివిల్ సర్వీసెస్ చేస్తాను. మా అంకుల్ ప్రైమ్ మినిష్టర్ సెక్రటేరియట్ లో ఉన్నారు."
    "డూ యూ నో వాట్ డాడ్ సెడ్? గో ఎ హెడ్! ఎంజాయ్ లైఫ్. డోంట్ బోదర్ ఎబౌట్ మనీ. నువ్వెంత ప్రయత్నించినా మనకున్న దాంట్లో వన్ ఫోర్తు కూడా స్పెండ్ చేయలేవు.
    "మనందరం న్యూయార్క్ వెళదాం. అక్కడ మా అంకుల్ ఉన్నారు. ఎప్పటినుంచో ఇన్వైట్ చేస్తున్నారు."
    "కిరణ్ బేడీ ఈజ్ మై హీరోయిన్. మా డాడీ ఇన్ ఫ్లుయెన్స్ చేసి నాకు తప్పకుండా ఐ.పి.ఎస్. సెలక్షన్ వచ్చేట్లు చేస్తానన్నారు. డూ యూనో, మినిష్టర్స్ చాలామంది మా ఇంటికొస్తుంటారు."
    "మా ఫామ్ హౌస్ లో డాల్ఫిన్స్ ని పెంచుతోంది మమ్మీ. రియల్లీ వాటితో ఆడుకుంటుంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది."
    చిరంజీవి వాళ్ళ మాటలు వినకుండా ఉండటానికి సర్వవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
    'కారు చాలా స్మూత్ గా నడపవలెను. సడెన్ బ్రేక్స్ వేయరాదు. గేర్లు మార్చుతున్న విషయం_"
    భరత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొప్రయిటర్ స్వామి గొంతు వినబడుతోంది పెద్దగా.
    తన తల్లి మొఖం ధీనంగా కన్నీరు పెడుతూ కనబడుతోంది ఎదురుగ్గా_
    "మా చిరంజీవి పెద్ద చదువులు చదువుతాడు. కలెక్టరవుతాడు, విమానాల్లో తిరుగుతాడు. బోలెడు మంది నౌఖర్లతో సేవలు చేయించుకుంటాడు" తల్లి గొంతే ఏడుస్తూ అంటోంది.
    చిరంకీవికి కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినయ్.
    ఛెళ్ళున చెంపదెబ్బ మళ్ళీ తగిలినట్లయింది.
    కళ్ళు బైర్లు కమ్ముతున్నాయ్.
    నిరంజన్ మేనేజర్ శ్రీరామ్ గట్టిగా అరుస్తున్నాడు.
    "బాస్టర్డ్! ఎందుకురా మా ప్రాణానికి దాపురిస్తారు? ఇలాంటి చేతగాని వాళ్ళనెలా పంపిస్తున్నాడా స్వామి? వాడి అంతు చూస్తాను. ఒక్క పైసా కూడా ఇవ్వను."
    కారు వెనుక సీట్లో నుంచి నవ్వులు.
    జోక్స్ చెప్పుకుంటున్నారు.
    కారు స్మూత్ గా నాగార్జునసాగార్ రోడ్ వేపు తిరిగింది.
    "నో జెర్క్స్, నో రఫ్ డ్రయివింగ్, నో సడెన్ కట్స్, నో సడెన్ బ్రేక్స్" స్వామి గొంతు.
    కొద్దిసేపటి తర్వాత ముగ్గురూ ఎగ్జాస్ట్ అయిపోయారు.
    సైలెన్స్...
    సన్నగా, మెత్తగా, మోటర్ తిరుగుతున్న శబ్దం అంతే!
    అందమైన కొండల మధ్య నుంచీ వెళుతోంది కారు.
    ఏ.సి. చల్లదనం ఎక్కువయి పోతోంది.
    పొగరుమోతు రాణి ఇంగ్లీష్ పాట పాడుతోంది.
    "విజెనింగ్ టు ది రెయిన్ డ్రాప్స్...వైల్ స్లీపింగ్ ఇన్ వి డార్క్ రూమ్."
    చిరంజీవిని బలవంతంగా గతం లాక్కెళ్ళిపోతోంది.
    తన తల్లి కిటికీ దగ్గర తనను కూర్చోపెట్టుకుని వర్షం చూపిస్తూ పాడింది.
    "వానలు కురవాలి, వరి చేలు పండాలి."
    వానా వానా వస్తావా?
    తొలరిజల్లు తెస్తావా?
    సడెన్ గా ఓ కుర్రాడు రోడ్ కి అడ్డంగా పరుగెత్తాడు.
    సడెన్ బ్రేక్ అప్లయ్ చేశాడు చిరంజీవి.
    ఆ కుర్రాడికి కొద్ది అంగుళాల దూరంలో ఆగింది కారు.
    వెనుక సీట్లో నుంచి కేకలు...
    "మైగాడ్ వాట్ రాష్ డ్రయివింగ్"
    "ఇడియట్, వీడు కారు డ్రయివర్ కాదు. లారీలు తోలే రకం లాగున్నాడు."
    "అదీ మునిసిపాలిటీ లారీ అయ్యుంటుంది. లేదా దున్నపోతుల బండి."
    "ఏయ్! బ్లడీ ఫూల్! నీకు డ్రయివింగ్ చేతకాకపోతే దిగిపొమ్మని ఒకసారి చెప్పాను."
    "ఇది నీకు లాస్ట్ వార్నింగ్ తెల్సిందా?"
    చిరంజీవికి కోపంతో పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయ్. కానీ ఇది తన ఉద్యోగానికి సంబంధించిన విషయం. ఇక్కడేమయినా గొడవయితే ఉద్యోగానికి మళ్ళీ ముప్పు వస్తుంది.
    "సారీ మేడమ్."
    "షేమ్ లెస్ ఫెలో! అన్నిసార్లు సారీ చెప్పడానికి కూడా సిగ్గులేదు" హిందీలో అంటోంది. 

 Previous Page Next Page