Previous Page Next Page 
జయ - విజయ పేజి 11


    "వెళ్ళగానే ఉత్తరం రాస్తావు కదూ?"
    "తప్పకుండా!"
    "సారీ. ఒకవేళ నిన్ను నొప్పించి ఉంటే_"
    "అదేంలేదు."
    జయ బస్ కోసం ఎదుర్చూడసాగింది.
    మరికాసేపట్లో బస్సు రానేవచ్చింది. బస్సు ఎక్కేసింది జయ.
    అతను అక్కడే నిలబడిపోయాడు.
    అతనివంక చూడకుండానే మొండిగా వూరుకుంది జయ.
    బస్సు బయలుదేరింది.
    ఇల్లు చేరుకునేసరికి పొద్దుగూకి పోయింది.
    "ఏమిటింత ఆలస్యమయింది?" అడిగింది పార్వతి, ఆమె లోపలకు వస్తూనే.
    "మధ్యాహ్నం క్లాసు లేకపోతే మా ఫ్రెండ్సందరూ కలిసి మాట్నీ కెళ్ళాం." తడుముకోకుండా జవాబిచ్చింది జయ. పార్వతి ఇంకేమీ అడగలేదు.
    తను రాసిన ఉత్తరానికి చంద్రకాంత్ జవాబు వెంటనే రాయడం విజయకు ఎంతో ఆనందం కలుగజేసింది. పెళ్ళిచూపుల తతంగాన్ని గురించి తను పడుతున్న ఆవేదనకు అతను చూపిన సానుభూతి ఆమెను కదిలించివేసింది. తనకు ప్రపంచంలో అతనికన్నా ఆత్మీయులింకెవరూ లేరనిపించింది.
    ఆ మర్నాడు పెళ్ళివారి దగ్గరనుండి ఉత్తరం వచ్చింది. తన రూపం వారికి నచ్చలేదట? అదే మరోసారి అయినట్లయితే ఆ ఉత్తరం తన మూడ్స్ ని పాడుచేసేది. కొద్దిరోజుల వరకూ మనశ్శాంతి కరువయిపోయేది. తన దురదృష్టాన్ని నిందించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఉత్తరం తనమీద ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. అందుక్కారణం చంద్రకాంత్! అతనితో ఏర్పడ్డ స్నేహం. తామిద్దరి మధ్యా ఒకరినొకరు చూడకపోయినా అల్లుకున్న ఆత్మీయత, తనకు వివాహం మీద కోరిక ఇక లేదు. జీవితాంతం చంద్రకాంత్ స్నేహం ఉంటే చాలు. ఇంకేమీ కోరుకోదు దేవుడిని!
    అయితే యధాప్రకారం ఆ ఉత్తరం పార్వతికి ఎంతో మనఃక్లేశం కలిగించింది. విజయకు ఎంత త్వరగా వివాహం చేస్తే అంత భారం తగ్గుతుందని, తను తొందరపడుతుంటే ఆ ఘడియ కాస్తా వెనక్కే పోతోంది.
    "నేను చెప్పానా అమ్మా! నాకు పెళ్ళే వద్దని! నువ్వు వినవు! ముందు జయకు చేసెయ్! ఆ తరువాత ఎప్పుడైనా నన్ను చేసుకుంటాననే మనిషి తనంతట తను ముందుకొస్తే అప్పుడు ఆలోచిద్దాం! సరేనా?"
    పార్వతి కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్.
    "నువ్వెక్కడి పిచ్చిదానివే!" అంది కన్నీళ్లు తుడుచుకుంటూ.
    "మీ అభిమాన రచయిత ఎలా వుంటారక్కా?" అడిగింది జయ. అతని ఉత్తరం చదువుతున్న విజయ దగ్గరకొచ్చి.
    "ఏమో! సరిగ్గా తెలీదు. అదివరకు ఓ పత్రిక ఆయన ఫోటో వేశారు గాని అది సరిగ్గా ప్రింటవలేదు.
    "పోనీ ఫోటో పంపించమని రాయకపోయావా? అభిమానులకు ఆమాత్రం పంపరా ఏమిటి?" నవ్వుతూ అందామె.
    విజయ ఓ క్షణం ఆలోచించింది.
    "అవునే! ఆమాత్రం ఐడియా రాలేదు నాకు చూడు. ఇవ్వాళే ఉత్తరం రాస్తాను. నాలుగు రోజుల్లో ఆయన ఫోటో మనచేతికొస్తుంది" అంది. అప్పటికప్పుడు ఉత్తరం రాయడానికి లేచి కూర్చుంటూ.
    ఆమె ఉత్తరం రాస్తుంటే చూస్తూ కూర్చుంది. ఉత్తరం రాయడం పూర్తయ్యేసరికి గంటన్నరసేపు పట్టింది.
    "అబ్బ. అన్ని విషయాలేముంటాయి రాయడానికి ఆశ్చర్యంగా అడిగింది.
    "ఏమోనే! నాకూ ఉత్తరం రాశాక చదువుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నో అర్థంలేనివి, అనవసరమైనవి కూడా ఆయన ఉత్తరంలో ఇరికించేస్తుంటాను. పాపం ఆయన ఈ చెత్తంతా ఎంత బాధపడి చదువుతున్నారో?" నవ్వుతూ అందామె.
    జయ అక్కడి నుంచి తన గదిలోకెళ్ళిపోయింది. ఆమెకేమి చేయడానికీ తోచటం లేదు. కిషోర్ ఊరు వెళ్ళి పదిరోజులయిపోతోంది. వెళ్ళేరోజు అతనికి కనిపించకూడదనే కాలేజీ కూడా మానేసింది తను. కానీ అతను సరితతోపాటు ఏదో వంక పెట్టుకుని ఇంటికి వచ్చేశాడు. కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ తీరా అతను వెళ్ళిపోయాక ఎందుకో మనసంతా పాడయిపోయింది. దేనిమీదా శ్రద్ధ లేకుండా పోయింది. కాలేజీకి కూడా వెళ్ళబుద్ధి కావడం లేదు. కిషోర్ గురించిన ఆలోచనలే చికాకు పరుస్తున్నాయ్.
    "కాలేజీకి వెళ్ళటంలేదేం?" రెండోరోజే అడిగింది పార్వతి ఆమెని.
    "నాకు చదువుకోవాలనిపించటం లేదమ్మా!" ధైర్యం తెచ్చుకుని అంది జయ.
    "ఎందుకని? ఆశ్చర్యంగా అడిగింది పార్వతి.
    జయకేం చెప్పాలో తెలీలేదు.
    "ఏమోనమ్మా! నాకలా అనిపిస్తోంది!"
    "ఎటూ కాకుండా మధ్యలో చదువాపేసి ఏంచేద్దామని?" అడిగిందామె.
    "ఉద్యోగం చేస్తానమ్మా! ఇంక చదవటం నావల్ల కాదు! రేపే నరహరి గారింటికి వెళ్ళి అడుగుతాను ఉద్యోగం సంగతి!"
    "నీ ఇష్టం!" అంది పార్వతి అక్కడినుంచి వచ్చేస్తూ.
    ఆమెకు లోలోపల జయ ప్రవర్తన ఏదో అనుమానం కలిగిస్తూనే వుంది. కానీ స్పష్టంగా ఏమీ తెలీడంలేదు. ఊహించడానిగ్గూడా వీల్లేకుండా వుంది. ఆరోజే విజయ దగ్గర ఆ విషయం కదిపిందామె.

 Previous Page Next Page