Previous Page Next Page 
8 డౌన్ పేజి 11

    తనకు ఆమె మాటలు ఆశ్చర్యం కలిగించినాయ్. ఇంత దురదృష్టకరమయిన సంఘటనను ఇంత త్వరగా, ఇంత ధైర్యంగా ఎవరయినా తట్టుకోగలరా? నిజంగా సంధ్య డేరింగ్ గాళ్! ఆమె ధైర్యం, ఆమె వెలిబుచ్చే విప్లవాత్మక మయిన ఆ అభిప్రాయాలే తనను మరింతగా ఆకట్టుకున్నాయి.    
    "మళ్ళీ ఎప్పటికొస్తారు?" తను కాఫీ తాగి వచ్చేస్తూంటే తనతో పాటు గేటుదగ్గరవరకూ వస్తూ అడిగిందామె.    
    "ఏమో, చెప్పలేను. వస్తే వారం రోజులకేరావచ్చు. లేదానెల రోజులు కూడా పట్టవచ్చు."    
    "వచ్చేవారం ఒకసారిరాకూడదూ" ఆ గొంతులో అభ్యర్ధన.    
    ఆమె అందం కళ్ళెంవేసి లాగుతోంది. ఆమె కోరితే ఎన్ని రోజులయినా అక్కడే వుండిపోతానని చెప్పాలని వుంది. ఆమె కోరితే ఆమెను తను వివాహం చేసుకుంటానని చెప్పాలని వుంది. ఆమె జీవితంలో నుంచి హఠాత్తుగా మాయమయిన ఆనందాన్ని క్షణంలో వేటాడి తీసుకొస్తానని ఆమెకు తెలియజేయాలనివుంది.    
    "ఓ, తప్పకుండా వస్తాను-"    
    "వీలయితే శుక్రవారంనాడు రండి. కాసేపు మాట్లాడుకోవచ్చు. బంధువులెవరితో మాట్లాడాలన్నా అనీజీగా వుంటోందినాకు. ఆఖరికి ఫ్రెండ్స్ కూడా అలాగే తయారయారు. నా జీవితమంతా నాశనమయిపోయినట్లూ, అతని కోసం నేను కూడా ఆత్మహత్యచేసుకుని చనిపోవాలేమో అన్నట్లు ఎంత మీనింగ్ లెస్ టాక్. మేమిద్దరం కలిసి గడిపింది ఒక్కరోజు. ఒక్క రోజులో ఒకరికోసం ఒకరు చనిపోయేంత అనుబంధం ఏర్పడుతుందా? మీరొక్కరే ఆ విషయం ఎత్తకుండా మిగతా విషయాలు మాట్లాడారు."    
    ఆ వారం రోజులూ చాలావేగంగా గడిచిపోయినట్లనిపించింది.    
    శుక్రవారం నాడు సికింద్రాబాదు స్టేషన్లో రైలు దిగిన క్షణం నుంచీ తనలో టెన్షన్ ప్రారంభమయింది.    
    తన ఆలోచనేమిటి? తన మనసేమిటి? ఆమెతో చనువుకోసం ఈ పరిస్థితిలో ఎందుకు ప్రాకులాడుతున్నాడు? తన ధ్యేయం ఏమిటి?    
    ఆమె వివాహితురాలు. ఇంకెందుకు ఆమెకోసం ప్రాకులాడుతున్నట్లు? కేవలం ఆమె మీద ప్రేమతో ఆమెకు సహాయంగా మసలాలనుకుంటున్నాడా? లేక ఆమెను వివాహంచేసుకుని ఉద్దరించాలనుకుంటున్నాడా? ఒకసారి పెళ్ళయ్యాక మరోపెళ్ళికి ఆమె వప్పుకుంటుందా? ఆమె కాదు! ఆమె స్థానంలో వున్న మరే స్త్రీ అయినా ఒప్పుకుంటుందా?    
    "ఏమిటక్కడే నిలబడిపోయారు?" అడిగింది సంధ్య.    
    అప్పుడు స్పృహలోకి వచ్చాడు.    
    తను ఆమె ఇంటిదగ్గరకొచ్చి ఎంతసేపయిందో తనకే తెలీదు. లోపలకు నడిచాడు. ఆమె ఒక్కతే వుంది. "అంతా మా చిన్నమ్మ వాళ్ళింటిలో ఫంక్షన్ కెళ్ళారు" చెప్పిందామె.  
    తనకు ఆనందం కలిగింది. ఈ రోజు ఆమెతో స్చేచ్చగా మాట్లాడవచ్చు. ఆమె మాట్లాడుతోంది.    
    వివాహ మయ్యాక స్త్రీకి తన మనసులో దాచుకున్న విషయాలన్నీ బయట పెట్టే ధైర్యం వస్తుందేమో.    
    సినిమా గురించీ, తనకాలేజీ ఫ్రెండ్స్ గురించీ, తను చదివిన పుస్తకాల గురించీ- సమయం ఎలా గడచిపోతోందో తెలీటం లేదు.    
    సాయంత్రం అయిదవుతోండగా నిశ్శబ్దం అలుముకుంది.    
    అప్పుడు మాట్లాడే అవకాశం లభించింది తనకు- తన మనసులోని విషయాలు! లోలోపల సంఘర్షణ!    
    ఎలా ఆ ప్రసక్తి తేవటం?    
    ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుంది తన ప్రపోజల్.    
    భర్త చనిపోయి ఆరు నెలలయినా కాకముందే పెళ్ళి చేసుకుంటానని అడగటం ఏం సమంజసం? తనను పిచ్చివాడిగా జమ కడుతుందా?    
    "ఏమిటలా చూస్తున్నారు? ఏదోకటి మాట్లాడండి" నవ్వుతూ అంది.    
    తన గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. ఏమనిప్రారంభించాలి?    
    "మీరిలా ఖాళీగా కూర్చోటంకంటే ఏదయినా ఉద్యోగంచేస్తే బావుంటుందేమో".  
    "అవును! నేనూ అదే అనుకుంటున్నాను. ఉద్యోగమో లేకపోతేమరోటో - ఏదో ఒక వ్యాపకం కోసం ప్రయత్నిస్తున్నాను. గతాన్ని గురించి ఆలోచించటం, గతం కోసం విలపించటంనాకు చేతకాదు...అందుకే...."    
    ఇదే తన మనసులోని మాట బయటపెట్టేందుకు అసలుసమయం.    
    "సంధ్యా!" గొంతులో వణుకు.    
    ఆమె తలెత్తి తన కళ్ళలోకి చూసింది. అంతవరకూ గుండెల్నిండుగా ఉన్న ధైర్యం అంతులేకుండాపోయింది. తన ఆలోచనఆమెను హర్ట్ చేస్తుందేమో! తన స్నేహం వెనుక ఇలాంటికోరిక వుందన్న విషయం ఆమెను తెలీదేమో!    
    "మాట్లాడండి! ఆగిపోయారేం?" పెదాలమీద చిరునవ్వు కళ్ళలో ప్రోత్సాహం.    
    "సంధ్యా! మీ కోసం ఎలాంటి సహాయం చేయడానికికయినా సిద్దంగా వున్నాను" తన గుండె లోపలికోరిక ఆమె అర్ధం చేసుకోగలదన్న ఆశ.    
    ఆమె నవ్వింది "థాంక్యూ"    
    మరికాసేపు నిశ్శబ్దం! ఆమె తన ఆలోచనను అర్ధం చేసుకుందా? అంతకంటే ఇంకెలా విశదీకరించగలడు తను.    
    బయట ఆటో దిగినచప్పుడయింది. ఆమె తల్లిదండ్రులు వచ్చారు. కాసేపు వారితో మాట్లాడి తను తిరిగి వచ్చేశాడు. ఎందుకో నిరుత్సాహం ఆవరించింది. తను డైరెక్టు గా తన కోరిక తెలిపి వుంటే బాగుండేదా? ఆమె అంగీకరించేదా? ఏమో!    
    ఏదేమయినా తనుధైర్యం చేసి వుంటేబాగుండేదేమో! ఆ తరువాత లాలాగూడ ట్రాన్స్ ఫరయింది తనకు. తనకు వచ్చిన సంబంధాలన్నీ తిరగకొడుతున్నాడు.    
    సంధ్య మనసు తెలుసుకోందే తమ వివాహ విషయం ఎలా నిర్ణయించుకోగలడు? ఆ రోజు వాళ్ళింటికెళ్ళే సరికి ఆమె తల్లి చెప్పింది. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందంట- తనకు ఆనందం కలిగింది. ఆమె ఆఫీస్ కి చేరుకున్నాడు. కాంటీన్ లో చెప్పింది. తనతో పాటు వర్క్ చేస్తోన్న ప్రకాష్ అనే యువకుడు తనను వివాహం చేసుకోబోతున్నట్లు-    
    తను నిశ్చేష్టుడయాడు.    
    కొద్ది క్షణాలు నోటమాటరాలేదు.    
    తనెంత తెలివితక్కువపని చేశాడో అర్ధమయింది. సంధ్య ఫాస్ట్ గాళ్! ఆమెతో తనూ ఫాస్ట్ మూవ్ అయివుంటే ఆమె తనకు దక్కేదేమో.    
    ఇద్దరూ కలిసి ఆఫీస్ నుంచి బయటికొచ్చి బస్ స్టాప్ లో నిలబడ్డారు.    
    తనకు కన్నీళ్ళు తిరుగుతున్నాయ్. ఆమె ఆనందంగా, ధారాళంగా మాట్లాడుతోంది.    
    "ముందు నేనతని మాటలకు స్టన్ అయాను. కానీ అతను చాలా స్పష్టంగా, వివరంగా చెప్పాడు. ఎడ్వాంటేజస్, డిజెట్వాంటేజస్ అన్నీ కేవలం కొద్దినిముషాల్లోనేనా అంగీకారం చెప్పేశాను. వచ్చేవారమే పెళ్ళి! వాళ్ళింట్లోనూ, మా ఇంట్లోనూ బహుశా పెళ్ళికి వప్పుకోరేమో! అందుకే రిజిస్టర్ మేరేజ్ చేసుకుని తర్వాత అందరికీ చెప్పాలనుకుంటున్నాం. మీరు కావలసినవారు గనుక చెప్తున్నాను."
    "సంధ్యా"
    "ఏమిటి?"
    తనకెంతో ధైర్యం వచ్చింది. ఆమె తన సొత్తు అయ్యేఅవకాశమే లేదిక తన మనసులోని మాటలేం చెప్పినా ఆమె ఇప్పుడు చెడుగాతీసుకోదు.
    "ఆ రోజు నీకు గుర్తుందా? నేను కాజీపేట వెళ్ళిపోయేరోజు కరెంట్ పోయినప్పుడు- నువ్ నా గదిలోకొచ్చి కొవ్వువత్తి వెలిగించావ్. అప్పుడు, ఆ సమయంలో నీతో చాలా ముఖ్యమయిన విషయం మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ నువ్వేమనుకుంటావో, ఆ విషయం ఎలా తీసుకుంటావోనని సంశయించాను-"
    సంధ్య నవ్వింది.
    "గుర్తుంది"    
    తన హృదయం ఆనందంతో పొంగిపోయింది. తనలాగే సంధ్యకూడా ఆ అందమయిన క్షణాలను పదిలంగా భద్రపరచుకుందా?
    "అయితే - అయితే - ఒకవేళనేను నా మనసులోని మాట నీకు తెలిపివుంటే నువ్ అంగీకరించేదానివా సంధ్యా?"
    ఆమె నెమ్మదిగా తనకళ్ళలోకి చూసింది. అకస్మాత్తుగా ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయ్.
    "మీ మనసులోని మాటేమిటో నాకు తెలిస్తే గదానా అభిప్రాయం చెప్పగలిగేది?"
    "అదే సంధ్యా! మనిద్దరం మీ ఇంట్లో కలుసుకున్న రోజునుంచే నాలోఏర్పడ్డ తీయనిభావం! మిమ్మల్ని వివాహం చేసుకోవాలనీ, నా జీవితాన్ని మీతో పంచుకోవాలనీ, మీ అందాన్ని నా ప్రేమతో ఆరాధించాలనీ - ఇదేమాట మీతో చెప్పాలనుకున్నాను". "కానీ మీ మనసులోకి నేనెలా తొంగిచూడగలననుకున్నారు. నేనూ నా వివాహం నిశ్చయమవబోతోందన్న విషయం తెలిసిన దగ్గర్నుంచీ మీరే ఆ ప్రసక్తితెస్తారేమోనన్న ఆశతో రోజులు గడిపేశాను. మీరు సూచనప్రాయంగానైనా మీ మనసు తెలిపివుంటే ఆనందంగా వప్పుకునేదాన్ని."
    తన మనసంతా ఆమె జవాబుతో కలతబారిపోయింది.
    ఎంత మూర్ఖుడు తను? ఎంత పిరికిగా ప్రవర్తించి జీవితాన్ని దుఃఖమయం చేసుకున్నాడు?
    "నేనంటే ఆడపిల్లను! మనసులోని మాటనుతెగించి చెప్పలేను. కానీ మగాడయుండి మీరెందుకలా చేశారు?".
    తనేం సమాధానంచెప్పగలడు?
    "అదేకాదు గురుమూర్తిగారూ! ఇంకో అవకాశం కూడా మీరు నాకు దక్కకుండా చేశారు. ఆ రోజు శుక్రవారం నాడు మిమ్మల్ని రమ్మనికోరాను. ఎందుకో అర్ధం చేసుకుంటారనుకున్నాను. ఆ రోజు ఇంట్లో నేనొక్కర్తినే వుంటాననే మిమ్మల్నాహ్వానించాను. అలా అకస్మాత్తుగా నా హజ్ బెండ్ చనిపోయాక నాకు చాలా డిప్రెసివ్ గా అనిపించింది జీవితమంతా ఒంటరిగా గడపాలన్న ఆలోచనను భరించలేకపోయాను. అందుకే తిరిగి మిమ్మల్ని వివాహం చేసుకునిచేతులారా జారవిడుచుకున్న అవకాశాన్ని పొందాలనుకున్నాను. మీరు వచ్చారు. కానీ ఇద్దరిలో ఎవ్వరం ఆ విషయం మాట్లాడేందుకు ధైర్యం చేయలేకపోయాము-".

 Previous Page Next Page