మూర్తి గలగల నవ్వాడు. జగన్నాధం పగలబడి నవ్వాడు.
"ఏమోయ్? నీ కొడుకుని అహింసా మూర్తిని చేస్తానన్నావు? అపర గాంధీని చెయ్యాలని కలలు కన్నావు? ఇన్ని సంవత్సరాల నీ శ్రమ వృధా అయింది గదా" అన్నాడు మూర్తి.
జగన్నాధం అర్థం కానట్టు మూర్తి ముఖంలోకి చూచాడు.
"అదేనయ్యా! నీ కొడుకుని ఆదర్శమూర్తిగా తీర్చిదిద్దటానికి ఇంతకాలం ప్రయత్నించావు. మరి చివరికి ఈ పోలీసు డిపార్ట్ మెంటుకు పంపిస్తున్నావేం?"
"తగిన డిపార్ట్ మెంటుకే పంపిస్తున్నాను. ప్రస్తుతం ఆ శాఖలోనే రవిలాంటి యువకులు చేరడం చాలా అవసరం?" అన్నాడు జగన్నాధం సగర్వంగా.
"పోలీసు డిపార్ట్ మెంటులో... ఆదర్శమూర్తులు అవసరమా!" ఘొల్లున నవ్వాడు మూర్తి.
"అవును! రవిని నా ఆదర్శాలకు అనుకూలంగా తీర్చిదిద్దాను. అతనికి తగిన శాఖే. దండించడమే పోలీసువాళ్ళ కర్తవ్యం కాదు. అపరాధుల్నీ, దుర్మార్గుల్నీ సానుభూతితో అర్థంచేసుకుని, సంస్కరించి, వాళ్ళను మనుషుల్లా మార్చడం వారి ముఖ్య కర్మం అనే విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు. దొంగల్ని నిజాయితీ పరులుగా మార్చడం వారి కర్తవ్యం. దేశాన్నీ సంఘాన్నీ విశృంఖలతనుంచి కాపాడటం వారి ధ్యేయం కావాలి. బలవంతుల నుంచి బలహీనుల్నీ, అన్యాయం నుంచి న్యాయాన్ని కాపాడటం వీరి ముఖ్యమైన ఆదర్శంగా ఉండాలి. జైళ్ళు బంధి ఖానాలుగా కాక-సంస్కార గృహాలుగా మారాలి. అందుకే రవిని ఈ శాఖలో ఉద్యోగం చెయ్యమని ప్రోత్సహించాను. ఐ.ఎ.యస్. పరీక్షకు అప్పియర్ కావడానికి సిద్ధపడ్డ రవిని ఐ.పి.యస్.కు పంపించాను" జగన్నాధం రవికేసి గర్వంగా చూస్తూ అన్నాడు.
"ఎంత పిచ్చివాడివయ్యా జగన్నాధం! చాలా పెద్ద అందమైన భ్రమలోనే పడ్డావ్. ఈ శాఖలో నాకు ఇరవై అయిదు సంవత్సరాల అనుభవం వుంది. ఈ శాఖ సంగతి నాకు బాగా తెలుసు. ఈ ఇరవై సంవత్సరాల నుంచీ, నీ కొడుకుని ఏదేదో చెయ్యాలని పడిన శ్రమా, ఆరాటం, అంతా బూడిదలో పోసినట్టే అయింది. చూస్తూ వుండు- ఆరు నెలల్లో... ఆ మాటకొస్తే అంత టైం కూడా అక్కర్లేదు. ఆ ఖాకీ దుస్తులు ధరించిన ఆరు రోజుల్లో నీ కొడుకు పూర్తిగా మారిపోతాడు. పోలీసు ఆఫీసరు ఉద్యోగం అటువంటిది. ఎటువంటివాడైనా మారక తప్పదు. ట్రైనింగ్ అయి తిరిగి వచ్చాక చూస్తావుగా? రవి మరో మనిషి అయి రాకపోతే అప్పుడు నన్ను అడుగు!"
రవి మారడు! నాకు ఆ నమ్మకం వుంది" అన్నాడు జగన్నాధం దృఢంగా.
"మారక తప్పదు. త్వరలో నువ్వే చూస్తావ్.
"ఏమిటి?"
"రవి ముఖంలో బిగింపు...కళ్ళలో అధికార గర్వం... కంఠంలో కాఠిన్యం...నడకలో దర్పం...మాటలో మొరటుతనం ట్రైనింగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నీకు ముందుగా కన్పించేవి ఇవే!"
"అసంభవం! అలా ఎప్పటికీ కాదు. నా శ్రమ వృధా కాదు. నా రవి నేను ఆశించిన ఆదర్శాలకు నిలబడతాడు. నువ్వూ చూస్తావు పోలీసు ఆఫీసరుగా తిరిగొచ్చిన రవి ముఖంలో సౌజన్యం, కళ్ళలో కరుణ, కంఠంలో ఆర్ద్రత... మాటల్లో మాధుర్యం, నడకలో ఆత్మ విశ్వాసం, ప్రవర్తనలో బాధ్యత..." అన్నాడు జగన్నాధం ఆత్మవిశ్వాసంతో ఒళ్ళు పెరిగిపోతూ వుండగా.
"చూద్దాం! ఢిల్లీ ఇంకా అట్టే దూరం లేదుగా!" అన్నాడు మూర్తి నవ్వుతూ.
రజనీ, రవి వారి మాటలు వింటూ, తమలో తాము నవ్వుకుంటూ కూర్చున్నారు.
11
రైలు చెవులు గింగురుమనేలా కూత పెట్టింది. రవి గబగబా రైలు ఎక్కి డోర్ దగ్గిర నిలబడ్డాడు.
"బాబూ! జాగ్రత్తగా వుండాలి!" జగన్నాధం కదులుతున్న రైలుతో ఫ్లాట్ ఫారం మీద నడుస్తూ అన్నాడు గద్గద స్వరంతో.
"అలాగే నాన్నా! ఎందుకు మరీ అంత ఇదైపోతారు? నేనేం పసిపిల్లవాణ్నా?" అన్నాడు రవి చిరునవ్వుతో.
రైలు వేగం పుంజుకుంది. మూర్తీ, రజనీ చేతులు ఊపారు. రవి కర్చీఫ్ ఊపాడు. తండ్రి కన్పించినంత వరకూ తల బయటికి పెట్టి చూశాడు. రైలు ఫ్లాట్ ఫారం దాటగానే లోపలకు వచ్చి, బెర్తుమీద కూర్చుంటూ, అదే బెర్తుమీద చివరి సీట్లో కిటికీ దగ్గరగా కూర్చుని వున్న యువతికేసి చూశాడు.
అంతవరకూ అతన్నే చూస్తున్న ఆ యువతీ రవి తనకేసి చూడగానే, ముఖం తిప్పుకొని కిటికీలోంచి బయటకి చూడసాగింది. రవి ఆ విషయాన్ని గమనించక పోలేదు.
రవి 'బ్లిడ్జి' చేతిలోకి తీసుకొని చదవసాగాడు. కాని మనస్సు అందులో లగ్నం కావడం లేదు. కళ్ళు మాటిమాటికీ పేపరు మీదనుంచి కదిలి, ఆ యువతీ మీద వాలుతున్నాయి. రవికి ఆమె ముఖం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. అంతరాంతరాల్లో ఏదో అస్తిత్వం కదిలినట్టయింది! హృదయ కవాటం ఎవరో మృదువుగా తట్టినట్టనిపించింది.
కిటికీలోనుంచి తల లోపలకు తీసుకుని ఆ యువతి రవి ముఖంలోకి చూసింది. రవి వెంటనే తన కళ్ళను పేపరు మీదకు మళ్ళించాడు. ఒక అపరిచిత యువతికేసి కళ్ళప్పగించి చూడటం సభ్యత కాదనిపించింది రవికి. పేపరు ముఖానికి అడ్డం పెట్టుకుని రవి ఆలోచనలో పడ్డాడు.
"ఆ పేపరు కొంచెం ఇస్తారా?" కంఠం వీణలా పలికింది. రవి ఉలిక్కిపడ్డాడు. అంతలోనే సర్దుకుని పేపరు అందించాడు.
"ఏమండీ! నా కంఠం అంత కర్ణకఠోరంగా వుందా?" ముసిముసిగా నవ్వుతూ ప్రశ్నించింది.
"ఆఁ! అబ్బే లేదే! ఏం?" అన్నాడు తెల్లమొహం వేసి రవి.
"మరి ఉలిక్కిపడ్డారేం?" కొంటెగా నవ్వుతూ అడిగింది ఆమె.