నిజానికి తనూ రేయింబవళ్ళు తను ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచడం ఎలా అని ఆలోచిస్తూనే వుంది. ఈమధ్యే ఒక ఉపాయం కూడా తట్టింది తనకి. తను మెట్రిక్ పాసయింది. కనుక ప్రయత్నిస్తే ఎక్కడో చోట - ఎంత చిన్న ఉద్యోగమయినా దొరకకపోతుందా! ఉద్యోగం చేస్తే తప్పేముంది? ఎంతమంది ఇల్లాళ్ళు ఉద్యోగాలు చేయడం లేదు . తమ కాంపౌండ్ లోనే ఇద్దరు ఇల్లాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకామె టీచరు, మరొకామె టైపిస్ట్. వాళ్ళిద్దరూ పాసయింది కూడా మెట్రిక్కే. కాకపోతే టీచర్ ట్రైనింగ్, టైపు పరీక్షా పాసవబట్టి వాళ్ళకి ఆ ఉద్యోగాలు దొరికాయి . ఈ విషయం భర్త దగ్గర కదపాలనుకుందామె.
"ఏమండీ! నేనో విషయం చెప్తాను, మీరేమీ కోపగించరు కదా?" ఓరోజు రాత్రి భయంగానే భర్త నడిగిందామే.
"ఏమిటది!" ముక్తసరిగా అడిగాడు మాధవరావు.
"మనకి జీతం ఎటూ చాలటం లేదు. మీరేమో అప్పులు చేయాల్సి వస్తోంది. ఇదంతా నామూలనే అని మీరు అనుకొంటున్న సంగతి నాకు తెలుసు. ఆ విషయం నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడీ ఇబ్బందులు తొలగిపోవడానికి నేనో ఉపాయం ఆలోచించాను! నేను ఉద్యోగం చేస్తాను! మీరు వప్పుకొంటే" అతని వంకే చూస్తూ అడిగిందామె.
ఉలిక్కిపడ్డాడు మాధవరావు.
అతనెప్పుడూ ఈవిధంగా ఆలోచించలేదు.
సీత ఉద్యోగం చేయడమా? చేస్తే ఎలా వుంటుంది! మిగతా ఉద్యోగం చేసే స్త్రీల స్థితిగతులేలా వున్నాయి? ఎవరి దాకానో ఎందుకు? తానఫీసులో చేస్తోన్న ప్రమీల, శారద ల మాటేమిటి? వాళ్ళకేం బాగానే వున్నారు. తమ జీతంతో సంసారం గడుపుతూ భర్తల జీతం బాంకులో దాచుకొంటున్నారు. వాళ్ళకి గౌరవ ప్రతిపత్తుల కేం లోపం వాటిల్లిందని? అందరూ గౌరవంగానే చూస్తున్నారు. మరి సీత కూడా ఉద్యోగం చేస్తేనేం? ఇటు తన ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. అటు తన మామయ్యకు కూడా అదివరలా సహాయం చేయడానికి వీలవుతుంది.
వివాహమయిన తర్వాత ఇంతవరకూ ఒక్క పైస కూడా మామయ్యకు పంపలేకపోయాడు తను. నిజంగా సిగ్గుచేటు! అక్కడ మామయ్య ఎన్ని బాధలు పడుతున్నాడో ఏమో! కేవలం మామయ్య వాళ్ళ కోసమయినా సీత ఉద్యోగం చేయాలి! తప్పదు.
"మాట్లాడరేమండీ! మీ కిష్టం లేదా?" అడిగింది సీత అనుమానంగా..
'అబ్బే .......ఇష్టం లేక కాదు సీతా! నువ్వు ఉద్యోగం చేస్తే మనకేమయినా ఇబ్బందులేదురవుతాయా అని ఆలోచిస్తున్నాను......."
"ఇబ్బందులేముంటాయండీ! మనకింకా పిల్లాపాపా లేరుగా! అ తరువాతంటారూ? అప్పటి సంగతి అప్పుడు ఆలోచించుకోవచ్చు........"
"కాని......నీకింత త్వరగా ఉద్యోగం దొరుకుతుందంటావా? కనీసం టైపయినా వస్తే గాని కొంత ఉపయోగం వుండదు......."
"నేనూ అదే అనుకొంటున్నాను. రేపట్నుంచీ టైప్ ఇన్ స్టిట్యుట్ లో జాయినవుతాను . పరీక్షలు ప్యాసవకపోయినా టైపు కొట్టటం ప్రాక్టీస్ అయితే చాలు! కదూ?"
'సరే! అలాగే చెయ్.....రేపు ఉదయం నేను ఆఫీసు కెళ్ళేటప్పుడు నాతోపాటు వచ్చేయ్. మెయిన్ స్ట్రీట్ లో టైప్ ఇన్ స్టిట్యుట్ లో మాట్లాడి నిన్ను చేర్పిస్తాను. రోజూ అదే టైము తీసుకొనేట్లయితే ఇద్దరం కలిసి బయలుదేరవచ్చు!......" ఉత్సాహంగా అన్నాడు మాధవరావు.
5
ఆ మర్నాడే సీత టైపు నేర్చుకోవడం ప్రారంభించింది. అక్కడ మొదట పరిచయమయింది అరుణ. అరుణ రచయిత్రి అని తెలిశాక ఆమె మీద మరింత ఆసక్తి చూపింది సీత.
"ఇంతవరకూ ఎన్ని కధలు రాశారు మీరు?" అడిగింది సీత కుతూహలంగా.
"సుమారు ఇరవై కధలు రాసుంటాను. అవిగాక నవలలు నాలుగు రాశాను....."
"నవలలు నేను చదివాను లెండి. కధలే మిస్సయ్యాను." అంది సీత.
"ఓరోజు మా ఇంటికి రండి! అన్నీ బైండు చేయించాను తీసుకెళ్ళి చదువుకుందురు గాని....."
"అలాగే ......" సంతోషంగా అంది సీత.
మర్నాడు టైప్ ప్రాక్టీసింగ్ అయిపోగానే అరుణతో అక్కడికి దగ్గరలోనే వున్న వాళ్ళింటికి చేరుకుందామే. వాళ్ళ ఇంట్లో కల్లా అరుణ గదే చాలా నచ్చింది సీతకి. గదిలో చిన్న స్టీలు అల్మారా! దాని నిండా ఖరీదయిన చీరె, డొకోలాం మంచం, గాడ్రెజ్ టేబులు , రివాల్వింగ్ కుర్చీ.
"ఇవన్నీ నా రచనలకు వచ్చిన పారితోషకం తోనే కొనుక్కొన్నాను......" సగర్వంగా అంది అరుణ.
ఈ మాట వింటూనే ఆశ్చర్యపోయింది సీత. రచనలు చేయడం వల్ల కేవలం మంచి పేరు సంపాదించుకోవటమే అనుకుంటూ వస్తుంది తను. కాని ఇప్పుడు అలా అనుకోవడం తప్పని ఋజు అయిపొయింది. పేరే కాకుండా డబ్బు కూడా సంపాదించవచ్చని తనకిప్పుడే తెలిసింది.