Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 12

 

    జైరాజ్ సెల్ బంద్ జేసి విస్కీ బాటిల్ ఓపెన్ చేశాడు.
    అప్పుడే రోజా ఇంట్లో కొచ్చింది.
    "హాయ్ డాడ్.........."
    "హాయ్ బేబీ - ఏంది యాళ లేటయింది?"
    రోజా మాట్లాడకుండా సోఫాలో కూర్చోవటం చూసేసరికి జైరాజ్ కి మొదటి పెగ్ నిషా దిగిపోయింది.
    "అరె - సప్పుడు జేయవ్? ఏమాయే - గట్ల సైలెంట్ గున్నావ్?"
    "చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది డాడ్-'
    అప్పుడే లోపల్నుంచీ వచ్చిన సబిత ఆ డైలాగ్ విని భయపడిపోయింది.
    "ఏంది బిడ్డా! ఏంది ప్రాబ్లం ?" ఆత్రుతగా అడిగింది.
    "మన చానెల్ ప్లేస్ ఇంకా కిందకు జారింది -"
    "అంటే మొల్తాడు తెగితే చెడ్డీ - లెక్క - మొత్తం కిందకా?" గబరాగా అడిగాడు జైరాజ్.
    "అవును డాడ్!" ఇప్పుడు మనదే నెంబర్ "సిక్స్' చానెల్ -"
    "ఓగాడ్ - అంత ఫాస్ట్ గా ఎట్లా పడింది ? లాస్ట్ మంత్ ల నెంబర్ త్రీ పొజిషన్ అంటివి గదా?"
    "అవును! ఇంత ఫాస్ట్ గా ఎలా స్లిప్ అయామో- నాకే అర్ధం కావటం లేదు -" విచారంగా అందామె.
    "దాన్దేమున్నది - కోషిష్ జేస్తే మళ్ళీ పైకి రావచ్చు కదా?" అడిగింది సబిత.
    జైరాజ్ తల అడ్డంగా ఊపాడు.
    "నీకు సమజ్ గావటం లేదే! నెంబర్ త్రీ పొజిషన్ లో ఉన్నప్పుడే మన చానెల్ నష్టాల్లో నడుస్తుండే! గిప్పుడిక లాస్ట్ అంటే ఒక్క యాడ్ కూడా మన చానెల్ కియ్యరు. మనం ఇన్ వెస్ట్ జేసిన పైసలన్నీ పోయినట్లే -"
    ఆ మాటతో పొజిషన్ సబితకు అర్దమయి , గుండె పట్టుకుని గాబరాగా కూర్చుండిపోయింది.
    పెట్టిన పెట్టుబడి పొవటమంటే మాటలు కాదు. ఇంచుమించు ప్రాపర్టీ మొత్తం పోయినట్లే - ఫామిలీ రోడ్ న పడాల్సిందే-
    సబితకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినయ్-
    కాస్తా కూస్తా కాదు! ఎనభయ్ కోట్లు -
    ముగ్గురూ సైలెంట్ గా కూర్చుని ఉండగా భవానీ డైలాగ్ వినిపించింది.
    "హాయ్ రోజా! నేనెవరో చెప్పుకో చూదాం-"
    రోజా తలెత్తి భవానీని చూసి ఆశ్చర్యంగా లేచి నిలబడింది. గుర్తు తెచ్చుకోడానికి ఎంత ప్రయత్నించినా అతనెవరో ఏమాత్రం గుర్తు రావటం లేదు.
    "సారీ! అయ్ కాంట్ రిమెంబర్ -" అంటూ తండ్రి వేపు చూసింది.
    "అదేంటి? నీ బచ్ పన్ కాదొస్తనే గుర్తుపట్టవా?' అడిగా జైరాజ్ హాపీ మూడ్ లో కొస్తూ.
    రోజా కన్ ఫ్యూజయింది.
    "బచ్ పన్ కా దోస్తంటే....."
    సబిత చెప్పేస్తుంటే భవానీ వారించాడు.
    "నువ్ చెప్పద్దాంటీ - నేనే ఒక క్లూ ఇస్తా-" అంటూ రోజా దగ్గరకొచ్చి ఆమె చెవిలో "ఏయ్ ఉల్లిపాయ! ఇంత త్వరగా నన్నెట్లా మర్చిపోయావే?" అన్నాడు సీక్రెట్ గా .
    ఉలిక్కిపడింది రోజా ..........
    అతనిని ఎగ్జయిట్ మెంట్ తో చూసింది.
    "ఓగాడ్! నువ్ రాకేష్ వా?"
    "ఏం డౌటా?"
    "నువ్ రాకేష్ లాగా లేవు-"
    "రాకేష్ నయితే కదా - అలా ఉండటానికి-"
    "అంటే?"
    "పదేళ్ళకిందటి రాకేష్ వేరు నేను వేరు - చాలా మారిపోయాను కదా! అసలు నా రూపమే మారిపోయింది -"
    "యా - యా అదే నేనూ ఫీలవుతున్నా-"
    "నువ్ మాత్రమేం తక్కువేంటి? నేను గాబట్టి గుర్తుపట్టాను గానీ -- అదే ఇంకెవరయినా అయితే ఇంకోదాన్ని వెతుక్కునే వాడు !' రోజా అతని డైలాగులకు కొంచెం అనీజీగా ఫీలయింది.
    "నువ్ కొంచెం దిగ్నిఫిడ్ గా మాట్లాడితే బావుంటుంది -- " అంది కోపం అణచుకుంటూ.
    జైరాజ్ వెంటనే వివరణ ఇచ్చాడు.
    "రోజా జరంత ఇంటలేక్చువల్ టైప్ అనుకోరాదు? లాంగ్వేజ్ , బిహేవియర్ - అన్నీ అమెరికా టైపన్నట్లు!"
    వెంటనే సబిత అందుకుంది.
    "రోజా లేవలే వేరు రాకేష్ - గివ్ రేస్ ఫెక్ట్ అండ్ టెక్ రేస్ ఫెక్ట్ టైప్-"
    "ఓ! నౌ అయ్ అండర్ స్టాండ్! చిల్లర్ టైప్ ని లైక్ చేయదన్నమాట! అయితే ఇండియాలో ప్రాబ్లమే- పాపం! అవునా రోజా-"
    "యా! యా! బిగినింగ్ లో కొంచెం ప్రాబ్లం అయింది. కానీ స్లోగా మా చానెల్ వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి ఒక లెవల్ కి తీసుకురావడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది -' గర్వంగా చెప్పింది రోజా.
    "వావ్! యూ ఆర్ రియల్లీ గ్రేట్! ఒబామాకి నీ లెవల్ తెలుస్తే పరేషానవుతాడు! ముల్కీ రూల్స్ కాన్సిల్ జేసి ఇండియన్ అమెరికాల్ పోరిలు జిందాబాద్ అంటాడు -"
    రోజాకి ఆ డైలాగ్ కూడా నచ్చలేదు.
    'ఆ లూజ్ టాకే నాకిష్టం ఉండదు" అంది చికాకుగా.
    "ఓ సారీ! ఏం చేస్తాం! అదత్ సే మజ్ బూర్ హై!"
    "ఈ ఇండియన్ బిహేవియర్ అంతేనమ్మా! ఇక్కడి వాళ్ళ పూర్వికులు ట్రైబల్స్ కదా! " సర్ది జెప్పటానికి ప్రయత్నించాడు జైరాజ్.
    "పదమ్మా! అందరం కలిసి భోజనం చేద్దాం! రాకేష్ కూడా నీకోసం వెయిట్ చేస్తూ భోజనం చేయలేదు - అంది సబిత.
    'అవును రోజా! భోజనం చేస్తూ మనం మన ఎగ్జయిటింగ్ ఓల్డెన్ డేస్ గురించి గుర్తు తెచ్చుకోవాలి -" అన్నాడు భవానీ ఉత్సాహంగా.
    రోజాకి ఆ ప్రపోజల్ నచ్చినట్లు లేదు.
    'ఆయామ్ టూ టైర్ డ్ మమ్మీ! మీల్స్ నా రూమ్ కి పంపించు-" అంటూ లేచి తన రూమ్ వేపు వెళ్ళిపోయింది.
    "ఈ అమెరికా పిచ్చోళ్ళతో ఇదే ప్రాబ్లం! ఇక్కడి జనం బిహేవియర్ ని అస్సలు భరించలేరు -' అన్నాడు భవానీ స్వగతంగా. లోపల్నుంచీ ఆ డైలాగ్ విన్న రోజాకి కోపం ముంచుకొచ్చింది -
    "వ్వాట్? అమెరికా పిచ్చోళ్ళా?" కోపంగా అడిగాడు జైరాజ్-

 Previous Page Next Page