Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 12


    "నే చెబుతా వినవయ్యా అన్నాడు. "అలా సుఖాసనం వేసుకుని 'ఓం' అని అనుకుంటూ కళ్ళుమూసుకున్నానంటే కళ్ళముందు గుండ్రని వెలుగు కనిపిస్తోంది. అంతే వొళ్ళు తెలీదు. ఆ వెలుగు క్రమక్రమంగా దగ్గరకోచి భ్రుకుటిలోంచి, కంఠంలోకి ఆ తర్వాత హృదయంలోకి...
    "ఆహా! మీ దగ్గర చాలా నేర్చుకోవాలి బావగారూ"
    "నే చెబుతా వుండరా బ్రదరూ ఆయనగారి మెడిటేషన్ గురించి" అంది సుశీలమ్మగారు. ఆయన 'ఓం' అనుకుంటూ కళ్ళుమూసుకోగానే కనిపించేది గుండ్రటి వెలుగు కాదు. మా కోడలు వేసే గుండ్రటి ఇడ్లీ. అది దగ్గరగా జరుగుతూ వచ్చేది భ్రుకుటిలోకి కాదు. చవులూరిస్తూ గొంతులోకి. ఇహ ధ్యానంవల్ల వొళ్ళు తెలీకపోవటం కాదు. కాస్త అవకాశం దొరికితే పరుగులు తీస్తూ మీదకొచ్చే నిద్ర"
    "మీ అక్కయ్యకి నా మెడిటేషన్ మీద నమ్మకం లేదయ్య. కాకపోతే కాస్త జిహ్వచావల్యం వుందనుకో"
    "జిహ్వచావల్యం" అనేమాట వినగానే రామేశానికి నోరూరింది. అంతలో సుజాత అతిథులకు ప్లేట్లతో ఉప్మా తీసుకొచ్చింది.
    రామేశం ఉప్మా తినడం మొదలుపెట్టాడు.
    "ఆహా! ఓహో!" అన్నాడు.
    అమ్మాజీ అతని ముఖంలోకి చూసింది.
    ఉప్మా బ్రహ్మాండంగా వుంది. దేశవాళి గోధుమరవ్వ, జీడిపప్పు, మామూలుగా పెళ్ళిళ్ళలో తేలిగ్గా అయిపోతుంది కదా అని చేసే ఉప్మా ఇంత రుచిగా వుంటుందని ఇవేళ కనిపెట్టాననుకో"
    "మీరు కొత్తచోటు కొస్తే ఇలాంటివి చాలా కనిపెడుతుంటారు" అంది అమ్మాజీ.
    "మా డాటరిన్లా వంటలో సిద్ధహస్తురాలు. మామూలు ఐటమ్స్ కూడా తెలివితేటలు జోడించి, కొత్త కొత్తవి వూహించి మాంచి రుచిగా తయారుచేస్తుంది" అంది సుశీలమ్మగారు.
    "అవునూ. ఈ చెంచా మూతి మామూలుగా చిన్నదిగా వుండి, కాడ ఇంత పొడవుగా వుందేమిటి?" అన్నాడు రామేశం.
    "వీటిని అమితాబచ్చన్ చెంచాలంటార్రా" అంది సుశీలమ్మగారు.
    "చాలా బావున్నాయే. అమ్మాజీ, మన వూళ్ళో ఇలాంటివి దొరకవుగానీ, మనం ఇక్కడ్నుంచి వెళ్ళేలోగా అక్కయ్యతోనో, సుజాతతోనో బజారెళ్ళి రెండు డజన్లు కొనెయ్. బజారు వెళ్ళేటప్పుడు పర్సు తీసుకెళ్ళటం మరచిపోకు. నీకు అదో అలవాటు.


                            *    *    *    *


    "అమ్మాజీ! ఈ పూటకు వంటలోకి ఏం చెయ్యమంటావు?" మా బ్రదర్ ఏం తింటాడో" అంది సుశీలమ్మగారు.
    "అబ్బే. వారెక్కువ తినరు వదినా. రెండు నిమ్మకాయలు"
    వినోద్ అక్కడే వున్నాడు. "వాట్! రెండు నిమ్మకాయలు తిని వూరుకుంటారా?" అన్నాడు ఆశ్చర్యంగా.
    "అంటే రెండు నిమ్మకాయల పరిమాణాన్ని మించని అన్నం. అన్నమంటే గోధుమన్నం అనుకో. డయాబిటిస్ కదా, పత్యం భోజనం, ఆకుకూరలు, పప్పు, కాకరకాయ, దోసకాయ..."
    అక్కడే వున్న మాధురి చిన్నగా "ఆ కాకరకాయ వగైరాలన్నీ మనతో తినిపిస్తుందేమిటి? అసలే వాటికి మనకూ శత్రుత్వం" అంది.
    "బి.పి. కూడా వుంది కదా. అన్నిట్లోనూ ఉప్పు తక్కువగా వెయ్యాలి" అంది అమ్మాజీ.
    "చచ్చాం" అన్నాడు వినోద్ చిన్నగా.
    "ఏమిట్రా?" అంది మాధురి.
    "అసలే కాకరకాయ, ఆకుకూరలు, దాంతో ఉప్పు, కారం లేకుండా చప్పగా..."
    "ఇహ యిక్కడ వుంటే ఇలాంటి విపరీతాలే వినాల్సి వస్తుందిగానీ, వెళ్ళిపోదాం రారా" అంది మాధురి.
    ఇద్దరూ వెళ్ళిపోయారు.
    అమ్మాజీ అటూ యిటూ చూసింది. దగ్గరలో ఎవరూ కనబడలేదు.
    "మీరింకోరకంగా అపార్థం చేసుకోనంటే...మరో ముఖ్యమైన..." అంది రహస్యం చెబుతున్నట్లు.
    "ఏమిటో చెప్పమ్మా" అంది సుశీలమ్మగారు ఆప్యాయంగా.
    "మరే...మరి..." అమ్మాజీ సిగ్గుపడుతుంది.
    "చెప్పమ్మా"
    "ఈ యింట్లో చూస్తే ఎక్కువ గదులున్నట్లుగా లేవు...ఆయనకి చలిగాలి పడదేమో, గదుల్లో తప్ప వరండాలో పడుకుంటే నిద్రపట్టదు."
    "దాన్దేముంది? మీరుండే నాలుగురోజులూ, మా చిన్నబ్బాయి, అమ్మాయి వరండాలో పడుకుంటారు. ఓ కే?" అంది సుశీలమ్మగారూ.
    "ఇంకో చిన్న విషయమొదినా"
    "చెప్పమ్మా నా దగ్గర డౌట్ పడకు"
    "అదేమిటో...ఆయనకి గది తలుపులు తీసి వుంటే నిద్రపట్టదు. తలుపులు వేసేసుకోవాలి... అదేం చిత్రమైన అలవాటో... ప్రక్కవాళ్ళేమనుకుంటారోనని ప్రాణాలు చచ్చిపోతూంటాయి."
    "ఒక్కో మనిషికి ఒక్కో హ్యాబిటుంటుంది" అండర్ స్టాండ్ చేసుకోవాలి మరీ.


                                                 *    *    *    *


    రామేశం, సుశీలమ్మగారూ కూచుని కబుర్లు చెప్పుకుంటూంటే_అవి ఎక్కువగా జబ్బుల గురించే అయివుంటుంది. అలా మాట్లాడుకోవటంలో వాళ్ళు గొప్ప ఆనందం అనుభవిస్తూ వుంటారు.
    "ఎందుకె అక్కయ్యా అలా నీరసంగా కనబడుతున్నావు" అనడుగుతాడు రామేశం.
    "అదేమిటిరా. ఈ మధ్య జనరల్ వీక్ నెస్ ఎక్కువయి పోతుంది. అప్పటికీ ఆల్సోసాంగూ, ప్రొటీన్లూ తాగుతూనే వున్నాను."
    "ఎక్కడో డిఫెక్ట్ వుంటుందక్కయ్యా. బ్లడ్ టెస్టులూ అవీ చేయించుకోపోయావా?"
    "ఎప్పటికప్పుడు చేయించుకుంటూనే వున్నారా. మరి ఏ డిఫెక్టూ కనబడదు."
    "అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకో అక్కయ్యా. ఎక్కడ ఏ లోపమున్నా టక్కున కనిపెట్టేస్తుంది."
    "ఏదీ? ఆ టి.వి.లో కనిపిస్తూ, ఫోటోస్ తీస్తుంది అదా! చాలా డబ్బయిపోతుందిరా."
    "ఆరోగ్యం విషయంలో డబ్బు చూసుకుంటే ఎలా? లేటెస్ట్ ఎక్విప్ మెంట్సు వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. పనిలో పని, నువ్వు చూపించుకున్నప్పుడే నేనూ చూపించేసుకుంటాను. ఎందుకంటే మనం మనం ఒక్కటే..."

 Previous Page Next Page