Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 11


    వినోద్ లోపల్నుంచి వచ్చి వ్యవహారం చూసి గమనిస్తున్నాడు. "నెలరోజులబాటు వుండటానికి సిద్ధపడి వచ్చినట్లు కనబడుతూన్న ఈ లగేజీ నాతో మోయిస్తుందేమిటి? ఉహు. నేనెక్కడో దూరంగా వున్నాను. అమ్మ పిలుపు నాకు వినబడటంలేదు" అనుకుంటూ బిగుసుకుపోయి కూర్చున్నాడు.
    "సమయానికి ఒక్కరూ కనబడరు. ఎక్కడున్నారో ఏమో" అంది సుశీలమ్మగారు విసుగ్గా.
    రామేశం మాత్రం ఏమీ కలవరపాటు పడకుండా "ఫర్వాలేదులే అక్కయ్యా. అమ్మాజీ వుందిగా, పెట్టేస్తుంది. నేనెందుకు బరువులు మొయ్యటం లేదో తెలుసా? నాకు డయాబిటిస్, బి.పి. అందుకని డాక్టర్ సలహా మీద సామాన్లు అలాంటిదేమీ మొయ్యను...అవునూ! ఈ ఊళ్ళో రిక్షావాళ్ళు చాలా ఎడ్వాన్సయి పోయారక్కయ్యా. లగేజి లోపల పెట్టకపోగా నోట్లోంచి బీడీ తియ్యడేమిటి?" అన్నాడు.
    "ఈ రోజుల్లో ఎక్కడయినా అంతేలేరా. అంతా ఎడ్వాన్స్. పి.టి.ఉష, అశ్వనిలలాగా ఒక స్టెప్ అటూ యిటూ అంతే."
    "ఏమిటి నువ్వు స్పోర్ట్స్ లో కూడా బాగా ఎడ్వన్సయిపోయావు. అయితే ఈ ఆమధ్య జరిగిన సాకర్ ఆటలు టి.వి.లో చూసే వుండాలి."
    "అర్దరాత్రివరకూ ఇంటిల్ల పాదీ నిద్రలేకుండా చూసేవారమనుకో...అయినా ఈసారి మారడోనా బాగా ఆడలేదురా?"
    "మారడోనా కాదక్కయ్యా. మ్యాడోనా" అన్నాడు తను ఇంగ్లీషులో ఆవిడకన్నా దిట్ట అని నిరూపించుకోటానికి"
    "నాకు తెలుసులేరా"
    అమ్మాజీ అతన్తో "ఏమండీ వదినగారితో కబుర్లలో పడి రిక్షా అబ్బాయికి డబ్బులివ్వటం మరిచిపోయారేమిటి? అతనప్పుడే గుర్రుగా చూస్తున్నాడు" అంది.
    "అవును కదూ. అలా మరిచిపోయానేమిటి?" అన్నాడు రామేశం ఆశ్చర్యంగా. అంతలోనే మళ్ళీ సర్దుకున్నట్లు "అయినవాళ్ళకదా, అక్కయ్యను చూసేసరికి అతి ముఖ్యమైన సంగతులే కొన్ని మర్చిపోతూ వుంటాను. అని జేబులోంచి పర్సు తీశాడు. "అవునూ! పర్సులో చిల్లర కనిపించదేమిటి? అన్నీ వందరూపాయల నోట్లున్నాయి."
    "నేనిస్తాలేరా" అంటూ సుశీలమ్మగారు" వినోద్ వొరేయ్ వినోద్" అంటూ మళ్ళీ కేకేసింది.
    వినోద్ కి తప్పలేదు. "ఏమిటమ్మా" అంటూ వచ్చాడు.
    "అన్నయ్యనడిగి ఓ ఫైవ్ రూపీస్ తీసుకురారా"
    వినోద్ ఆవిడ మాటని శిరసావహించి లోపలకెళ్ళి తీసుకొచ్చి యిచ్చాడు. అయితే అది ఐదు రూపాయలనోటు కాదు. పదిరూపాయల నోటు.
    మాధురి యిదంతా గమనిస్తోంది.
    చిన్నగా "అన్నయ్యా" అంది.
    "ఏమిటే మాధురీదీక్షిత్"
    "అదిగో అలాగే పిలవద్దన్నాను."
    సరే. సరే విషయం చెప్పు.
    "ఆయన రిక్షా అబ్బాయిచ్చిన చిల్లర అమ్మకివ్వకుండా జేబులో వేసుకుంటున్నాడేమిటి?"
    "పాపం ఆయనకిలాంటివి గుర్తుండవు."
    రామేశం వాళ్ళిద్దరూ గుసగుస లాడుకోవటం గమనించాడు "ఏమిట్రా మీరిద్దరూ దూరంగా నిలబడి అలా పరాయివాడ్ని చూసినట్లు చూస్తున్నారు? మనం మనం అయిన వాళ్ళం. కాకపోతే...వెధవది... ఈ ఉద్యోగాలవల్ల, వృత్తులవల్లా తరచుగా కలుసుకోలేకపోతూ యిలా దూరమైపోతున్నాం. అరె...మాధురి కూడా చక్కగా ఎదిగిందే అమ్మాజీ! మా మేనకోడలు అచ్చం సినిమా స్టార్ లావుంది కదూ"
    "మాధురీ! అప్పుడే నిన్ను కాకాపట్టేస్తున్నాడు" అన్నాడు వినోద్ చిన్నగా.
    "బహుశా ఆయనకప్పుడప్పుడూ నిజం చెప్పే అలవాటు వున్నట్లుందిరా"
    "ఈ పొగడ్తకి పడిపోని వారెవరూ వుండరులే"
    అంతా మధ్య గదిలో సెటిలయ్యారు. విజయ్ కుమార్ బెడ్ రూంలోంచి ఇవతలకొచ్చి పలకరించాడు. సుజాత అంతకుముందే పలకరించి, లోపలకెళ్ళి కాఫీలు కలుపుకొచ్చింది.
    "కాఫీ తీసుకో బ్రదర్" అంది సుశీలమ్మగారు.
    "షుగర్ వెయ్యలేదు కదా. ఎందుకంటే నేను డయాబిటిస్ పేషెంటుని"
    "వెయ్యలేదు లేరా. మీ డాటరిన్ లా నీ మాటల్ని బట్టి ముందే కనిపెట్టేసింది."
    రామేశం కాఫీ కొంచెం సిప్ చేశాడు. "గుడ్! కాఫీ అంటే యిలా వుండాలి. ఏమి రుచీ, ఏమి ఈరోజూ అమ్మాజీ పాతికేళ్ళబట్టి కాపురం చేస్తున్నా నీకిలా కలపటం చేతకాదు కదా"
    అమ్మాజీ మూతి ముడుచుకుంది. "మీరెక్కడకొచ్చినా ఇతరుల్ని పొగడకుండా వుండలేరు కదా" అంది.
    సుశీలమ్మగారు సర్దుబాటు చేస్తున్నట్లుగా "కాఫీ పౌడర్ లో కూడా వుంటుంది లేరా. ఈ ఊళ్ళో మాంచి కాఫీ పౌడర్ దొరుకుతుంది" అన్నది.
    "అంతేనంటావా? అమ్మాజీ! వెళ్ళేటప్పుడు ఇక్కడ్నుంచి రెండు కేజీలు కాఫీపౌడరు పట్టుకెళదాం గుర్తుంచుకో" అన్నాడు రామేశం.
    "మన ఖాతాలో" అన్నాడు వినోద్ చిన్నగా.
    రామేశం కాఫీకప్పు క్రిందపెట్టాడు. "ఇలా వుంటే అరగంటకోసారయినా కాఫీ త్రాగి ఆ థ్రిల్ అనుభవించాలనిపిస్తోంది."
    "మాధురి" అన్నాడు మళ్ళీ చిన్నగా వినోద్.
    "ఏమిటన్నయ్యా"
    "ఇవాళ్టినుంచి కాఫీపొడి రోజుకో కిలో అయిపోయేలా వుంది. కాఫీ పరమ అసహ్యంగా తయారు చెయ్యమని వదినకు చెబుతాను"
    "అవునూ, బావగారు కనబడరేమిటీ?" అన్నాడు రామేశం.
    "ఆయన...తన గదిలో కూచుని డీప్ మెడిటేషన్ లో వున్నాడులే" అంది సుశీలమ్మగారు.
    అంతలో ప్రసాదరావు లోపల్నుంచి రానే వచ్చాడు. ఈ చివరి మాటలు విననే విన్నాడు.

 Previous Page Next Page