అదేమిటో ఒకరు ఓ లక్షణం గురించి చెప్పేటప్పుడు అది రెండోవారి లక్షణంతో సింత్రనైజ్ అవుతూ వుండేది.
ఆమె చీటికీ మాటికీ వొంట్లో బాగాలేదు, అనగానే నీకు వంట్లో బాగాలేదా? నాకూ బాగాలేదు? అనుకునేవారు.
"ఇదేమిటో ఈ మధ్య మడమ దగ్గర ఒకటే నొప్పి వొస్తుందిరా" అని ఆవిడంటే,
అతనూ, నీకూ వస్తుందా? నాకూ అలాగే వస్తూంది" అనేవాడు.
వాళ్ళిద్దరికీ అదో గొప్ప కాలక్షేపం.
* * * *
రామేశానికి డయాబిటిస్, బి.పి. వున్నా జిహ్వచావల్యానికేమీ లోటు లేదు.
పథ్యం, పథ్యం అంటూనే కోరినవన్నీ చేయించుకుంటూ వుంటాడు.
"అమ్మాయ్! అంటూ సుజాత దగ్గరకు ఆప్యాయంగా చేరేవాడు. "గుత్తివంకాయకూర వుంటే__ఈ మధ్య రకరకాలుగా చేస్తున్నారమ్మా. వంకాయని నాలుగు భాగాలుగా చీల్చకుండా, మధ్యలో గాటుపెట్టి అందులో కొంచెం కారం, సెనగపొడి, ఇంకా మసాలకూర, నూనెలో చేయించినట్లయితే..." అంటూ అలా చేయించుకు తినేవాడు.
అంటూ "ఆహా అద్భుతం, ఓహో బ్రహ్మాండం" అని పొగిడేవాడు.
"వినోద్! అలా బయటకు వెళ్ళి వద్దాంరా" అంటూ బయల్దేరి తీసేవాడు.
రామేశానికి సిగరెట్లు అలవాటు. వినోద్, పర్సు మరిచిపోయానుగాని, ఓ గోల్డు ప్లాక్ ప్యాకెట్ తీసుకో. ఆనక యింటికెళ్ళాక గుర్తుచేసి డబ్బు తీసుకో సుమా. నాకు ఇతరుల సొమ్ముతో ఎంజాయ్ చెయ్యటం ఇష్టం వుండదు. ఎందుకంటే డబ్బు విలువ తెలిసినవాడ్ని" అనేవాడు.
అలాగే రెండు మూడు రోజులకోసారి సినిమాకి తీసుకెళ్ళేవాడు. అదేమిటో డబ్బు ఖర్చుపెట్టటం అవసరమున్నప్పుడల్లా అతను పర్సు మర్చిపోవటమో, వందరూపాయల నోటుకు, ఆ మాటకొస్తే అయిదొందల రూపాయల నోటుకు చిల్లర లేకపోవటమో జరిగేది.
అతను ఎప్పుడూ ఏదో ఒక ప్రపోజల్ లేవదీస్తూ వుండేవాడు.
"కార్తీక మాసం. అందరూ వనసమారాధానాలకి వెళుతున్నారు. మనం కూడా వెళదాం" అంటూ ఓసారి అందరినీ ఒప్పించాడు.
ఓ ఆదివారం వనభోజనం ఏర్పాటు చేయించాడు.
సుజాత ఇంట్లోనే అన్నీ తయారు చేసింది. మాధురి చాలా సహాయం చేసింది.
వీళ్ళ హడావుడి చూసి విమలాదేవి గబగబా రాధాప్రియ దగ్గరకొచ్చింది.
"ఏమండోయ్. వీళ్ళంతా వనభోజనానికి వెళుతున్నారు. అందరం కలిసి ఒక ఇంట్లో వుంటున్నాం కదా మనతో చెబితే మనం కూడా మన మొగుళ్ళతో వాళ్ళతో జాయినయి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా" అంది.
"వాళ్ళ బొంద వాళ్ళకు ఎంజాయ్ మెంట్ కూడానా? రెక్కలు ముక్కలు చేసుకొని వంటవాళ్ళలా వంట వండటం అదో ఎంజాయ్ చెయ్యటమా? వచ్చేవారం మీ ఫ్యామిలీ, ఇంటివాళ్ళ ఫ్యామిలీ ఓ బ్రహ్మాండమైన పార్టీ ఏర్పాటు చేస్తానుండండి. వీళ్ళలా రెక్కలు ముక్కలు చేసుకుని వంటలు వండటం కాదు. హోటలులో ఆర్డర్ చేస్తాను.
"ఆఁ అలా చేస్తే అద్భుతంగా వుంటుందండి" అంది విమలాదేవి.
ఇంటి యజమానురాలి పేరు సత్యాదేవి. వాళ్ళాయనకీమధ్య వ్యాపారంలో కలిసొచ్చి గబగబ డబ్బు సంపాదించేస్తున్నాడు. ఆయనకు డబ్బు సంపాదన తప్ప ఇంకో సంగతి పట్టదు. ఇంట్లో ఎక్కువ వుండటం లేదని పెళ్ళాం గొణక్కుండా ఆవిడ అడిగినవీ అడగనివీ అన్నీ కొని పడేస్తున్నాడు. టి.వి. ఎలాగూ ప్రతి వాళ్ళింట్లోనూ వుంటుంది. ఎయిర్ కూలర్, ఫ్రిజ్, వి.సి.ఆర్, ఈ మధ్య టెలిఫోన్ కూడా వచ్చేసింది.
సత్యాదేవి కొంతవరకూ సబబైన మనిషే. నిక్కచ్చి మనిషి కూడా. అనవసరంగా ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోదు. అరిచి గీపెట్టినా ఎవరికీ సాయం చెయ్యదు కూడా. అద్దె మాత్రం నిక్కచ్చిగా వసూలు చేస్తోంది.
రామేశానికున్న అనేక వ్యసనాల్లో ఫోను వ్యసనం ఒకటి. అతని కెవరింట్లోనైనా ఫోను వున్నట్లు కళ్ళబడితే ఎక్కడలేని పనులూ గుర్తుకొస్తాయి. అయిన దానికి కాని దానికి ఫోన్లు చెయ్యకపోతే అతని చెయ్యి వూరుకోదు.
ఇంటివాళ్ళ ఫోనుమీద మొదటిరోజునే అతని కన్ను పడింది. గబగబా వెళ్ళి పరిచయం చేసుకున్నాడు. అతనికా వూళ్ళో అయిదారుగురు పరిచయస్తులున్నారు. అవకాశమున్నప్పుడల్లా వెళ్ళి వారికి ఫోన్లు త్రిప్పేవాడు.
"ఏమోయ్ బావున్నావా? ఏమిటి కబుర్లు? మీ పిల్లలేం చేస్తున్నారు?" ఇలా వూకదంపుడు దంచేవాడు.
ఇంటావిడతో "ఏమండోయ్. ఈ ఫోన్లన్నీ ఊరికినే చేస్తాననుకోకండి. ఇంకొకరి వస్తువులు వాడుకోవటమంటే నాకిష్టం వుండదు. పర్సు మర్చిపోయి వచ్చాను. ఎంతయిందో లెక్కచూసి చెప్పండి. వెళ్ళి వెంటనే పంపించేస్తాను" అనేవాడు.
తర్వాత దాని వూసు గుర్తుండేదికాదు. సత్యాదేవి నిక్కచ్చి మనిషి కావటం చేత సుజాత దగ్గరకెళ్ళి వసూలు చేసుకునేది.
రాధాప్రియ వెళ్ళి సత్యాదేవిని కలుసుకొంది. ఇదివరకు రాధాప్రియ ఇంకోవిడతో సఖ్యతగా వుండేది కాదు. సుజాత మీద కోపంవల్ల ఈ మధ్య తరచు వెళుతోంది. అంతేకాదు. ఇంట్లో చేసిన కారప్పూస, జంతికల లాంటివి "మీకిష్టమని తెచ్చాను" అంటూ తీసుకెళుతోంది.
ఇద్దరూ కలిసి జంతికలు తింటున్నారు.
మొదట్లో సుజాతను గురించి రాధాప్రియ ఎత్తినప్పుడు సత్యాదేవి వినీ విననట్లు ఊరుకొనేది. "పోనిద్దురూ వాళ్ళంతా చెడ్డవాళ్ళలా కనబడటం లేదు అని కూడా అనేది. కాని ఈ మధ్య కాస్త కాస్త మెత్తపడుతోంది. చెప్పుడు మాటలకు లొంగిపోనివాళ్ళు ప్రపంచంలో ఎక్కడో గాని వుండరు.
నాగరిక దేశాల్లో కూడా ఈ జాడ్యం వున్నది. స్టెఫీ గ్రాఫ్ టెన్నిస్ ప్రాధాన్యతకన్న ఆమెతండ్రి ఎవరో మోడల్ గర్ల్ తో సంబంధం పెట్టుకున్నాడన్న వార్తకు ప్రాధాన్యత నిచ్చి, నానా అల్లరి చేసి, ఆమెలోని ఏకాగ్రతను చెడగొట్టేసి బలహీనపర్చిన ప్రపంచమిది. ప్రతివారి పర్సనల్ విషయాలూ వీళ్ళకి కావాలి. స్టెఫ్ గ్రాఫ్ తండ్రికి ఎవరితో సంబంధముందో మార్టి నాన్న పత్రిలోవాకి లెస్నియన్ గర్ల్ ఫ్రెండ్ వుందనీ, డేటింగ్ కు హాలులో గదిలో ఏ కాల్ గర్లతో గడిపాడో, ఇమ్రాన్ ఖాన్ కి ఎంతమంది అమ్మాయిలతో సంబంధముందో, ఇవన్నీ లెక్కలు కావాలి. వ్యక్తిలోని గొప్పతనాన్ని ఇలాంటి సైడ్ ట్రాఫ్ ద్వారా భగ్నంచేసే దుర్మార్గపు ప్రపంచమిది.