Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 11


    "చాలా బాగుంది! ఎటొచ్చీ మీరింకో సహాయం చేయాల్సి ఉంటుంది."
    "ఏమిటది?"
    "నా పేరుమీద సీరియల్ కూడా మీరే రాయాలి. నాకు టైముండదు..."
    "ఆల్ రైట్ ఎగ్రీడ్."
    భవానీశంకర్ లేచి వచ్చేశాడు.
    సాయంత్రానికి విజేత ఎడిటర్ దగ్గర్నుంచీ ఫోన్ వచ్చిందతనికి.
    "సారీ! ఆ అమ్మాయి ఫోటో మా మాగజైన్ లో పబ్లిష్ అవలేదు. అయిదేళ్ళ క్రితంవరకూ వచ్చిన సంచికలన్నీ వెతికించాను."
    "థాంక్యూ బ్రదర్! మీ రుణం ఉంచుకోను."
    "మరి నా సీరియల్."
    "సారీ బ్రదర్! రేపటినుంచి నా పోస్ట్ మారిపోతోంది. నన్ను చిన్నపిల్లల మాసపత్రికలో ఎడిటర్ గా వేశారు_అంచేత"
    ఫోన్ డిస్కనెక్ట్ అయింది.
    "హలో" అతని గదిలోకి జొరబడిందొకామె.
    "హలో! కూర్చోండి!" అన్నాడు భవానీశంకర్.
    ఆమె అతనికెదురుగా కూర్చుంది.
    "నా పేరు వెంకులక్ష్మి అండీ! కవితలు రాస్తూంటాను."
    "ఓ! మీరా! వండర్ ఫుల్! నేను మీ ఫాన్ ని మేడమ్! ఎప్పటినుంచో మిమ్మల్ని కలుసుకోవాలనీ, మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలనీ కలలు కనేవాడిని! ఇన్నాళ్ళకు నా కలలు ఫలించినయ్."
    ఆమె ఉప్పొంగిపోయింది.
    "ఓ నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు" అంది సిగ్గుగా.
    "పొగడ్తా! నో నెవర్ మేడమ్. నేనెప్పుడూ ఎవ్వరినీ పొగడను. కేవలం నిజాలు మాత్రమే మాట్లాడతాను."
    "థాంక్యూ" అందామె ఆనందంగా.
    "మీ గురించి మొన్నే రంగారావ్ గారు చెప్పారు మేడమ్. వెంకులక్ష్మి కవితలు అంటే మా పాఠకులు చెవులు కోసేసుకుంటున్నారనీ, కళ్ళు పీకేసుకుంటున్నారనీ."
    "థాంక్యూ! కానీ రంగారావ్ గారు ఓ విషయం చెప్పారు"
    "ఏమిటది వెంకులక్ష్మిగారూ! చెప్పండి ఫర్లేదు."
    "నా కవితల్ని అయిదు వారాలకు మించి మీరు ప్రచురించవద్దన్నారట."
    "ఓ! అదా! దటీజ్ టెంపరరీ బాన్ మేడమ్! కేవలం తాత్కాలిక నిషేధం! అఫ్ కోర్స్! పాఠకుల కోరికపై."
    "కానీ ఎలాగయినా వంద కవితలు ప్రచురిస్తే ఆ తరువాత నేను వాటిని పుస్తకంగా రిలీజ్ చేయాలని నా ఆలోచన! ఆ పుస్తకం వేయటానికి కూడా కారణం ఉంది!"
    "ఏమిటి మేడమ్?"
    "ఆ పుస్తకం రిలీజవగానే దానికి సాహిత్య అకాడమీ బహుమతి వస్తుంది."
    "వస్తుందా?" ఆశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్.
    "అవును! ఆ ఏర్పాట్లన్నీ మావారు చేశారు"
    "సూపర్బ్ హజ్బెండ్ మేడమ్! ప్రతి స్త్రీ కోరుకునేది అలాంటి భర్తనే! భర్తలందరికీ ఆదర్శప్రాయుడు."
    ఆమె మళ్ళీ సిగ్గుపడింది.
    "కనుక మీరు నా కవితలు ఆపకుండా వేస్తే..."
    "మీ కోరిక తప్పక పరిశీలించడం జరుగుతుంది. వెంకుమాంబాజీ! కాకపోతే కొన్ని నెలలు గాప్ ఇచ్చాక అప్పుడు."
    "ప్లీజ్" అతని చేతిని హఠాత్తుగా తనచేత్తో పట్టుకుందామె. "మీరేం చేయమన్నా చేస్తాను. కానీ కవితలు మాత్రం ఆపకుండా..."
    భవానీశంకర్ తన చేతిని వెనక్కు లాగేసుకున్నాడు.
    "ఓ.కే. ఓ.కే ఈ విషయం చాలా సీరియస్ గా ఆలోచిస్తానని హామీ ఇస్తున్నాను మైడియర్ ఫ్రెండ్. ఇంక మీరు వెళితే..."
    ఆమె లేచి నిలబడింది.
    "థాంక్యూ! మీరు మా ఇంటికోసారి రాకూడదూ? చాలా హ్యాపీగా ఉంటుంది నాకు."
    "తప్పక వస్తాను మేడమ్."
    "ఇదిగో మా అడ్రస్, ఫోన్ నెంబరు."
    "థాంక్యూ_థాంక్యూ_"
    ఆమె వెళ్ళిపోయింది.
    "హమ్మయ్య" అనుకున్నాడు భవానీశంకర్ తేలికగా.
    మర్నాడు 'తేజస్సు' మాసపత్రిక ఆఫీస్ ని చేరుకున్నాడతను.
    ఓ అందమయిన అమ్మాయి కూర్చుని ఉంది.
    "హలో హలో_నమస్కారం! అయామ్ భవానీశంకర్" అన్నాడతను చిరునవ్వుతో.
    ఆ అమ్మాయి సీరియస్ గా చూసింది "ఏం కావాలి?"
    "మీ మాసపత్రికలో ఈ అమ్మాయి బొమ్మ ప్రచురించబడింది డియర్! ఈ అమ్మాయి వివరాలు కావాలి."
    "నన్ను డియర్ అనకండి" కోపంగా అందామె.
    "అనకూడదా?"
    "అనకూడదు"
    "ఆల్ రైట్_మీకు అభ్యంతరమయితే ఓ.కే."
    "మీక్కావలసిన వివరాలు కూడా దొరకవు."
    "ఎందుకని మైడియర్...సారీ ఫ్రెండ్?"
    "ఎవరికీ ఎలాంటి వివరాలూ ఇవ్వవద్దని మా ఎడిటరుగారు చెప్పారు."
    "ఎందుకని?"
    "ఒకతను ఇలాగే వివరాలు తీసుకుని ఓ రచయిత్రికి ప్రేమలేఖ రాశాడు."
    "రాస్తే తప్పేముంది డియర్! ప్రేమకు స్వేచ్చ అవసరం! ప్రేమించే హక్కు, ప్రేమను తెలియజేసేహక్కు ప్రతి ప్రాణికీ ఉంది. అసలు ప్రేమలేఖలు అందమయిన అమ్మాయిలకు కాంప్లిమెంట్స్. ఆ రచయిత్రి ఎందుకు కంప్లైంట్ చేసిందో అర్థం కావటంలేదు."
    "ఆమె కాదు కంప్లెయింట్ చేసింది."
    "మరి?"
    "ఆమె భర్త!"
    "ఓ!" అర్థమయినట్లు అన్నాడతను. "అదా సంగతి!"
    "అవును!"
    "పాపం అతనికి ఆ ప్రేమలేఖ అంతగా నచ్చి వుండదు."
    "ఏమాత్రం నచ్చలేదు"
    "అఫ్ కోర్స్ అతని మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు."
    "కనుక మీరింక వెళితే..."
    "కానీ నా కేన్ అదికాదు డియర్."
    "డియర్ అనవద్దని ఇంతకుముందోసారి చెప్పాను."
    భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు "చెప్పారా?"
    "అవును!"
    "ఎప్పుడు?"
    "ఇంతకుముందే!"
    "ఐసీ! మర్చిపోయి ఉంటాను! ఓ.కే. భవిష్యత్తులో తప్పక గుర్తుంచుకుంటాను డియర్! ఇంతకూ నేను చెప్పేదేమిటంటే_ ఇప్పుడీ అమ్మాయికి నేను ప్రేమలేఖ రాయబోవటం లేదు కదా?"
    "ఆ రచయిత్రికి ప్రేమలేఖ రాసినతను కూడా అచ్చం మీలాగానే చెప్పాడు."
    "ఐసీ!"
    "చెప్పి పదహారు పేజీల ప్రేమలేఖ రాశాడు."
    "మైగాడ్! పదహారు పేజీలా?"
    "ఇంకో అరపేజీ కూడా ఉందట!"
    "ఫూలిష్ ఫెలో, బహుశా తెలుగు మాతృభాష అయుంటుంది వాడికి. అందుకే ఎక్స్ ప్రెషన్ చాలా 'వీక్'గా ఉండి అన్ని పేజీల మేటర్ రాశాడు. నేనయితే రెండే రెండు లైన్లు రాస్తాను. ఉదాహరణకు నీచిక్కటి అనుభూతుల చీకటిలో_నే పురివిప్పిన వెన్నెలనవుతా! అంతే."

 Previous Page Next Page