Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 12


    "మీరు మరో వారం పదిరోజులు ఆఫీసు గురించి ఆలోచించక పోతేనే మంచిదేమో సర్."
    "అదేం?...."
    "కాస్త రెస్ట్ తీసుకోండి."
    "చూద్దాం...."
    "సరే సర్...." బయటికొచ్చేశాడు మూర్తి. డాక్టర్ ఎదురుపడ్డాడు హాల్లో."
    "మాట్లాడారా?"
    "ఊఁ...."
    "ఎలా వున్నారిప్పుడు?"
    "నేను చెప్పానుకదా డాక్టర్? రిలాక్స్ డ్ గానే వున్నారు."
    "ఓ.కే. ఏక్సిడెంట్ గురించేమీ చెప్పలేదుకదా పొరపాట్న."
    "లేదు. కానీ...."
    "ఊఁ.... కానీ?"
    "సాయంత్రం ఆఫీస్ అవర్స్ అయ్యాక శ్రీధరంగారినీ, చౌదరిని పిలిపించమన్నారాయన.... ఏదో డిస్కషన్ కి."
    సాలోచనగా తల పంకించాడు డాక్టర్.
    "హుం.... అంతేగా? ఓ.కే. ఆ విషయం నేను చూసుకుంటాన్లెండి, థాంక్యూ ఫర్ టెల్లింగ్ మీ."
    "ఓ.కే. డాక్టర్." అని హాలు మూలలోవున్న టెలిఫోన్ కేసి నడిచాడు మూర్తి. రిసీవర్ ఎత్తుతూ తల ఎత్తి వాకిలివంక చూసిన మూర్తికి అప్పుడే హాల్లోకి అడుగుపెట్టి, డాక్టర్ విశ్వం దగ్గరకు వెళ్ళి కరచాలనం చేస్తూ కనిపించాడు లాయర్ శాతకర్ణి.
    "ఈయనెందుకొచ్చాడబ్బా ఇప్పుడిక్కడికి" అన్న ఆలోచనని బలవంతంగా ప్రక్కకి నెట్టేశాడు మూర్తి.
    శాతకర్ణి 'అక్షయ్' గ్రూప్ కంపెనీ లాయర్. హుందాగా తెల్లగా మంచి ఒడ్డూ, పొడవుతో వుండే అతనికి దగ్గర దగ్గర నలభై అయిదు సంవత్సరాల వయసుంటుంది.
    మూర్తిని చూస్తూనే విష్ చేసి డాక్టర్ ని అనుసరించి భరద్వాజ గదికేసి నడిచాడు.
    అతను వెళ్ళినవైపే చూస్తూ ఫోన్ డయల్ చేయసాగాడు మూర్తి.
    సమయం పదకొండున్నర కావస్తోంది అప్పుడు. తనకి తగిలిన ప్రాణాంతకమైన దెబ్బలకి లొంగి మరణించిన చౌదరి మృతకాయాన్ని ఆసుపత్రిలోని పనులయ్యాక ఇంటికి తరలిస్తున్నారప్పుడే.
    జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతూ అచేతనంగా ఇంకా అలాగే పడి వున్నాడు శ్రీధరం ఆసుపత్రిలో అదే సమయానికి. అప్పుడే అడుగుపెట్టాడతను ట్రాడ్ వే బార్ కమ్ రెస్టారెంట్ లోకి. తలుపు దగ్గర నిలబడి ఓసారి చుట్టూ కలయచూశాడతను. ఆ తర్వాత నెమ్మదిగా అడుగు తీసి అడుగు వేస్తూ ఎడమ వేపు మూలగా వున్న ఒక టేబుల్ దగ్గరకు నడిచాడు.
    ఖాళీగా వుందా టేబుల్.
    స్టీవర్ట్ రాగానే చెప్పాడు "విస్కీ బాగ్ పైపర్....లార్జ్....సోడా....గ్రీన్ పీస్...." వెళ్ళిపోయాడు స్టీవర్ట్.
    అతను కూర్చున్న టేబుల్ కు రెండు టేబుల్స్ అవతలగా కూర్చుని వున్నారు సాగర్, శృతి.
    అప్పటికే నాలుగు పెగ్గుల విస్కీ తాగేసి వున్నాడు సాగర్. అతని మెదడు ఇప్పుడు కళ్ళెం లేని గుర్రంలా పరుగులు తీస్తోంది.
    అప్పటికీ ఐదు నిమిషాల క్రితం శృతి తనకు చెప్పి మిగించిన భరద్వాజ జీవితం ఆయన అలవాట్లూ, నిత్యకృత్యాలూ, వాటి సమయాలూ, మొత్తం జీవితం గురించి ఆలోచిస్తున్నాడతను. ఆలోచించే కొద్దీ అతనికి భరద్వాజని చంపడం చాలా కష్టమన్న నమ్మకం పెరగసాగింది. కారణం భరద్వాజకి ఇంతవరకూ జీవితంలో అడుగడుగునా సహాయం చేస్తూ వస్తున్న అదృష్టం ఒకటయితే, క్రమశిక్షణ మరొకటి. అయినా విషం పెట్టడము లాంటివి ప్రయత్నిస్తే చాలా ప్రమాదమని శృతి స్వయంగా చెప్పిందతనికి. ఇక ఒక్కటే మార్గం. ఒంటరిగా ఆయన్ని చేజిక్కించుకుని గొంతు నులమడం, కత్తితో పొడవటం, తుపాకితో కాల్చడం లాంటివి. కాని అవి సాధ్యమేనా?
    ఎక్కడో మారుమూల "వద్దు....వద్దు" అని ఘోషిస్తున్న అంతరాత్మని పెడచెవిన పెట్టాడు సాగర్. ఆ క్షణం కూడా సాగర్ లేచి- "సారీ శృతీ.... ఇది నావల్ల అయ్యే పని కాదు. ప్రేమ కోసం ఒక నిండు ప్రాణాన్ని నిలువునా తీసే ధైర్యం నాకు లేదు" అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటే అతని జీవితం మరోలా వుండేదేమో, కాని__ అతను అలా చేయలేదు.
    అదే అతను చేసిన రెండో పొరపాటు.
    అయిదో పెగ్గు విస్కీ కూడా తాగేసాక బిల్ గురించి అడిగాడు సాగర్.
    లంచ్ ఇంటికెళ్ళి చేద్దామని శృతి చెప్పడంతో.
    బిల్ రాగానే పే చేసాడు సాగర్. మిగిలిన డబ్బు కోసం ఎదురుచూస్తూండగా గుర్తుకొచ్చింది సాగర్ కి శృతిని తను అడగాలనుకొన్న మరో విషయం.
    వెంటనే అడిగాడు_
    "ఔనుగానీ శృతీ...."
    "ఊఁ...."
    "మీ అంకుల్ విల్లు గురించి నీకేమైనా తెల్సా?"
    కళ్ళెత్తి క్రొత్త వ్యక్తిని చూసినట్లుగా చూసింది అతని వేపు శృతి.
    "అహ.... అంటే.... ఇప్పుడు ఆయన విల్లు రాయకుండానే మరణించాడనుకో ఆస్తి నీకు దక్కుతుందా?" గొణుక్కుంటున్నట్లు అన్నాడు సాగర్.
    "చట్టరీత్యా మా అమ్మ ఆయన భార్య అయినప్పుడు ఆస్తి నాది కాదా? అయినా నాకీ లీగల్ పాయింట్స్ తెలియవు. ఏది ఏమయినా ఆస్తి ఆయన నా పేరిట రాశాడని నాకు తెలుసు.... ఏం? ఎందుకలా అడిగావు?"
    కాసేపు మవునంగా వూరుకున్నాడు సాగర్. తర్వాత తిరిగి అన్నాడు__
    "ఏంలేదు.... వూరికే. అయినా విల్లు ఈ మధ్యన ఏమన్నా మార్చాడేమో కనుక్కో"
    "అలాగే"
    ఇద్దరూ లేచారు.
    "బీ బ్రేవ్ సాగర్"
    "ఐ లవ్ యూ. ఐ డోంట్ వాంట్ అస్ టు పార్ట్.... మనం విడిపోవడం నేను సహించలేను. త్వరగా ఏదయినా జరిగితే బాగుంటుంది."
    బయటికి నడిచింది శృతి.
    "నీకన్నా నాకే ఈ విషయంలో పట్టుదల పెరుగుతోంది శృతీ....! ఐ షల్ విన్....." తనలో తానే గొణుక్కుంటూ బయటకు నడిచాడు.
    వాళ్ళు అటు వెళ్ళగానే స్టీవర్డ్ ఇందాకటి వ్యక్తి అడిగిన రెండో విస్కీ పెగ్ అతని ముందు వుంచాడు. ఆ వ్యక్తి తాపీగా సిగరెట్ నోటి కందించి లైటర్ వెలిగించాడు. అతని మొహం మీద ఎలాంటి భావమూ లేదు. లైటర్ నుండి సన్నటి సంగీతం విన్పిస్తూ లైటర్ ఆర్పగానే ఆగిపోయింది.

 Previous Page Next Page