6
నెమ్మదిగా లేచి గదిలో పచార్లు చేయసాగాడు భరద్వాజ. అప్పటికి రెండవ హార్ట్ ఎటాక్ వచ్చి వారం దాటింది. ఆరోగ్యం చాలావరకు తేరుకొంది. తనకు ఎటాక్ వచ్చిన రోజున శ్రీధరానికీ, చౌదరికీ యాక్సిడెంట్ జరిగి చౌదరి మరణించిన విషయం శ్రీధరం స్థితి ఇంకా బాగుపడని విషయం ఆ రోజు మధ్యాహ్నమే తెలియజేయపడింది అతనికి.
విషయాన్ని అతని సునిశితమయిన మెదడుకు అంత దూరంగా వుంచగలిగిన ఘనత డాక్టర్ విశ్వందే. భరద్వాజ సూటి ప్రశ్నల్ని అతని తెలివితేటలు గెలిచాయి.
వార్త విన్న భరద్వాజ గుండె తట్టుకోవడం కూడా డాక్టర్ విశ్వం ప్రత్యేకతగానే చెప్పుకోవాలి.
"సార్.... మీ మందుకి సమయం...." ఎదురుగా చేతిలో మాత్ర, మంచినీళ్ళతో హబీబ్ నిల్చున్నాడు.
హబీబ్ పుట్టుకతో ముస్లిమే అయినా పెరిగింది ఏలూరు కావడంతో మంచి తెలుగు మాట్లాడతాడు. అతని తండ్రి భరద్వాజ స్నేహితుడి ఇంటిలో నౌకరుగా వుండేవాడు. ఆ స్నేహితుడూ, అతని భార్య, హబీబ్ తండ్రి తిరుపతిలో ఒక బస్ ప్రమాదంలో మరణించారు. అప్పుడు హబీబ్ కు పన్నెండేళ్ళు. అతడ్ని తనే చేరదీశాడు భరద్వాజ. భరద్వాజ అంటే అతనికుండే భక్తి కన్నా శృతిమీద అతనికుండే అసహ్యం ఎక్కువ ప్రస్తుతం.
మాత్ర వేసుకున్నాడు భరద్వాజ.
ఖాళీ గ్లాసు తీసుకుని వెళ్ళిపోయాడు హబీబ్.
షెల్ఫ్ లో నుండి మహా భారతం తీసి తిరగేయసాగాడతను. మనసు ప్రశాంతతకి చాలా దూరంగా వుంది. సిగార్ కోసం తపించిపోతోంది ఎందుకో అతని మనసు. పదే పదే శారద సహచర్యం కోరుకోసాగింది. ఇప్పటి మాట కాదు_ అతని జీవితంలో శారద ఒక భాగం అయిన క్షణం నుండీ ఎప్పుడయినా ఏదయినా అవసరం వచ్చిందీ అంటే అది శారదదే. శారద తప్ప ప్రపంచంలో మరేదీ అవసరం కానంతగా పెనవేసుకుపోయిందతని జీవితాన్ని శారద.
శారద.... శృతిని నవమాసాలు మోసిన కన్నతల్లి. కాని శృతి అతని కూతురు కాదు.
* * * *
చేస్తున్న పని ఆపి తలెత్తి చూశాడు కేశవ్.... కేశవ్ భరద్వాజ.
"అమ్మగారు కాఫీ పంపారండి" కాఫీ కప్పు అతని టేబుల్ పైన వుంచి వెళ్ళిపోయింది భాగ్యం. ఒకరకంగా చెప్పాలంటే భాగ్యం, తనూ కొలీగ్స్. పేరు ప్రఖ్యాతులు గడించిన అడ్వొకేట్ ప్రభాకరంగారి ఇంట్లో పని చేసుకునే పనిమనిషి భాగ్యం. అయితే ఆయన ఆఫీసుకి సంబంధించిన వ్యవహారాలూ చూసిపెట్టే గుమాస్తా.... లేదా పనిమనిషి తను. అయితే తననా దృష్టితో ఎప్పుడూ చూడలేదు ప్రభాకరం, ఆయన అర్థాంగి శారద కూడా.
వాళ్ళ గారాల బిడ్డ శృతి.
"అంకుల్" అంటూ తన వెంట తిరిగే ఆరేళ్ళ శృతి అంటే కేశవ్ కి ఎనలేని ప్రేమ.
అలాగే మెరిసే శారద కళ్ళ వెనక దోబూచులాడే బాధ చూస్తే అతనికి ఎనలేని జాలి. కారణం.... ప్రభాకరం, శారదల మధ్య దాదాపు ముప్పై సంవత్సరాల వ్యత్యాసం వుండటమే.
పాతికేళ్ళ శారద అతని కంటికి ఎంతో అందంగా కనబడేది.
నిజంగానే చాలా అందంగా, హుందాగా వుండేది శారద.
కాఫీ తాగి తిరిగి పనిలో మునిగిపోయాడు కేశవ్. సరిగ్గా ఆరుగంటలకల్లా పని పూర్తి చేసుకుని లేచాడు కేశవ్. ప్రభాకరం వూళ్ళో వున్నప్పుడు ఏనాడూ ఆరింటికల్లా బయటపడగలిగేవాడు కాదు కేశవ్. అయినా గత మూడేళ్ళలోనూ అతను వేరే ఉద్యోగానికి గాని మరోలా గాని బయటికి వెళ్ళకపోవడానికి కారణం కేవలం శారదే. శారద అందం అతణ్ణి పిచ్చివాడ్ని చేసేది. వృద్దుడయిన ప్రభాకరం స్థానంలో తనను తాను ఊహించుకొని ఎంతో తపించిపోయాడతను.
లేచి డెస్క్ సర్ది లోపలికి నడిచాడు శారదకి చెప్పి వెళ్ళడానికి. హాల్లోగాని, వంట గదిలో గాని కనిపించలేదు శారద. ఆ ఇంట్లో అతనికున్న చనువు వల్ల గబగబా పైకి వెళ్ళాడు. పైన శృతి గదిలో కూడా లేదు శారద.
"శారదగారూ...."
సమాధానం లేదు.
నెమ్మదిగా ప్రభాకరం పడకగది దగ్గరకెళ్ళాడు.
"శారదగారూ...."
లోపల ఎటాచ్డ్ బాత్ రూమ్ లో నుండి షవర్ శబ్దం సన్నగా వినబడుతోంది.
లోపలికి వెళ్ళాలా వద్దా అన్న మీమాంసలో ఆగిపోయాడు కేశవ్.
"కేశవ్.... టవల్ మర్చిపోయాను. ఏమీ అనుకోకండి, కాస్త ఇస్తారా.... ప్లీజ్"
ఉన్నట్టుండి గగుర్పొడిచించి కేశవ్ శరీరం.
నెమ్మదిగా గదిలోకి అడుగుపెట్టాడు. నిజంగా శారద టవల్ అడిగిందో అది తన భ్రమో క్షణం అర్థం కాలేదు అతనికి.
"కేశవ్.... వెళ్ళిపోయారా?"
ఈ సారి కాస్త ఆతృత కనిపించిందా గొంతులో. నోరు పెగల్లేదు కేశవ్ కి. చుట్టూ చూశాడు టవల్ కోసం. ఓ వార బట్టల స్టాండ్ మీద ఉందది. గది విశాలంగా ఉంది. చక్కగా అలంకరింపబడి ఉంది. గది మధ్యలో డబుల్ కాట్, దానిపైన మెత్తని ఫోమ్ బెడ్. మంచంకేసి చూడగానే కేశవ్ గుండెను ఎవరో పిండేసిన అనుభూతి. ఉన్నట్టుండి బాత్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి.
ఎదురుగా శారద.
నగ్నంగా శారద.
పోత పోసిన పాలరాతి విగ్రహంలా శారద.
కేశవ్ నిగ్రహాన్ని సవాల్ చేస్తున్నట్టు శారద.
ఆమె శరీరం నుండి రాలుతున్న నీటి చుక్కలు గదిలో పరచిన తివాచీ పైన బడి ఇంకిపోతున్నాయి.
కేశవ్ ని చూసిన శారద అవాక్కై నిలబడిపోయింది. నెమ్మదిగా స్టాండు నుండి టవల్ తీసుకుని ఆమె దగ్గరికి నడిచాడు కేశవ్.
హఠాత్తుగా తెప్పరిల్లి గిరుక్కున వెనక్కి తిరిగింది శారద.
అనుకోకుండా ఆమె భుజంమీద చేయివేశాడు కేశవ్. ఆమె శరీరం తన చెయ్యి తగలగానే గగుర్పాటు చెందడం గమనించాడతను.
అతని నుదుట చిరు చెమటలు.
అప్రయత్నంగా ఇటు తిప్పాడు శారదని.
టవల్ అందించడానికి చేయి ఎత్తాడు.