"అసలేం జరిగింది శృతీ? మీ అంకుల్ వెళ్ళలేదేం కారులో?"
"సరిగ్గా బయల్దేరే సమయానికి ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. డాక్టర్ కి కబురుచేసి వేరే పనులుంటే అవి ముగించుకొని వస్తామంటూ శ్రీధరం అంకుల్, చౌదరి బయలుదేరారు. ఆ కంగారులో నేను వాళ్ళని ఆపేసే అవకాశం లేకపోయింది. ఆపే అవకాశం ఒకవేళ కలిగివున్నా ఏమని ఆపుతాను?"
అవునన్నట్టుగా తలాడించాడు సాగర్.
మళ్ళీ కాసేపు ఎవరి ఆలోచనలలో వారు మౌనంగా వుండిపోయారు.
"సరే! ఎలాగూ జరిగిందేదో జరిగిపోయింది. ఇకముందయినా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అన్నట్టు కారాక్సిడెంట్ గురించి ఎవరికయినా ఏదైనా అనుమానం కలిగిందా? అంటే_ బ్రేకుల గురించీ...."
"అలాంటిదేమీ లేదు"
మరోసారి రిలీఫ్ గా నిట్టూర్చాడు సాగర్. సరిగ్గా వీళ్ళిక్కడ మాట్లాడుకుంటున్న సమయంలో భరద్వాజ ఇంటి ఎదుట స్కూటర్ పార్క్ చేశాడు.
"అక్షయ" హౌసింగ్ ఫైనాన్స్ వింగ్ మానేజర్ మూర్తి.
చకచకా బంగళాలోకి నడిచిన అతన్ని తలుపుల దగ్గరే అడ్డగించాడు డాక్టర్ విశ్వం.
"నేను అక్షయలో ఒక మేనేజర్ ని. భరద్వాజగారు కొన్ని పేపర్సు తీసుకురమ్మన్నారు. అవి...." నసిగాడు మూర్తి.
"ఏం పేపర్స్ అవి?"
"బిజినెస్ కి సంబంధించినవి"
"ఎలాంటివి?"
"ఒక ముఖ్యమయిన ప్రాజెక్ట్ వివరాలు....చాలా అర్జంట్"
"ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎక్సయిట్ కావడం అంతమంచిదికాదు మిస్టర్"
"మూర్తి" అందించాడు.
"మిస్టర్ మూర్తి"
"కాని ఈ పేపర్స్ ఆయన టెన్షన్ ని తగ్గిస్తాయి కాని పెంచేవికావు డాక్టర్."
"అది మీరెలా చెప్పగలరు?"
"ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి చాలా టెన్షన్ తో ఉన్నారు. పైగా ఈవేళ ఆల్మోస్ట్ డెడ్ లైన్. ఈ పేపర్స్ ఆధారంగానే ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ చేయిజారిపోతే ఆయన తట్టుకోలేరు. ఇప్పుడు ఈ పేపర్స్ లో ఉన్న వివరాలన్నీ ఆయనకి సరిపడేవిగా వున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను నిరాటంకంగా, ఎలాంటి అనుమానాలూ లేకుండా అయన అంగీకరించే విధంగా వున్నాయి! ఆయన ఇవి చూసి తప్పక రిలాక్స్ అవుతారు."
"హెల్తు డెలికేట్ గా ఉన్నప్పుడు బాధాకరమైన విషయాలు మాత్రమే ఎక్సైట్ చేయాలని లేదు మిస్టర్ మూర్తీ. మరీ ఆనందం కలిగినా ప్రమాదమే. ఇప్పుడు మీరు చెప్పే ఈ ప్రాజెక్టు చేయిజారిపోవడం లేదు. ఆనందంలో ఆయనకేదైనా జరిగితే?
"జరగదు డాక్టర్. ఆ హామీ నాది. ప్లీజ్. ఇది చాలా ఇంపార్టెంటు." ఆశగా చూశాడు మూర్తి డాక్టర్ వైపు.
అతనికేసి నిశితంగా ఓ అరనిమిషంపాటు చూసి భుజాలెగరెసి చెప్పాడు డాక్టర్ విశ్వం.
"మీ ఇష్టం. నేను చెప్పవలసింది చెప్పాను. మీకంత నమ్మకంగా వున్నప్పుడు కాదనడం నాకంత మంచిది కాదు. పైగా చాలా ముఖ్యం అంటున్నారు. కాని మీరు మరో పది నిమిషాలు వెయిట్ చేయాలి. ఆయనిప్పుడు నిద్రలో వున్నారు. నిద్ర మేల్కొన్నాకగాని మీకు అవకాశం లభించదు" అనేసి వెళ్ళిపోయాడు డాక్టర్.
ఉసూరుమంటూ సోఫాలో కూలబడ్డాడు మూర్తి. కాసేపు ఆలోచించి లేచి టెలిఫోన్ దగ్గరకి నడచి నెంబరు తిప్పసాగాడు. అవతలినుండి ఎంతకీ రెస్పాన్సు లేకపోయేసరికి ఫోన్ పెట్టేశాడు.
అరగంట గడిచాక తెలివి వచ్చింది భరద్వాజకి. ఈ మధ్యలో మూడుసార్లు టెలిఫోన్ తో కుస్తీపట్టాడు మూర్తి. నెమ్మదిగా లేడీ డాక్టర్ వెంట, భరద్వాజ బెడ్ రూంకేసి నడిచాడు.
"చూడండి మిస్టర్ మూర్తీ. భరద్వాజగారికి ఏక్సిడెంట్ విషయం ఇంతవరకూ తెలీదు. దయచేసి దాన్ని గురించి మాట్లాడకండి."
సరేనన్నట్టుగా తల ఊపాడు మూర్తి. నెమ్మదిగా స్క్రీన్ ప్రక్కకు తొలగించి గదిలోనికి అడుగుపెట్టాడు. అప్పటికే ఆ గది నర్సులతోనూ ఇతర వస్తువులతోనూ ఆసుపత్రి వాతావరణాన్ని సంతరించుకుని వుంది. మధ్య మంచంపైన నీరసంగా పడుకుని వున్నాడు భరద్వాజ. గంభీరంగా, తెల్లని జుత్తు పెద్దపెద్ద మీసాలతో చేతిలో సిగార్ తో అంత క్రితంరోజే మధ్యాహ్నం తన ఆఫీసునుండి బయటకు నడచిన తమ ఎమ్.డి.కీ, ఇతనికి చాలా వ్యత్యాసం వుంది.
నీరసంగా నవ్వారు భరద్వాజ మూర్తిని చూసి. అతని కళ్ళల్లో మాత్రం అంత నీరసంలోనూ ఓ విచిత్రమైన వెలుగు.
"కమాన్ మై బాయ్...."
"సారీ సర్....ఈ పరిస్థితిలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నిజానికి నాకిష్టంలేదు."
"నాన్సెన్స్.... ఏవిఁటి పరిస్థితి?.... నాకిప్పుడేమయ్యిందని?.... వెల్.... కూర్చో వాట్ న్యూస్?"
"మీరడిగిన వివరాలు...." పేపర్ అందించాడు మూర్తి.
అవి అందుకొని "సిస్టర్" అని పిలిచారు భరద్వాజ.
సిస్టర్ సహాయానికి వచ్చింది, ఆమె ఆసరాతో నెమ్మదిగా లేచి దిండు మంచపుకోడుకి నిలువుగా వేసి ఆనుకొని కూర్చున్నాడు. అతని మొహం మళ్ళీ గంభీరంగా మారింది. శ్రద్ధగా, నిశ్శబ్దంగా చేతిలోని కాగితాలలోని ఒక్కో పదాన్నీ సూక్ష్మంగా పరిశీలించసాగాడు. ఒక్కో అక్షరమూ చదివేకొద్దీ అతని మొహంపైన క్రమంగా ప్రశాంతత చోటుచేసుకోసాగింది. మొత్తం చదివేశాక ఓసారి దీర్ఘశ్వాస వదిలి మూర్తికేసి తిరిగాడు. ఇప్పుడతని వదనంపై మళ్ళీ చిరునవ్వు చోటుచేసుకుంది వుంది.
"వండ్రఫుల్.... వెల్ డన్ మైబాయ్" కాగితాలు మూర్తి కందించారు.
"వీటినలాగే ఆఫీసులో ఓ సెపరేట్ ఫైల్ ఓపెన్ చేసి అందులో ఫైల్ చేయించు."
"అలాగే సర్...."
"ప్రాజెక్ట్ ఓ.కె. చేయించు. అనఫీషియల్ గా అప్లికేషన్ రేపే పంపమని చెప్పు. వెంటనే పుటప్ చేసుకుందాం బోర్డుకి. ఓ.కే.?"
"ఓ.కే. సర్."
లేచి నిల్చున్నాడు మూర్తి.
"వన్ మోర్ థింగ్."
"సర్?"
"సాయంత్రం ఆఫీసయిన తరువాత శ్రీధరాన్నీ, చౌదరినీ నన్ను కలవమని చెప్పు. అఫ్ కోర్స్ వాళ్ళే వస్తారనుకో. కాని_ అనఫీషియల్ గా పిలిచానని చెప్పు. వీలైతే నువ్వు కూడా ఉండడం మంచిది."
కాసేపు తటపటాయించాడు మూర్తి.
"ఏవిఁటి?.... ఎనీథింగ్ రాంగ్?"
"అహఁ....ఏవీఁలేదు. ఓ.కే. సర్".... అని వెళ్ళబోయి మళ్ళీ ఆగాడు.
"చెప్పు మూర్తి.... ఎనీథింగ్ ఎల్స్?...."
"ఏంలేదు సర్. బెస్టాఫ్ లక్ సర్. గెట్ వెల్ సూన్...."
"థాంక్యూ."