"ఆశ కోసమే బ్రతుకుతున్నాను నేను. దాని సుఖం కంటే నాకు కావలసింది మరేదీ లేదు. దానికోసం ఎంతైనా త్యాగం చెయ్యగలను. ఎంతటి క్షోభనైనా భరించగలను."
రావు మాటలు పూర్తిగా అర్థమయ్యాయి శోభకు. తన చేత్తో అదుముకుంటూ కూర్చుంది.
9
పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న శోభ "టీచర్" అన్న కేకతో తృళ్ళిపడి ఆగింది. ఆశ పరుగిడుతూ వచ్చి, శోభను కలుసుకుని ఆయాసపడుతూ నిలబడింది. పరుగెట్టడం వల్ల నున్నగా దువ్విన జుట్టు కొంచెం రేగి పచ్చని నుదుటిమీద పడి ముద్దుగా ఉంది. అప్రయత్నంగా వంగి ఆశ బుగ్గమీద ముద్దు పెట్టుకుంది శోభ. తరువాత తన చేష్టకు తనే ఆశ్చర్యపోయింది. చిన్నపిల్లలంటే ఇష్టంలేని తనేనా ఇలా ప్రవర్తిస్తూంది? చీమిడిముక్కు, బానపొట్ట, ఊచకాళ్ళూ ఇలాంటి పిల్లల్నే తను చూసింది. దానికితోడు వాళ్ళ అలంకరణ గురించి శ్రద్ధ తీసుకునేవాళ్ళు లేరు. వేళకు స్నానం చేయించి ఏవో బట్టలు తొడిగి తలదువ్వటమే గగనం. వాళ్ళను చూసి చూసి పిల్లలంటేనే చిరాకేర్పడింది. ఏపుగా బొద్దుగా పచ్చగా ఉండి వంటికి పట్టినట్లున్న ఎంబ్రాయిడరీ కుట్టిన లేత నీలిరంగు అంబరిల్లా ఫ్రాక్ వేసుకొని, లేత నీలిరంగు మేజోళ్లు తొడుక్కొని, పాలిష్ చేసిన నల్లని శాండిల్స్ వేసుకుని, సెల్యులాయిడ్ బొమ్మలా ఉన్న ఆశ ఎవరికి ముద్దురాదు?
"మీరూ పార్కులోకి వస్తారండీ?" శోభ చెయ్యి పుచ్చుకొని అడిగింది.
"మీతో మాట్లాడాలి" అంది గంభీరంగా. ఆ చిన్నపిల్ల మాటలకూ, ఆ గాంభీర్యానికీ ముచ్చటేసి నవ్వొచ్చింది శోభకు. నవ్వు బలవంతాన ఆపుకొంటూ "పద" అంది. అంతలోనే ఆశ ఆయా కూడా కలుసుకుంది.
"ఆశా! రోడ్డుమీద అలా పరుగెత్తవచ్చమ్మా!" అంది ఆయా, మృదువుగానే అయినా తీక్షణంగా.
"ఈవిడ వెళ్ళిపోతున్నారు మరి." బుంగమూతితో అంది ఆశ.
"నా బంగారు తల్లివి కదూ! ఇంకొకసారి అలా పరుగెత్తకూ!"
ఆశ తలూపింది.
"ఎంత అల్లారుముద్దుగా పెరుగుతూంది పాప?" శోభ లోలోపల ఆశ్చర్యపోయింది.
ముగ్గురూ పార్కులో కూర్చున్నాక "మీరు నన్ను క్షమించాలి." అంది ఆశ.
శోభ ఆశ్చర్యపోతూ "ఎందుకూ?" అంది.
"అప్పుడు మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని 'టీచర్' అని పిలిచాను. అందుకు.."
ఇంత చిన్నవయసులో ఎంత సంస్కారం? జన్మసిద్ధంగా వచ్చింది.
"నేను టీచర్ ను కానని నీకెవరు చెప్పారు?"
"డాడీ చెప్పారు. మీరు డాడీ ఫ్రెండ్ ట కదూ!"
కేవలం స్నేహితురాలినే ఆయనకు! ఒక్కనాటికీ అలాకాదు. చిన్నపిల్లకి అలాకాక ఇంకెలా చెప్తారు? తనను తను ఓదార్చుకొంది శోభ.
"నేను టీచర్ నని ఎందుకనుకున్నావు?"
"ఒక్కదాన్నీ చదువుకోవటానికి విసుగ్గా ఉంది. ఫ్రెండ్ ఉంటే బాగుండును!" అన్నాను డాడీతో. అప్పుడు డాడీ 'నీకు ఫ్రెండ్ ను తేలేను, టీచర్ ను తెస్తాను. దగ్గరుండి చదివిస్తారు' అన్నారు. అందుకని మీరు టీచర్ అనుకున్నాను."
"నీకు టీచర్ కావాలా? పాఠాలు అర్ధంకావటం లేదా?"
"నాన్సెన్స్! నాకు పాఠాలెందుకర్థంకావూ? కంపెనీకి!"
ఆ ఆత్మాభిమానానికి మరొకసారి నివ్వెరపోయింది శోభ.
కొద్దిగా కనుబొమ్మలు ముడిచిన ఆశ ముఖం ఎంతో ముద్దుగా అనిపించింది.
"పోనీ, నిజంగానే నేను నీకు టీచర్ గా రానా? పాఠాలు చెప్పలేకపోయినా, పాటలు పాడతాను."
ఆశ కనుబొమ్మ ముడి విడిపోయి కళ్ళు వెలిగాయి. "థాంక్యూ టీచర్. థాంక్యూ. నాకు పాటలంటే ఎంతో ఇష్టం. నేను...నేను... ఇంగ్లీష్ డాన్స్ చెయ్యగలను."
"అదెవరు నేర్పారు?"
"మా ఆంగ్లో ఇండియన్ టీచర్"
"ఇంక వెళ్దామా ఆశా, పొద్దుబోయింది." అంటూ ఆయా లేచింది. ఆశ శోభ వంక చూస్తూ "మీరూ రండి టీచర్" అంది.
"రాను." అనగలిగే శక్తి శోభకు లేకపోయింది. తన మనసు తనకే ఆశ్చర్యంగా ఉంది. రావును చూసి వారం రోజులవుతుంది. ఈ ఏడురోజుల నుండీ ఆమె మనసులో ప్రళయాలు చెలరేగుతున్నాయి. ఒక వంక రెండో పెళ్ళి సంబంధాలు తెచ్చిన తన అన్నను తను చేసిన వేళాకోళాలు తిరిగి తననే వెక్కిరిస్తూంటే వేరొక వంక రావును మరిచిపోలేని బేలమనసు ధీనంగా కుమిలిపోతోంది. ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత దానినుండి తిరిగే స్వభావం కాదు శోభది. మనసారా తననుతాను రావు కర్పించుకొంది. వివాహమంటూ జరిగితే అతనితోనే. లేకపోతే జీవితాంతమూ కన్యగానే ఉండాలని నిశ్చయించుకొంది. రావు కోసం, కనీసం రోజు కొక్కసారి రావు చిరునవ్వును దర్శించగలగటం కోసం, ఏం చెయ్యటానికైనా సిద్ధంగా ఉంది.
కాని రెండోపెళ్ళి...సవతి కూతురు..ఈ విషయాలు జీర్ణం చేసుకోలేకపోతూంది. రావు సర్వస్వమూ తానైపోయి అతని పరిపూర్ణ ప్రేమను పొందాలని అతి గాఢంగా కోరుకుంటున్న తనకు అడుగుపెట్టీ పెట్టకుండానే వాటాదారు తయారయితే ఎలా సహించగలదు?
ఏదో పుస్తకం తిరగేస్తూ హాలులో కూర్చున్న రావు ఆశతో కూడా వచ్చిన శోభను చూసి ఆశ్చర్యపోయాడు. అతని ముఖంలో వెయ్యి జ్యోతులు వెలిగాయి.
"హలో శోభాదేవీ! రండి! రండి! ఇవాళ ఎంత మంచిరోజు" అన్నాడు సంభ్రమంగా.
వారం రోజుల తరువాత రావు చిరునవ్వు చూసి అతని కంఠస్వరం వినటంతో శోభకు తను పోగొట్టుకున్నదేదో దొరికినట్లయింది. అంత క్రితంవరకూ ఉన్న ఉదాసీనత పోయి ఎప్పటి చిలిపితనం వచ్చేసింది.
"నన్ను మీరేం ఆహ్వానించక్కర్లేదు. నేను మీకోసం రాలేదు. ఆశకు పాఠాలు, పాటలు నేర్పటానికి వచ్చా" ముభావం నటిస్తూ అంది.
రావుకు సరిగ్గా అర్థంకాలేదు. ఆశ వంక చూశాడు.
"ఇవాళ మీకు తలనొప్పి రాలేదా డాడీ?"
"తలనొప్పేవిఁటి?"