Previous Page Next Page 
దశావతారాలు పేజి 11


    అగ్గిదొర కోపంతో ఆ రోజు ఇంటికి రాలేదు - అయిన రత్తాలమ్మ బాధపడలేదు-ఇంటికిరాక ఏమవుతాడు ? ఇవ్వాళ కాకపోతే రేపొస్తాడు. ఈ ఇల్లు తనది ! ఈ పిల్లలు తన వాళ్ళు, ఇది తన సామ్రాజ్యం.
    జరిగింది తలుచుకొంటున్న కొద్దీ సరోజిని మనసులో చెప్పరానంత బాధగా వుంది.
    తన దురదృష్టంకొద్దీ వాళ్ళ మధ్యకు వచ్చి పడ్డాననుకునేది ... రెండు రోజులకొకసారిగాని స్నానం చెయ్యకపోవటం, ... తలల్లో పేలు చూసుకోవటం... నోట్లో తాంబూలం నమలటం... ఇలాంటి అలవాట్లన్నీ అసహ్యించుకునేది__ మనుష్యులలో మొరడుతనం భరించలేకపోయేది_ చదువుమీద ఏమాత్రం శ్రద్ధలేని ఆ అజ్ఞానాన్ని చీదరించుకునేది ! "వీళ్ళు మృగాలు" అనుకుంది ఎన్నోసార్లు మనసులో....  
    కానీ తాను ఏ సమాజంలో నుండి వచ్చిందో! ఆ సమాజం ఎలాంటిది ?
    సరోజిని చదువుకున్నది. అందమైనది - బుద్ధిమంతురాలు - తండ్రి పదివేలు కట్నంతో ప్రభాకరరావుకిచ్చి పెళ్ళి చేసాడు- రతీమన్మదుల్లా వున్నారని అందరూ పొగిడారు - సరోజిని అదృష్టాన్ని చూసి ఎందరో ఈర్ష్యపడ్డారు_ సరోజిని కూడా తన అదృష్టాన్ని చూచుకుని ఎంతో ఆనందించింది. అయితే ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు__ప్రభాకరరావు, మరో వన్నెల విసనకర్రతో జత కలిపాడు_బాహాటంగా ఇంటికే తీసుకొచ్చాడు__
    భరించలేకపోయింది సరోజిని__
    "ఆవిడని ఇంట్లో ఉంచితే నేను ఉండను" అంది తిరగబడి__సరోజిని కోపాన్ని కాని, ఆవేదననుకాని ప్రభాకరరావు ఏమాత్రం లక్ష్యపెట్టలేదు__
    "పోతే, పో!" అన్నాడు విసుగ్గా. భరించరాణి దుఃఖం వచ్చింది సరోజినికి - గుండెలు పగిలేలా ఏడ్చింది. అంతమాట అనిపించుకున్నాక అక్కడ ఇంకా ఎలా ఉండగలదు ? బయలుదేరి పుట్టింటికొచ్చింది. పుట్టింటిలో ఒక్కరు కూడా సరోజిని ఆవేదనను అర్ధం చేసుకోలేదు_సరిగా ఆదరించలేదు.
    "మొగాళ్ళు ఏదో కక్కుర్తి పడతారు_ నువ్వు కూడా ఇలా తొందరపడి ఇల్లొదిలొస్తే ఎంత అప్రతిష్ట? ఇంకా పెళ్ళి కావలసిన చెల్లెళ్ళున్నారు నీకు !" అంది తల్లి మెత్తమెత్తగా.
    "ఏదో నాలుగురోజులుండు నేను వ్యవహారాలు చక్కబరుస్తాను__" అన్నాడు తండ్రి ధైర్యం చెపుతున్నట్లుగానే. అక్కడ ఎక్కువరోజులు వుండకూడదని హెచ్చరిస్తూ. సరోజినిని చూడగానే వదిన గుండె గతుక్కుమండి. ఇక జీవితాంతమూ ఆడబిడ్డను తామే భరించవలసి వస్తుందేమోనని భయం బయలుదేరింది.
    "వేలు వేలు కట్నాలు గుమ్మరించి పెళ్ళిళ్ళు చేసింది చాలక ఇదొకటి ! తమ ఇంట్లో తాము నిభాయించుకోలేరు కాని, పుట్టిళ్ళకొచ్చి వదినమీద పెత్తనాలు చెలాయిస్తారు. అయినా మొగాణ్ని కట్టేసుకునే నేర్పు ఆడదానికుండాలి ! ఏ లోపమూ లేకపోతే ఇల్లాల్ని వొదిలి బజారున ఎందుకు పడతాడు? - ఇలాంటి సూటిపోటి మాటలు మితిమీరిపోయాయి.
    అక్కడ ఎక్కువరోజులు ఉండలేకపోయింది సరోజిని. ఎవరికీ తెలియకుండా ఉద్యోగం చూసుకుని వచ్చేసింది. అయినా సరోజినిని సమస్యలు వదలలేదు. ఎక్కడకెళ్ళినా ఒకటే ప్రశ్న?_ ఒక్కదానివే ఉన్నావేం ? మొగుడెందుకు వొదిలేసాడు? నువ్వే వదిలేసావా? అతడే వొదిలేసాడా?" లాటిది __
    ఈ ప్రశ్నలను వెన్నంటి అనుమానపు చూపులు __ వంకర నవ్వులు__వ్యంగ్య వాగ్బాణాలు...
    ఇదంతా భరించలేక మారుమూల గూడెంలో చిన్న బళ్ళోకి ఒకే ఒక టీచర్ గా వచ్చేసింది సరోజిని... గూడెంలో అందరూ సరోజినిని వింతగా చూసేవారు... ఆవిడను ఏదైనా ప్రశ్నించటానికి వాళ్ళకు సాహసం వుండేదికాదు. అక్కడ ఒక విధంగా ప్రశాంతంగా రోజులు వెళ్ళదీస్తోంది సరోజిని.
    స్కూల్లో పిల్లలందరిలో తెలివైనవాడు నర్సింహులు - చదువులో కూడా వాడికే శ్రద్ధ ఎక్కువ.
    "నువ్వు బాగా చదువుకోవాలి ! మాలాగా మారిపోవాలి" అనేది సరోజిని వాడిని పొగుడుతూ... ఆ మాటలకు వాడు పొంగిపోయేవాడు ...
    ఎప్పటిలా ఆరోజు కూడా వాడు లెక్కలన్నీ కరెక్టుగా చేసాడు__
    "చాలా బాగాచేసావురా ! నువ్వు చాలా పైకొస్తావు" ఆమె మెచ్చుకొంది సరోజిని.
    "బాగా చదువుకుని నేను మీలా మారిపోతాను టీచిరమ్మగారు !" అన్నాడు వాడు సంబరంగా.
    "వద్దురా ! వద్దు ! బాగా చదువుకో ! వృద్ధిలోకి రా! కానీ మాలాగ మాత్రం మారిపోవద్దు - మీలాగనే ఉండు-" అంది సరోజిని_
    టీచరమ్మ కళ్ళలో కన్నీళ్ళెందుకొచ్చాయో, పసివాడైన నర్సింహులికి అర్ధం కాలేదు.

 

                                    *  * * 

 Previous Page Next Page