'పాపం! రాజు నింకా మరిచిపోలేదులా ఉంది!' తనలో తనే నవ్వుకుంది రాగిణి.
లలిత వీణానాదం పూర్తికాగానే ఆవిడను చాలామంది అభినందించారు. రాగిణికి పరిచయమున్న ఒక ఆఫీసర్ కూడా లలితను అభినందిస్తూ మాట్లాడుతున్నాడు.
తనను చూచి భయంతో ముఖం తిప్పుకున్న ఆఫీసర్! రాగిణి కెక్కడో కలుక్కుమంది. శ్యామలాంబా, బాపినీడు గార్ల కఠినమైన ఆదేశాలననుసరించి తమలో ఎవరూ బయట ఎక్కడా తమకు పరిచయస్థులైన ఆఫీసర్లను పరిచయమన్నట్లుగా పలకరించకూడదు. కానీ లలితను పలకరించవచ్చు!
రాగిణి చకచక లలిత దగ్గిరకెళ్ళి భుజాలమీద చెయ్యివేసి "హలో! లలిత! బాగున్నావా?" అంది అందమైన చిరునవ్వుతో.
రాగిణి అనుమానించినట్లు లలిత ముఖం చిట్లించుకోలేదు. రాగిణిని తప్పించుకోవటానికి ప్రయత్నించలేదు.
"హలో! బాగున్నాను. నువ్వు బాగున్నావా?" అంది ప్రసన్నంగా.
రాగిణి అక్కడికి రాగానే అంతవరకు లలితతో మాట్లాడుతున్న ఆఫీసర్ కంగారుపడిపోయాడు. తడబడుతూ "ఈవిడెవరు?" అన్నాడు.
"చిన్నప్పటి స్నేహితురాలు! ఒకప్పుడు ఇరుగుపొరుగున ఉండేవాళ్ళం!" అంది లలిత.
రాగిణి వచ్చాక అక్కడ నిలవడం ఆఫీసరుకు కష్టమయిపోయింది.
"నేను వెళ్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటి దగ్గిర డ్రాప్ చేస్తాను" అన్నాడు లలితతో, రాగిణి వంక చూడకుండా.
"నో! థాంక్స్! ఇక్కడి కార్యకర్తలు వాళ్ళ కారులో నన్ను ఇంటికి పంపిస్తారు!" వినయంగా అని నమస్కారం చేసింది లలిత.
ఆ ఆఫీసర్ కూడా నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
కొంచెం సేపట్లోనే కార్యదర్శి వచ్చి "మేడమ్? మీకోసం కారు వచ్చింది.వస్తారా?" అన్నాడు లలితతో.
లలిత పక్కనే ఉన్న రాగిణి మీద అక్కడి యువకుల చూపులు తారట్లాడాయి.
"ఆవిడెవరు?"
"శ్యామలాంబగారి సేవాసదనంలో సీతాకోకచిలుక!"
"ఓహ్!"
ఈ గుసగుసలు రాగిణికి వినిపిస్తున్నాయి.
"ఓహ్!" అనడంలో నిరసన కూడా స్పష్టంగానే తెలుస్తోంది.
"వెళ్ళొస్తాను రాగిణీ!" అని లలిత వెళ్ళిపోయింది.
లలితకు ఆ రోజు వాళ్ళిచ్చిన పారితోషికం రెండువందల రూపాయలు మాత్రమే! తన విలువ ఒక్క రాత్రికి అయిదువందలు! కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ! రెండువందలెక్కువా? అయిదువందలెక్కువా? అయిదే ఎక్కువ! లలితకంటే తనే ఎక్కువ! అవును! తనే ఎక్కువ! తప్పకుండా ఎక్కువ!
7
మణిమాల లలితను తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఆ ఆహ్వానం సంతోషంగా అంగీకరించింది లలిత. ఆమె అంతరాంతరాల్లో మిణుకు మిణుకుమంటున్న ఆశ! మాధవరావుగారి ద్వారా మోహన్ జాడ తెలుస్తుందేమోనని!
అందంగా ఉన్న డ్రాయింగ్ రూంలో అంతకంటే అందంగా ఉన్న మణిమాల ముచ్చటగా కనిపించింది లలితకి.
"మీరు అదృష్టవంతులు!" అంది మనసారా అభినందిస్తూ.
"ఇదేం అదృష్టం!" చికాగ్గా అంది మణిమాల.
ఆశ్చర్యంగా చూసే లలితను ఎవరో అడవి మనిషిని చూసినట్లు చూసింది.
"నీ కసలేం తెలియదు! మాధవ్ మరీ ఇంత మడి కట్టుకునే మనిషి కాకపోతే మేమూ గొప్పగానే ఉండేవాళ్ళం! భాస్కరరావుగారికి చూశావా? రెండు బంగళాలు! ఎయిర్ కండిషన్డ్ రూంలు! మిసెస్ భాస్కరరావు ప్రత్యేకించి కాశ్మీరులో సమ్మర్ కాటేజ్ కట్టించుకుంది. మిసెస్ శోభాదేవి ఎప్పుడెక్కడికి కదిలినా ప్లెయిన్ లోనే! ఆవిడ చీరలు చూడలేదు నువ్వు. ప్రత్యేకించి ఆర్డర్లిచ్చి బొంబాయిలో ఎంబ్రాయిడరీ చేయిస్తుంది! మిసెస్ ఆశాలత ఎప్పుడూ..."
లలితకు అర్థమయిపొయిన్ది౧ నిరుపేదగా అవస్థలు పడలేక పినతల్లి పెంపకంలో మమతకు నోచుకోలేక రత్నమ్మ రాగిణిగా మారి దేనివెంట పరుగులెత్తుతూ ఆనందం వెతుక్కోవాలనుకుంటుందో, అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ భార్య... సంపన్న గృహిణి... విద్యావంతురాలు, సభ్య సమాజంలో మన్ననలందుకోగలిగిన సంస్కారిణి... మణిమాల కూడా దానివెనుకనే పరుగులెత్తుతోంది! అదే ఆనందం అందుకోవాలని ఆరాటపడుతోంది!
లలిత ఎక్కువసేపు నిరీక్షించవలసిన అవసరం లేకుండానే మాధవ్ వచ్చేశాడు. మణిమాల లలితను పరిచయం చేసింది. మాధవ్ లలితను చూసి వెంటనే "మిమ్మల్ని ఎక్కడో చూశాను! ఆ! రైట్! మీ తమ్ముణ్ని విడిపించమని అడగటానికి వచ్చారు!" అన్నాడు.
లలిత సంకోచంతో తల వంచుకుంది.
"అబ్బ ఎంత గుర్తు! పోలీస్ ఆఫీసర్!" అంది మణిమాల నవ్వుతూ.
"ఏం జరిగింది? మీ తమ్ముడు విడుదలయ్యాడా?" యధాలాపంగా అడిగాడు మాధవ్! అతని కంఠంలో నిరసనా లేదు, ఆదరమూ లేదు.
"ఆ! కాని..." లలిత మాటలు పూర్తికాకుండానే కారు దిగి లోపలికి వచ్చింది రాగిణి.
రాగిణిని చూసి లలిత ఎంత ఆశ్చర్యపోయిందో, లలితను చూసి రాగిణి కూడా అంత విస్తుపోయింది.
"ఎక్స్యూజ్ మి!" అని ఏ ఒక్కరికీ నోరు మెదిపే అవకాశం కూడా ఇయ్యకుండా రాగిణిని తీసుకుని తన ప్రైవేట్ రూంలోకి వెళ్ళిపోయాడు మాధవ్.
మాధవరావుగారు! నిజాయితీపరుడని మణిమాల పొగుడుతోన్న మాధవరావుగారు కూడా ఇంతేనా? ఇంతటి శక్తి ఉందా '36" -28" -36" కి? మణిమాల నిట్టూర్చింది!
రాగిణితో మాధవరావుగారు అలా తన కళ్ళముందు వెళ్ళిపోతే మణిమాలకు బాధగా లేదా? ఏమీ పట్టించుకోదా?
ఫోన్ మ్రోగింది. మణిమాల వెళ్ళి మాట్లాడి వచ్చింది. "ప్లీజ్! లలితా! ఏమీ అనుకోకండి! డాక్టర్ వినోద్ అర్జంటుగా రమ్మన్నాడు! పది నిముషాల్లో వచ్చేస్తాను. ఉంటారుగా! నేను రాగానే డ్రాప్ చేయిస్తాను." నొచ్చుకుంటున్నట్లుగా అని హడావుడిగా వెళ్ళిపోయింది. ఆయన అలాగ! ఈవిడ ఇలాగ! కొన్ని కొన్ని సంసారాల్లో భార్యాభర్తలిద్దరకు ఎవరి స్నేహితులు వాళ్ళకుంటారనీ, ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆ స్నేహాల గురించి పట్టించుకోకుండా హాయిగా సంసారాలు చేస్తారనీ వింది. ఇంచుమించు ఇలాంటి సబ్జెక్ట్ మీదే గోపీచంద్ 'ప్రేమోపహతులు' వ్రాసారు! ఈ సంసారం కూడా అలాంటిదేనా?
వీణ వింటాం రమ్మని ఆహ్వానించి భర్త అటు, భార్య ఇటు వెళ్ళిపోయారు. ఏ కళాకారిణికైనా ఇంతకంటే అవమానం ఉండదు.ఏం మనుష్యులు? ఎలా అర్థం చేసుకోవాలి ఈ మానవ ప్రవృత్తిని? ఎంత అయోమయంగా కనిపిస్తోంది జీవితం!