"అక్షరం పొల్లుపోకుండా రిపీట్ చేశారే"
"అవును"
"ఏమిటి అవును?"
"దగ్గరలోనే వున్న రామాపురంలో చదువుకుంటున్నాను."
"ఈ ఊళ్ళో మంచి స్కూళ్ళు లేవనుకుంటాను."
"అవును"
"మీరెక్కడ ఉంటారు?"
"హరిజనవాడలో"
"అంటే మీరు"
"అవును"
ఎంత అందంగా, అమాయకంగా, నిర్మలంగా వుంది.
పైనుంచి ఓ వర్షపు చుక్క తలమీద పడింది.
వర్ష మొచ్చేలా వుంది అనుకుంటూ "మీ పేరేమిటి?" అన్నాడు.
"వర్ష"
మరో వర్షపు చుక్క ఆమె తలపై పడి చెంపమీదకు జారింది.
"బ్యూటిఫుల్"
"ఏమన్నారు?"
"వర్ష మొచ్చేలా వుంది"
"అవును"
"ఊ, అవును అనే మాటంటే మీకు చాలా ఇష్టమా?"
నవ్వింది. అదే సమయానికి ఆకాశంలో ఓ మెరుపు మెరిసి, మెరుపును తళుక్కుమన్న యీ నవ్వులోని మెరుపు జోడించినట్లయింది.
"అవును" అంది మళ్ళీ.
"వెరీ స్వీట్"
"ఏమన్నారు?"
"వెరీ వెరీ స్వీట్"
ఆమె పెదవి తెరచి ఏదో అనబోయింది. ఇంతలో ఉన్నట్టుండి చినుకులు యెక్కువైపోయినాయి. "అయ్యో" అంటూ తడవకుండా పుస్తకాలు తలమీద అడ్డుగా పెట్టుకుంది.
"అరె పుస్తకాలు తడిసిపోతాయి."
"మరెలా?"
"మీరేం అనుకోనంటే..."
"చెప్పండి"
"సైకిలు వెనక కూచోండి. స్పీడ్ గా తొక్కేస్తాను"
"స్పీడ్ గా తొక్కితే వర్షంలో తడవరా?"
"వర్షం కంటే వేగంగా వెళ్ళిపోతాం."
"అమ్మో? నాకు భయమేస్తోంది."
"ఏం భయం ఉండదు. అంతగా భయమైతే..."
"ఊ"
"సైకిలును పట్టుకోండి. వాన నిజంగానే పెద్దదవుతోంది"
వర్ష అటూ ఇటూ చూసింది. వెనకెక్కడో ఓ ఎడ్లబండి వస్తోంది. దగ్గర్లో జనమెవరూ కనబడలేదు.
"సరే పదండి" అంది సైకిలు ఎక్కడానికి సిద్ధపడి. అతను ముందుగా ఎక్కి కూచున్నాడు. తర్వాత వెనక క్యారియరుమీద ఆమె ఎక్కింది. సైకిలు కదిలింది.
"అన్నట్టు మీ పేరు?"
"హర్ష. శ్రీహర్ష."
* * * *
శ్రీహర్షకు వెళ్ళినపని అయింది. కాకపోతే అవతల దుకాణంవారు తాత్సారం చెయ్యడంవల్ల సాయంత్రం దాకా టైము పట్టింది. చీకటిపడే సమయానికి జోగాపురానికి తిరిగి వచ్చాడు. చలమయ్య దుకాణంలో లేడు. డబ్బు తీసుకొని యింటికి వెళ్ళాడు. చలమయ్య వసారాలో ప్రేము కుర్చీలో కూచొని వున్నాడు. చేతిలో బ్రాందీతో నింపువున్న గ్లాసు ముందున్న టీపాయ్ మీద సోడా సరంజామా అంతా వుంది.
"రా కుర్రాడా? ఏమిటింత ఆలస్యమయింది?" అన్నాడు చలమయ్య.
శ్రీహర్ష జేబులోంచి డబ్బు తీసి టీపాయ్ మీద పెట్టాడు. చలమయ్య మొహం ఆనందంతో విప్పారింది. "మెత్తని వాడివనుకున్నా కాని మొత్తంమీద అసాధ్యుడవని పించుకున్నావయ్యా? రా కూచో! ఓ చుక్కేసుకు పోదువు గాని" అన్నాడు.
"వొద్దులెండి అలవాటు లేదు. వస్తాను" అంటూ కదలబోయాడు.
"పోనీ భోజనం చేసి వెళ్ళవయ్యా! మా ఆవిడ పనస పొట్టు కూర వండినట్టుంది."