Previous Page Next Page 
జోగబాల పేజి 11


    తమ వాడలోనే అమృతం అని ఓ జోగిని ఉంది. ఆమె జోగినిగా ఉంటూనే తమ్ముడ్ని మెడిసిన్ చదివించింది. అతను చదువు పూర్తిచేసి డాక్టరుగా మంచిర్యాల గవర్నమెంటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు కూడా. అయినా ఆమె జోగిని వృత్తి మానలేదు. ఆమె జీవితం ఆమె చేతిలోంచి జారిపోయింది.


    జోగిని!


    ఆ ఆలోచన వస్తేనే ఆమె గుండె ఝల్లుమంటుంది. ఆ వికృత, అనాగరిక, పైశాచిక జీవన విధానం మనసును నలిపేస్తూ ఉంటుంది. రామాపురానికి ఆమె ఇద్దరు ముగ్గురు స్నేహితురాళ్ళతో కలిసి వెడుతూ ఉంటుంది. ఈవేళ హరిజనవాడలో ఓ అమ్మాయి పెళ్ళి. అందుకని వాళ్ళిద్దరూ ఆగిపోయారు. జోగాపురం నుంచి రామాపురానికి రోడ్డు బాగానే ఉంటుంది. బస్సులయితే లేవుగాని తరుచు వొంటెద్దు, రెండెడ్ల బళ్ళూ, సైకిళ్ల మీద వెళ్ళేవాళ్ళు తారసపడుతూనే ఉంటారు.


    ఆకాశం మబ్బు మబ్బుగా ఉండి ఏ క్షణాన్నయినా వర్షం పడేలా ఉంది. ఒకవేళ వానవస్తే...? ఈ రోజు బయల్దేరి తానేమైనా పొరపాటు చేశానా అనే అనుమానం కలుగుతోంది. వడివడిగా నడవడానికి ప్రయత్నిస్తోంది.


    అదే రోడ్డుమీద శ్రీహర్ష రామాపురం వైపు సైకిలు తొక్కుకుంటూ వస్తున్నాడు. రామాపురంలో ఓ రిటైల్ వ్యాపారస్థుడు చలమయ్య దగ్గర యెప్పుడో నాలుగయిదు వేల రూపాయలదాకా సరుకు కొనుగోలు చేసి డబ్బివ్వకుండా తప్పించుకుంటున్నాడు. చలమయ్య ఇవాళ్ళ యెలాగైనా వెళ్ళి బాకీ వసూలు చేసుకొని రమ్మని శ్రీహర్షను పంపించాడు.


    హర్ష సైకిలుమీద పోతూ వర్షని చూశాడు. చక్కగా, ముచ్చటగా ఉన్నది. అమ్మాయి పొరుగూరికి చదువుకోసం కాబోలు పోతున్నది. వర్షం వచ్చేలా వుంది. తడుస్తుందో ఏమో. ఎందుకో ఆ అమ్మాయిని పలకరించాలనిపించింది. ఒంటరిగా పోతున్న ఆడపిల్లను పలకరిస్తే జులాయికోరనుకుంటుందేమోనని తటపటాయించి చివరకు ధైర్యం చేశాడు. ఆమె ప్రక్కకి వచ్చాక సైకిలు స్లో చేశాడు.


    వర్ష తల ప్రక్కకి తిప్పి చూసింది. ఈ యువకుణ్ణి యెప్పుడో చూసినట్లనిపించింది. ఎప్పుడు చూశానా అని గబగబ ఆలోచిస్తుంటే హరిజనవాడలో అతను ఒకటి రెండు చోట్ల సంచరిస్తూ కనిపించినట్లు గుర్తొచ్చింది. "మీరూ... వేరే ఊళ్ళో చదువుకుంటున్నారా?" అనడిగాడు శ్రీహర్ష. అతని గొంతులో చిన్న ఒణుకు.


    "మీకెందుకు?" అనాలనుకుంది వర్ష. అతని గొంతులోని వొణుకు, మార్దవం, ముఖంలోని సౌమ్యత - ఆమెనామాట అననియ్యకుండా చేశాయి. పరాయి పురుషుడితో ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు. అందుకే జవాబు చెప్పాలనిపించినా భయపడి ఊరుకుంది. ఆమె యెంత భయపడుతున్నదో అతనూ అంతే భయపడుతున్నాడు. అయినా ఎందుకో...ఆమెతో మాట్లాడాలన్న కోరికను చంపుకోలేక పోతున్నాడు. "మిమ్మల్నే" అన్నాడు శ్రీహర్ష మళ్ళీ ధైర్యం తెచ్చుకొని.


    తానింకా పదిహేనేళ్ళ వయసులో ఉన్న చిన్నపిల్ల. తనకి గుర్తున్నంతవరకూ 'మీరు' అని సంబోధించినవారు లేరు. అందుకని నవ్వొచ్చింది. వర్ష నవ్వింది. ఆ నవ్వు చాలా మధురంగా, పన్నీటి జల్లు కురిసినట్లుగా అనిపించింది. మరికొంత ధైర్యమొచ్చి "చెప్పరా" అన్నాడు.


    ఆమెకికూడా అతనితో మాట్లాడాలనిపించి "ఏమిటీ" అన్నది.


    అతను ఇందాక ఏమడిగాడో గుర్తు రావడంలేదు. ఆలోచిస్తున్నాడు.


    "చెప్పండి" అంది ఆమే ఈసారి లిడ్ తీసుకొంటూ.


    "అదే...అదే..."


    ఈలోగా ఆమె కాలికేదో రాయి అడ్డుతగిలి తూలి క్రింద పడబోయింది. పడకుండా సర్దుకోవడంలో చేతిలోని పుస్తకాలు జారి కిందపడ్డాయి.   


    "అరె" అంటూ అతను సైకిలు దిగి నేలమీద నుంచి పుస్తకాలు తీసి ఆమెకందిస్తూండగా గుర్తుకు వచ్చింది.


    "మీరు వేరే ఊళ్ళో చదువుకుంటున్నారా అని అడిగాను."

 Previous Page Next Page