Previous Page Next Page 
జోగబాల పేజి 13


    "థాంక్సండీ. నా బట్టలన్నీ వానకు తడిసి చిరాకుగా వుంది. వెడతాను" అని నమస్కారం చేసి అక్కణ్ణుంచి కదిలాడు.


    అతడు గుమ్మందాటి వెళ్ళగానే చలమయ్య భార్య రత్నమ్మ లోపల్నుంచి వసారాలోకి వచ్చింది.


    "అతనేనాండీ? మన కొట్లో కొత్తగా చేరిన కుర్రాడు?" అనడిగింది.


    "అవును ఏం?"


    "కుర్రాడు వినయంగా బాగున్నాడు. కులమేమిటో తెలుసుకోలేకపోయారా?"


    "మనకంటే గొప్పకులమే అయి ఉంటుంది"


    "అమ్మాయికి అలాంటి మొగుడు దొరికితే బావుండదూ?"


    "బావుంటుంది. కాని దొరకవద్దూ? సరే లోపలకు వెళ్ళు. నేను మందు కొడుతున్నప్పుడు కుటుంబ సమస్యలు తీసుకురావద్దని చెప్పానా?" అన్నాడు చలమయ్య మృదువుగానే గదమాయిస్తూ.


                                                       *    *    *    *


    ఆ మర్నాడు హర్షకు తండ్రి దగ్గర్నుంచి ఉత్తరమొచ్చింది.


    "హర్షా!


    ఒక్కగానొక్క కొడుకువని వున్నంతలో ఎంతో గారాబంగా పెంచాను. కాని అనుకోకుండా యిలా దూరమౌతావని అనుకోలేదురా. నువ్వెప్పుడూ చెడు పని చెయ్యవని నాకు తెలుసు. కాని, మంచి పనులన్నీ క్షేమంతో కూడుకొన్నవి కావురా. ఈ ప్రపంచం ఎప్పుడూ చెడువైపే మొగ్గుతుందని, చెడూ చెడూ యెప్పుడూ ఒకటవుతాయని తెలుసుకో. నువ్వెక్కడున్నా శుద్ధంగా ఉండాలనీ నిన్నప్పుడప్పుడూ కళ్ళారా చూసుకోవాలని కాంక్షించే


                                                                                 __నీ తండ్రి."


    ఎందుకో గుండె కలుక్కుమన్నట్లయింది. ఓ నీటి బిందువు కంట్లో పొటమరించబోయి ఆగిపోయింది. అయిదు నిముషాలసేపు స్తబ్దుగా కూచొని, తర్వాత దుకాణానికి బయలుదేరాడు.


                                *    *    *    *


    ఆ రోజు షాపు చాలా రద్దీగా వుంది. అవటానికి హోల్ సేల్ దుకాణమే అయినా, తెలిసిన వాళ్ళకు బేరమొస్తే పోగొట్టుకోవడం ఇష్టంలేక యితరులకు కూడా బట్టలు అమ్మేస్తూ ఉంటారు.


    ఉన్నట్టుండి షాపులోవున్న వారందరికీ కళ్ళు జిగేలు మనేటట్లు ఓ యువతి వయ్యారంగా నడుచుకుంటూ లోపలికొచ్చింది. ఆమెకు పాతికేళ్ళు ఉండవచ్చు. అంత అందగత్తె అయి ఉండక పోవచ్చుగాని, కట్టుకొన్న ఖరీదైన ఎంబ్రాయిడరీ చీరె తళతళలు, మెళ్ళో బంగారు గొలుసుల ధగధగలు ఆమెను అందగత్తెగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాయి.


    ఆ సమయానికి చలమయ్య కూడా షాపులోనే ఉన్నాడు. "ఏం మోహనా! చీరెలు కొనటానికొచ్చి చాలారోజులయింది." అన్నాడామెను పలకరిస్తూ.


    "మీరు మా యిల్లు పావనం చేసి చాలా రోజులయిందిగా" అంది మోహన.


    ఆమె ఆ మాట అంటూ ఉండగా షాపులో ఉన్న పదిమంది విన్నారు. అయినా చలమయ్య సిగ్గుపడలేదు ముసిముసిగా నవ్వి "తీరుబడి ఉండటంలేదులే" అన్నాడు.


    "కొత్త చీరె లొచ్చాయటగా షావుకారుగారూ" అంది మోహన.  


    "చాలా రకాలు. ఇవిగో అడవికి మొన్న బొంబాయి నుంచి దిగిన సరుకు చూపించు కుర్రాడా?"


    "ఎవరీ కుర్రాడు!" అనుకుంటూ మోహన అతనివంక చూచింది.


    అదే సమయానికి శ్రీహర్ష కూడ ఆమెవైపు చూశాడు.


    "అరె! బలే అందంగా వున్నాడే" అనుకుంటూ రెప్ప ఆర్పకుండా చూస్తోంది.


    "చూద్దాం ఎంతసేపలా చూస్తుందో!" అని అతనూ పెంకిగా అలా చూస్తుండేసరికి, వున్నట్టుండి కన్నుకొట్టింది.


    శ్రీహర్ష ఉలికిపడి తల ప్రక్కకి తిప్పేసుకొన్నాడు.


    
                                *    *    *    *


    జోగాపురం మధ్యలో ఓ సందులో సుమారైన రీతిలో కట్టబడిన ఓ మేడలో మోహన కాపురముంటుంది. రాత్రి పదిగంటలవేళ ఆ మేడముందు ఓ మోటార్ సైకిల్ ఆగింది. ఎస్.ఐ. కోదండపాణి మోటారు సైకిలు ఓ ప్రక్కన పార్కు చేసి మెట్లెక్కి పైకి వచ్చాడు. ఆ ఊరి చుట్టుప్రక్కల పదిగ్రామాలకు ఒక్కటే పోలీసుస్టేషన్. ఎస్.ఐ. కోదండపాణి నలభై ఏళ్ళుంటాయి. దృఢంగా, యెత్తుగా, బలంగా ఉంటాడు. కళ్ళలో యెర్రని జీరలు కదలాడు తుంటాయి.

 Previous Page Next Page