అతనెప్పుడూ తనదైన ముఖ్యమైన వస్తువుల్లో ఏవీ మరచిపోకుండా రాడు. ఆ మరిచిపోయిందికూడా ఓ అరగంటలోనే బయటపడుతూ ఉంటుంది. అవి షేవ్ చేసుకునే రేజర్ కావచ్చు, కట్టుకునే లుంగీ కావచ్చు, మనీ పార్స్ కావచ్చు. ఒక్కోసారి ఒక్కో రూపంలో ఉంటుంది. దానివల్ల అనుక్షణం ఏదో సమస్య తలెత్తుతూ ఉంటుంది.
పద్మనాభరావు ఎప్పుడూ పిల్లల్ని పిలిచినఅవాడు పిలిచినట్లే వుంటాడు. పిల్లలు...వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ కాలక్షేపంలో ఉన్నా సరే, చదువుకుంటూ బిజీగా ఉన్నాసరే, ఇంకా ఏదన్నా పనిపాటల్లో మునిగి ఉన్నా సరే_అవతలివాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచించకుండా పేర్లుపెట్టి పిలుస్తూ ఉంటాడు.
"అభిలాష్! కాస్త మంచినీళ్ళందుకో"
"నీరజా! అమ్మనడిగి కాఫీ పట్రా"
"అరవింద్! కిళ్ళీకొట్టుకెళ్ళి ఓ విల్స్ ప్యాకెట్ పట్టుకురా. అన్నట్లు చిల్లరలేదుగానీ తర్వాతిస్తామని పద్దు రాయించు"
పిల్లలెవరితో మాట్లాడుతున్నా అర్జంటు పని వున్నట్లు కొంపలంటుకుపోయినంత హడావుడి వున్నట్లు పిలిచేవాడు.
"అరవింద్! మంచి సినిమా ఏవుందో చూడమ్మా. ఇద్దరం కలిసి వెడదాం" అంటూ తనతోబాటు బయల్దేరేదాకా ప్రాణాలు తోడేసేవాడు.
సినిమాహాల్ దగ్గరకెళ్ళాక చచ్చినా జేబులోంచి పార్స్ తీసేవాడు కాదు. తన దగ్గరున్న పాకెట్ మనీతో పిల్లవాడు టిక్కెట్లు కొంటూంటే చూస్తూ ఊరుకునేవాడు.
అర్థరాత్రిపూట మెలకువ వచ్చి దాహమేస్తే పెళ్ళాం రోగిష్టి మనిషి లేవలేదని, గాఢనిద్రలో వున్న పిల్లల్ని నిద్రలేచేదాకా కేకలు వేసి లేపి మంచినీళ్ళు తెప్పించుకునేవాడు. వాళ్ళు నిద్రమత్తులో బద్ధకించినట్లో, విసుక్కున్నట్లో కనబడినా, "నేను గెస్ట్ ని. నాకు మర్యాద చెయ్యాలి" అనేవాడు.
అతనన్నం తింటున్నప్పుడు దృశ్యం చూసి తీరాలి.
చాలా మందిలా కాక అదో మహాయజ్ఞంలా ఓ క్రతువు నడిపిస్తోన్నట్లుగా ప్రవర్తించేవాడు.
అతను అన్నం తినడం పూర్తి చెయ్యడానికి దాదాపు గంటసేపు పట్టేది.
కుర్చీమీద బాసిపట్టు వేసుకొని కూర్చుని తన కార్యక్రమాన్ని ప్రారంభించేవాడు.
ఆవకాయ అన్నం కలుపుతున్నప్పుడు వున్నట్లుండి కలపటం ఆపేసి అలా వుండిపోయేవాడు.
"ఏం కావాలిరా? అనడిగేది అరుంధతి ఆప్యాయంగా.
"నూనె. నువ్వు ఆవకాయ మహా గొప్పగా పెడతావే. అందులో నూనె వేసుకుని తింటేగాని మజా వుండదు" అనేవాడు.
అన్నట్లు పిల్లల్లో ఎవరో ఒకర్ని తన కంపెనీకోసం ప్రక్కనే కూచోబెట్టుకునేవాడు_తోడుగా భోజనం చెయ్యటానికి.
వాళ్ళు మొహాలు చిట్లించినట్లు కనబడితే "నేను మీకు గెస్ట్ ని మర్యాద చెయ్యాలి" అనేవాడు.
గోంగూర పచ్చడి కలిపినప్పుడు వున్నట్లుండి ఆగిపోయేవాడు.
"ఏం కావాలిరా" అంటే "ఉల్లిపాయ. ఉల్లిపాయ ముక్కలుకోసి పట్రా" అనేవాడు.
సాంబారు కలిపినప్పుడు "ఏమిటీ అప్పడంగానీ, గుమ్మడికాయ వడియంగానీ లేదా? సాంబారు చేసినప్పుడు అలాంటివి కాంబినేషన్ లేకపోతే బావుండవే" అని ఆవిడ వేయించి పట్టుకొచ్చేదాకా బాసిపట్టులో అలా ఓపిగ్గా నిరీక్షించేవాడు.
మజ్జిగన్నంలో ఆఖరిసారి అన్నం మారు వేయించుకుని కంచంనిండా కలిపేవాడు.
ప్రక్కన కూర్చున్న అరవిందు, యింకెవరో ఆశ్చర్యంతో ఆ తిండిపుష్టి చూసి కళ్ళు పెద్దవి చేసేవారు.
ఒక్కోసారి లోపల కలిగిన అసహ్యాన్ని అణుచుకోలేక "నువ్వు కడుపునిండా తినడంలేదు మావయ్యా మొహమాట పడుతున్నట్లుగా వున్నావు" అనేవారు వేళాకోళం చేస్తున్నట్లుగా.