"తెలవదు - ఎందరో సస్తా ఉంటారు. అయితే ఏంటి?"
"ఇది అట్లాంటి సావుకాదులే? ఆ నరసయ్య వెంకణ్ణి తిట్టాడు - వెంకడు నువ్వు చస్తావు, అన్నాడు - వాడు వచ్చాడు..... అన్నాడు జైహింద్ బాబు-
"అదేంటి? ఈడు సస్తావంటే ఆడు సస్తాడేంటి?
"ఈడికి మంత్రాలొచ్చు. కొండల్లోంచి వచ్చాడు - "
కళ్ళు పెద్దవిచేసి చెప్పింది సుందరీబాయి - "
భయంగా చూసింది కోటయ్య తీసుకొచ్చిన మనిషి. చంద్రి అందుకుంది....
"మా అమ్మ అసలు వాణ్ణి రానిచ్చేదేంటి! వాడికి మంత్రాలొచ్చని రానిచ్చింది. రోజూ తలారా స్నానంచేసి గంటలు గంటలు జపంచేస్తాడు. అర్థరాత్రి శ్మశానానికి పోయి ఆ ఎముకలూ, ఈ ఎముకలూ, ఏరుకొస్తాడు. నెత్తురుతో అమ్మోరికి పూజ చేస్తాడు....."
నించున్న ఆ మనిషికి భయంతో రోమాలు నిక్కపొడుచుకున్నాయి.
చంద్రి మరికాస్త పొడిగించింది-
"ముందు మా అమ్మ వాణ్ని ఇంట్లో అడుగు పెట్టదంది. వాడు ఏదో మంత్రం చదివేసాడు. మా అమ్మకి ఉపద్రవంగా గుండెనొప్పి వచ్చేసింది. భయపడిపోయి రమ్మంది - గుండెనొప్పి తగ్గిపోయింది."
గుండెలు దడదడలాడాయి ఆ మనిషికి.
సమయం చూసుకుని వెంకడు చేతిలో వేపమండ పుచ్చుకుని "ఓం! హ్రీం!" అంటూ వచ్చాడు-
"ముదనష్టపుదానా? ఈణ్నించి పోకపోయినావంటే రేపటికల్లా గుండె పగిలిసస్తావు-" అన్నాడు ఉరిమిచూస్తూ.
వెంకడు పుష్టిగల మనిషి. వాడిలా ఉరిమిచూడగానే. గుండె కలుక్కుమంది ఆ మనిషికి. నిజమో, అబద్దమో ఎందుకొచ్చిన పీడ అనుకుంది. అప్పటికప్పుడు సంచీ సర్దుకుని పారిపోయింది.
పిల్లలంతా చప్పట్లుకొట్టి నవ్వుకున్నారు. క్షణాలలో ఈ వార్త గుడిసెలన్నింటిలోనూ వ్యాపించింది.
"వెంకడికి మంతరాలొచ్చు. కోటయ్య లేవదీసుకొచ్చిన దాన్ని మంతరం పెట్టి వెల్లగొట్టేసినాడు-" అని చెప్పుకున్నారు.
నాగమ్మ వెంకడిని భయంగా చూసి "నిజమేనా?" అంది.....
వెంకడు చంద్రివంక బెదురుగా చూశాడు.
"అవునమ్మా! అన్న మంత్రం చదివాడు- అది విలవిలలాడి గిలగిలతన్నుకుని పారిపోయింది" అంది చంద్రి.....
నాగమ్మ ముఖం పాలిపోయింది. "ఓర్నాయినో" అంది గుండె రాసుకుంటూ.....
వెంకడు దిగాలుగా చంద్రినిచూశాడు - చంద్రి నవ్వింది. వెంకడూ నవ్వాడు.
6
వరదాచార్యులుగారి భార్య రంగనాయకమ్మకి తరచుగా తలనొప్పి వస్తుంది. ఆ రావటం ఉథృతంగా వస్తుంది! ఆ వచ్చినప్పుడు వికారం పుట్టి వాంతులు కూడా అవుతాయి! తలనెప్పి వచ్చినప్పుడు ఆవిడ ఇల్లంతా తలక్రిందులు చేసేస్తుంది! అసలే పనితో ఊపిరాడని సరళకి ఆవిడకి తలనెప్పి వచ్చిన రోజుల్లో మరీ, కాళ్ళూ చేతులూ విరక్కొట్టుకున్నట్టే అవుతుంది.
ఆ రోజు రంగనాయకమ్మకి తలనెప్పి వచ్చింది. ఇంటి కప్పు ఎగిరిపోయేలా మూలుగుతూ "వామ్మో! నాయనో" అని అరుస్తోంది మధ్య మధ్య.
సరళ తలారా స్నానం చేసి మడి కట్టుకొని మహా నైవేద్యానికి వంట తయారుచేస్తోంది.
వరదాచార్యులు ఇంట్లో సాలగ్రామాలకు మహా నైవేద్యం పెట్టి, ఆ తరువాత కోవెలకెళ్ళి అర్చనలు చేయించాలి. సాలగ్రామాలకు నైవేద్యంగా పెట్టే వంటలో ఏమాత్రం అపచారం జరిగినా అది బెడిసికొడుతుందనే నమ్మకం ఉంది!
అంచేత సరళ ఎంతో మడిగా వంట చెయ్యటంలో మునిగిపోయింది.
దానికి తోడు వరదాచార్యులు అమ్మా! సరళా! ఇవాళ ఇద్దరు ఉద్యోగస్తులు ఇళ్ళలో తద్దినాలు పెట్టుకునే వెసులుబాటు లేక కోవెలలోనే చేయించమని డబ్బు కట్టేశారు! నువ్వు నిష్ఠగా చెయ్యాలి! త్వరగా చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు ఆఫీసులకి పోవాలి! కోవెలకి వచ్చి ప్రసాదం తీసుకొని ఆఫీస్ కి వెళతారట! సాధ్యమయినంత త్వరలో ముగించమని మరీ మరీ చెప్పారు" అని హెచ్చరించాడు.
పనితో సతమతం కాసాగింది సరళ.
రంగనాయకమ్మ కూతుళ్ళు కమల, శ్యామల ఇద్దరూ చిన్న చిన్న వాళ్ళే. కమలకి పదేళ్ళుంటాయి. శ్యామలకి ఎనిమిది. రంగనాయకమ్మ ఎప్పుడూ మూలుగుతూ మంచములో వుండటం వల్ల, ఆ ఇద్దరు పిల్లలకి అన్నీ సరళ చెయ్యటం వలన ఆ పిల్లలిద్దరికీ పిన్ని అంటే చాలా యిష్టం.
"పిన్నీ స్కూలుకి టైమవుతోంది జడ వెయ్యవూ?" అంటూ వచ్చింది కమల.
పొయ్యిలోంచి తల పైకెత్తి ముఖానికి పట్టిన చమట అతడి పైటకొంగుతో తుడుచుకుంటూ "ఇవాళ నాకు చాలా పని వుంది కమలా! కాస్త మీ అమ్మచేత వేయించుకో?" అంది సరళ.
కమల తల్లి దగ్గరకు వెళ్ళి అడిగింది.
అక్కడితో రంగనాయకమ్మ గట్టిగా అరుస్తూ "నా కర్మ! నాకు పుట్టెడు రోగం వస్తే నా పిల్లలకి తల దువ్వేవాళ్ళయినా లేరు. అంతా ఇంట్లోపడి తినేవాళ్ళే కాని, కాస్త ఆదుకునే వాళ్ళెవరూ లేరు" అని దీర్ఘాలు ప్రారంభించింది.
సరళ హడిలిపోయి, చేస్తున్న పని ఆపి పొయ్యిలోంచి కర్రలు ఇవతలకు లాగి బయటకొచ్చి "కమలా! శ్యామలా! రండి జడలు వేస్తాను" అంది.
పిల్లలు సహజంగా మంచివాళ్ళు. పదేళ్ళ కమల అన్ని పరిస్థితులూ అర్థం కాకపోయినా, పిన్ని పరిస్థితి అర్ధమయింది.
"వద్దులే పిన్నీ! ఈ రోజుకీ మేం వేసుకుంటాములే" అంది కమల.
ఆ పసిమనసులు తనపై చూపించే ప్రేమాభిమానాలకు కరిగిపోయింది సరళ. వీళ్ళకోసం ఎంత శ్రమైనా పడగలననుకుంది.....
"ఫరవాలేదు రండమ్మా! ఎంతలో వేస్తాను! మీ అంతట మీరు వేసుకుంటే సరిగా రాదు. అందరూ నవ్వుతారు" అని ఇద్దరికీ జడలు వేసింది. వాళ్ళకోసం విడిగా కలిసిన దదోజనం పళ్ళాలలో పెట్టి, మధ్యాహ్నం తినటానికి చపాతీలు చెయ్యసాగింది.