నీ డిప్రెషన్ అప్పుడప్పుడూ నీమీద నీకే వెగటు కలిగిస్తుంది. అదేపనిగా దాన్ని పక్కవాడిమీద రుద్దుతూ వుంటే, అతడి పరిస్థితి ఏమైపోతుందో? కొంత జాలిపడటమన్నా నేర్చుకోలేవా? జీవితంలో ఎన్నో ప్రాథమిక సూత్రాలు వుంటాయే.....వాటిని అమలుపరచాలన్న జాగ్రత్త కొంచెమైనా నీలో లేదా? పనికిరాని ఆలోచనలు అతి తెలివితో ఎన్నో చేస్తావే. పక్కవాడి సమయం ఎంతో విలువైనదని, అతడి మెదడును అదేపనిగా తినేసే హక్కు నీకు లేదనీ, నీ ఉనికి పక్కవాడికి ఆహ్లాదకరంగా వుండాలి గానీ, వెగటు పుట్టించకూడదని, అందుకోసం కొంచెం.....ప్రయత్నించాలనీ....ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేని అల్పజీవిగా వుండటం నీకిష్టమా?
నీకు ఇష్టమని చెప్పుకోవడానికి నిరాకరిస్తున్నావు. అంటే నిజాన్ని ఒప్పుకోలేక పోతున్నావన్నమాట.
మనిషి నిజాన్ని ఒప్పుకోవటానికి ఎందుకు భయపడతాడు? అతడిముందు చుట్టూ ఎంతో అందమైన జీవితమున్నదే. అనుభవించటానికీ, ఆస్వాదించటానికీ ఎక్కడ పడితే అక్కడే రమణీయమైన ప్రకృతి వెల్లివిరిసి వున్నదే. నీవు ప్రకృతి సౌందర్యాన్ని చూసి తరించటం మరిచిపోయావు. దానికేదో బిజీ అనీ, అదని ఇదనీ ఏవేవో పేర్లు పెట్టుకుంటావు. తీర్ధయాత్రలు చేస్తావు. ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తావు. కాని అక్కడ ప్రత్యక్షమై వున్న అమోఘమైన ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించటానికి నీలోని అహం, యాంత్రికత్వం అడ్డు వస్తాయి.
అసలు నీవు వెన్నెలను చూసి ఆనందించి ఎన్నాళ్ళయింది? ఎందుకు మిస్ అయిపోతున్నావు?
నీలో సౌందర్యపిపాస వుంది. మంచి స్నేహితుడుగా వుండాలనీ మంచి సంగీతం వినాలనీ ఎంతో తపన వున్నది.
కాని... అలా చేయలేకపోతున్నావు.
ఎందుకని?
నీలో వున్న నెగెటివ్ నెస్ నిన్ను నీనుంచి దూరం చేసేస్తున్నది ఎక్కడికో కనిపించని దూరాలకు విసిరేస్తుంది.
నీకు తెలియటంలేదు.
నిన్ను నీవు చాలా పోగొట్టుకుంటున్నావు.
సాధనలు చేస్తే మనిషి మారతాడా?
చాలా అవకాశముంది కాని మళ్ళీ ఆ సాధనలు యాంత్రికంగా తయారవుతున్నాయే. అక్కర్లేని వాటికోసం ఒళ్ళు వంచి పనిచేసి, శరీరాన్ని హూనం హూనం చేసుకుంటావు. ఏదైతే అవసరమో.... అక్కడ నీ జాగృతిని అమరనియ్యటం లేదు.
బహుశా..... ఈ నెగెటివ్ నెస్ లో ఓ నిషా వున్నదేమో....!
మరో చిత్రమైన ప్రవృత్తి
ఆ రాత్రి ఎంతకీ నిద్ర పట్టలేదు. కొంచెంసేపు ఆలోచిస్తూ పడుకున్నాను. కొంతసేపు లేచి హాల్లో అటూ ఇటూ తిరిగాను. చాలలేదు. ఇంకా ఏదో చేయాలనీ పించింది. ముందుకూ వెనక్కూ హాయిగా వూగిసలాడే నా ఈజీ చైర్లో కూర్చుని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన జీవితాన్ని గురించి రాసుకున్న గ్రంథమొకటి తీసుకుని చదవసాగాను.
భారతీయ సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థానం తిరుగులేనిది. నాకప్పుడప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది. దేశంలో ఎంతోమంది గొప్పవాళ్ళయిన కవులూ, రచయితలూ వున్నారు. వాళ్ళు ఎందుకని ఠాగూర్ స్థాయికి ఎదగలేకపోయారు?
ఇది ప్రతి కవీ, రచయితా వేసుకోవలసిన ప్రశ్న ఎందుకని?
ఎక్కడో అక్కడ ఆ మేధనూ, నిజాయితీని మిస్ అయిపోతున్నారు. ఆ పరిపక్వతనూ, సంపూర్ణత్వాన్ని అందుకోలేకపోతున్నారు. ఎక్కడో అక్కడ.... ఆ ఎక్కడో తేల్చుకోవడం అంత సులభం కాదు.
ఎక్కడ వుంది ఆ గొప్పతనం అన్న ఆసక్తితో ఆ పుస్తకాన్ని చదవసాగాను.
చాలామంది గొప్ప రచయితల సాహిత్యానికీ, వాళ్ళ జీవిత చరిత్రలకూ పొంతన వుండదు. ఇక్కడ అలాంటి ప్రమాదం కనిపించలేదు గానీ, ఓ సంపూర్ణ విశ్వకవిగా ఆవిర్భావం ఎక్కడ జరిగిందో వెతుక్కోవటం కష్టమైపోతోంది. ఆయనలో అన్ని గూప లక్షణాలూ... సంగీతం, చిత్రలేఖనం, కవిత్వం యథాలాపంగా రూపుదిద్దుకున్నట్లు కనిపిస్తున్నాయి గాని ఏ మహాతపనతో అవి శాంతిజ్వాలల్లా జనించాయో.... వాటి ఉనికి తప్పకుండా వుండి వుంటుంది. కాని వివరణలు లేవు.
కొంత అసంతృప్తి కలిగింది. ఎందుకోమరి.... కొంతమంది తమ లోతుల్ని సాహిత్యరూపంలో వ్యక్తీకరించకోగలరు గాని, సూటిగా భావన కలగజెయ్యలేరు.
ఆ అసంతృప్తి పోగొట్టుకునేందుకు ఎవరైనా స్నేహితులకు ఫోన్ చేసి, కాసేపు మాట్లాడాలనిపించింది. కాని ఈ సమయం - ఆదమరచి హాయిగా నిద్రపోతున్నవేళ అలా డిస్టర్బ్ చేయటం సంస్కారం కాదనిపించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను.
కొంతసేపు ఆలోచనలు ఈ సమస్యమీదకి మళ్ళాయి.
మనసు ఒకదానివైపు నుంచి ఇంకోదాని మీదకు ఎలా మెలికలు తిరుగుతుందో, మళ్ళుతుందో చూశారా? ఎక్కడో మొదలై మరెక్కడో ఆగిపోతుంది.
ఫోన్ విషయానికొస్తే అది వచ్చే సమయానికి మనం తీరిగ్గా వుండాలని నిబంధన ఏమీలేదు. వుండవలసిన అవసరం లేదు కూడా. మనం ఆఫీసుపనిలో బిజీగా వుంటూనో, ఇంట్లో భోజనం చేస్తూనో, నిద్రపోతూనో, విశ్రాంతి తీసుకుంటూనో వుండి వుండవచ్చు. కాని అది వస్తుంది. ఎందుకంటే ఫోన్ జీవితంలో ఒక భాగమై పోయింది కాబట్టి.
ఆఫీసు వ్యవహారాలకు సంబంధించి మనకు ముఖ్యమైనదో, ఎదురు చూస్తున్నదో అయి వుంటే ఉత్సాహంగా రిసీవ్ చేసుకుంటాం. లేకపోతే క్యాజువల్ గా చేసిందో, కాలక్షేపానికి చేసిందో అయివుంటే ఆంటీ అంటకుండా ముక్తసరిగా ఒక్కొక్కసారి అవతలి వారికి కష్టం కలిగేటట్లు మాట్లాడతాం.
చాలా సందర్భాల్లో ఇలాంటి చేదు అనుభవమే నాకూ ఎదురవుతూ వచ్చింది.
ఒక పత్రికాధిపతినుంచి ఫోన్ వస్తుంది సీరియల్ రాయమని అడుగుతూ.....సరే సీరియల్ రాయటం మొదలుపెడతాం.
మధ్యలో అనేక అవసరాలు వస్తూంటాయి.
ఫోన్ చేస్తాం.
ఫోన్ గొప్పవాళ్ళకు డైరెక్ట్ గా వెళ్ళదు కదా మధ్యలో ఓ టెలిఫోన్ ఆపరేటర్ రిసీవ్ చేసుకుంటుంది.
"ఫలానా వ్యక్తి వున్నారా?" అని అడుగుతాం.
'ఉంటే' విషయం తర్వాత రాస్తాను లేకపోతే.... వున్నారో లేదోనన్న విషయం చెప్పటానికి కూడా కొంత అస్తిమితంగా ఫీలై, తర్వాత "లేదు" అన్న జవాబు.
"ఎప్పుడొస్తారు?"
"తెలీదు."
"పోనీ ఇప్పుడు ఏ నంబరులో వుంటారు?"
"తెలీదు."
మనం ఫలానా అని చెప్పి వచ్చాక ఫోన్ చెయ్యమనండి అనేలోపునే "కాసేపాగి చెయ్యండి" అని ఫోన్ పెట్టేస్తుంది.
ఉంటే...?
"ఉన్నారు. బిజీగా వున్నారు."
"వారితో మాట్లాడాలండి."
"ఏం కావాలి?"
చాలా అవసరమైన ప్రశ్న. ఏం కావాలో, ఏం మాట్లాడాలో వీళ్ళకి చెప్పనవసరం లేదు. ఎన్నో సందర్భాల్లో ఇదే ప్రశ్న ఎదురయింది నాకు. అవసరం వుండి ఫోన్ చేసినంతమాత్రాన మనం వీళ్ళకి సబార్డినేట్స్ కాదు. ఏదో నేరం చేసినట్టు సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరంలేదు.