Previous Page Next Page 
ఆలోచన ఒక యజ్ఞం పేజి 13


    అలాగే... కొంతమంది స్నేహితులుగా చలామణీ అయ్యే వ్యక్తులు తమకి ఖాళీ దొరికినప్పుడో మూడ్ వచ్చినప్పుడో ఫోన్ చేసేసి క్రికెట్ గురించో, రాజకీయాల గురించో, లేక ప్రాపంచిక విషయాలగురించో ఎడాపెడా మాట్లాడేస్తారు. అవతలవారు సంతోషపడిపోయి తనంతట తానే ఫోన్ చేస్తే అమాంతం బిగుసుకుపోయి, "పాయింట్ చెప్పండి" అంటాడు కొంత కఠిన వైఖరితో.
    
    ఫోన్ చేసిన మనిషి బిక్కచచ్చిపోయి "ఊరికినే మాట్లాడుకుందామని..." అంటూ నసుగుతూంటే "బిజీగా వున్నాను. తర్వాత ఫోన్ చేస్తాను" అని పెట్టేస్తాడు.
    
    ఈ వ్యవహారిక ప్రపంచంలో చాలా సున్నితమైనవే కావచ్చు. అనుక్షణం ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవలసి వస్తూ వుంటుంది. మనసెంతో బాధపడుతూ వుంటుంది.
    
    ఇంకొక రకం మనుషులుంటారు. వాళ్ళు మనింటికి వస్తే ఎంతో చనువుగా, ఆప్యాయంగా మనతో కలిసిపోయినట్లు వుంటారు. ఇంటిని సొంత ఇంటిలా వాఉద్కుమ్తో మేనర్స్ లేకుండా బాత్ రూమ్ లు ఖరాబు చేస్తూ ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ సంతోషంగా భరించి స్నేహానికో, చుట్టరికానికో ప్రాధాన్యమిచ్చి మనం వాళ్ళ ఇంటికి వెడితే, వారిలో కొందరు మనసారా పలకరించరు. కొందరు కొత్తవారిని చూసినట్లు మొహాల్లో ఏ భావమూ లేకుండా చూస్తారు. వాళ్ళ ఇంట్లో ఏ వస్తువులూ ముట్టుకోకూడదన్నట్టు, ఏ చనువూ తీసుకోకూడదన్నట్లు, డిసిప్లిన్ అంతా వొలకబోస్తూ ప్రవర్తిస్తారు.
    
    ఎన్నో సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ వుంటాయి.
    
    ఇంకా కొంచెం లోపలకు వెడదాం.
    
    ఇక్కడ 'నేను'ను పాత్రగా నిర్వహించుకుంటూ రాస్తాను. రాయటానికి సులువుగా వుంటుందని.
    
    "మీ 'పెంకుటిల్లు' సీరియల్ గా తియ్యటానికి నిర్ణయించుకున్నానండి. ఎక్కడా కాపీలు దొరకటంలేదు. మా డైరెక్టర్ గారు ఒకసారి చదవాలి. మీ దగ్గర కాపీ వుంటే..."
    
    నా దగ్గర కాపీలు ఎప్పుడూ వుండవు. పబ్లిషర్స్ ప్రింట్ చేసినప్పుడు ఒక్కో నవలకూ పది పదిహేను కాపీలు ఇస్తారు. ఆ కాపీలు బంధువులకూ, స్నేహితులకూ ముఖ్యమైనవారికీ ఇవ్వటం, వాళ్ళు బలవంతంగా తీసుకోవటంతో మొదట్లోనే అయిపోతాయి. ఫైల్ కాపీ అని ఎవరికీ ఇవ్వకుండా ఒక కాపీ జాగ్రత్త చేద్దామని విశ్వప్రయత్నం చేస్తాను. ఎప్పుడూ సాధ్యంకాదు. ఇలాగే ఏ సినిమావాళ్ళో, టీవీవాళ్ళో వచ్చి అర్జెంటు అని చెప్పి ఇరకాటంలో పెట్టి తీసుకెళ్ళిపోతారు. ఇలా కాపీలు అయిపోతాయి. అవీ ఎగరేసుకుపోయారు. అవతలివాళ్ళు చేసిన 'వొత్తిడి'ని బట్టి, మొహమాటానికని లోబడి, ఏ టీవీ సీరియల్ గానో కార్యరూపం దాలుస్తుందన్న ప్రలోభం చేత ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది చాలా చిన్నమొత్తంలో ఎడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ మీద స్మతకం పెట్టించుకోవటంలాంటివి చేస్తారు.
    
    అంతటితో కథ ముగిసిపోతుంది. తర్వాత వాళ్ళ ఆచూకీ తెలియదు. ఏవేవో ఫోన్ నెంబర్లు ఇస్తారు. చాలాకాలం నిరీక్షించి విసిగిపోయి, ఆ నవలకోసం ఇంకొక పార్టీ రావటంచేతా ఫోన్ చేస్తే ఎప్పుడూ దొరకరు. దొరికినా జవాబులు చాలా నిర్లక్ష్యంగా వుంటాయి. చాల సందర్భాల్లో ఆ ఫోన్ నెంబర్లూ, ఎడ్రస్ లూ మారిపోయి వుంటాయి.
    
    అవతలివ్యక్తి ఇంత ఆరాటపడుతున్నాడే, రెస్పాన్స్ ఇద్దాం అన్న కనీసపు బాధ్యత వుండదు.
    
    ఒక ఆశ తళుక్కుమని మెరిసి అంతలోనే నిర్దాక్షిణ్యంగా కరిగిపోతూ వుంటుంది.
    
    వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి వుండవచ్చు. కాని జవాబు చెప్పటానికేమైంది?
    
    అలాంటి సమయాలలో మనసెంత బాధపడుతుందో ఆలోచించండి.
    
    అనేక ప్రశ్నలు ఉదయిస్తాయి. కొంతమందికి ఎందుకు జరుగుతుందో, మనకెందుకు జరగదూ అన్న అశాంతి దారుణంగా నలిపేస్తూ వుంటుంది.
    
    నెగెటివ్ థింకింగ్ కు ఓ ప్రత్యేక కారణమక్కర్లేదు. డబ్బు చాలినంతగా వుండదు. వున్నా ఏదో ముఖావసరానికి దాచుకుని వుంటాం.
    
    అమాంతంగా ఏ చుట్టమో, పరిచితుడో వచ్చి ప్రాణంమీదకు వచ్చిందని చెప్పి, రెండురోజుల్లో పువ్వుల్లో పెట్టి ఇస్తానని చెప్పి గద్దలా తన్నుకుపోతాడు. అంతే సంగతులు!
    
    అంతవరకూ రోజూ కనిపించేవాడు పత్తా వుండడు. కబురు చేస్తే దొరకడు. గట్టిగా ప్రయత్నించి పట్టుకోగలిగినా ఏవో కుంటిసాకులు చెబుతాడు. మరీ గట్టిగా అడిగితే మనమే నేరం చేసినట్లు వాళ్ళకు కోపమొస్తుంది.
    
    ఇలా ఎందుకు జరుగుతుంది? పొరపాటు మనలోనే వుందా?
    
    జాగ్రత్తగా ఆలోచిస్తే.... నిజాయితీగా, తెలివిగా శోధించుకోగలిగితే పొరపాటు మనలోనే వున్నదనిపిస్తుంది.
    
    ఏదైతే సున్నితత్వం అనుకుంటున్నావో... అది నీ బలహీనత.
    
    ఏదైతే జాలి అనుకుంటున్నావో... అది నీ వ్యసనం.
    

    బహుశా ఇలాంటి సంఘటనల్లో నీ పొరపాటు కూడా పూర్తిగా కాకపోయినా కొంతవరకూ వుండివుంటుందన్న యథార్దాన్ని గమనించటానికి ప్రయత్నంచెయ్యి.
    
    ఇతరులు నీకు ఫోన్ చేసినప్పుడు అంత ఉదారంగా నీవు వాళ్ళకు దొరుకుతుండటంలో సంస్కారం వుంటే వుండవచ్చుగానీ, నిన్ను నీవు కొంతవరకూ పోగొట్టు కుంటున్నావేమో నీవు డ్యూటీలో వున్నప్పుడు ఫోన్ లో అవసరానికిమించి మాట్లాడుతూ కూర్చుంటే, బయట నీతో పనివుండి వచ్చి, వేచిచూస్తున్న వారికి అసౌకర్యం కలగజేస్తూ అసహనానికి గురిచేస్తున్నావు. అంటే అవతలివాళ్ళను సంతోషపెట్టటంకోసం నీ విలువైన సమయాన్ని కొంత వృధా చేసుకుంటున్నావు. ఒక్కొక్కసారి మనసులో బాధ పడుతూ కూడా ఆ పని చేస్తున్నావు. నీవు బయటివారిపట్ల నిర్లక్ష్యంగా లేవు. కాని సంస్కారమో, ప్రలోభామో తెలియని ఉచ్చులో నీవు చిక్కుకుపోతున్నావు. క్రమశిక్షణ అనే అంశానికి నీవు ప్రాధాన్యమివ్వగలగటం నేర్చుకుంటే, చాలా తెలివిగా అటు ఫోన్ చేసినవారికీ, ఇటు నీ దైనందిన వ్యవహారాలకూ అవరోధం కలగకుండా చూసుకోగలవు. ఎవర్నీ గాయపరచకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే నేర్పు నీకు కావాలి. నీవు చాలా క్రమశిక్షణను పాటిస్తావన్న అభిప్రాయాన్ని నీవు ఇతరులలో కలిగించగలిగితే నిన్నెవరూ అపార్ధం చేసుకోకపోవటమే కాకుండా నీమీద గౌరవంగాకూడా ఇనుమడించగలదు.
    
    అలాగే.... ఇతఃరులు నీ ఇంటికి వచ్చి అతి చనువుగా ప్రవర్తించి, వాళ్ళ ఇళ్ళకు వెళ్ళినప్పుడు నిక్కచ్చిగా ప్రవర్తించగలిగితే వాళ్ళను పోల్చుకుంటూ వుండు. ఒకటి రెండు అనుభవాల్లో ఎవరెలాంటివాళ్ళో తెలిసివస్తుంది. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళటం మానెయ్యి ప్రపంచం చాలా విశాలమైంది. వెతుకున్నకొద్దీ మనకి కావలసింది దొరుకుతూనే వుంటుంది.
    
    డబ్బు ఇతరులకిచ్చే విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా వుండు. అవసరాలకు ఉపయోగపడవద్దని చెప్పటంలేదు. గత అనుభవాల నుంచి గుణపాఠం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ వుండు.
    
    మొహమాటానికీ, నిర్మొహమాటానికీ మధ్య అందమైన తెర వుంది. గడుసుతనం తనని కాపాడుకునే గడుసుతనం అది అలవరచుకుంటూ వుండు.
    
    ప్రయత్నం చెయ్యి సాధిస్తావు.

    
                                                                                                     - సూక్తి

 Previous Page Next Page