నేనివాళ అవతలివాన్ని మోసం చెయ్యబోతున్నాను. ఇది నాకు కలిసివస్తుంది.
నేనివాళ దొంగతనం చెయ్యబోతున్నాను. ఇది ఫలిస్తుంది.
నేనివాళ లంచం తీసుకోబోతున్నాను. అది ఫలిస్తుంది.
ఇది పాజిటివ్ థింకింగ్ లో చెడుబుద్ది కలిసి వుండటమన్నమాట.
పాజిటివ్ థింకింగ్ ఆశావాదంతో కూడిన మంచి ఆలోచన అయివుండాలి.
అంటే...
ఈవేళ నేను ఇంటర్వ్యూకి హాజరవుతున్నాను. నాకు ఉద్యోగం దొరుకుతుంది.
ఈవేళ మా రిజల్ట్సు వస్తున్నాయి. నేను తప్పకుండా పరీక్ష పాసవుతాను.
నేను ఇల్లు కట్టుకునేందుకు బ్యాంక్ లోన్ కి అప్లై చేశాను. నాకు తప్పకుండా వస్తుంది.
'ఈ పని అవదేమో అవదేమో' అన్న సంశయం వొదిలేసి 'అవుతుంది - అవుతుంది' అన్న పాజిటివ్ దృక్పథం అలవరచుకుంటే చాలామంచిది.
'అవుతుంది-అవుతుంది' అన్న సంకల్పంలోని బలం మీకు ఎన్నో విధాల మేలు చేస్తుంది.
నెగెటివ్ దృక్పథం దేనికి?
నేనీ రచన చేస్తున్నాను అది తప్పకుండా బాగా రూపుదిద్దుకుంటుంది. పాఠకులు బాగా రిసీవ్ చేసుకుంటారు.
నిజం గొంతెత్తి చెబుతున్నాను. ఈ పాజిటివ్ దృక్పథం మీ జీవితాలను ఎంతో ముందుకు తీసుకెడుతుంది.
నెగెటివ్ ఆలోచనలు పోవటమెలా?
నెగెటివ్ థింకింగ్ పోగొట్టుకోవాలని నిర్ణయం తీసుకుంటాం. కాని పోవటమెలా? అది మనచేతుల్లో వుందా?
వుంది.
'ఉందంటే.... ఊరికినే పోవాలి పోవాలి' అని తాపత్రయపడుతుంటే పోతుందా?
ఆ తాపత్రయమంతా బలీయమైన తపన వుంటే తప్పకుండా కొంతవరకూ పనిచేస్తుంది.
'పని చెయ్యదేమో... అవదేమో' అన్న అపనమ్మకం ఎప్పుడైతే తొలగించుకోగలుగుతామో అది శుభపరిణామానికి మొదటిమెట్టు అని గ్రహించు. అంటే అది శుభానికి ఆరంభమన్నమాట.
'నెగెటివ్ నెస్' అన్నది ఒక్కమనసుకే కాదు, శరీరాన్నీ, శరీరావయవాలనూ, శరీరాన్ని అలంకరించి వున్న ఆభరణాలనూ ఆవరించి వుంటుంది.
దీన్నిగురించి ఇంకా లోతుగా పోదాం.
మనం ఇంట్లోని దేవతా విగ్రహాల్ని అవకాశమున్నప్పుడల్లా ఎలా శుభ్రం చేసుకుంటూ వుంటామో, మన వొంటిమీది ఆభరణాలను కూడా స్పిరిట్ తోనో, సెలైన్ తోనో నెలకోసారి శుభ్రం చేసుకుంటూ వుండాలి.
ఇహ మనసు?
జోస్ సిల్వా ఇలా అంటాడు. 'నీకు జీవితంలో ఎందరిమీదో నీ కుటుంబసభ్యులు, స్నేహితులు, దూరపు బంధువులు, పరిచితుల మీదా వ్యతిరేకభావం వుండివుంటుంది. ఉండి వుంటుంది కాదు, వుంది తప్పు వాళ్ళది కావచ్చు, నీది కావచ్చు.
"అసలు ఈ తప్పు అనేది ఎవరిదో ఎవరిలో వుంటుందో సృష్టిలో ఎవరికీ తెలియదు. ఎదుటివారికన్నా మనలోనే ఎక్కువ వుంటుందని అనుకుంటూ వుంటే మంచిది."
సిల్వా అంటాడు. "కనులు మూసుకుని చేతనైతే ధ్యానమో లేకపోతే ధ్యానంలాంటి దశలోనో వున్నప్పుడు నీ అంతరదృష్టిలోనికి మొదట నీ కుటుంబసభ్యులను తెచ్చుకో. వాళ్ళను బాగా వీక్షించు. అలాగే వాళ్ళనుకూడా బాగా నిన్ను వీక్షించనియ్యి మొదట వాళ్ళను క్షమించెయ్యి. నీ తల్లిదండ్రులతో ప్రారంభించు. వారు జీవించివుంటే సరే, విగతజీవులై వుంటే వారి రూపాలనూ, ఆత్మలనూ దర్శించు.... నీవు చేసిన తప్పులకూ చూసిన అవిధేయతకూ క్షమాపణలు అడుగు. అలాగే అనేక సందర్భాల్లో వారివల్ల నీకు కష్టం కలిగివుండవచ్చు. వారు నీకు కష్టం కలిగించి వుంటారన్న భావన నీలో వుండవచ్చు. అందుచేత అవే, ఆ సంఘటనలే తలుచుకుంటూ సందర్భమొచ్చినప్పుడల్లా నీవు వైర్ని గర్హిస్తూ వుండవచ్చు. ఈ అలజడికి ఎక్కడో అక్కడ ముగింపు పలకాలి. నీవు వారిని క్షమించివెయ్యి అలా చేస్తే నీ మనసెంత ప్రశాంతంగా వున్నదో చూసుకో. ఊరికినే జరిగినవి తలుచుకుని అలజడిని పెంచుకుంటూ వుండటంకన్నా, వాళ్ళని మనసులో క్షమాపణ అడిగి, తిరిగివారిని క్షమించివేయటంలో ఎంత ప్రశాంతత వున్నదో అనుభవంమీద నీకే తెలుస్తుంది. జీవితంలో ఇదివరకెన్నడూ రుచిచూడని నిర్మలమైన అనుభవం. అలాగే నీ ఇతర బంధువులనూ, స్నేహితులనూ కూడా క్షమాపణలు కోరి వాళ్ళని క్షమించేస్తూ వుండు.
"నీ శరీరంలోని అవయవాలు వ్యతిరేక భావాలతో నిండిపోయి నీకు అనేక మానసిక శారీరక రోగాలను కలుగజేస్తున్నాయి కనులు మూసుకుని పాదాలదగ్గర్నుంచి ఒక్కొక్క అవయవాన్నీ ఊహించుకుంటూ వాటిలో జీర్ణించిపోయి వున్న వ్యతిరేకభావాలు తొలగిపోవాలని అర్ధించుతూ ప్రార్ధించు శాసించు ఒక్కసారి కాదు, వీలైనన్ని సార్లు అలా చేస్తూ వుండు. క్రమంగా నీ అవయవాలు వాటిలో వ్యతిరేక మలినాన్ని పోగొట్టుకుని రిలాక్స్ అయిపోతాయి. అప్పట్నుంఛీ అవి నీకు మంచి చేయటం మొదలుపెడతాయి.
"ప్రతివారికీ కొత్తజీవితం కావాలి. కాని అదెలా పొందాలో తెలీదు. నీవు కొత్త జీవితం పొందే విధానం నీలో వుంది. అది పొందలేకపోతే ఆ లోపం నీలో వుంది."
కొంతమందిని చూస్తే ఆశ్చర్యంగా వుంటుంది. వాళ్ళ డిప్రెషన్స్ ఇతరులమీద రుద్దడానికి ప్రయత్నిస్తూ వుంటారు.
నాకు తెలిసిన ఒకాయన వున్నారు. ఆయన్ని చూస్తే కావాలని ఎప్పుడూ ఏదో ఒక సమస్యలో తల దూరుస్తున్నట్టనిపిస్తుంది. ఆయన ఒప్పుకోడనుకోండి ఆయన భాషలో సమస్యలు నిర్దాక్షిణ్యంగా ఆయనమీద విరుచుకుపడుతూ వుంటాయి. ఇంకోమాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఆయనొక్కడే కష్టాలు పడుతూవుంటాడు., ఒకసారి ఉద్యోగంలో ఏవో చిక్కులు ఇంకొకసారి ప్రతికూలతతో భయంకర వాతావరణం, మరోసారి ప్రేమించిన ప్రియురాలితో ఘర్షణవల్ల అలజడి, ఇంకా.....ఇంట్లో కూతుళ్ళ సతాయింపు, కొడుకు చెప్పినమాట వినకుండా ఎదురుతిరగటం, ఇల్లు కట్టటం మొదలుపెట్టి అప్పుల పాలైపోతూ వుండడం.
ఫరవాలేదు. ఎవరి బాధలు వారు విపరీతంగా చిత్రించుకునే హక్కు వారికున్నది. కాని వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ఆ డిప్రెషన్ కు పక్కవాడు బెంబేలెత్తి పోయేటట్లు ప్రవర్తించకూడదు.
అయినదానికీ, కానిదానికీ డిప్రెషన్ తో ముడుచుకుపోయే అసహ్యమైన అలవాటు నీకుంటే... దాన్నుంచి ఎలా బయటపడాలో తర్వాత ఆలోచిద్దాం. కాని నీ డిప్రెషన్ తో ఎదుటివారిని హింసించకు. వాళ్ళ విలువైన సమయాన్నీ, మూడ్ నూ హరించెయ్యకు.
నీ బాధల్ని ఆలకించటానికి నీకో శ్రోత కావాలి. వాళ్ళు విని నీమీద సానుభూతి చూపిస్తూ ఉండాలి. మొహమాటపడి, కొంతకాలంపాటు ఆ పని చేస్తారు. ఇలా ఎంతకాలం? తర్వాత తర్వాత నువ్వు వస్తూంటేనే భయపడిపోతూ వుంటారు. నిన్ను తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెడతారు.
అప్పుడేం జరుగుతుంది? ఆ వ్యక్తి నీకేదో అన్యాయం చేస్తున్నట్టూ, నిన్ను అవమానం చేస్తున్నట్టూ... ఇలాటి భావనలు మొదలవుతాయి. క్రమంగా అతనిమీద కోపం, ద్వేషం పెంచుకుంటూ వుంటావు.
అంటే ఓ స్నేహితుడికి దూరమైపోయాయన్నమాట.
ఇలా ఎంతమంది బంధువులకూ, స్నేహితులకూ దూరమైపోతూ, వారిని పోగొట్టుకుంటూ, వారితోపాటు మనశ్శాంతిని కూడా పోగొట్టుకుంటూ వుంటావు?
ఆత్మవిమర్శ అన్న పెద్ద పదం వద్దులే, కంగారుపడి దాని జోలికి వెళ్ళటం మానేస్తావు.