సంఘర్షణతో గూడిన పగళ్ళూ, రాత్రులూ చాలా గడిచిపోయాయి. శుక్ల పక్షం వెళ్ళి కృష్ణ పక్షం, కృష్ణ పక్షం వెళ్ళి శుక్ల పక్షం వస్తున్నాయి. తను స్టేట్సులో యిన్ని సంవత్సరాలు గడిపాడు. యెప్పుడూ యింత ఆవేదనకు గురి కాలేదు. ఎందుకొచ్చిన బెడద! యీ వూరినుంచి త్వరగా వెళ్ళిపోదామా అనుకున్నాడు. ఆర్థిక సమస్యలకు సంబంధించిన అనేక యిబ్బందు లున్నాయి. బొంబాయిలో వ్యాపారం పెట్టటం గురించి అక్కడి స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాడు. ఎందుకూ పనికి రాకుండా, రాబడి లేకుండా పడి ఉన్న పొలాలను అమ్మి డబ్బు చేసుకొనటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను విదేశాల నుంచి టేప్ రికార్డర్ ఒకటి తెచ్చుకున్నాడు. అది బ్యాటరీతో పనిచేస్తుంది. దానికి చిన్న ట్రాన్సిష్టర్ సెట్ కూడా అమర్చి ఉంది. ఏమీ తోచనప్పుడు రేడియో వేసుకుంటూ, లేకపోతే తను అక్కడ రికార్డు చేసి తెచ్చుకున్న పాశ్చాత్య గీతికలు ఆలకిస్తూ, లేకపోతే తుపాకీ పట్టుకుని అడవుల కేసి పోతూ, లేకపోతే కెమేరాతో ప్రకృతి దృశ్యాలను ఫోటోలో తీసుకుంటూ కాలం గడుపుతాడు. వేదితను చూడాలన్న కోరిక అతన్ని నిత్యమూ రెచ్చగొడుతుంది, కాని ఎందుకనో అతనికే స్పష్టంగా తెలియదు. బలవంతంగా ఆ కోరికను అణచివేసుకుంటున్నాడు.
సంక్రాంతి వచ్చింది. ఆనందపురమంతా ఓ కొత్త శోభతో వెలిగిపోతుంది. ఇంటింటా ముగ్గులు, గొబ్బెమ్మలు, చెట్టుకొమ్మల ఉయ్యాలలు, రంగురంగుల బట్టలు ధరించి ఆడపిల్లలు, వయసులోని అందంతో మెరిసే అమ్మాయిలు హరిదాసులు, వేడుకలు, కొత్త పంటలు, గుళ్ళోని ఉత్సవాలు-ఎక్కడ చూసినా ఏదో వెలుగు. శాయికి ఆకస్మికంగా తన పల్లెమీద ప్రేమ పుట్టుకు వచ్చింది. అన్ని పల్లెలూ యింత అందంగా ఉంటాయా? ఉండవు. యిక్కడ-ఏదో ప్రత్యేకత ఉంది. యేదో నిర్మలత్వం వుంది.
కెమేరా భుజాన వేసుకుని వాహ్యాళికి పోతున్న అతడ్ని చూసి ఆడపిల్లలు దూరంగా తొలగిపోయేవారు. "మీరంతా ఎందుకలా కంగారు పడుతారు? నేను మిమ్మల్నేమీ అల్లరి చెయ్యను. మీ వెంట పడను. వైవిధ్యంమీద నాకు మనసుమొత్తింది. మిమ్మల్నిచూస్తుంటే నా కానందంగా ఉంది, అంతకంటే యింకేమీ కాంక్షలేదు. నాలోని దుష్టబుద్ధే ప్రకోపిస్తే...మీలో ఎందరి జీవితాలు నాశనమై ఉండేవో!" అనుకునేవాడు జాలిగా.
అతని తల్లి ఇందుమతమ్మగారికి ఆరోగ్యం అంతకంతకూ కుంటుపడుతోంది. మంచంమీదనుంచి లేవటం కూడా కష్టంగా ఉంది. కొడుకుని గురించీ, కోడలుని గురించీ ఆమె యిప్పుడు సందేహాస్పదురాలై లేదు. సీత నిజపరిస్థితి బయటకు రావటానికి ఏ మాత్రమూ అవకాశం ఇవ్వలేదు. ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు పదిహేను రోజులకోసారి అయినా గుడికి వెళ్లే అలవాటు ఉండేది. ఇప్పుడు మంచం మీదనుంచి కదలలేని స్థితిలో ఉంది. గోవిందాచార్యులుగారు రోజూ తాను వైద్యం చేయటానికి వచ్చినపుడు తీర్థ ప్రసాదాలు తీసుకు వస్తూనే ఉన్నాడు. ఇందుమతమ్మగారికి వేదిత దగ్గర అన్నా చాలా అభిమానం. కోడలుతో కోవెలకు వెళ్ళినప్పుడు వేదితను దగ్గర కూర్చో పెట్టుకుని భజనగీతాలో, పౌరాణికపు పాటలో పాడించుకుంటూ వుండేది. ఆమె యిప్పుడు వేదితని చూసి రెండుమూడు నెలలు దాటిపోయింది. ఓ రోజు ఉదయం గోవిందాచార్యులుగారు తమ యింటికి వచ్చినప్పుడు "వేదితను చూడాలని కోర్కెగా ఉంది ఆచార్యులుగారూ! నేనా కదల్లేని స్థితిలో ఉన్నాను. ఇహ బండి కట్టించుకుని బయల్దేరాలి" అంది.
అయన నొచ్చుకుంటూ "ఈ స్థితిలో మీరు కదలటమా! అమ్మాయిని మీ యింటికి పంపిస్తాను" అని మాట ఇచ్చాడు.
మాంగల్యం పోగొట్టుకుని వేదిత ఇంటికి తిరిగి వచ్చాక వాగువైపే పోవటం తప్ప ఎవరింటికీ పోనిమాట నిజమే. కాని ఇందుమతమ్మగారు కోరిక వెళ్ళబుచ్చిందంటే అది సామాన్యమైన సంగతేంకాదు. ఊరిలోకల్లా సంపన్నమైన కుటుంబం. జమీందారులతో పోల్చతగ్గ ఆస్తిపాస్తులు, యీ దేవాలయానికి అధిపతులు. అదీగాక ఇందుమతమ్మ చేతులెత్తి మొక్కవలసినంతటి సౌజన్య మూర్తి. ఇన్ని కారణాలుగా గోవిందాచార్యులుగారు వేదితను వాళ్ళ యింటికి పంపటానికి సంతోషంగా అంగీకరించాడు.
రెండు రోజులు గడిచాక మధ్యాహ్నం రెండుగంటలవేళ శేషశాయి పైన గదిలో సోఫామీద పడుకుని కునికిపాట్లు పడుతూండగా, క్రింది భాగంనుండి శ్రావ్యమైన గానము వినవచ్చి, ఆ కంఠము అతన్ని వెన్ను మీద చరిచినట్లయి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.
వేదిత పాడుతోంది తన్మయతతో, ఒక గోపికా గీతం.
"... మావి గున్నలారా కోకిల తావి చెన్నులారా
రావులార గనరే చక్కని రావి యాకులారా
మకర కుండలములూ ముఖమున మెరసెటి ముంగురులూ
ముక్కున ముత్యములూ కౌస్తుభ ముత్యపు హారములూ
భుజకీర్తులు తరచూ వింతల భూషణములు మెరయా
త్రిజగన్మోహనుడే వచ్చిన తెలుపవె శ్రీహరికి
మన సారపు తరవా కృష్ణుని కన్నుల గానవుగా
వనరుగ బంధుకమా కృష్ణుని కరముతో చూపరుగా"
.... .... .... ....
ఆటే లాగుతోంది గుండె. ఆ గుండెలో చలివేంద్రం వెలిసినట్లయింది.
"కుందన కానవుటే నాతన కుందన రధనుడ్ని
నల్లని కృష్ణునికి పంకజనయన దయాపరుని
మల్లియ తరులారా మీ పొద మాటున చూడరుగా
అంగజు కంగజుని గరుడ తరంగుని మురహరుని
మంగళ విగ్రహుని వరముని రంగని జూపరుగా
మవుళి మేఖలాది కలితుని, మణిమయ కుండలునీ...."