Previous Page Next Page 
నివేదిత పేజి 11


    "వచ్చి.....?"

 

    "మీ కాళ్ళు పట్టుకుంటాను. కాస్త నా బాధ అర్థం చేసుకోండి. అర్ధాంగిగా దయతలచవద్దు. ఒక స్త్రీ గానైనా దయాభిక్ష వద్దు. తోటి మనిషిగా అర్థం చేసుకోండి.

 

    "ఏం కావాలి నీకు?"

 

    "ఎప్పుడో అప్పుడు, మీకు బుద్ధి పుట్టినప్పుడు వచ్చి ఆ గదిలో పడుకుంటూ వుండండి. మన విషయం ఇంట్లో పనివాళ్ళకి తెలియటం నా కిష్టం లేదు. అదే నేను మిమ్మల్ని కోరేది."

 

    "సరే, అలాగే."

 

    అతను వరం ఇచ్చినట్లు ఇచ్చి ఇంకేమీ మాట్లాడకుండా గ్లాసు నోటిదగ్గర పెట్టుకుని గుటకలు వేస్తున్నాడు.

 

    ఒకటి రెండు నిమిషాలు అతనింకా యేమయినా చెడుతాడని ఎదురుచూసి అతను తన ఉనికిని పట్టించుకోనట్లు త్రాగుతూండటం చూసి "ఇహవెళ్ళనా?" అని అడిగిందామె.

 

    "వెళ్ళు."

 

    ఆమె మెల్లిగా కదిలి, గుమ్మంవరకూ వెళ్లి తలుపు తీయబోతూంది.

 

    "మాట" అని పిలిచాడు.

 

    సీత ఆగింది.

 

    "నీ ముందే నిస్సంకోచంగా యిలా తాగుతున్నాను కదా,నీకు కష్టముగా లేదా? నిజమైన హైందవ స్త్రీ లాగా త్రాగుడు మానమాని బ్రతిమాలవే?"

 

    ఆమె అతనివైపు నిశితంగా ఓ చూపు చూసింది. ఆ నిశితత్వంలో ఏవగింపూ లేదు. క్రోధపూరిత భావమూలేదు.

 

    "ఫారిన్ లో పురుషులు తమ పెళ్ళాలతో కలిసి తాగుతారు. వాళ్లు తాగటానికి భార్యలు అభ్యంతరం చెప్పరు. మనవాళ్ళు అభిప్రాయపడినట్లుగా అది మహాపరాధమని కూడా వాళ్ళు అనుకోరు" అంటున్నాడు శాయి.

 

    మొగవారికి అనేక దుర్వ్యసనా లుంటాయి. వాటన్నిటినీ వాకబు చేయటం, అజమాయిషీ చేయటం ఆడదానికి సాధ్యమూకాదు, అందుబాటులోనూ వుండదు" అని ఆమె యిహ అక్కడ ఆగకుండా ప్రక్కగదిలోకి వెళ్ళిపోయింది.

 

    "మంచిదే. కాని మంచిదైనంత మాత్రాన నాకు ఉపయోగమేమిటి?" అనుకుని అతను మళ్ళీ గ్లాసు నింపుకుని త్రాగసాగాడు. "అసలు అంత ఎక్కువసేపు మాట్లాడకూడదు. మాట్లాడినకొద్దీ చనువు ఎక్కువ అవుతుంది.

 

    "ఈమె ముఖంలో అమాయకత్వం వుంది. ఆ అమాయకత్వాన్ని ఎరగా చూపి నన్ను బంధంలో పడవేద్దామని చూస్తున్నది. నేను ఏ మాత్రమూ లొంగిపోకూడదు. మా యిద్దరికి అసలు పొసగదు."

 

    మరో గంటసేపు అతను ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు. సిగిరెట్టుమీద సిగిరెట్టు కాల్చుకుంటున్నాడు - మధ్య మధ్య తాగుతున్నాడు.

 

    తర్వాత అతనికి నిద్ర వచ్చినట్లయింది. అతను సీత కిచ్చినమాట గుండెలో గంటలా మ్రోగింది. మెల్లిగా తూలుతూ లేచి, తడుముకుంటూ సీసా, గ్లాసు బీరువాలో పెట్టి తలుపు వేసేశాడు. తర్వాత తూలుతూ తూలుతూ గుమ్మందాటి ప్రక్కగదిలోకి వెళ్ళాడు. హరికేన్ లాంతరు మందమైన కాంతితో వెలుగుతూ పలుచని వెలుతురు గదంతా వ్యాపింపజేస్తున్నది. గదంతా శుభ్రంగా అలంకరించిబడి, చూడగానే హాయి అని పిస్తోంది. తెరచివున్న కిటికీలగుండా తెరలను తొలగించుకొని చల్లని గాలి వీస్తోంది. గోడదగ్గర రెండు పట్టెమంచాలు ఒకదాని ప్రక్కన ఒకటి వేయబడి, తెల్లని పరుపులు, తెల్లని దుప్పట్లు పరచి వెన్నెల పరిచినట్టుగా, పాలనురగల్లా వున్నాయి. కానీ సీత వాటి మీద పడుకుని లేదు. అతను విస్మితుడై ప్రక్కకి చూశాడు. ఆమె నేలమీద చాప పరుచుకుని, తలక్రింద దిండు కూడా లేకుండా ఆదమరచి నిద్రపోతున్నది. ఆ దృశ్యం చూసి అతని హృదయమంతా కలచివేసినట్లయి, ఎనలేని సానుభూతితో నిండిపోయింది. ఆమె ఓ లక్షాధికారియైన యింజనీరు భార్య. క్రింద పడుకోవలసిన ఖర్మ ఏమొచ్చిందని అతను నొచ్చుకున్నాడు. "సీత!" అని పిలిచి ఆమెను లేపుదామనుకున్నాడు. భుజంమీద తట్టి మేల్కొలుపుదా మనుకున్నాడు.కాని ఆమె గాఢ నిద్రాపరవశమై ఉంది. కన్నులు గట్టిగా మూతలుపడి, ఆమె నిద్రలోని పరవశతను సూచిస్తున్నాయి. అంతటి మధుర నిద్రలో ఉన్న ఆమెను నిద్రాభంగం కలుగజేయట మతనికి ఇష్టంలేక, యేమీ చేయటానికి తోచక వొంగి ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నాడు.

 

    స్నిగ్థ మందహాసం వొకటి నిష్కల్మషంగా వెలుగుతూ, ఆమె ముఖానికి లేని అందాన్ని తెచ్చి పెట్టింది. అందానికి రూపంకన్నా వయసు ప్రధానమన్న సూత్రం గుర్తు వచ్చి, అతని పెదవులపై చిరునగవు ఉదయించింది. నిషా కొంచం దిగినట్లయింది. చలికి దుప్పటి యేమీ కప్పుకోకుండా పడుకున్న ఆమె శరీరం, ముడుచుకుని, వెచ్చదనాన్ని సృష్టించుకున్నట్లు కనిపించింది. ఆ స్థితిలో ఆమెను చూసి అతని హృదయం జాలితో నిండిపోయింది. వెళ్ళి కిటికీ తలుపులు మూసేసి వచ్చాడు. ఆమె అలా నేలమీద పడుకుంటే మంచంమీద పడుకోవట మతనికి కష్టమని పించింది. ఓ విచిత్రమైన ఊహ అతని మనసులో ఉత్పన్నమై, అందమైన కోర్కెను రగిలించింది. తానామెను ఎత్తుకుని మంచంమీదకు తీసుకుపోగలడా? తన చేతులు బలిష్టమైనవి. యింత మత్తులోనూ అవి పటుత్వాన్ని సడలించవు. వొంగి తన రెండుచేతులూ ఆమె వీపుకూ, కాళ్ళకూ క్రిందుగా పోనిచ్చి అవలీలగా ఆమెను గాలిలోకి లేపేశాడు. నిద్దట్లో ఆమె కాస్త కదిలి తన చేతులు అతని మెడ చుట్టూ వేసింది. "నల్లని పువ్వు" అనుకున్నాడతను. నవ్వుకుంటూ తడబడుతూ, తూలుకుంటూ నడిచి వెళ్ళి ఆమెను ఒక మంచం మీద మృదువుగా పడుకోబెట్టాడు. మెడమీద నుంచి చేతులు మెల్లిగా వదుల్చుకున్నాడు. ఆమెకు మెలకువ రానందుకు తనకు తను ధన్యవాదా లర్పించుకుంటూ చుట్టూ తిరిగి వచ్చి రెండో మంచంమీద ఆమెకు దూరంగా జరిగి పడుకున్నాడు. "నా కీమె అంటే ద్వేషం ఎందుకు? అయిష్టత మాత్రమే" అనుకున్నాడు. చప్పున వేదిత రూపం మనసులో మెదిలింది తృటిలో మనసు నుండి సీత కరిగి, అంతర్థానమై పోయింది. ఈ అంతర్థానానికి అతను అవధులు నిర్మించలేకపోయాడు. తంబూరా మీటుతూ, మృదు అధరాలు కదిలిస్తూ, భజన గీతాలు పాడుతూంటే వేదితే అతని ఎట్టెదుట కన్పించసాగింది. నిద్ర ముంచుకువస్తోంది. మూత పడిన కళ్ళలో కూడా వేదిత రూపమే నడయాడుతోంది.

 

                                         * * *

 Previous Page Next Page