Previous Page Next Page 
నివేదిత పేజి 13


    "ఆహా! ఎంత బాగా రాశారమ్మా! ఎంత బాగా పాడావమ్మా! నీ కంటే ఆ గోపికా హృదయాన్ని వ్యక్త పరుచగల అదృష్టవంతులెవరమ్మా? ఏదమ్మా, ముద్దు కృష్ణుని జలక్రీడల్ని వర్ణిస్తూ ఓ పాట పాడేదానివి. ఓ సారి వినిపించవూ?

 

    వేదిత "అలాగేనండి" అని మరో పాట ఎత్తుకుంది.

 

    "చెన్న రంగవాసా పన్నగ శయనరంగధామా

 

    కన్యలు జలక్రీడా కృష్ణుడు చెన్నెలు గావించి

 

    ......................

 

    ......................

 

    వేదిత. "కృష్ణా! కృష్ణా!" అనుకుంటోంది.

 

    శాయి "వేదితా! వేదితా!" అనుకుంటున్నాడు.

 

    "... ఆ అల్లరివాడు గోపిక స్త్రీల వలువల నెత్తుకుపోయి దాగున్నాడు. ఆ వనితలు వారిలో వారు కళవళపడిపోతున్నారు.

    "ఇది యేమే ఓ అక్క, యిది విష్ణుమాయ గదరే

    వెదకిన లే విచట చీరలు ఏమైపోయినవో"

 

    "అదృష్టవంతురాలివమ్మా! అదృష్టవంతురాలివి. ఇంత తాదాత్మ్యత నొందగలుగుతూన్న నీవు మానవమాత్రురాలవు కాదు. యే కళంకమూ నిన్నంటదు.

 

    "ఇహ వస్తానండీ" వేదిత కంఠం వినిపించింది,

 

    "మంచిది తల్లీ! సీతా? లోపలనుండి నాలుగు కమలా ఫలాలు తెచ్చియియ్యవమ్మా....! అప్పుడప్పుడూ వస్తుంటావు కదూ?"

 

    "అలాగేనండి."

 

    వేదిత కదిలి వెళ్ళి పోయినట్లయింది. ఏదో అజ్ఞాతమైన మువ్వల చప్పుడు ఆమె నిష్క్రమణాన్ని అతని శ్రావణకుహరానికి తెలియచేసినట్లయింది.

 

    రెండు నిమిషాలు గడిచాక తలుపులు గడియవేసి అతను టేప్ రికార్డర్ టేబుల్ మీద పెట్టి ఆన్ చేశాడు.

 

    దూరంగా, అతి చిన్నగా, ఏదో లోకం నుండి వస్తున్నట్లు వినిపిస్తోంది వేదిత కంఠం.

 

    "కుందన కానవుటే, నూతన కుందన రదనుడ్ని
    నల్లని కృష్ణునీ, పంకజనయన దయాపరునీ."

 

                                             * * *  

 

    మరునాటి ఉదయం వేదిత దేవుడికి అర్చన ముగించి నైవేద్యం మంగళ హారతులిచ్చి, గుడిగంటలు ఖంగ్ మని మ్రోగించి, చేతులుజోడించి కనులు మూసుకుని మరోసారి నమస్కరిస్తోంది.

 

    "వేదితా!"

 

    ఈ పిలుపు విని ధ్యానంలోంచి ఉలికిపడి, వెనుదిరిగి చూసి "మీరా శేషుబాబూ!" అంది కొంచెం గగుర్పాటు చెంది.

 

    అతను ఒక అడుగు ముందుకువేసి నవ్వుతూ "చాలా రోజులకు మళ్ళీ వచ్చాను చూశావా?" అన్నాడు.

 

 

    "ఈ దేవాలయం మీది. మీ యింటికి మీరు వచ్చారు."

 

 

    "దేవాలయం మాది కావచ్చు. కాని దేవుడు అందరి వాడుగా. ఆయనపై ఎవరికి అధికార ముంటుంది?"

 

    ఈ మాటలు విని ముగ్దురాలైనట్లు కనబడింది. కృష్ణ భగవానుడి విగ్రహం ముందు హారతిపళ్ళెంలో హారతి యింకా వెలుగుతోంది. ఆమె వెనక్కి వెళ్ళి ఒంగి పళ్ళెం అందుకుని అతని దగ్గరకు తీసుకువస్తూ "హారతి అద్దుకుంటారాబాబు?" అంది ఆర్థ్రస్వరంతో.

 

    "అంతకంటేనా!" అంటూ అతను శ్రద్ధగా చేతులు చాచి కళ్ళకద్దుకుని బుద్ధిమంతుడిలా నిల్చున్నాడు.

 

    "దేవుడి కుంకుమ పెట్టుకోండి."

 

    అతను ఆమె ఆజ్ఞ పాటిస్తున్నట్టుగా పళ్ళెంలోంచి కుంకుమ తీసుకుని నుదుటన అంటించుకున్నాడు.

 

    "ప్రసాదం తీసుకొస్తానుండండీ" అంటూ ఆమె మళ్ళీ వెనక్కి వెళ్ళి హారతి పళ్ళెం క్రిందపెట్టివేసి మరో వెండి పళ్ళెంలోని ప్రసాదం తీసుకువచ్చి అతనికి అందించింది.

 

    అతను కాస్త ప్రసాదం తీసుకుని నోటిలో వేసుకుని "ఇంతేనా! ఇంకేమైనా చెయ్యాలా?" అని అడిగాడు.

 

    "ఏం ? చాలా కష్టపడిపోయారా?" అని ఆమె నవ్వి పళ్ళెం యధాస్థానంలో పెట్టివచ్చి 'రండి' అంది బయటకు నడుస్తూ.

 

    ఆమె తన ప్రక్కనుంచి నడుస్తూ ముందుకు కదిలినప్పుడు మృదు సుగంధంలాంటి ఆనందమేదో అతన్నావహించింది. మంత్రముగ్ధుడైనట్లు వెంట నడిచాడు.

 

    ఇద్దరూ బయటకు వచ్చాక అక్కడున్న అరుగువైపు చూపిస్తూ వేదిత "కూర్చోండి శేషుబాబూ! నిజంగా చాలారోజులకి కనిపించారు" అంది ఆదరణ ఉట్టిపడుతూన్న కంఠంతో.

 

    ఆమె చెప్పినట్లే అతను అరుగుమీద అసీనుడయి "మరి నీవు చుట్టూ గీత గీసుకుని కూర్చున్నావాయె. నిన్ను అమ్మవారిగానో, ఆదిశక్తిగానో తల పోస్తున్నారు ప్రజలు. నేనా మొరటువాణ్ని, నా రాకవల్ల నీ కేదయినా కష్టం కలిగి కోపంవచ్చి శపిస్తే?" అన్నాడు.

 

    ఆమె ఫక్కుమని నవ్వి, తను నిల్చున్నవైపు అరుగుమీదకు ఒంగిన పూల మొక్కను ప్రేమగా నిమురుతూ "ప్రజలు అమాయకులు బాబూ! వాళ్ళెప్పుడూ ఇవ్వవలసిన విలువకన్నా ఎక్కువయినా ఇస్తారు. తక్కువయినా ఇస్తారు. ఉన్నది ఉన్నట్లు చూడటం వారికి చేతకాదు. నేను మాత్రం చిన్నతనాన మీతో ఎడతెరిపి లేకుండా దెబ్బలు తిన్న యెప్పటి వేదితనే" అంది.

 

    "కాదు" అన్నాడతను చిలిపిగా చూస్తూ.

 

    "ఏం?"

 

    "చిన్నప్పుడు నీ చెవులు పట్టుకుని ఊయించేవాణ్ని. నీ ఎర్రని శరీరం మరింత ఎర్రగా కందిపోయేటట్లు గిచ్చేవాడ్ని. నిన్ను గభాలున తోసి క్రింద పడవేసి నువ్వేడుస్తుంటే నేనానందించే వాడ్ని. అవన్నీ చేయగలమా ఇప్పుడు వేదితా."                                         

 Previous Page Next Page