మాలతి బొమ్మలా కూర్చుని ఏమి చెయ్యాలో తెలీక చేతిలోని పుస్తకంమీద వ్రేళ్ళు అటూఇటూ కదిలిస్తోంది.
"నిన్న జరిగిందానికి క్షమించండి."
ఆమె పెదాలమీదకు చిన్న నవ్వు వచ్చింది. "అది నిన్ననే చెప్పేశారుగా!"
"నిన్నటి సంఘటన గురించి మీరేమనుకున్నారు?"
ఇంతవరకూ ఏమీ అనుకోలేదు."
ఒక్కనిముషం పాటు ఎవరూ మాట్లాడుకోలేదు.
తర్వాత చంద్రశేఖరం చెప్పసాగాడు. "మా అమ్మది అసలు అత్యంత సున్నితమైన మనస్తత్వం. నాన్నని ఎంత భక్తితో, ప్రేమతో ఆరాధించేదో నాకు తెలుసు. అలాంటి అమ్మని క్రమంగా దుర్వ్యసనాల నాన్న మానసికం గానూ, శారీరకంగాను చాలా హింసించాడు. ఆ దారుణ హింసాకాండను చూడలేక చిన్నప్పుడు నాన్నను చంపేద్దామన్నంత కోపం వస్తూండేది.లేకపోతే అమ్మని తీసుకుని ఎటయినా వెళ్ళిపోదామా అన్నంత ఆవేశం వస్తూండేది. రానురాను నాన్నకి త్రాగుడు విపరీతమైపోయింది. దాంతోనే ఆయన ఆరోగ్యం శిధిలమైపోయి, క్షీణించి క్షీణించి చనిపోయారు. ఆ వంటరితనంలో అమ్మకి నేను మరీ చేరువైపోయాను. కానీ ఆమె మతి చలించింది. చివరిరోజుల్లో నాన్న ఆమెకు దూరమైపోయినట్లుగానే నన్నెవరైనా తనకి దూరం చేస్తారేమోనని భయం.ఎప్పుడూ అదే ఆలోచన, ఆవేదన. ఈ స్ధితిలో ఆమెకు టి. బి. వచ్చేసింది. మందులు తినదుగా, జబ్బుకూడా బాగా ముదిరిపోయింది. ఆమె ఎక్కువరోజులు బ్రతకదని నాకు తెలుసు. బ్రతికినన్ని రోజులూ చేతనైనంత మనశ్శాంతి ఇవ్వాలని నా ప్రయత్నం."
మాలతి తలవంచుకుని నోట్సు తీసుకున్నంత శ్రద్ధగా వింది. చెప్పటం అయిపోయాక ఎక్కువసేపు మౌనాన్ని భరించలేక తల ఎత్తి చూసేసరికి ఆమె ముఖంలోకే చూస్తోన్న అతను చప్పున తల ప్రక్కకి త్రిప్పుకున్నాడు.
"ఇహ వేడతానండీ" అన్నది.
తల ఊపాడు.
ఆమె లేచి మెల్లగా బయటపడి సీట్లో కూర్చోబోతుంటే "ఎన్ని ఉత్తరాలు డిక్టేట్ చేశారు?" అనడిగింది భానుమతి.
మాలతి నవ్వింది. "సగం ఆత్మకథా, సగం మౌనం."
తర్వాత రెండుమూడు రోజులు గడిచి, దినచర్యలు యధావిధిగా సాగుతున్నా మాలతిలో మాత్రం కలవరపాటు తగ్గలేదు. ఆ రాత్రి భానుమతి చెప్పిన మాటలే చెవుల్లో మార్మోగుతున్నాయి.
ఒకరోజు ప్రొద్దుట స్నానంచేసి, కొత్త జాకెట్ తీసుకుందామని అల్మైరాలోని బట్టలు కదిలిస్తూంటే వాటి అడుగున ఏదో కనిపించినట్లయి ఉలిక్కిపడింది. ఆ వస్తువును చేతిలోకి తీసుకునేసరికి శరీరమూ వణికింది.
"ఏమిటలా తాకరాని వస్తువు తాకినట్లు మ్రాన్పడిపోయావు మాలతీ?" వెనుక నుండి భానుమతి గొంతు వినిపించింది.
మాలతి తల త్రిప్పి చూసేసరికి, తలంటు పోసుకోవడానికి కాబోలు జుట్టుకు బాగా నూనె పట్టించి, చేతిలో కుంకుడుకాయ రసం వున్న గిన్నెతో భానుమతి.
"దీన్నెందుకు తీసేశావు?"
భానుమతి తేలిగ్గా నవ్వింది "దాని అవసరం తీరిపోయింది గనుక."
"అంటే మంగళసూత్రాలకు కూడా అవసర అనవసరాలు వుంటాయా?"
"తప్పకుండా. ఈ సత్యం గుర్తించకపోతే ఈ దేశంలో సగంమంది మెళ్ళలోంచి ఇవి నిత్యం జారిపోతూ వుండేవి."
మాలతి రెండుచేతుల్తో చెవులు మూసుకుంది.
"శివ శివా అనలేదేం?"
"మనసులో అనుకున్నాలే!"
"చూడూ! కొన్ని వస్తువులకు మనుషుల అవసరాల్ని బట్టి విలువ ఇవ్వబడుతుంది. కొన్నిటికి వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి ఇవ్వబడుతుంది. ఈ రెండూ దీనికి వర్తిస్తాయి."
"భానూ! అలా పిశాచిలా మాట్లాడకే!"
"అవును. ఒకళ్ళ నొకళ్ళు అనుమానించుకుంటూ, తిట్టుకుంటూ, ద్వేషించుకుంటూ, విడిపోతే బాగుండునని ఎన్నో సార్లు అనుకుంటూ, రహస్యాలు దాచుకుంటూ, దారుణంగా మోసం చేసుకుంటూ, ఆత్మవంచన చేసుకుంటూ, సంవత్సరాల తరబడి పిశాచి ప్రవృత్తులతో బ్రతికితే ఫర్వాలేదు గానీ, ఆ నిజాన్ని బయటకు చాటితే పిశాచత్వం."
"అలా అనుకోవటం నీ భ్రమ. ఒక వ్యక్తికి మనసిచ్చి ఆరాధిస్తూ, జీవితమంతా అతనికి అర్పణచేసి, అణువణువునా ప్రేమ నింపుకుని గడిపేదే బ్రతుకు. అట్లా వుండేవాళ్ళు ఇంకా ఎంతోమంది వున్నారు. ఎప్పటికీ వుంటారు కూడా."
"అవునవును. నటన అనేది మన పురాణాలకాలం నుండి, నేటివరకూ విశృంఖలంగా విజయతాండవం చేస్తూనే వుంది."
"ఛీ ఛీ, అలా మాట్లాడకు, నిజమైన అనురాగం నటనా? ప్రపంచంలోని ప్రతిజీవి ప్రవర్తనా అంతేనా?"
"జీవితం పొడవునా తీసుకుంటే...." అంది భానుమతి దీర్ఘం తీస్తున్నట్లుగా. "సహజంగా గడిపే క్షణాలు - అక్కడక్కడా కొన్ని. మనకి మనం అర్ధంకాకుండా తప్పటడుగులు వేస్తూ గడిపేసి ఏవో కొన్నివారాలు, నెలలు, నటిస్తూ గడిపినవి సంవత్సరాలు."
"అబద్దం" మాలతి ఆవేశంగా అరిచింది.
భానుమతి నవ్వింది. "ఎందుకే మాలీ అంత ఆవేశం? నీలాంటి సున్నితమైన దానితో ఇలాంటి విషయాలు చర్చించటం నాదే తప్పు......"
మాలతికి ఆ సన్నివేశంనుంచి తప్పుకోవాలని వుందిగానీ ఏదో ప్రలోభం వెంటబడుతోంది.
"అయితే ఇప్పుడేం చేస్తావు?" అంది అసహనాన్ని కనబడనియ్యకుండా.
"జీవితాన్ని ఎటువైపు మలచుకునేందుకైనా ఇప్పుడు నాకు హక్కుంది. ఇప్పుడు నేను అవివాహిత క్రిందే లెక్క."
"అంటే ?.....గతానికి ఉద్వాసన చెప్పినట్టేనా?"
"నే చెప్పేదేముంది? అదే కాలగర్భంలో కలిసిపోయింది."
"మరి ..... కొత్త జీవితాన్ని వెదుక్కుంటావా?"
"నే వేదుక్కోను. వెదుక్కుని బ్రతికే జీవితాలకన్నా వాటంతట అవి నడిచే వాటిలో న్యాయం ఒక పిసరు ఎక్కువ."
మాలతి వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది. చేతిలో మంగళసూత్రాలు ఇంకా ఊగిసలాడ్తూనే వున్నాయి. హఠాత్తుగా వెగటనిపించి అల్మైరాలో వాటిని యధాస్థానంలో వుంచేసింది.