Previous Page Next Page 
రక్త సింధూరం పేజి 11


    దామోదరం ఊరు!!
    నాకెందుకో ఆ వార్తని అంత ఈజీగా తీసుకోవాలనిపించలేదు. మూసి వున్న కళ్ళముందు కొన్ని పదాలు వచ్చి నాట్యం చేయసాగాయి.
    'ఆపరేషన్ నెంబర్ టూ- స్టార్టెడ్'.
    అని.
    కానీ ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యగలను? నా వూహ తప్పేకావొచ్చు. కానీ ఈయన దేవపట్నం వెళ్ళడం మాత్రం కాకతాళీయం కాదు అనిపిస్తూంది ఎందుకో....
    "అక్కడ నేను పదిహేను రోజులదాకా ఉండవలసి రావొచ్చు. ఈ లోపులో మీ నాన్నగారొస్తే?"
    "జరిగిందంతా చెప్తాను."
    "తన కూతురిమీద ఇంత ప్రాక్టికల్ జోక్ వేసినందుకు ఆయన నా మీద మండిపడవచ్చు."
    "కళ్ళు పోయిన స్థితిలో మీరుంటే మీ మీద మండిపడటం ఏమిటి? నన్నే చివాట్లు పెడతారు. అదీగాక ఇందులో నా స్వార్ధం కూడా వుంది. నలుగురికీ తెలియకముందే మీ కళ్ళు తిరిగివస్తే చాలు..."
    ఏది ఏమైతేనేం- జగన్నాధం ఇంటిలో ప్రవేశించానన్న నా కోర్కె అలా నెరవేరింది.
    ఆ సాయంత్రమే వాళ్ళింటికి వెళ్ళిపోయాము.
    .....
    మొదటి రోజు భారంగా గడిచింది. ఎంతసేపని కన్నార్పకుండా అలా శూన్యంలోకి చూస్తూ కూర్చోవటం?
    ఆమె పత్రికల్లోంచి కథలు చదివి వినిపిస్తూ ఉండేది. ఆమె కదిలే పెదాలకేసి చూస్తూ కూర్చునేవాణ్ణి! ఇదో అడ్వాంటేజి. గుడ్డివాణ్ణి కాబట్టి చూపు మరల్చకపోయినా ఫర్వాలేదు.
    ఆ ఇంటికి వెళ్ళిన ముప్పై ఆరుగంటల తరువాత దొరికింది నాకు ఆ అవకాశం! ఆ ఇంటిని శోధించే ఛాన్సు...
    రేఖ ఏదో పని వుందని కాలేజీకి వెళ్ళింది. ముందు గది తలుపు వేసేసి జగన్నాధం గది వెతకటం మొదలు పెట్టాను.
    పోలీసు డిపార్టుమెంటుతో సంబంధం వున్న మనిషిని కాబట్టి సిస్టమాటిక్ గా వెతకసాగాను.
    దాదాపు అరగంట అయింది.
    మొత్తం గదంతా శోధించాను. ఏమీ దొరకలేదు.
    తరువాత డ్రాయింగ్ రూమ్ వెతకటం మొదలుపెట్టాను.
    మరో గంట గడిచింది.
    నా ఆశ ఫలించేటట్టు కనబడలేదు. బహుశా నా ఊహ తప్పయి ఉండవచ్చు. తన ఇంటిలోనే ఋజువులు పెట్టుకోవటానికి జగన్నాధం ఏమీ తెలివితక్కువవాడు కాదు. ఆలోచిస్తూనే వెతుకుతున్నాను. రేఖ తిరిగివచ్చే టైమయింది.
    రెండున్నర గంటల తరువాత, అప్పుడు దొరికింది- అది. డ్రాయింగ్ రూమ్ లో నటరాజ విగ్రహం లోపల.
    మడతపెట్టి ఉన్న కాగితం!
    ఆ కాగితం అక్కడ ఉండవలసిన అవసరం ఏమిటా అని ఆశ్చర్యపోతూ విప్పి చూశాను. నేను వూహించినదే అయినా, విస్మయంతో కళ్ళు పెద్దవయ్యాయి.
    అది జైలు మ్యాపు - బ్లూ ప్రింటు.
    గోడలు ఎంత ఎత్తున్నదీ- జైలుకి ఎటువైపు ఏమి ఉన్నదీ- లోపల సెల్స్ ఉన్న విధానం-అంతా క్లియర్ గా వుంది. కొన్ని చోట్ల ఎర్ర ఇంకుతో మార్కులు వున్నాయి. ఒకచోట బాటం గుర్తు ఉంది.
    నా గొంతు తడారిపోయింది.
    భీమరాజుని విడిపించటానికి ఏదో పెద్ద ఏర్పాటు జరుగుతూంది. ఇన్ని సంవత్సరాల జైలు ప్రతిష్ట మంటగలవబోతూంది. దీనికి కారకుడు జగన్నాధం! నా అనుమానం కరక్టే. ఆపరేషన్ నెంబర్ వన్ కంప్లీటెడ్ అన్న వార్త పంపింది అతడే!
    రక్తం సలసలా మరుగుతూ ఉండగా, వెళ్ళి ఈ విషయం- పై అధికారులకి రిపోర్టు చేద్దామనుకున్నాను. కానీ అంతలోనే వివేకం నన్ను హెచ్చరించింది.
    ఏమని రిపోర్టు చేయగలను?
    ఈ జైలు ప్రింటు నటరాజ విగ్రహంలో దొరికిందని చెప్పటానికి నా దగ్గిర ఋజువులు లేవు. జగన్నాధానికీ దామోదరానికీ మధ్య సంబంధం గురించి రుజువు చేయటానికి దాఖలాలు లేవు.
    మళ్ళీ ఇంకొకసారి ఆలోచించాను.
    జగన్నాధాన్ని రెడ్ హాండెడ్ గా పట్టుకోవాలి! అప్పుడు కానీ లాభం లేదు. అతడు దేవపట్నంనుంచి రావటానికి ఇంకా ఒకటి రెండు రోజులు పట్టవచ్చు. వీలైతే ఈ లోపులో ఇక్కడ పని పూర్తి చేసుకుని వెళ్ళి డ్యూటీలో జాయినయిపోవాలి. భీమరాజు మీద ఇరవై నాలుగు గమటలూ ఒక కన్ను వేసి ఉంచటం ద్వారా పని సానుకూల పడవచ్చు. అవును, అదే మంచి ఆలోచన- అనుకున్నాను.
    జగన్నాధం బహుశా, మొదటి ఆపరేషన్ ఫెయిల్ అయింది కాబట్టి, ఇంకొకటి ఆలోచించి, దాన్ని చర్చించటానికి వెళ్ళి ఉంటాడు. అతడు వచ్చే లోపులో అనవసరమైన హడావుడి చేసి, పై అధికారులకి ఈ విహాయం తెలియబర్చటం వేస్టు. జైలులో మరింత సెక్యూరిటీ ఎక్కువచేస్తే జగన్నాధానికి అనుమానం రావొచ్చు. తాను లేనప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే ఆ అనుమానం మరింత బలపడవచ్చు. అదీగాక, ఇంకా పదిహేను రోజులు శలవున్న నేను, దాన్ని కౌన్సిల్ చేసుకుని పనిలో చేరితే నా మీద అనుమానం రావొచ్చు. అది రాకుండా చూసుకోవడం ముఖ్యం. చాపక్రింద నీరులా చెయ్యాలీ పని. పై అధికారులకి తెలియపర్చటం గానీ, అదనపు బలగాలని డ్యూటీలో పెట్టటం కానీ ఈ పరిస్థితుల్లో అనవసరం.
    - ఇలా ఆలోచించి, నేను ఏమీ తెలియనట్టు ఇలాగే కొనసాగదల్చాను- సమయం వచ్చినప్పుడు బయటపడదామని.
    అదే నేను చేసిన తప్పు.
                                                6
    సాయంత్రం ఆరవుతుండగా షాపింగ్ నుంచి వచ్చింది రేఖ. చాలా వస్తువులు కొన్నది.
    "ఈ పది రోజులూ నన్నిలా ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు... ప్లీజ్" అన్నాను.
    ఆమె నవ్వి- "ఏం, ఒంటరితనం బోరు కొట్టిందా" అని అడిగింది.
    "కాదు. నాకు ఫైర్ - ఫోబియా వుంది" అన్నాను.
    ఆశ్చర్యంగా "ఫైర్- ఫోబియా?" అంది.
    "అవును. నిప్పు చూసినా, మంటని చూసినా చాలా భయం నాకు. చిన్నతనంలో ఎవరో అలా కాలి చచ్చిపోవటం చూశాను. అప్పటినుంచీ ఆ భయం పెరిగిపోయింది. ఇప్పుడు ఇంటిలో ఎవరూ లేరు. నేనొక్కణ్ణే వుంటున్నానన్న భావం క్రమక్రమంగా భయాన్ని పెంచింది. ఎక్కడో వంటింటిలోంచి ఒక చిన్న మంట, మనిషి ఆకారంలో పాక్కుంటూ వచ్చి నన్ను చుట్టు ముట్టినట్టు అనిపించింది. ఏం చెయ్యను? అందులో కళ్ళముందు ఈ చీకటి ఒకటి...బయటకు వెళ్ళలేను. గట్టిగా అరవలేను. చాలా చిత్రమైన స్థితి. కానీ భయంకరమైనది-"
    "ఐయామ్ సారీ" అందామె. "....ఇంత జరిగిందని నాకు తెలీదు"
    "ఇట్సాల్ రైట్"
    "కాస్త టీ పెడతాను.
    "ఉహూ! ఇప్పుడేగా బజారునుంచి వచ్చారు. స్నానం చేసి రండి. ఇద్దరం కూర్చొనే తాగొచ్చు."
    "థాంక్స్. అలాగే."
    ఆమె లోపలికి వెళ్ళింది.
    నేను సోఫాలో కూర్చొని ఉన్నాను. బజారుకి కట్టుకెళ్ళిన నైలెక్స్ చీర విప్పి గౌను వేసుకుంటూంది. గుడ్డివాణ్ణి కాబట్టి ఇంట్లో మరెవ్వరూ లేనట్టే ప్రవర్తిస్తూంది.
    ఆమె బెడ్ రూమ్ తలుపులు వేసుకోలేదు. కుచ్చిళ్ళు తీసి చీరె స్టాండ్ మీద వేసి గౌను వేసుకుంది. రెండు నిముషాలు ఆగి, బాత్ రూమ్ దగ్గిరికి వెళ్ళి మృదువుగా "రేఖగారూ" అన్నాను.
    లోపల్నుంచి "ఓయ్" అని వినిపించింది.
    "మనిద్దరికీ టీ పెడుతున్నాను"
    "వద్దు - వద్దు" లోపల్నుంచి కంగారుగా వినిపించింది. "రెండు నిముషాల్లో నేను వచ్చేస్తున్నాను."
    ఆమె మాటలు వినిపించుకోకుండా వంటింటిలోకి వెళ్ళాను. స్టోర్ రూమ్ లో దొరికింది కిర్సనాయిలు డబ్బా! కొద్దిగా నేలమీద పోసి దాంట్లో మసిగుడ్డ తడిపి, పెద్ద శబ్దం అయ్యేటట్టు డబ్బాని కాలితో కొట్టాను.
    "ఏమైంది?" దూరం నుంచి అరుపు వినిపించింది.
    "ఏదో డబ్బా క్రింద పడినట్టుంది."
    "మిమ్మల్ని వంటింటిలోకి వెళ్ళొద్దన్లే-"
    "సారీ రేఖా"
    క్షణం ఆగి, అగ్గిపుల్ల వెలిగించి గుడ్డమీద పడేశాను. మంట కొంచెం పెద్దయ్యాక వరుసగా రెండుసార్లు కెవ్వున అరిచాను. ఆ అరుపు ఎటువంటి వాళ్ళనైనా బయటకు తీసుకు వచ్చేలా వుంది.
    నేను వూహించింది కరెక్టే అయింది. రేఖ టవల్ తో బయటకు వచ్చింది. భుజం మీదా, చేతులమీదా సబ్బు అలానే వుంది. ఆదరాబాదరాగా కట్టుకోవటంవల్ల టవల్ కూడా పూర్తిగా ఆమె శరీరాన్ని కప్పలేకపోతూంది. ఆమె మొహం ఆందోళనతో నిండివుంది. మండుతూన్న గుడ్డని పక్కకి తోసేసింది. వాటర్ ని వంపింది. నేను వణుకుతున్నట్టు నిలబడి వున్నాను. ఇంకెక్కడైనా మంట ఉందేమో అని ఆమె గదంతా పరికించి చూస్తూంది. నేనూ ఆమెనే చూస్తున్నాను.
    ఆ ఇంటిముందు తలుపు వేసి ఉండటం వల్లనూ, ఇంటిలో వున్నది మేమిద్దరమే అవటంతోనూ, అందులోనూ నేను గుడ్డివాడిని అవటం వల్లనూ కంగారుగా బాత్ రూమ్ లోంచి వచ్చిన తరువాత కూడా ఆమె భుజాలక్రింద టవల్ ని అడ్జెస్ట్ చేసుకునే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు.
    నా కెందుకో డాక్టర్ అంతటి నరసింహంగారు గుర్తొచ్చారు. తెలుగు పుస్తకాలు చదవటంలాటి మంచి అలవాట్లు నాకులేవు. అలాటివన్నీ శివప్రసాద్ కే! ఒక రోజు ఆయన విజయ విలాస వర్ణన మా అందరికీ వినిపించాడు. రొమాన్సు వుంది కాబట్టి అందరం ఉత్సాహంగా విన్నాము అనుకోండి. అది వేరు సంగతి.
    అది గుర్తొచ్చింది నాకు.
    అర్జునుడికి చిత్రాంగద పరిచయమైందట గానీ, ఇంకా రొమాన్సులో మనవాడు సఫలీకృతుడు కాలేదు (ట) అప్పటికి!! ఆ రాత్రి మన వాడికి సఫలత ఏమీ ఉండదని చెప్పటం కోసం కవి అంటాడట- చిత్రాంగదా వక్షోజ పద్మ సమానములైన పద్మములు ఆమె చేతిలో వున్నాయి. కానీ ఏం లాభం? రాత్రికి ఆమె వక్షోజ రాజీవములు కుముదాలవుతాయి. ఇక్కడ కుముదములు అంటే కలువలు కావు. ముదము (సంతోషము) లేనివట. మళ్ళీ పగలు కాగానే ఆ కుముదాలు నీరజాలు అవుతాయి. (ఇక్కడ నీరజము అంటే పద్మము కాదు. రజము (ప్రకాశము) లేక వృధా అయినది. శివప్రసాద్ మాటిమాటికి హేట్సాఫ్- హేట్సాఫ్ అనుకుంటూ చదివిన పంక్తులు.
    ఇప్పుడీ రేఖని చూస్తూంటే అదే గుర్తొచ్చింది నాకు. నడుము దగ్గిర సరిపోయిన టవలు ఉత్తర దక్షిణాల్లో ఇబ్బంది పడుతూంది. దానికున్న నిలువుచారల రేఖ విల్లు అయితే, దాని పసుపు రంగు రేఖ వంటితో పోటీపడుతూ ఉంది. కవిలా వర్ణించలేను గానీ నాకు తెలిసిన క్రికెట్ భాషలో చెప్పాలంటే- నో కవర్, నో ఎక్స్ ట్రా కవర్, టూ సిల్లీ పాయింట్స్, వన్ డీప్ గల్లీ, వన్ స్క్వేర్ లెగ్, టు స్లిప్స్, నో మిడ్ - ఆన్ వగైరా వగైరా...
    ఈ లోపులో ఆమె తిరిగి బాత్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకోబోయింది. కంగారుగా, "రేఖగారూ" అన్నాను. ఆమె ఆగింది.
    "నే నుండలేను. ఇక్కడ నేను వుండలేను. ఫైర్ - ఫోబియా"

 Previous Page Next Page