Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 11


    ఆమెకు లోపల్నుంచి దుఃఖం తన్నుకు వచ్చింది. ఆనందం మితిమీరగా వచ్చిన దుఃఖం అది. దాన్ని దాచుకునే ప్రయత్నమేమీ చేయలేదామె. అతడి తల్లి ఆమె తలమీద అనునయంగా చెయ్యి వేసింది. పేపర్లో ఫస్ట్ క్లాస్ చూసుకుని ఏడ్చే చిన్నపిల్లలా ఏడ్చి, ఏడ్చి, కొంచెంసేపటికి ఆమె తేరుకుంది.

    "ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను."

    "ఏం? నీకేం తక్కువ? ఒక స్టేజిలో నువ్వు నా భార్యవే నేమో అని నాకే అనుమానం వచ్చింది. అంత బాగా నటించావు" అన్నాడు.

    లక్ష్మిని అతడి తల్లి లోపలికి తీసుకువెళ్ళి చాలాసేపటివరకు ఆమె గురించిన వివరాలు అడిగింది. లక్ష్మి వెళ్ళిపోయాక కొడుకుతో "ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా వుందిరా చైతూ" అంది.

    "నీ మెచ్చుకోలు సంపాదించిందంటే నిజంగానే మంచి అమ్మాయి అయి వుండాలి" అన్నాడు అతను తేలిగ్గా. ఆవిడ మాట్లాడలేదు. లక్ష్మికీ, తనకీ దగ్గర పోలికలున్నాయి అనుకుంది. ఒక చిన్న పావురం బలహీనమైన రెక్కల్తో ఒక గూడుని నిలబెట్టడానికి ప్రయత్నించినట్టు ఆ అమ్మాయి ఎక్ స్ట్రా వేషాలు వేసి కుటుంబాన్ని పోషిస్తోంది.

    ఒకప్పుడు తను అంట్లు తోమి కొడుకుని చదివించినట్టుగా. 


                        7


    ఇస్మాయిల్ ఖాన్ జేబులు తడివి చూసుకున్నాడు.

    అర్ధరూపాయి దొరికింది.

    ఆఖరి అర్ధరూపాయి.

    ఇస్మాయిల్ ఖాన్ భారత సైన్యంలో పనిచేశాడు. పది సంవత్సరాల క్రితం అతడు కాశ్మీర్ లో శత్రుసైన్యానికి పట్టుబడ్డాడు. అతడిని మిలటరీ క్యాంప్ లో బంధించారు. పది సుదీర్ఘమైన సంవత్సరాలు. అతడిని వాళ్ళు ఒకటే కోరేవారు. "నిన్ను వదిలిపెడతాం- భారతదేశానికి వెళ్ళు. తిరిగి సైన్యంలో చేరు. ఈసారి మా గూఢచారిగా పనిచెయ్యి. సంవత్సరానికి లక్షరూపాయిలిస్తాం." ఇస్మాయిల్ ఒప్పుకోలేదు. అతడు నిజాయితీ ఉన్న భారత సైనికుడు.

    ఫలితంగా పది సంవత్సరాలు జైల్లో వున్నాడు. చివరికి శాంతి ఒప్పందం క్రింద ఖైదీల మార్పిడి జరిగింది. ఖాన్ స్వదేశం వచ్చేశాడు. అప్పటికే అతడి వయసు దాటిపోవటంతో తిరిగి సైన్యంలో ఉద్యోగం లేదు. పింఛను వస్తుందన్నారు. దానికోసం ఆర్నెల్లనుంచీ తిరుగుతున్నాడు. బ్యూరోక్రసీ అడ్డుపడుతోంది. అయినా అతడెప్పుడూ దేశాన్ని తిట్టుకోలేదు. ఈ ప్రభుత్వాన్ని రక్షించడం కోసమా నేను చలిలో శత్రువులతో పోరాడింది అనుకున్నాడు. అతడికి పిల్లల్లేరు. భార్య ఎప్పుడో చచ్చిపోయింది.

    ఆ రోజే అతడికో మంచివార్త తెలిసింది. మాజీ సైనికుల కిచ్చే పింఛను శాంక్షను అయినట్టు. అంతేకాదు! చేనేత కార్యాలయంలో ఉద్యోగము దొరికినట్టు.

    అందుకని ఆ రోజు తన దగ్గర వున్న ఆఖరి అర్ధరూపాయి సగర్వంగా ఖర్చు పెట్టుకోదల్చుకున్నాడు. మిరపకాయ బజ్జీలు కొని పైపు దగ్గర నీళ్ళు తాగి, జెండా ఊంఛా రహే హమారా అనుకున్నాడు.

    బజ్జీల కాగితం పారవేయబోతూంటే కనపడింది ఆ బొమ్మ.

    "చైతన్య కోసం విలపిస్తూన్న తల్లి" అని.

    నాలుగు రోజుల క్రితం పేపరు అది. అప్పటికి చైతన్య ఇంటికి వచ్చి రెండు రోజులైంది. ఇస్మాయిల్ ఆలోచిస్తున్నది దాని గురించి కాదు. ఫోటోని చూస్తున్నాడు. మడతలు పడిన పేపరుని మరింత సాఫీగా చేసి చూశాడు. 'రంగనాయకి కదూ' అని గొణిగాడు. అతడి మొహం టెన్షన్ లో ఎర్రబడింది. 'ఈ వార్త ఆమెకి చెప్పాలి' 'ఆమెకి చెప్పాలి' అనుకున్నాడు.

    పాకిస్తాన్ జైళ్ళలో పది సంవత్సరాలు వున్నప్పుడు కూడా అతడింత టెన్షన్ అనుభవించలేదు.

    వివరాలు కోసం ఇస్మాయిల్ మరోసారి పేపరు చూశాడు.

    హీరో చైతన్య కనపడకుండా పోవటం గురించి రకరకాల కథలు అప్పటికే ప్రచారంలోకి వచ్చాయి. విదేశాలకు వెళ్ళిపోయాడని ఒక పేపరు వ్రాసింది. ఫీల్డ్ లో వున్న టాప్ స్టార్ ని పెళ్ళాడి హనీమూన్ కి వెళ్ళాడని రూమర్ స్ప్రెడ్ చేసిందొక పత్రిక. అతడి పేరు ప్రఖ్యాతుల్ని చూసి ఓర్వలేక సాటి నటులెవరో కిడ్నాప్ చేయించారని మరో "కాకా" పత్రిక వ్రాసింది. మరో పత్రిక మరింత ముందుకెళ్ళి చైతన్య మరణించాడనీ, ఆ వార్త బయటికి పొక్కనివ్వకుండా చేస్తున్నారనీ వ్రాసింది.

    ఇస్మాయిల్ చేతిలో వున్న పత్రిక ముక్కలో మాత్రం చైతన్య కొన్ని రోజుల్నుంచి కనపడటం లేదన్న వార్త మాత్రమే వుంది.

    అతడు పేపరు తీసుకుని కొట్టువాడి దగ్గరకెళ్ళి "ఈ చైతన్య ఎవరు బాబూ?" అన్నాడు.

    కొట్టువాడు ఇస్మాయిల్ కేసి విచిత్రంగా చూసి "నువ్వు నన్ను అడిగింది తెలుగులోనేనా" అన్నాడు.

    "అవును! ఏం?" అర్ధంకానట్టు చూశాడు ఇస్మాయిల్.

    "తెలుగు సినిమాలు చూడవా నువ్వు"

    తెలుగు సినిమాలు చూడవా నువ్వు"

    తెలుగు సినిమాలు కాదుకదా- తెలుగుగడ్డను చూసే పది సంవత్సరాలైంది అందామనుకుని "నేను చూడను" అన్నాడు.

    "నువ్వు సినిమాలు చూసినా, చూడకపోయినా, కనీసం తెలుగు మాట్లాడటం వస్తే చాలు చైతన్య తెలిసి వుండాలే. చైతన్య తెలుగు తెరమీద టాప్ స్టార్."

    "ఆయన ఇల్లు ఎక్కడ?"

    కొట్టువాడు అడ్రస్ చెప్పాడు.

    ఇస్మాయిల్ కి ఆ ఇల్లు కనుక్కోవటానికి ఎక్కువసేపు పట్టలేదు. అతడి మనసంతా టెన్షన్ తో నిండి వుంది.

    చైతన్యది చాలా పెద్ద బంగ్లా. ముందుగేటు పది అడుగుల ఎత్తుంది. చుట్టూ చెట్లు. పోర్టికోలో రెండు కార్లున్నాయి. గేటుసందుల్లోంచి చైతన్య కనపడతాడేమో చూద్దామని నలుగురైదుగురు అభిమానులు తొంగి చూస్తున్నారు.

    ఇస్మాయిల్ వాచ్ మెన్ తో "చైతన్య వున్నాడా?" అని అడిగాడు.

    వాచ్ మెన్ ఇస్మాయిల్ వైపు చిత్రంగా చూశాడు. చైతన్యని వున్నా "డా" అని సంబోధించే మొట్టమొదటి వ్యక్తిని అతను చూస్తున్నాడు.

    "నువ్వెవరు?"

    "నా పేరు చెప్తే అతనికి తెలీదు, ఉన్నాడా?"

    "పిచ్చాసుపత్రి నుంచి వస్తున్నావా? బాబుగార్ని వున్నా-డా అంటావా? నాలుక కోసెయ్యగలను. పో ఇక్కడనుంచి" కసిరాడు వాచ్ మెన్.

    "సైన్యం నుండి వచ్చాను బాబూ! భాయీ -భాయీ అనుకోవటమే తప్ప గౌరవాలిచ్చుకోవటం తెలీదు. చైతన్య నా కొడుకు లాంటివాడు. అందుకని ప్రేమగా అలా పలుకరించాను. అంతేకాని తేలిక చెయ్యాలనే ఉద్దేశ్యంతో కాదు. ఆయనుంటే ఒకసారి చూస్తాను."   

    "ఇంకా నయం. నా కొడుకుని బయటికి పిలువు అనలేదు. కొడుకు లాంటివాడట. ఇలా తండ్రులమనీ, తాతలమనీ చెప్పుకుని చైతన్యగారిని పిలవమంటే పిలవటానికి కాదు మాకు జీతాలిస్తున్నది. వెళ్ళు వెళ్ళు"

    "అలా అనకు. ఆ అబ్బాయితో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి."

    "వెళ్ళవయ్యా చెపుతూంటే నీక్కాదూ-"

    "పోనీ ఆయన అమ్మగారున్నారా?"

    వాచ్ మెన్ ఇస్మాయిల్ భుజంమీద చెయ్యి వేశాడు.

    "అయ్యగారి అభిమానినంటావ్. ఆయన లేదనేసరికి అమ్మగారు కావాలంటావు. అసలు ఎవరవిరా నువ్వు?"

    "రంగనాయకికి అన్నయ్యలాంటి వాడిని."

    ఆ మాటల్లో నిజాయితీకి వాచ్ మెన్ కాస్త బెదిరాడు. అయినా ఆ విషయం ఒప్పుకోవటం ఇష్టంలేనట్టు "అయితే ఓ వారంరోజుల తరువాత రా పో" అన్నాడు.

    "వారంరోజులు ఎందుకు?"

    "అబ్బాయి తిరిగి వచ్చినందుకు అభిషేకం చేయించటానికి అమ్మగారు తిరుపతి వెళ్ళారు. వారంరోజుల తరువాత వస్తారు."

    ఇస్మాయిల్ కాస్త నిరాశ చెందినట్టు కనబడ్డాడు.

    "వారం ఆగాలా? ఇంకా వారం ఆగాలా?"

    "ఏమిటి నీలో నువ్వే గొణుక్కుంటున్నావ్?"

    "చైతన్యతో నన్నొకసారి కలుపు బాబూ! నీకో మంచి బహుమతి లభిస్తుంది."

    "నన్నేం అనుకుంటున్నావు నువ్వు? లంచాలు తీసుకునే వాడిలా కనబడుతున్నానా నేను. అలా డబ్బులు తీసుకుని అభిమానులకి చైతన్య దర్శనం యిప్పించటం మొదలు పెడితే ఇప్పటికి ఆయనకన్నా ఎక్కువ సంపాదించి వుండేవాడిని తెలుసా?"

    "అయ్యో నేనా ఉద్దేశ్యంతో అనలేదు బాబూ."

    "చాల్లేవయ్యా ఇంకేం మాట్లాడకు వెళ్ళు-"

    వాచ్ మెన్ మాటలు పూర్తవుతూ వుండగా గేటు తెరుచుకుంది. చైతన్య కారు బయటకొచ్చి ఇస్మాయిల్ చూస్తుండగానే స్టూడియోవైపు దూసుకుపోయింది.

    "వెళ్ళు స్టూడియో దగ్గర ప్రయత్నం చెయ్యి. ఆయన మాట్లాడతారేమో-"

    "ఊహు. స్టూడియోకి వెళ్ళను. తిరుపతి వెళతాను. చైతన్యకి కాదు... రంగనాయకికి చెప్పాలి ముందు..." అంటూ తనలో తానే గొణుక్కుంటూ వెళ్ళిపోతున్న ఇస్మాయిల్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ వుండి పోయాడు వాచ్ మెన్.


                   *    *    *    *


    "స్త్రీ జీవితంలో ఒకేసారి ప్రేమిస్తుంది మోహన్. మనసూ, తనువూ ఒకరికే అర్పిస్తుంది."

    "అలా అనకు సుజాతా. నువ్వీ వివాహం చేసుకోక తప్పదు. శేఖర్ యోగ్యుడు. పైగా నా స్నేహితుడు."

    "నన్ను క్షమించు భార్గవ్. నీకు నన్ను వివాహం చేసుకోవటం ఇష్టం లేకపోతే పోనీ, కానీ ఇంకొకర్ని చేసుకొమ్మని మాత్రం అనకు."

    "అయ్యో సుజాతా నీకెలా చెప్పను.... నాకు.... నాకు బ్లడ్ క్యాన్సర్ సుజాతా."

    "కట్" అన్నాడు దర్శకుడు. చైతన్య వచ్చి కుర్చీలో కూర్చుని రిలాక్స్ అయ్యాడు. ఈ సినిమా నాలుగు రోజులకన్నా ఎక్కువ ఆడదని తెలుస్తూనే వుంది. అయినా తన అభిప్రాయం బయట పెట్టకుండా చివరి షెడ్యూల్ చేస్తున్నాడు. అవతల దర్శకుడు పెద్దవాడు. యాభై సినిమాలకు పైగా తీసినవాడు. తను తీసిందే వేదం అని నమ్మినవాడు.

    చుట్టూ వందిమాగదులు. ఆయన తీసిన ప్రతి షాటుకీ, చైతన్యకి చెప్పిన ప్రతి డైలాగుకి చప్పట్లు కొడుతున్నారు. ఈ హిపోక్రసీ చైతన్యకి విసుగ్గా వుంది. కానీ తప్పదు.

    రాత్రి తొమ్మిదింటికి షూటింగ్ పూర్తయింది.

    చైతన్య ఇంటికి వెళ్ళలేదు. జయసింహ ఇంటికి వెళ్ళాడు.

    చాలా పెద్ద ఇల్లు అది. పురాతన కాలపు రాజభవనంలా వుంది. లోపల ఫర్నీచరు మాత్రం ఆధునికంగా వుంది. ప్రతి గదికీ ఎయిర్ కండిషనర్ లున్నాయి.

    "నేనే వచ్చేవాడిని కదా. నాతో పని అంటే ఆశ్చర్యంగా వుంది" అన్నాడు జయసింహ.

    "ఫర్వాలేదు."

    "మా పిల్లలందరూ మీ ఫాన్స్. వాళ్ళు లేరు, బయటకెళ్ళారు. ముఖ్యంగా మా పెద్దమ్మాయి మీ ఫాన్. అమ్మాయి ఎమ్మెసీ మాథ్స్ లో చేసి, ఐయ్యేయస్ కి ప్రిపేర్ అవుతుంది."

    చైతన్య కాస్త గర్వంగా ఫీలయ్యాడు. మామూలు అభిమానులు వుండటం వేరు. బాగా చదువుకున్న వాళ్ళు అభిమానులవటం వేరు.

    "మా అమ్మాయికి పజిల్స్ చాలా ఇష్టం."

    "మీకు పెయింటింగ్స్ ఇష్టంగా వుందే" గోడలవైపు చూస్తూ అన్నాడు చైతన్య.

    "అవును. అవన్నీ నేనే వేశాను"

 Previous Page Next Page