"అదికాదమ్మా.......వాళ్ళు....వాళ్ళు....." పావని వెక్కుతూ జరిగిందంతా చెప్పింది.
వచ్చినవాళ్ళకు వీడ్కోలు చెప్పి లోపలకు వస్తున్న విశ్వపతి చెవిన పడ్డాయా మాటలు.
పావని, అరుంధతి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు.
అతడు మాత్రం శిలాప్రతిమలా నిలబడిపోయాడు.
7
"సార్ మీకు ఉత్తరం" అంటూ ఫ్యూన్ టేబుల్ మీద పడేసి వెళ్ళిపోయాడు. ఫైల్లో న్యూస్ పేపర్ పెట్టుకుని సీరియస్ గా చదువుతున్న భాస్కరమూర్తికి కవరు చూడగానే ఎక్కడ నుంచి వచ్చిందో అర్ధమయిపోయింది. ఆత్రుతగా విప్పాడు. నెల రోజుల క్రితం ఏదో పత్రికలో వచ్చిన ప్రకటన చదివి తన కిష్టమైన పువ్వు పేరు, అయిదు రూపాయలు పంపాడు. ఆ జ్యోతిష్య సామ్రాట్ రాసి పంపిన తన భవిష్యత్ అది.
"మీరు చాలా తెలివితేటలు గలవారు. కానీ పైకి అతి సాధారణంగా కనిపిస్తారు. మీ జ్ఞానాన్నీ, తెలివినీ పదిమందీ గుర్తించే సమయం త్వరలోనే వస్తుంది. భార్యవల్ల లాభం పొందే సూచనలున్నాయి. అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. రాబోయే పదేళ్ళ కాలం గ్రహబలం చాలా బావుంది. లక్షాధికారులవుతారు."
చదవగానే అతని మొహం నవ్వుతో వెలిగిపోయింది. ఆ మధ్య రోడ్డుమీద చిలక జోస్యం చెప్పించుకున్నప్పుడూ ఇలాంటి ఫలితమే వచ్చింది. ఏమిటో ఉన్నట్టుండి అదృష్టరేఖ తన దారిలోకి వచ్చేసింది. ఓ స్నేహితుడికి అప్పు ఇచ్చి ఇక తిరిగి రాదనుకున్న డబ్బు క్షేమంగా తిరిగి వచ్చింది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఎరియర్స్ చేతికి అందాయి. తల్లి మరణం ఒక్కటి తప్పించి అన్నీ శుభసూచకాలే. అతడి తల్లి నర్సు ఆదిలక్ష్మి మరణించి అప్పటికి కొన్ని వరాలు అయింది. తల్లి చెప్పిన అమ్మాయిల కోసం అతను వెతుకుతూనే వున్నాడు.
ఈసారి పేపర్లో వార్త అతడిని ఆకర్షించింది.
జంటనగర వాసులకు మహదవకాశం
________________________________________________________________________________________________
ప్రపంచ ఖ్యాతి పొందిన జ్యోతిష్య శాస్త్రవేత్త డా|| అవదేష్ బాబా నగరానికి విచ్చేశారు. ఆయన కావేరీ హోటల్ లో నాలుగు రోజులపాటు బసచేస్తారు. తమ భవిష్యత్తుని వివరంగా యధాతధంగా తెలుసుకోగల కోర్కె గలవారు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు గంటలలోపు ఏ సమయములోనైనా రావచ్చును.
__________________________________________________________________________________________________
పక్కనే అవదేష్ బాబా ప్రధానమంత్రితోను, మరో పేరు మోసిన సినిమా నటుడితోనూ వున్న ఫోటోలున్నాయి.
ఆ బాబా గురించి భాస్కర్ చాలాచోట్ల చదివాడు. ఎలక్షన్ల ముందు ఆయన ప్రకటనలు వస్తుంటాయి. ఆయన చెప్పినట్లుగానే ఫలితాలు వస్తుంటాయి.
తన భాగ్యరేఖని స్థిరపరచుకోవడానికి, ఇదొక మంచి అవకాశం. భాస్కర్ మర్నాడు ఉదయం ఎనిమిదిన్నరకల్లా హోటల్ కావేరీలో వున్నాడు. బాబాగారి గదిముందు అప్పటికే ఓ చిన్న గుంపు వుంది.
భాస్కరరామ్మూర్తి వందరూపాయల ఫీజు చెల్లించి టోకెన్ తీసుకున్నాడు. నంబరు తొమ్మిది లక్కీనంబరు. 'అన్నీ కలిసొస్తున్నాయి' మనసులోనే నవ్వుకున్నాడు. గదిలో గంట మోగింది. అందర్నీ లోపలకు పిలిచి హారతి యిచ్చాడు బాబా.
అతడి వంతు వచ్చేసరికి పది దాటింది. అవదేష్ బాబా భాస్కర్ చెయ్యి అందుకుని పది నిమిషాలపాటు పరిశీలించాడు. ఆ తర్వాత అతడి జాతకం తీసుకుని చాలాసేపు లెక్కలు చేశాడు. పరీక్ష ఫలితం కోసం ఎదురుచూసే విద్యార్ధిలా కూర్చున్నాడు భాస్కర్.
బాబా అతడి మొహంలోకి సూటిగా చూశాడు. భాస్కర్ కి భయం వేసింది.
"భయపడకు నాయనా!" చిరునవ్వు నవ్వాడు. "నీ అదృష్టానికి నా మతిపోతోంది. స్త్రీ ద్వారా నీకు ధనయోగం కలుగుతుంది. అంతా ఇంతా కాదు. లక్షలు, లక్షలు ఇంతటి అదృష్ట జాతకాన్ని నేనెప్పుడూ చూడలేదు."
భాస్కర్ హృదయం సంతోషంతో గంతులు వేసింది. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి, తలుపుదాకా వెళ్ళగానే వెనక్కి పిలిచాడాయన.
"ఏమిటి స్వామీ?"
"మరేంలేదు. అదృష్ట జాతకంమీదే అందరి కళ్ళూ పడతాయి. దృష్టిలోపం కలగకుండా స్వామీ పూజ చేయడం మంచిది. ణ సెక్రటరీ దగ్గర పూజ పెట్టె వుంటుంది. తీసుకెళ్ళి క్రమం తప్పకుండా అందులో వివరించినట్లుగా పూజ చెయ్యి. భాగ్యరేఖ నిలబడుతుంది."
"అలాగే స్వామీ!" అయిదు వందల ఖరీదు చేసే ఆ పెట్టెనికొని సంతోషంగా బయటికి వచ్చాడు భాస్కరరామ్మూర్తి.
పదకొండవుతోంది. అప్పుడు వెళ్ళినా ఆఫీసరు ఏమీ అనడు. కానీ భాస్కరానికి ఆఫీసుకెళ్ళే మూడ్ లేదు. తను కన్న కలలన్నీ నిజమవుతాయని స్థిరపడిపోయింది. ఆ వెధవ ఉద్యోగం ఎక్కువ రోజులు చేయాల్సిన అవసరంలేదు. అతడికి నృత్యం చేస్తూ సిటీరోడ్లమీద పరుగులు పెట్టాలనిపిస్తోంది. ఈ సంతోషాన్ని పంచేందుకు ప్రస్తుతం చెల్లి ఊళ్ళో లేదు. ఆ విషయం మాత్రమే అతడికి బాధ కలిగిస్తోంది. కాస్త దూరం నడిచి తలెత్తి చూశాడతను. ఎదురుగా హాస్పిటల్ దాన్ని చూడగానే తల్లి, ఆవిడ చివరి కోరికా గుర్తు వచ్చాయి. ఆ రెండో ఆవిడ అంటే అరుంధతి అడ్రసు దొరుకుతుందేమో మరోసారి ప్రయత్నం చేస్తే సెలవు రోజుకి సార్ధకత చేకూరుతుందనిపించింది.
తల్లికి దగ్గర స్నేహితురాలయిన మరో నర్సు చాముండిని వెతికి పట్టుకోవడానికి అతడికి గంట పైగా పట్టింది. ఆవిడ సహాయంతో రికార్డు రూంకి చేరుకున్నాడు. అక్కడ గుమాస్తా ఆవిడకు తెలిసినవాడే కావడంతో పని సులభమైంది.
బర్త్ సర్టిఫికెట్టు కోసమని అబద్దం చెప్పి అతడే స్వయంగా కూర్చుని వెతికాడు. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం చెప్పినట్లు ఆ తారీఖున ఇద్దరి పేర్లూ వున్నాయి. రెండు అడ్రసులూ హైద్రాబాద్ వే. కానీ సీతాఫల్ మండిలో వాళ్ళు ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోయి పదేళ్ళు దాటింది. మరో క్లూ ఏదైనా దొరుకుతుందేమో అంతా వెతికాడతడు....ఏమీ లాభం లేకపోయింది.
నీరసంగా అన్నీ సర్దేసి పెడుతుంటే కనిపించిందతడికి పుస్తకం!! హాస్పిటల్ నుంచి మునిసిపాలిటీకి జనన మరణాల వివరాలు వ్రాసి పంపే పుస్తకం అది. దాన్నిండా కార్బన్ కాపీలు..... ఆతృతగా పేజీలు తిరగేశాడు.
అరుంధతి వైఫాఫ్ విశ్వపతి. కానీ అడ్రస్ మళ్ళీ సీతాఫల్ మండి!! 'ఛ' అని విసురుగా పుస్తకం మూయబోయి ఆగిపోయాడతడు. కాగితానికి మరో పక్క పర్మెనెంట్ అడ్రస్ అన్నచోట విశ్వపతి ఊరి అడ్రస్ ఉంది.
* * *
బస్ వేగంగా నడుస్తుంది.
భాస్కరరామ్మూర్తి ఆలోచన్లు కూడా అతి వేగంగా నడుస్తున్నాయి.
ఈ మొత్తం తిరుగుళ్ళకి వందరూపాయలకన్నా ఎక్కువ ఖర్చే అయివుంటుంది.
తల్లి కోరిక తీర్చాలని అతడేం తహతహలాడిపోవటంలేదు. ఇరవై సంవత్సరాల క్రితం తన తల్లి ఎలా ఫీలయిందో అతనలా ఇప్పుడు అలాగే ఫీలవుతున్నాడు. ఈ నిజాన్ని ఆ నలుగుర్ని కూర్చోబెట్టి చెపితే ఆ జంటలు రెండూ ఎలా నిర్విగ్నం చెందుతారో, ఆ ఇద్దరి అమ్మాయిల ఫీలింగ్సూ ఎలా వుంటాయో చూడాలని అతడి మనసు ఉవ్విళ్ళూరుతుంది.
అతడు బస్ దిగేసరికి అయిదున్నర అయింది.
విశ్వపతి అడ్రస్ పట్టుకుని ఇల్లు కనుక్కునేసరికి సూర్యాస్తమయం అవుతోంది.
దూరంగా ఇల్లు, సంరక్షణలేని చిన్నతోట. విరిగిపోయిన పాతగేటు, గేటు కిరుపక్కలా 'విశ్వపతి, అరుంధతి' అన్న పేర్లు....
అతడి శరీరంలో రక్తం వడివడిగా ప్రవహించసాగింది. గేటుమీద చెయ్యివేసి అక్కడే వున్న పావని- "విశ్వపతిగారున్నారా?" అని అడిగాడు.
"లేరు!"
"ఎప్పుడొస్తారు?"
"తెలీదు, అదిగో మా పెద్దక్కయ్య నడగండి"
పెద్దక్కయ్య అంటే పెద్ద..... కూ..... తు.... రు.....
జన్మకాల ముహూర్తంలోనే కోటీశ్వరుడి కుటుంబంలోంచి బీదతనం వైపు జారిపోయిన ఆ అమ్మాయిని చూడటం కోసం తల తిప్పాడతను.
అదే సమయానికి మొక్కల మధ్యలోంచి లేస్తుంది పావని.
అస్తమించే సూర్యుడి ఎర్రటి కాంతి ఆమె మొహంమీద అద్భుతమైన సౌందర్యంతో పరావర్తనం చెందుతోంది.
అదే సమయానికి లోపల లైటు వేశారెవరో, వెనుక గదిలోనూ, భాస్కర రామ్మూర్తి మెదడులోనూ లైటు వెలిగింది.
* * *
పావని మనసదోలా వుంది. తోటలోని చెట్లన్నీ వాడి పోయాయి.ఎవరికీ వాటిమీద శ్రద్ద లేనప్పుడు, ఈ పెళ్ళి సంబంధాలు వేట అందరిలోనూ ఉత్సాహాన్ని చంపేసింది.