అందర్నీ అడిగి చెప్పినపని నిజాయితీగా నిర్వర్తించకు వచ్చిన భ్రుత్యుడిలా తిరిగి వచ్చాడు.
"అంతా పెద్ద డాక్టరుగారినే అడుగుతున్నారండీ" అని అంతటితో ఆపినా బాగుండేది. 'మీరు అక్కర్లేదంటున్నారండీ' అని పూర్తిచేశాడు.
కాంపౌడర్ని నమిలి మింగేయాలన్నంత కోపంవచ్చింది కుమార్ కి. ఒక్కసారె ఉరిమిచూసి ఊరుకున్నాడు.
అరవైఏళ్ళ వయసులో వున్న తండ్రి డిస్పెన్సరీ నాలుగు గదుల్లోనూ చకచక తిరుగుతూ ఒక్కొక్క పేషెంటునూ చూసి పంపించేస్తున్నాడు. వాళ్ళతో ఏవో కబుర్లు చెబుతున్నాడు, జోక్సు వేస్తున్నాడు. మధ్య మధ్య బిగ్గరగా నవ్వుతున్నాడు. చలాకీగా అటూఇటూ తిరుగుతున్నాడు.
ముప్పైకింకా ఇటువైపే వున్న కుమార్ వంటరిగా, గిల్టీగా ఫీలవుతూ కుర్చీలో కూర్చుండిపోయాడు. తండ్రి అటూఇటూ తిరుగుతూ పనిచేస్తుంటే అతనికి ఎలాగో వుంది.
మధ్యలో ఒకసారి రంగారావుగారు 'అలా ఊరికినే కూర్చోకపోతే పేషెంట్లని చూసి పంపిస్తూ వుండకూడదూ?' అన్నారు.
కుమార్ ఆయనవైపోసారి చూసి 'నేను చూసేవాళ్ళెవరూ లేరు' అన్నాడు.
అయిదు నిముషాలు గడిచాక రంగారావుగారు అతన్ని లోపలిగదిలోకి పిలిచారు.
"చూడూ! నేను అనుభవమున్నవాడ్ని కాబట్టి అంతా నన్నడుగుతూ వుంటారు. డానికి నువ్వు అఫెండ్ అవ్వకూడదు. ఓర్పు వుండాలి. ఒడుపుగా, ఉపాయమ్గా పేషెంట్లని ఆకర్షించి, వాళ్ళకు నీమీద గురి కలిగేటట్లుగా ప్రవర్తించాలి. వాళ్ళేదో అన్నారని తిక్క తెచ్చుకుని వాళ్ళని మళ్ళీ ఏదో అని పరిస్థితిని పాడుచేయకూడదు. నేను ముప్పై, నలభై ఏళ్ళబట్టి ప్రాక్టీసు చేస్తున్న వాడ్ని కాబట్టి నన్నడుగుతారు. అందులో ఆశ్చర్యంలేదు. నువ్వు స్పోర్టివ్ గా తీసుకుని, పని జరిగేటట్లుగా చూసుకోవాలి" అన్నారు.
పెద్దవాళ్ళు ఏ వృత్తిచేస్తే తమ పిల్లల్నికూడా అదే వృత్తిలో పెట్టాలని మనుషులు తహతహలాడటం ఆనవాయితీ. పిల్లలు అలా చేయకపోతే వాళ్ళేదో కానిపని చేసినట్లు, చేతికందకుండా దాటిపోతున్నట్లుగా కూడా పెద్దవాళ్ళను కోవటం కద్దు.
"నా కొడుకుని నా వృత్తిలో నా అంతటివాడ్ని చెయ్యాలని" ఉవ్విళ్ళూరటం, అలా చేయించటమే తమ జీవితాదర్శం అయినట్లు చాలామంది తండ్రులు కబుర్లు చెబుతుంటారు. తమ సంతానాన్ని మరో వృత్తిలోనో, ఉద్యోగంలోనో, పదవిలోనో ఊహించటం వారికి చేతకాదు.
కుమార్ కి తను డాక్టర్ అవుతాడని ముందుగా తెలియదు. అవాలని కూడా అనుకోలేదు. అతని దృష్టి ఎప్పుడూ లలితకళలమీద వుండేది. చిన్నతనంలో వంటరిగా కూర్చుని ఏవో ఆలోచనలు చేస్తుండేవాడు. కాగితం, పెన్సిలు తీసుకుని ఏవో బొమ్మలు గీస్తుండేవాడు. లేకపోతే కాగితం, పెన్ను తీసుకుని ఏవో పిచ్చి రాతలు రాస్తుండేవాడు. లేకపోతే అక్కయ్యలకోసం ఇంట్లోవున్న ఫిడేలుమీదో, వీణమీదో ఏవేవో ధ్వనులను పలికించడానికి ప్రయత్నించేవాడు. కానీ అతని ప్రయత్నములన్నీ తండ్రి నిర్దాక్షిణ్యంగా త్రుంచేసేవాడు. కాగితం, కలంతో కనిపిస్తే అవి ఊడలాక్కుని, కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపేసే వాడు. వీణముందో, ఫిడేలుముందో కనిపిస్తే చెవి పుచ్చుకుని బరబర అవతలికి లాక్కెళ్ళేవాడు.
"మన ఇంటావంటా లేవురా ఈ పద్దతులు. పెద్ద కళాకారుడివవుదామని నీ బుర్రలో వున్నట్లుంది. కళలేమయినా కూడు పెడతాయట్రా? నువ్వు నా పెద్దకొడుకువి. నువ్వు డాక్టరువి కావాలి. మా నాన్న డాక్టరు, ఆయన తండ్రి కూడా డాక్టరే. అలాగే నువ్వుకూడా డాక్టరువి అయితీరాలి తెలిసిందా? నీ బుర్రలోకి మరో ఆలోచన వస్తే ఒప్పుకోను జాగ్రత్త!" అని హెచ్చరికలు చేసేవాడు.
కుమార్ లేతహృదయంలో ఎన్నో సంఘర్షణలు చెలరేగేవి. మొదట్లో తన సున్నితమైన గుండెను ఎవరో నిర్దయగా, క్రూరంగా నరికేసినట్లు, అతన్ని మైనం ముద్దలా ఒంచేస్తున్నట్లు అనుభూతి పొందాడు. చిన్నతనంవల్ల పిల్లలు అనుకునే ఆలోచనలు నిజంగా అర్ధవిహీనమైనవేమే, పెద్దవాళ్ళు వీళ్ళ ఆలోచనలతో నిమిత్తంలేకుండా కఠినంగా వుండటమే సబబేమో అతనికి తెలియదు. కానీ అతను బాధపడ్డాడు.
తర్వాత తర్వాత మనసును రాయిచేసుకుని చదువుమీద దృష్టి పెంచుకుని తనకిదివరకున్న ఆసక్తుల్ని మరచిపోవడానికి ప్రయత్నించాడు. కొంతవరకూ కృతకృత్యుడయ్యాడు కూడా.
మెడిసన్ పూర్తిచేశాక అతను అనుభవంకోసం కొన్నాళ్ళు సర్వీసులో చేరదామనుకున్నాడు.
తండ్రి అదీ సాగనివ్వలేదు. నాకు ఒక్కడికే చేసుకుంటానికి కష్టంగా వుంది. ఇన్నాళ్ళూ నువ్వెలాగూ చదువుకుంటున్నావు కాబట్టి విధిలేక రాత్రనక, పగలనక చేశాను. ఇహ నాకు ఓపిక తగ్గుతోంది. నువ్వు వచ్చి నాదగ్గరుంటే నాకు చేదోడువాదోడుగా వుంటుంది. బాధ్యతంతా నీకు అప్పజెప్పేసి నేను రిటైరవుతాను.
చేసేదిలేక కుమార్ తండ్రి డిస్పెన్సరీలో కాలు మోపాడు.
అయితే ఆ క్షణంనుంచీ అతని మనస్సుకీ, వ్యక్తిత్వానికీ భయంకరమైన సంఘర్షణ మొదలైంది.
తను ఒకరిమీద ఆధారంలేకుండా బ్రతుకుతున్నాడు అనుకోవటానికి ఆస్కారంలేకుండా పోయింది.
తను విడిగా ప్రాక్టీసు పెట్టుకుంటే తన తిప్పలు తను పడుతుంటే తనకు ప్రాక్టీస్ వున్నా, లేకపోయినా, రాబడివున్నా లేకపోయినా ఆ సంగతివేరు. తను సంపాదించిన ప్రతిపైసా తన స్వశక్తిమీద సంపాదించుకున్నట్లు అయేది. తను గడించిన పేరులో ప్రతి అణువూ స్వశక్తిమీద గడించుకున్నట్లు అయేది.
తండ్రి చెప్పేది నిజమే. తను విడిగా ప్రాక్టీస్ పెట్టుకోలేదు. కాబట్టి వచ్చిన వాళ్ళలో ఎక్కువభాగం ఆయనకోసం వస్తారు. దానికి తాను అభిమానపడి ప్రయోజనం లేదు. కానీ లోలోపల తొలచివేస్తున్న వ్యక్తిత్వం ఊరుకోదు కదా!
"కాఫీకి రుచేమిటి సింగినాదం!" అని గడగడ త్రాగేసేవాళ్ళూ, అర్ధశేరు బియ్యంతో వండిన అన్నం తినికూడా ఏ కూరతో తిన్నామో, ఏ పచ్చడితో కలుపుకున్నామోనన్న ఇంగితజ్ఞానం లేకుండా తినేసేవాళ్ళూ - ఇలాంటి సంఘర్షణని లెక్కపెట్టరేమో గానీ, కాఫీ వేడిగా ఘుమఘుమలాడుతూ వుంటేగానీ త్రాగలేని కుమార్, అన్నంలోకి ఇష్టమైన కూర లేకపోతే ఆప్యాయంగా తినలేని కుమార్ ఈ సంఘర్షణనుంచి తప్పించుకోలేకపోయాడు.
అతనికి తండ్రి దయమీద ఆధారపడివున్నట్లు అనిపించేది.
కానీ అతను తండ్రినుంచి ఒకటి ఆశించాడు. తాను వృద్దిలోకి రావాలని తండ్రి కోరుకుంటున్నాడు కాబట్టి, వచ్చిన పేషెంట్లదగ్గర తన గురించి వాళ్ళ హృదయాలకు హత్తుకునేలా చెబుతాడనీ, తాను చాటుకు తప్పుకుంటూ కొడుకును ముందుకు నెడతాడనీ ఆశించాడు.
కానీ పొరపాటు ఎక్కడుందోగానీ అలా జరగలేదు. ఆయన మనసులో కొడుకు అభివృద్ధి కాంక్షిస్తూ వుండవచ్చు. కానీ తన 'సుపీరియారిటీ'కి తిలోదకాలిచ్చుకోవదానికి ఆయన రాజీపడలేకపోయి వుంటాడు. "నేను పెద్దవాడినై పోయానని, ఇహ నాకు కొడుకుల అండకావాలి" అని మొదట్లో ఆనుకున మాట నిజమే అయివుంటుందిగానీ తీరా తండ్రీ, కొడుకులు ఒకే రంగంలో ఎదురుబొదురుగా తారసపడినప్పుడు ఈ జీవిత పోరాటంలో తారసపడినప్పుడు విధిచేతిలో పరాజయం పొందటం ఆయన భరించలేకపోయి వుంటారు. కొడుకు ఎంత వృద్దిలోకి వచ్చినా తనకు కుదిభుజంగా, అంటే కేంద్రం తనే అయివుండి వుంచుకుంటేనే తృప్తిగా వుందికానీ, అతనికి దూరంగా జరిగి, అతని అంతస్తుని పెంచి, తాను సైడ్ కర్టెన్ లోకి తప్పుకోవటం రుచించి వుండదు. తాను డిమ్ లైట్ లోనే వుండాలి. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలమూ తన శక్తిమీద ఆధారపడి ఉండాలన్న ఆయన ఆశయం గొప్పదే కావచ్చు. కానీ తనంతటి వాడయిపోతున్న కొడుకు మనసుని కాల్చివేస్తున్న ఆలోచన్ల ఉద్రేకాన్నికూడా ఆయన గ్రహించగలగాలి. తెలివైన వాళ్లయితే ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నంకాకుండా ముందుగానే జాగ్రత్తపడతారు. 'తర్వాత చూచుకుందాం!' అనుకునేవాళ్ళు అడగడుక్కీ అవస్థపడుతూనే వుంటారు.
పైగా ఆయన ఎంతమందితోనో 'మావాడిదేముందండీ! అరటిపండు ఒలిచినట్లుగా అంతా వాడిచేతిలో ఒలిచిపెట్టాను. ఎందుకంటే నా చిన్నతనంలో నేను పడిన బాధలు వాడిజీవితంలో వాదు పడటం నాకిష్టంలేదు. నా చదువు పూర్తికాకుండానే మా నాన్నగారు పోయారు. అది పూర్తిచేసుకుని, తిరిగి లైఫ్ లో సెటిల్ అవడానికి అష్టకష్టాలు పడాల్సివచ్చింది. వాడిదేముంది? చదువు పూర్తి చేయించాను. ఇక్కడ వాడికోసం చెయిర్ రెడీగా వుంచాను. అందులో వచ్చి హాయిగా కూర్చున్నాడు. నేను ఉండటం వాడికి ఎంత ఎసెట్! వాడు ప్రాక్టీస్ బిల్డ్ చేసుకుంటున్నాడంటే నలుగురిలో మంచిపేరు తెచ్చుకున్నాడంటే ప్రక్కన పెద్దవాడ్ని నేనున్నాను కాబట్టే, లేకపోతే క్రొత్తగా ఏ అండాలేకుండా పెట్టినవాదు ఈ మాదిరిగా పికప్ చేయగలడేమో చెప్పండి?" అంటూ ఉండగా కుమార్ అనేకసార్లు విన్నాడు.