Previous Page Next Page 
నిశ్శబ్దం-నీకూ-నాకూ మధ్య పేజి 11


    అన్నీ రెండే. రెండు టిక్కెట్లు. రెండు సీట్లున్న టేబిలూ, అన్నీ రెండే. ఒరే ఇడియట్, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ రా.

    "నే వెళ్ళొస్తాను" అంటూ లేచాడు మిత్ర. నూతిలోనుంచి వచ్చినట్టుంది అతని కంఠం.

    "నేనూ వస్తాను" అన్నాడు ఆరెస్బా. "మళ్ళీ రెండింటికి వచ్చి పికప్ చేస్తాను. అలసిపోయి వుంటారు రెస్టు తీసుకోండి స్పందనాదేవి-"

    ప్లేనులో వచ్చి అలసిపోవటం ఏమిట్రా. అంత నాజూగ్గా కనబడుతుందా? అలా అని అది మెచ్చుకోలా? ఓరి వెధవా.... ఆడవాళ్ళ మనసుల్నీ శరీరాల్నీ ఎక్కడ తాకుతే వాళ్ళు మెచ్చుకుంటారో నీకు బాగా తెల్సురా.

    మిత్ర కారు స్టార్టు చేశాడు. ఆరెస్బా మోటార్ సైకిల్ స్టార్టు చేస్తూ "ఆఁ జ్ఞాపకం వచ్చింది. ఇంతకుముందు మిమ్మల్ని ఎక్కడ చూశానో" అన్నాడు.

    ఆమె ఆత్రంగా "ఎక్కడ" అంది.

    "నెలకొకసారి -నక్షత్రాలమధ్య.... పౌర్ణమినాడు" అనేసి గాలిలో దూసుకుపోయాడు. మిత్ర ఆమెవైపు చూశాడు. ఆమెకి మొదట అర్ధంకాలేదు. కాగానే గుండెలమీద చెయ్యి వేసుకుని నవ్వింది. నవ్వుతూనే వుంది. కళ్ళవెంబడి నీళ్ళు వచ్చేదాకా పడి పడి నవ్వుతూనే వుంది.


                          *    *    *


    "స్పందనా-"

    "ఊ"

    "నా ఈ ఒంటరితనం ఎంత భయంకరమైనదంటే నన్ను నేనే భరించలేను" అన్నాడు మిత్ర.

    "ఊ"

    గాజులు సవరించాడు. "నా హృదయంనిండా ప్రేముంది. కానీ దాన్నెలా ప్రదర్శించాలో ఆ విద్యే రావటంలేదు. నువ్వు లేకుండా నా జీవితమే ఒక పెద్ద తప్పు. నీకేం- ఒకసారి కళ్ళలోకి సూటిగా చూసి కళ్ళు దించుకుంటావ్. తర్వాత నా అవస్థ నీకేం తెలుసు? అయినా రాత్రంతా నన్ను మేల్కొని వుండమని శిక్ష విధించే అధికారం నీకెవరిచ్చారు?"

    "నాకు సిగ్గేస్తూంది బాబూ?"

    "నేను దగ్గరుంటే నిన్ను తీరిగ్గా సిగ్గుపడనివ్వనుగా!"

    ..........

    ..........

    "చెప్పు-"

    "ఏం చెప్పను?"

    "నీ పెదవిమీద నిల్చున్న నిశ్శబ్దంలో ఎన్ని కధల్ని దాచుకున్నావో విప్పి చెప్పు. ఇదిగో ఈ పూలు తీసుకో."

    "గులాబీలా-"

    "నాకు గులాబీలంటే ఇష్టం. నువ్వు నవ్వినప్పుడల్లా అవి పూస్తాయి కాబట్టి నువ్వంటేనూ నాకిష్టం. నే నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించటం పాపం అనుకోకు. ఆ మాటకొస్తే నువ్వన్నీ పుణ్యాలే చేసి స్వర్గానికి వెళ్తే మరీ కష్టం. నువ్వు నందనవనంలో విహరించడం చూస్తే తమకన్నా అందమైన యువతి ఈమెవర్రా అన్న ఆలోచనలతో రంభా ఊర్వసులకి నిద్రపట్టదు."

    గాజులు చేతుల్లోకి తీసుకుని అన్నాడు....

    "స్పందనా.... పెదవులపైన నీ పేరూ, కళ్ళలో నీ మీద ప్రేమా, మనసులో నీ ఆలోచనా.... ఇంకా శరీరం ఎందుకు దూరంగా."

    "ఎంత బాగా మాట్లాడతావ్ నువ్వు-"

    "మాట్లాడానా? నాకొచ్చేసింది మాట్లాడటం!!!చాలు. ఇంకేమీ వద్దు. సైకియాట్రిస్టు చెప్పింది కరెక్టే. గాజులూ, పూలూ పెట్టుకుని ప్రయత్నం చేస్తే.... మాటలు అవంతట అవే...."

    గుమ్మం దగ్గర చప్పుడయ్యేసరికి తనలో తనే మాట్లాడుకున్న మిత్ర ఉలిక్కిపడి చూశాడు. వరసగా గుమ్మం దగ్గర నిలబడి అతనినే చిత్రంగా చూస్తూ వున్నారు హరిదా, చంద్రం, పక్కింటి పాప, ఇంటిగలాయన.

    ఇదేమీ పట్టనట్టూ టేప్ తిరిగుతూనే వుంది.

    "నేను, టేప్ రికార్డరు, పూలు, సైకియాట్రిస్టు, గాజులు" అన్నాడు మిత్ర.

    ఎవరూ మాట్లాడలేదు.

    "డిప్రెవైజేషన్ ఆఫ్ ఫీయర్" అన్నాడు తనే మళ్లీ. 

    ఇంటిగలాయన దగ్గరకొచ్చి భయం భయంగానే అతని చేతివేళ్ళూ, కాలివేళ్ళు పరీక్షించి "ఎందుకైనా మంచిది. భూతవైద్యుణ్ణి సంప్రదిస్తే...." అని చంద్రాన్ని సలహా అడిగాడు.

    చంద్రం గంభీరంగా తల పంకించేడు.

    శంభు వళ్ళు మండింది- "నాకే పిచ్చీలేదు. ఏ దెయ్యమూ పట్టలేదు" అన్నాడు.

    "అదిగో! అది దెయ్యం లక్షణమే" అన్నాడు ఇంటిగలాయన.

    "ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి" అన్నాడు చంద్రం.


                       *    *    *



    ఇక్కడ ఆపరేషన్ చేసి, వెంటనే రిజల్టు చెప్పబడును.

    అన్న బోర్డు వేలాడుతుంది. ఇంకోపక్క స్క్రీన్ కట్టబడి వుంది. పైన ఆపరేషన్ ధియేటర్ అని వ్రాసి వుంది.

    బైట కన్సల్టింగ్ రూమ్ లో కూర్చుని వున్నారు చంద్రమూ, మిత్ర.

    "నాకే జబ్బూ లేదురా విను" అన్నాడు మిత్ర.

    మాట్లాడకు అన్నట్టు చంద్రం సైగ చేశాడు.

    లోపల పేషెంటు కంఠం వినబడుతూంది. "మూడురోజుల నుంచీ కడుపునొప్పి డాక్టరుగారూ! పాములున్నట్టూ అనుమానం."

    'నర్స్' డాక్టర్ కంఠం 'బిస్మిల్లాఖాన్ తీసుకురా.'

    శంభు చంద్రంవైపు తిరిగి "ఇదేమిటి ఈయన భస్మాల్తో కూడా ట్రీట్ చేస్తాడా?" అన్నాడు.

    "రకరకాలు. అందుకే నిన్నీయన దగ్గరకు తీసుకొచ్చాను."

    ఈ లోపులో నాదస్వరం వినిపిస్తుంది. మరుక్షణం పేషెంటు నవ్వుతూన్న ధ్వని, "కడుపులో చక్కిలిగింతలు పెడుతున్నట్టుంది సార్".

    నాదస్వరం ఆగిపోయింది. డాక్టర్ కంఠం గంభీరంగా వినిపించింది. "పాములే. మంచి టేస్టున్న పాములు. ఇదిగో ప్రిస్కిప్షన్."

    ఆ పేషెంటు వెళ్లిపోయాక ఇద్దరూ లోపలికి వెళ్ళారు.

    డాక్టర్ కి నలభయ్ ఏళ్ళుంటాయి. కదలటానికి సిద్ధంగా వున్న ట్రైన్ ఎక్కటానికి వచ్చిన ప్రయాణీకుడిలా హడావుడిగా ప్రతిదానికీ కంగారుపడుతూ వుంటాడు. కళ్ళజోడున్నా చూడటం మాత్రం దాని పైనుంచే.

    "మీ గురించి చంద్రం అంతా చెప్పాడు. అంతా" అన్నాడు. క్షణం నిశ్శబ్దం.

    డాక్టర్ తనగోళ్ళవైపూ, పేపర్ వెయిట్ వైపూ, చంద్రం వైపూ ఫిలాసాఫికల్ గా చూశాడు. తర్వాత అదే వేదాంతపు స్వరంతో..... "లింఫో సర్కోమా ఆఫ్ హార్ట్" అన్నాడు.

    మిత్ర ఉలిక్కిపడి "ఏమిటీ" అన్నాడు.

    డాక్టర్ మాట్లాడలేదు. చచ్చిపోయినవాడి ఆత్మశాంతి కోసం అన్నట్టుగా కొద్దిసేపు మౌనంగా వుండి, "ఏది ఏమైనా గుండె పరీక్షిస్తే కాని చెప్పలేను" అంటూ కత్తి చేతుల్లోకి తీసుకున్నాడు.

    శంభు కుర్చీలోంచి లేచి భయంగా, "తీసి పరీక్షిస్తారా" అన్నాడు.

    "వద్దా" అని, అదేదో సామాన్య విషయంలా కత్తి పక్కన పెట్టి స్టెత్ తీసుకున్నాడు.

    శంభు ఏదో చెప్పబోయాడు.

    "మాట్లాడకండి.... గట్టిగా ఊపిరి పీల్చండి" గద్దించాడు.

    "కానీ...."

    "మాట్లాడొద్దన్నానా...."

    శంభు కళ్ళు మూసుకుని ఎగశ్వాస ప్రారంభించాడు. పరీక్షిస్తున్న డాక్టర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతడూ బలంగా శ్వాస తీయటం ప్రారంభించాడు. చంద్రం ఇద్దర్నీ ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టాడు.

    డాక్టరు జుట్టు దానంతట అదే పైకి లేవటం మొదలు పెట్టింది. కళ్ళజోడు క్రింద పడిపోయింది. స్టెత్ ణి అతని రొమ్ము మీద అటూ ఇటూ జరిపి, తరువాత దాన్ని తీసేసి నిటారుగా నిలబడి, దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్టు - "ఇతడి గుండె కొట్టుకోవటం లేదు" అని అనౌన్స్ చేశాడు.

    చంద్రం కుర్చీలోనుండి ముందుకు పడబోయి తమాయించుకున్నాడు.

    శంభు కుర్చీలో ఇబ్బందిగా కదిలి, నీరసంగా "డేక్స్ ట్రోకార్డియా" అన్నాడు.

    "అంటే" అన్నాడు ఎం.బి.బి.యస్. చదివిన డాక్టరు.

    "కుడి, కుడివైపున వుంది గుండె" అన్నాడు మిత్ర. నూతిలోనుంచి వచ్చినట్టు వుంది అతని కంఠం.

    "ఓహో" అన్నాడు డాక్టరు అర్ధమయినట్టుగా.

    "ముందునుంచీ అక్కడే వుందా-?" పరీక్షిస్తూ అన్నాడు.

    శంభుకి మళ్లీ వళ్ళు మండింది. ఈ డాక్టరో తార్కిక ప్రత్యక్ష జ్ఞాన ప్రాధాన శూన్యతా వాదిలా వున్నాడు.

    "లేదు. ముందు ఎడమవైపు వుండేది. చిన్నప్పుడు జారి పడ్డాను. అప్పుడు కుడివైపు కొచ్చింది" అన్నాడు కసిగా.

    డాక్టర్ దాన్ని పట్టించుకోకుండా తన మామూలు ధోరణిలో "గుండె కొట్టుకుంటోంది" అన్నాడు.

    ఇంతలో లోపల్నుంచి పదేళ్ళ పాప వచ్చి "అమ్మ కత్తి పీట కావాలంటోంది" అంది.

    "ధియేటర్ లో వుంటుంది చూడమ్మా" అన్నాడు విసుగ్గా.

    "ఇలా మాటిమాటికీ తీసుకెళితే తన పనికి అడ్డొస్తూందట. కావాలంటే కొత్తది కొనుక్కోమంది" అంటూ ఆపరేషన్ ధియేటర్ లోకి వెళ్ళింది పాప.

    శంభు నీరసంగా చెయ్యి ముందుకు చాపాడు. రబ్బర్ కప్ కట్టి, మీటర్ చూసి, "నూట ఇరవై ఆరు- ఎనభై నాలుగు గుడ్. వెరీగుడ్" అన్నాడు. "మిస్టర్ శంభు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాను- ఆలోచించకుండా జవాబు చెప్పండి" గంభీరంగా అన్నాడు.

    మిత్ర కళ్ళు మూసుకుని, ఉరికి సిద్ధమైన ఖైదీలా - "అడగండి" అన్నాడు.

    "మీరెవర్నైనా అమ్మాయిని ప్రేమించారా?"

    సిస్టాలిక్ ప్రెజర్ నూట ఆరునుంచి నూట డెబ్భైకి పెరిగింది. డాక్టర్ ఉత్సాహంగా ముందుకు వంగాడు. "లేదు" "ఎవరైనా అమ్మాయిని నగ్నంగా చూశారా - అంటే స్నానం చేస్తున్నప్పుడు కాని, బట్టలు కట్టుకుంటున్నప్పుడు కానీ."

    సిస్టాలిక్ ప్రెజర్ నూట డెబ్భైనుండి రెండు వందల పదికి, డయాసాలిక్ ప్రెజర్ ఎనభైనాలుగు నుండి నూట ఆరుకి.

    "లేదు."

 Previous Page Next Page