"ఎవరెవరొస్తే వాళ్ళందరూ వుంటారు."
"అంటే! ఈ ఇంట్లోకి యెవరేనా రావొచ్చా?"
"రావొచ్చు."
"నేను కూడా రావొచ్చా?"
"రావొచ్చు."
"అయితే నేను లోపలికెళ్ళనా?"
"డొనేషన్ చెల్లించి వెళ్ళండి."
"అయ్యగారి సంఘానికి."
"ఎంత?"
"పది రూపాయలకి తక్కువ కాకూడదు. తరువాత యెంతైనా నా మీ యిష్టం. మీరెంత పుణ్యం సంపాదించుకోవాలను కుంటున్నారో దాన్నిబట్టి యివ్వండి"
అతని చేతిలో పది రూపాయలు పడేసి లోపలికొచ్చాడు సహదేవ్. పెళ్ళిహాలు లాంటి పెద్ద హాలు తప్ప ఇంకేమీలేదు. ఎవరూ కనపడలేదు. గోడమీద టిబెటియన్ లామా వేషంలో ఒక వ్యక్తి ఫోటో దానికింద "లామా మింగియార్" అనే అక్షరాలు కనిపించాయి. అవి నోట్ చేసుకుని, "మృదుల లామా మింగియార్ ఇంట్లోకి వచ్చి మాయమైపోయింది. ఈ మిస్టరీ తెలుసుకోవాలి" అని నోట్ చేసుకున్నాడు.
* * *
మేలిముసుగుల్లో వున్న ఆడవాళ్ళు-నల్లటి గంతలు కళ్ళకి కట్టుకున్న మగవాళ్ళు, వాళ్ళ యెదురుగా చిన్న వేదిక మీద మింగియార్ తో పాటు టిబెటియన్స్ లా కనిపించే మరో యిద్దరు-వింతగా అందర్నీ చూసింది మృదుల. ఏదో మాట్లాడటానికి ప్రయత్నించేలోగా పెదవుల మీద వేలుంచి "మాట్లాడొద్దు" అన్నట్లు సైగచేసాడు మింగియార్. మొదట ఆడవాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి మింగియార్ ముందు వొంగి నమస్కారాలు చేయసాగేరు. అతడు వాళ్ళ ముఖాల్లోకి పరిశీలనగా చూసి పక్కన దొంతరగా పెట్టుకున్న స్లిప్స్ మీద ఏదేదో రాసి ఒక్కొక్కరికి చేతికి యిస్తున్నాడు. దాన్ని వాళ్ళు కళ్ళు కద్దుకుని బయటికి వెళ్ళిన పది నిముషాలు తరువాతగాని, మరొకర్ని పిలవడం లేదు మింగియార్. మొదట ఆడవాళ్ళయిపోయాక తరువాత మగవాళ్ళు కూడా వచ్చి మింగియార్ కి వొంగి నమస్కారం చేసి, అతను తమని పరిశీలనగా చూసాక రాసిచ్చిన చీటీలు అందుకుని వెళ్ళిపోసాగేరు. పదేసి నిముషాల వ్యవధిలో స్త్రీ పురుషులు జంటలుగా వెళ్ళినవాళ్ళు కూడా వున్నారు. వాళ్ళు చాలాకొద్ది మంది. అందరూ వెళ్ళిపోయాక మృదుల వైపు తిరిగి "ఏమిటి మీరిలా వచ్చారు?" అడిగాడు మింగియార్.
"అయితే నేనిన్నది నిజమేనన్న మాట. మీరు- మీరు కూడా మోసగాళ్ళేన సన్యాసుల్లాగ జ్ఞాననేత్రం వుందని సమాజాన్ని మభ్యపెట్టి జనాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అడవులలో గిరిజనులకి యెంతో సాయం చేస్తూంటే చూసి మీరు చాలా మంచివారనుకున్నాను" అంది.
ఈ ఆరోపణకి మింగియార్ కోపం తెచ్చుకోలేదు - చిన్నబుచ్చుకోలేదు. చిరునవ్వుతో, "మంచి-చెడు అనే పదాలు వాడకండి. వాటికి స్థిరమైన అర్ధంలేదు. సందర్భాన్నిబట్టి ఆ పదాల విలువ మారిపోతూ వుంటుంది. ఉదాహరణకి ఇలా మా రహస్య సమావేశాలకి వచ్చి మేం చేస్తున్నదేమిటో తెలుసుకోవడం మీ దృష్టిలో మంచి- మీ భర్త భాగవతార్ ని అడగండి మీరింట్లోంచి వంటరిగా యిక్కడికి రావడం చాలా చాలా చెడ్డ పని అంటారు."
"భాగవతార్ మీకు తెలుసా? ఆయన మనస్తత్వం గురించి మీరెలా చెప్పగలరు?"
"భాగవతార్ యిక్కడికొచ్చారు. అప్పుడు ముఖం చూసాను. భాగవతార్ మీ భర్తని మీరే చెప్పారు. జ్ఞాననేత్రంతో ఆయన మనసు తెలుసుకోగలిగాను."
నిజంగా ఆశ్చర్యపోయింది మృదుల. భాగవతార్ ఆలోచనా ధోరణి మృదులకి తెలుసు. అయితే మింగియార్ దానిని జ్ఞాననేత్రంతో తెలుసుకోగలిగాడంటే మాత్రం నమ్మలేకపోయింది.
"అతడి మాటల్నిబట్టో, చేతల్నిబట్టో వూహించి వుంటారు అవునా?"
"కరెక్ట్. అదే జ్ఞానేత్రం. మనందరం మన చూపుల్లో - మాటల్లో - నడకల్లో - చేతల్లో మన మనస్సును ఆత్మను వ్యక్తీకరిస్తూనే వుంటాం. అయితే ఆ మనిషి లోపలి మనిషిని తెలుసుకోగలిగే శక్తి మనలో యెంత మందికి వుంది?"
"వీళ్ళంతా ఎవరు? ఎందుకొస్తున్నారు- ఈ ముసుగులెందుకు?"
"డాక్టర్ జకిల్ - అండ్ మిస్టర్ హైడ్" నవల మీరు చదివే వుంటారు. ఆ రచనలో ఫాంటసీ వున్నా ఆ మహామేధావి మానవ మనస్తత్వాన్ని ఎంత బాగా అర్ధం చేసుకున్నాడు? మనసంతా మన ఐడెంటిటీ నిలుపుకోవాలని ఎంత తాపత్రయ పడతామో ఒక్కొక్కసారి ఆ ఐడెంటిటీ నుంచి మరుగున పడాలని కూడా అంతగానూ ప్రయత్నిస్తాము. మనలోవున్న ఉదాత్త భావాలను, ఉన్నత ఆదర్శాలను ఐడెంటిటీలో వెలిగించుకోవాలని ప్రయత్నిస్తాము. అలాగే మనలో తలిత్తే అసహజం- అవాంచనీయము అయిన అనేక భావాలకు_ కోరికలకు_ వాంఛలకు ఐడెంటిటీ నుంచి ఎలాగో తప్పించుకుని తృప్తి కలిగించాలని చూస్తాము. అదే యీ ముసుగులు. ఇలా ప్రత్యేకించి ముసుగులు వేసుకున్నా- వేసుకోకపోయినా మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో ముసుగులో దాక్కోవాలనే ప్రయత్నిస్తాము."
"అయితే యింతకీ మీరు జ్ఞాననేత్రంతో ఎదుటివాళ్ళ జీవితమంతా తెలుసుకోగలగటం నిజమేనా?"
"జీవితమంతా కాదు. ఆ క్షణంలో నా యెదుట వ్యక్తి శారీరక- మానసికావస్థలను గ్రహించగలను. బహుశా మీకు తెలిసే వుంటుంది. జీవంవున్న ప్రతీ ప్రాణిని ఆవరించుకుని కాంతివలయం వుంటుంది. ఇది ఆ ప్రాణిలోని జీవశక్తి ప్రతి ఫలనము. ఈ జీవశక్తి విద్యుత్ శక్తి లాంటిదే విద్యుత్ కారణంగా ఆకాశంలో మెరుపు మెరిసినట్లే మనిషిలో వున్న జీవశక్తిని ఆధారం చేసుకుని కాంతివలయం వుంటుంది. మన పూర్వులు యేనాడో యిది అర్ధం చేసుకున్నారు. అందుకే దేవతలను- ఉత్తమ పురుషులను చిత్రించేటప్పుడు శిరస్సు వెనక కాంతివలయాలను కూడా చిత్రించేసారు. ప్రతి ప్రాణిలోను అంతర్లిహితంగా విద్యుత్ - వుందని- దానివల్ల జనించిన అయిస్కాంత శక్తి వుందని ఇప్పుడు సైంటిస్ట్స్ కూడా చెపుతున్నారు. కొంత సాధనతో మనిషిని ఆవరించి వున్న యీ కాంతివలయాన్ని- ఆ వలయంలో మనిషి- శారీరక- మానసిక కాంతి వర్ణాలని చూడొచ్చు. వాటి సహాయంతో అతని శారీరక- మానసిక రుగ్మతలను గ్రహించి తగినవిధంగా వైద్యం చేయొచ్చు. మాదంతా మూలికల వైద్యమేనని మీకు తెలుసు. ఆ మాటకొస్తే ఇపుడు మనం వాడే మందులన్నీ మూలికల్లోంచి తయారైనవే. ప్రకృతి సహజమైన మూలికలకున్న శక్తి అపారం. అది సరిగా తెలుసుకుని వైద్యం చేయగలిగితే దానిని అతిశయించగల వైద్యం లోకంలో ఎక్కడా లేదు."
ఈ మాటలు ఒప్పుకోక తప్పలేదు మృదులకి. మూలికలలో వున్న ఔషధీ శక్తుల్నే రసాయనిక ప్రక్రియల ద్వారా మాత్రలుగా- కేప్సూల్సుగా- టానిక్ లుగా వుపయోగించి ఆలోపతిలో వాడతారని మృదులకి తెలుసు.
"మీరు చెప్పిన జ్ఞాననేత్రం యెలా వస్తుంది? ఎవరేనా పొందగలరా?" "ఏకాగ్రమైన సాధన ప్రాక్టీస్ చేయగలిగితే ఎవరేనా పొందగలరనుకుంటాను. మాకు కొంత తంతు వుంది. అయితే యీ తంతు కూడా ఏకాగ్రతకి సంబంధించిందే."
"తంతా! ఏమిటది?"
"టిబెట్ లో మేమంతా చాలా కష్టజీవులం. విపరీతమైన ఎండకి- విపరీతమైన చలికి- ఎత్తయిన కొండల మీంచి విజృంభించి వచ్చే చల్లటి గాలులుకి తట్టుకుని జీవించాలి మేము. మాలో చాలామంది బౌద్ధమతాన్ని స్వీకరించారు. మా కుటుంబం కూడా బౌద్ధమతాన్ని పాటిస్తూ వచ్చింది తరతరాలుగా. పాతకాలపు సాంప్రదాయాలననుసరించి మాబోటి కొన్ని కుటుంబాలలో ఒక పిల్లవాడి భవిష్యత్తు మతాచారుల నిర్ణయాన్ననుసరించి వుంటుంది. నాకు ఏడేళ్ళ వయసులోనే జ్యోతిష్కులు నా జాతకాన్ని చూసి, నేను లేమేస్రీలో చేరి అక్కడ వైద్యుణ్ణి కావాలని నిర్ణయించారు. నా తల్లిదండ్రులు అనందంతో యేడేళ్ళ వయస్సులో వున్న నన్ను లేమేస్త్రీకి అప్పగించారు. ఆ వయస్సునించే మత గురువుల శిక్షణా జీవితం ప్రారంభమైంది నాకు. అంత చిన్నతనం నుంచి యెంతో కఠినమైన క్రమశిక్షణలో మతాచార్యుల దగ్గిర- మత గ్రంధాలు చదవటం జ్ఞాపకశక్తిని పెంపొందించుకొనడం- ఎదుటి వ్యక్తిని అన్ని కోణాలలోంచి తెలుసుకోవడం తెలుసుకున్న దానిని అవసరమైనప్పుడు కాని బయట పెట్టకపోవడం- వగైరాలన్నీ నేర్చుకున్నాను. ఈ రకమైన ట్రైనింగ్ పూర్తయ్యాక అక్కడి విద్యార్ధులలో కొందరిని మాత్రమే జ్ఞాననేత్రం ప్రసాదించడానికి అర్హులుగా మతగురువులు నిర్ణయిస్తారు. అలా నన్ను ఎంచుకున్నారు. జ్ఞాన నేత్రాన్ని ప్రసాదించడానికి ముందు రోజు నన్నొక్కణ్ని వేరే గదిలో వుంచి ఒకరోజంతా ధ్యానంలో వుండమన్నారు. రాత్రి అవుతుండగా ఆధ్యాత్మిక రంగంలో యెంతో కృషి చేసిన ముగ్గురు మతలామాలు నా గదిలో కొచ్చారు. నా నుదుటిమీద ఏదో మూలికల చూర్ణం దట్టంగా అదిమారు. అందులో మహత్తు యేమీలేదు. నుదుటిమీద గాయం అయితే త్వరగా మాన్పడానికి మాత్రమే పనికొస్తుందా చూర్ణం తరువాత నేను పూర్తిగా తెలివిలో వుండగానే "యు" ఆకారంలో వున్న పదునైన పళ్ళున్న ఉక్కు చట్రాన్ని నేర్పుతో నుదిటిలోకి గుచ్చారు. దానిని గుచ్చబోయే ముందు మా గురువు. "మింగియార్ ఇది చాలా బాధాకరంగా వుంటుంది. ఈ ప్రయోగం మత్తు మందిచ్చి చేయడానికి వీల్లేదు. నువ్వు పూర్తిగా తెలివిలోనే వుండాలి. నీ ధ్యాస బలంతో యీ బాధనంతా భరిస్తూ యేమాత్రం కదలకుండా స్థిరంగా వుండాలి. నీ మానసిక- శక్తిపైన నీకు సిద్ధించబోయే జ్ఞాననేత్ర ప్రభావం ఆధారపడి వుంటుంది" అన్నారు. అది చాలా బాధాకరమైన అనుభవం. అప్పటికే యెంతో సాధన వుండటం వల్ల మనసుని యేకాగ్రంగా ధ్యానంలో నిలిపి యేమాత్రం కదలకుండా బాధంతా భరించగలిగాను. బహుశాః ఆ ఇనుస్ట్రుమెంట్ లో మహత్తుయేమీ లేదేమో. మనసుకున్న యేకాగ్రత పరిమితిని నిర్ణయించడానికి అది కేవలం పరీక్షమాత్రమేనేమో? నేను సరిగా చెప్పలేను. ఆ స్థితిలో నేను ఒక రోజంతా పద్మాసనంలో ధ్యానంలో వుండిపోయేను. తొలి క్షణాల తరువాత నాకు బాధ తెలియలేదు. కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ఆ మరునాడు స్టెరిలైజ్ చేసిన కొన్ని వెండి పనిముట్లతో నుదుటినుంచి "యు" ఆకారం గల ఇన్ స్రుమెంట్ తీసేసారు. హెర్ బల్ లోషన్స్ తో మత గురువు స్వయంగా నుదురు కడిగి మూలికల చూర్ణం పూసారు. ఇంతే ఆ తంతు. ఆ రోజుల్లో నేను యేకాంతవాసంలో గడిపేవాడిని. వైద్య విషయాలు, అధ్యాత్మిక విషయాలు బోధించే గురువులు తప్ప మరెవరూ నా గదిలోకి వచ్చేవారు కారు. ఆ రోజులలో నేను కేవలం శరీరఛారణకి అవసరమైనంత ఆహారమూ, నీరూ తీసుకునేవాడిని. అలా ఎన్ని రోజులు గడిచాయో నాకు తెలియదు. ఎందుకంటే ఆ రోజుల్లో నాకు టైమ్ సెన్స్ ఏమాత్రం వుండేదికాదు. ఒకరోజు మా గురువుగారు నన్ను ఆశీర్వదించి, "మింగియార్! ఇప్పుడు నువ్వుకూడా మాలో ఒకడివైపోయావు. ఇహ నీ మిగిలిన జీవితమంతా మనుష్యుల్ని వారి వారి యదార్ధ తత్వాలతో చూడగలవు. ఎదుటివాళ్ళు నీ ముందు యేరకంగా కనిపించాలని ప్రయత్నించినా నీకు మాత్రం నిజ స్వరూపం మాత్రమే కనిపిస్తుంది" అన్నారు.