Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 12

    "ఊఁ" అన్నదామె.
   
    "మరి నా ముందిలా ప్రవర్తిస్తున్నావేం?"
   
    "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ నీతో పంచుకోవాలన్న కోరికను నిగ్రహించుకోలేకపోతున్నాను. నీకోసం ఏదో చేయాలనీ, నీ మనసును బాగా సంతోషపెట్టాలనీ తపనగా ఉన్నది నాకు. మన మధ్య అరమరికలుండకూడదు. సిగ్గుండకూడదు. అసలు మనమిద్దరం వేరుకాదు. ఒక్కటే..." అంటూ నాకు కాస్త దగ్గరగా జరిగిందామె.
   
    నేనామెకు దూరంగా జరిగి "అందుకు పర్యవసానం తెలుసా?" అన్నాను.
   
    "ప్రేమ పర్యవసానం గురించి ఆలోచించదు"
   
    "అద్న్హుకే ప్రేమకు వివేకాన్ని జతపరచాలి" అంటూ ఆమెకు నాకు వచ్చిన కలగురించి చెప్పాను.
   
    ఈ కల ఆమె వివేకాన్ని మేల్కొలుపుతుందనే ఆశించాను. కానీ అలా జరుగలేదు.
   
    "నువ్వు నా గురించి కల కూడా కన్నావా! ఎంత అదృష్టం?" అన్నాది కోమలి నేనాశ్చర్యంగా తనవంక చూస్తూంటే "రామం-కల గురించి మరికాస్త వివరంగ చెప్పవూ" అన్నదామె.
   
    "నా కల నీ ఆత్మహత్యతో అంతమయింది!"
   
    కోమలి నవ్వి "నేను ఆత్మహత్య చేసుకోవడమెందుకు?" అన్నది.
   
    "ఎందుకంటే నేను నిన్ను పెళ్ళి చేసుకోను గనుక."
   
    కోమలి కిసుక్కున నవ్వి "పదేళ్ళకు పైగా తెలుసు నువ్వు నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావని ఎలాగనుకుంటాను?" అన్నది.
   
    "మరి....?" అన్నాను.
   
    "పర్యవసానాల గురించి నువ్వు ఆలోచించకు. మానసికంగా నువ్వు బాల్యావస్థలో ఉన్నావు నువ్వు చెప్పేవన్నీ వింటుంటే నా ప్రేమకు నీవు అర్హుడివేనా అనిపిస్తున్నది. కానీ ప్రేమ అర్హతను కూడా చూడదు" అన్నది కోమలి.
   
    "నువ్వు చెప్పేది నాకు అర్ధం కావడం లేదు..." అన్నాను.
   
    "నాన్న ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామనుకుంటున్నాడు. అందుకని ఊరు మారాలనుకుంటున్నాడు. అంటే మేమిక్కడ ఎంతో కాలం వుండము. మన ఇద్దరికీ సంవత్సరాల అనుబంధం ఎందుకో నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నిన్నేమీ అడగను. పెళ్ళిగురించి వేధించను. మన ఇద్దరి అనుబంధానికీ కలకాలం మనసులో నిలిచిపోయే తీపిగుర్తుగా...ఈ ఏకాంతాన్ని మనం గడపాలి. పర్వసానాల భారం నాది..." అన్నది కోమలి.
   
    ఒక ఆడపిల్ల నోరువిడిచి ఇంతకన్నా ఏం చెబుతుంది?
   
    నాకు కోమలి మనసు ఇప్పుడర్ధమైంది.
   
    ఆమె నిజంగా నన్ను ప్రేమిస్తున్నది. కానిక్కడ్నుంచి వెళ్ళిపోయేలోగా నాకు మరపురాని కానుక ఇవవలనుకుని ఈ విధంగా ఆహ్వానించింది.
   
    కానీ అందుకు నేను అర్హుడినా?
   
    అప్పుడు కనులముందు గోపీ కనపడ్డాడు. చెడామడా తిట్టాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలింది. ఇంకా ఆలోచిస్తావేం అన్నాడు.
   
    నేనింకా ఆలోచిస్తూండగా కోమలికి అటుపక్కనుంచి రఘు కనబడి నన్ను పిలిచాడు. "తక్షణం ఇక్కడ్నించి వెళ్ళిపో...నీ పవిత్రతను నిలుపుకో" అన్నాడు.
   
    "ఏమిటటూ ఇటూ చూస్తున్నావ్?" అన్నది కోమలి.
   
    నేను ఉలిక్కిపడ్డాను. "ఏమీలేదు...కానీ కోమలీ ఒక్కమాట....నీవు నన్నెప్పుడూ ఇలాగే ప్రేమిస్తూంటావా!" అన్నాను.
   
    "నీకా సందేహం అవసరం" అన్నది కోమలి.
   
    "అయితే నీ పిలుపు గుర్తుంచుకుంటాను. నీ ప్రేమను పొందే అర్హత సంపాదించుకున్నాక నీ పిలుపుకు బదులుగా నాకై నేనేవస్తాను నీ వద్దకు. నీ పిలుపు ఈ రోజుమాత్రమే కాదని నమ్ముతున్నాను" అన్నాను.
   
    కోమలి ఏమీ మాట్లాడలేదు. ఆమె కనులలో నిరుత్సాహం, దిగులు, అవమానంకూడా నాకు కనబడ్డాయి. ఆమె ప్రకటించిన ప్రేమ విధానానికి బహుశా అవి తప్పవేమో! అందులోనూ ఆమె ప్రేమకు నన్నెన్నుకున్నది.
   
    కోమలికి అటూ ఇటూ గోపీ, రఘు నాకు కనబడుతున్నారు. గోపీ ముఖం నిరుత్సాహంగా వున్నది. రఘుముఖంలో విజయగర్వం తొణికిసలాడుతున్నది.
   
    నేను మంచంవంక చూశాను. నా కనులముందు కోమలి విడిచిన మాక్సీ "నీవు సాధించిన విజయం సాధ్యమై నది కాదుసుమా!" అంటున్నది.
   
    నా వయసు మనసుముందు తలవంచుకుంది.
   
    కోమలిని మళ్ళీ కలుసుకుంటానని అప్పుడు నేననుకోలేదు.
   
                                              *    *    *    *
   

    నా చదువు పూర్తయింది. ఉద్యోగం వచ్చింది. యూనివర్సిటీలో లెక్చరర్ నయ్యాను. నాకు వివాహమూ అయింది. నా భార్యపేరు పద్మిని.
   
    పద్మినిది సామాన్యమయిన అదంకాదు ముఖం విషయంలో అప్సరసలా లేకపోయినా ఆమె శరీరం ఏ శిల్పి కయినా, చిత్రకారుదికైనా తమ తప్పులు దిద్దుకొనడానికి ఉపయోగిస్తుంది.
   
    చూడగానే మలిచిన శిల్పంలా ఉంటుందామె.
   
    పెళ్ళిచూపుల్లో ఆమె కూర్చున్నప్పుడు చూశాను. అంతగా నచ్చలేదు నాకు. మా అమ్మ ఆమెను దగ్గరగా రమ్మనమని పిలిచింది కాలూ, చెయ్యీ లోపముంటే తెలుసుకునేందుకు మగపెళ్ళివారలా చేస్తారుట.
   
    అప్పుడు పద్మిని లేచినిలబడింది. అడుగు ముందుకుపడలేదో ఏమో అలా కొద్ది క్షణాలు నిలబడే ఉండిపోయింది.
   
    నేను కాళిదాసునుకాను జక్కన్ననుకాను. రవివర్మను కాను.

 Previous Page Next Page