Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 11

    కానీ ఆమెకు చెడ్డపేరు వచ్చింది. సమాజం ఆమెకు కుళ్ళబొడవడం ప్రారంభిస్తుంది. ఆమెను రక్షించగలవాడ్ని నేనే!
   
    ఆమెను నేను ఆదుకోవాలి. కానీ ఇప్పుడు....
   
    నాన్న అప్సెట్ అవుతారు. అమ్మ షాక్ తింటుంది.
   
    ఏం చేయాలి? నేను ఆలోచిస్తున్నాను.
   
    రోజులు గడుస్తూన్నాయి. నేను ఆలోచిస్తూనే ఉన్నాను.
   
    ఒక రోజు...
   
    కోమలి ఆత్మహత్య!
   
                                            O    O    O    O
   
    ఉలిక్కిపడి నిద్రలేచాను.
   
    కల...కలకాదది పీడకల...
   
    కానీ అధి నిజంకాదు కలేనని తెలిసి మనస్సు తేలిక అయింది.
   
    ఇది నాకు కొత్తకాదు. నేనేమైనా తప్పు చేయాలనుకున్నప్పుడు పర్యవసానం స్వప్న స్వరూపంలో వచ్చి నన్ను హెచ్చరిస్తూంటుంది. నేను శ్రీరామచంద్రుడిని ఆదర్శపురుషుడుగా ఎన్నుకున్నందుకు ఆయనే నాకిచ్చిన వరమేమో ఇది!
   
    ప్రతి మనిషిలోనూ తప్పుచేయాలన్న కాంక్ష వుంటుంది. పర్వసానం గురించి ఆలోచించగల విచక్షణ వుంటే మనిషి తప్పుచేయడు.
   
    ఆ విచక్షణ నాకు కలలు కలిగిస్తూంటాయి.
   
    ఇప్పుడేం చేయాలి?
   
    కొంతకాలం కోమలిని తప్పించుకొని తిరగడం మంచిది.
   
    వయసు నన్ను మళ్ళీ వెక్కిరించింది. నీపని ఇప్పుడు కాదు....అప్పుడు పడతాను..... అంటున్నదది.
   
                                                                              O    O    O    O
   
    అది వయసు ప్రభావమో కాదో చెప్పలేను. కానీ కోమలిని కల్సుకోవాలనే అనుకున్నాను.
   
    కోమలి తప్పటడుగు వేస్తున్నది. అందుకు నన్నెన్నుకున్నది. నేను కాదంటే మరో యువకుడిని వెతుక్కుంటుంది. అందరూ నాకులా వుండరు. కొందరు అవకాశం తీసుకుంటారు. అధి చివరికి కోమలి ఆత్మహత్యతో ముగిసిపోతుంది.
   
    అలా జరగకూడదంటే నేను కోమలి మనస్సును పునీతం చేయాలి. అందుకోసం ఆమెనికల్సుకోవాలి.
   
    అప్పుడు నా మనసు నవ్వింది. నీవు కోమలిని కలుసుకోవడం తధ్యం అందుకు డొంకతిరుగుడు కారణాలనీ ఎందుకు అంటున్నదది.
   
    నేను లెక్క చేయలేదు.
   
    సరిగ్గా మూడుగంటలకే కోమలి ఇంటికెళ్ళాను.
   
    గుమ్మంవద్ద నాకోసం ఎదురు చూస్తున్నది కోమలి.
   
    "ఈరోజు ఆలస్యం చేయలేదు." అని అభినందించిందామె. కానీ అప్పుడు నా శరీరం వణికింది.
   
    కోమలి ఈరోజు నిన్నటికి రాలేదు.
   
    నిన్న ఆమె పరికిణీ, వోణీ వేసుకున్నది కానీ ఈరోజు పల్చటి మాక్సీ వేసుకున్నది. చూసీ చూడగానే ఆమె మాక్సీ మాత్రమే వేసుకున్నదనిపించింది.
   
    నాకళ్ళు జిగేలుమన్నాయి.
   
    మనస్సు వెనక్కి లాగింది. వయస్సు ముందుకు తోసింది.
   
    ఆ క్షణంలో వయస్సే బలంగా వుంది.
   
    నేను తలుపు గడియ వేశాను.
   
    ఇద్దరం ఇంట్లోకి వెళ్ళాం. అధి పడకగది. మంచం మీద కూర్చున్నది కోమలి. నేనూ కూర్చున్నాను.
   
    "పాట పాడమంటావా, కథ చెప్పమంటావా?" అన్నది కోమలి.
   
    "రెండూ వద్దు. ముందాడ్రస్ మార్చు" అన్నాను.
   
    "నువ్విలాగంటావని ముందే ఊహించాను" అన్నది కోమలి.
   
    అప్పుడే నేనూహించని సంఘటన జరిగింది.
   
    కోమలి నా ఎదురుగా బట్టలు మార్చుకున్నది.
   
    శరీరాన్ని బహిర్గతం చేస్తుందని మాక్సీని మార్చమన్నాను. ఆ మాత్రం అడ్డుకూడా లేకుండా చేసింది కోమలి.
   
    నా వళ్ళు వేడెక్కింది.
   
    భగవంతుడు స్త్రీకి ఎంత అందమయిన శరీరాన్నిచ్చాడు? అని క్షణమాత్రం అనుకోకుండా ఉండలేకపోయాను.
   
    కోమలి పరికిణీ, జాకెట్టూ వేసుకుని, వోణీ కూడా వేసుకుని "ఇప్పుడు బాగున్నానా?" అన్నది.
   
    "నీకు సిగ్గులేదు" అన్నాను వణుకుతూ మాట్లాడుతూంటే నాకు పెదాలు అదురుతున్నాయి. శరీరంలో అదోరకం కంపన ప్రారంభమయింది.
   
    "ప్రేమ సిగ్గెరుగదు" అన్నది కోమలి.
   
    "ప్రేమంటే బరితెగించడమనుకున్నావా?" అన్నాను.
   
    "నేను బరితెగించానా? నా గురించి నీక్కలిగిన భావమిదా?" కోమలి కాస్త బాధగా అన్నది.
   
    "లేకపోతే నన్నిలా రెచ్చగొట్టాలని ఎందుకు చూస్తావు?"
   
    "నేను నిను రెచ్చగొట్టడంలేదు. ఎంతగా ప్రేమించానో తెలియబరుస్తున్నాను. నీకోసం ఎద్మయినా చేయగలనని చెబుతున్నాను."
   
    "ఇవన్నీ వళ్ళు వాచినవాళ్ళ కబుర్లు...."
   
    "నీ ముందు నన్ను చూసి మరోలా భావించకునన్ను. నేను నిప్పులాంటి దాన్ని ఇష్టంలేని వెధవ ఈల వేసినా సహించను నేను" అన్నది కోమలి.
   
    అప్పుడు నాకు చెంపదెబ్బ తింటున్న కొండల్రావు గుర్తుకు వచ్చాడు. ఆ క్షణంలో మధ్యాహ్న సూర్యుడ్ని మరపించిన కోమలి ముఖమూ గుర్తుకు వచ్చింది.
   
    తప్పు నాదే....కోమలి నన్ను ప్రేమిస్తున్నది.
   
    "కోమలీ...." అన్నాను నేను.

 Previous Page Next Page