"ఎందుకని ఒప్పుకోవు? ఎంత గౌరవమైనా చూపుతాను, భార్యగామాత్రం ఒప్పుకోనంటావా? అయితే
"నేననుకొన్నంత అమాయకుడివి కాదన్నమాట!"
"అయ్య బాబోయ్! మీరు నన్ను అపార్దం చేసుకొంటున్నారు! మీరెక్కడా, నేనెక్కడా అనుకొంటున్నాను. మీరు మా గురువుగారి చెల్లెలు. మీ గురించి నేను అలా అనుకోవడం కూడా తప్పే! పాపం చుట్టుకొంటుంది నన్ను!"
"గురువుగారి చెల్లెల్ని లేపుకు రావచ్చునేం?"
"మీరిలా మాట్లాడితే ఇక్కడే నాతల బద్దలుకొట్టుకు ఛస్తాను!"
"అయితే వెళ్లిపో అచ్యుతా! నా బాధ నేను నేనుపడతాను!"
"వెళ్ళను! మిమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్లను!"
"నీతో చిక్కువచ్చిపడిందే? ఇద్దరం వయసులో వున్న వాళ్లం. మనమద్య ఏం లేకుండా ఒక కప్పు క్రింద ఎలా జీవిస్తాం? జీవించినా మనమధ్య ఏం లేదంటే ప్రపంచం నమ్ముతుందా."
అయోమయంగా చూశాడు అచ్యుతం.
"వెళ్ళిపోదలచుకొంటే నిన్ను న్ను అడ్డుపెట్టను లేదా నన్ను భార్యగా స్వీకరించు. నన్ను భార్యగా స్వీకరించినంత మాత్రాన నిన్ను నాశనం కానివ్వను. అచ్యుతా! నిన్నో మనిషిగా తీర్చిదిద్ది నీ నీడలో నేను నిశ్చింతగా తల దాచుకొంటాను"
"ఏం మాట్లాడాలో తెలియలేదు అచ్యుతానికి.
"ఇరవయ్యేళ్ళకే నా తలరాత చెడిపోయింది. ఇది దేవుడు వ్రాసిన రాత అని, దీనికి తిరుగులేదని నేను నిరాశ పడను. కొత్త రాత రాసుకోవడానికి నా సర్వశక్తులూ ధారబోస్తాను! 'ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి స్పూర్తినిస్తూంటుంది. ఏ వీరేశలింగమో, ఏ రామ్మోహనరాయో వస్తారని ఆశలేదు! పట్టుదలతో నా జీవితాన్ని నేనే దిద్దుకుంటాను! ముందు నిన్ను దిద్ది నీ ఆసరాతో నన్ను దిద్దుకొంటాను.'
* * * *
శంకరి అచ్యుతం చేయిపట్టుకొని ఒక క్రొత్తలోకం లోకి తీసుకొచ్చి, వదిలింది. అక్కడున్న అధ్బుతాలు, ఆనందాలు అచ్యుతాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి బదులు కలవరపడేట్టు చేశాయి!
తప్పుదోవన అక్కడ ప్రవేశించినట్టుగా సిగ్గు, బాధ!
చదువుకోసమని ఆచారి బావ దగ్గర తనని అమ్మవదిలి పెడితే తనేం చేశాడు? గురువుగారి చెల్లెలితో పారిపోయి వచ్చాడు! శంకరిని లేవదీసుకు వచ్చాడని జనం చెప్పుకొంటారు కాబోలు! ఇరవయ్యేళ్ల వయసుకే ఒక స్త్రీని లేవదీసుకు వచ్చేంత ఘనుడయ్యాడా? అమ్మ ఈ సంగతి విని ఏమౌతుంది? వృద్దాప్యంలో ఆధారం అవుతాడనుకొన్న కొడుకు ఎందుకూ పనికిరాకుండా పోయాడని కుములుతుంది!
ఇంతవరకు కొడుకు అప్రయోజకుడయ్యాడనే బాధ పడేది! ఇప్పుడు చరిత్ర హీనుడుకూడా అయ్యాడని తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో?"
తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకొంటున్నట్టుగా శంకరితో శరీరసంబంధం పెట్టుకోకుండా దూరంగా వుండిపోయాడు అచ్యుతం.
ప్రతిరాత్రి తన పక్కబట్టలు తీసుకొని వరండాలోకి వెళ్లిపోయే అతడిని వారించలేదు శంకరి. ముందు తప్పు చేశానన్న భావననుండి అతడిని దూరంచేయాలి! సహజమైన అనురాగం అతడిలో అంకురించాలి! అప్పుడే తమమధ్య ఏర్పడే అనుబంధానికి అర్దం వుంటుంది.
శంకరి నిబ్బరంగా, నిశ్చింతగా వుంది.
* * * *
"అచ్యుతా, లే! లెమ్మంటుటే! ఇంత మొద్దునిద్రేమిటి, బాబూ..... లేవవా?" శంకరి తట్టితట్టి కుదిపి కుదిపి లేపసాగింది అచ్యుతాన్ని!
అతడు ఊ ఊ అని మూలుగుతున్నాడేగాని కళ్లు విప్పడం లేదు!
హఠాత్తుగా చల్లగా మీద బిందెడునీళ్లు గుమ్మరింపబడేసరికి కెవ్వున కేకపెట్టి లేచి కూర్చున్నాడు. ఏం పని ఇది?"
"నీ మొద్దునిద్రకు సమాధానం ఇది!"
"ఇంకా తెల్లవారలేదు! ఇప్పుడు లేచి ఏం చేయాలి?" బద్దకంగా ఆవలిస్తూ అడిగాడు.
"నీ మొద్దు మొహం ఎప్పుడయినా ఉషోదయాన్ని చూసిందా అని!లేచి తూర్పున చూడు ఉషస్సు అద్దుతూన్న రంగుల్ని! పక్షుల కిలకిలరావాల్లో ఆ శ్రావ్యత విను! నీ మొద్దుబుర్రకు పట్టిన మట్టి వదిలిపోతుంది!" అంటూనే పళ్లపొడి తెచ్చి, అచ్యుతం అరచేతిలో పోసింది. త్వరగా ముఖం కడిగి స్నానం చేసెయ్యి! నువ్వీరోజు ఒక పని చేయాలి"