"మరి దయాకర్ కూడా విడాకులు యివ్వాలిగా."
పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపాడింది ఆర్తి. "అంటే దయాకర్ పెళ్ళయినవాడా?"
"పెళ్ళయినవాడు మాత్రమే కాదు... ఇద్దరు పిల్లలకి తండ్రి కూడా."
"గాడ్!" ఆర్తి తలపట్టుకుంది.
ఏమిటి ధీర మాట్లాడుతున్నది?
ఇంత విచ్చలవిడిగా బరితెగించినట్టు ఆలోచిస్తుందేం?
"పైగా దయాకర్ కీ భార్యాబిడ్డలంటే చాలా యిష్టం."
ఇక జుగుప్సలాంటి భావం ఆర్తి మొహంలో మెదిలి అంతలోనే మాయమైపోయింది.
ఒక పెళ్లయిన ఆడది, మరో పెళ్ళయిన మగాడితో సంబంధం పెట్టుకుని అది ప్రేమంటూ తెలియచెబుతుంది. పైగా ఆ మగాడు తనతో బాటు అటు భార్యాబిడ్డల్నీ ప్రేమించగల మహోన్నతమైన వ్యక్తిలా తెలియచెప్పటానికి ప్రయత్నిస్తూంది.
జీర్ణించుకోలేని విషయమిది.
"అంటే నువ్వు అతడికి భార్యుండగానే, ఇటు నీకు భర్తుండగానే అతడితో సంబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నావన్నమాట."
"చెప్పానుగా ఆర్తీ! శ్యాంని విడిచిపెట్టడానికి నేను సుముఖంగానే వున్నాను."
"ఏం మనిషివే నువ్వు? ఇలా మాట్లాడుతుంటే నీ గురించి తెలిసిన వాళ్లు, నీకు కావాల్సిన వాళ్లు కూడా నవ్విపోతారని నీకు అనిపించడం లేదూ?" ఆర్తి అసహనంగా అంది. "నేను ఆలోచిస్తున్నది నీ దయాకర్ గురించి కాదే... అసలు అతడెవరో తెలీని నేను " అతడిని గురించి కామెంట్ చేయడమూ నేరమే అని అంగీకరిస్తాను. కానీ ఇంత చదువుకున్నావ్... సంఘంలో గౌరవ ప్రదమయిన ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నావ్... ఒక వ్యక్తికి భార్యగా వుంటూ మరో వ్యక్తి భర్తతో అక్రమసంబంధాన్ని పెట్టుకుని బ్రతకాలనుకోవడం దారుణమని ఎందుకు ఆలోచించలేకపోతున్నావ్?"
"అది అక్రమమో, సక్రమమో నా స్థానంలో వుంటే తప్ప నీకు అర్దంకాదు" యథాలాపంగా అంది ధీర.
"అసలు అతడికైనా ఇది తప్పని అనిపించలేదా? అలా చూడకే. ఒక మగాడు ఇద్దరు ఆడవాళ్లని ఒకేసారి ప్రేమించగలడా?అసలు ఇది నమ్మగలిగే విషయమేనా?"
ఆర్తి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే రెప్పలార్పకుండా చూసింది ఆమె.
బాధాకరమైన సాలెగూడులాంటి దాంపత్య జీవితంలో చిక్కుకుని అదే బ్రతుకని రాజీపడే లక్షల, కోట్లమంది స్త్రీలలో ఆర్తికూడా ఒకతె అనిపించిందో లేక తెలివి వుండీ వాస్తవాన్ని అర్దం చేసుకోలేని మేధావి వర్గంలోని ఓ సగటు మనస్తత్వం గల ఆడపిల్లగా బోధపడిందో నిర్లిప్తంగా కళ్లు మూసుకుంది.
కలలోలా చెప్పుకుపోయింది ధీర -
"లోకానికి నేను అర్దంకానని తెలుసు ఆర్తీ! చుట్టూ వున్న ప్రపంచంలోకి చూసి రియాక్టయ్యే సంఘానికి, నాలోకి నేను చూసుకునే నా ఆలోచనలు ఇబ్బందికరంగా వుంటాయని కూడా నాకు తెలుసు. అయినా నేను ఆనందం కోసం అంగలార్చుకుపోతూ ఆ అన్వేషణలో ఓ మగాడ్ని వెదుక్కున్న ఆడదాన్నే. లోకం ఏమనుకున్నా గానీ నా కథకి అతడు స్పందించాడు .నేను మొరపెట్టుకోకుండానే నా మనసుని గ్రహించాడు. నామీద అతడికి ఎంతటి కన్ సర్నో నీకు తెలీదు. అతడికున్న బంధాల మధ్య అప్పుడప్పుడూ విసుక్కుంటేనేం అతడి భావనల మధ్య అతడిలో నేను ఎప్పుడూ వుంటూనే వుంటాను ఆర్తీ! నా మనసే కాదు, నా బుద్ది కూడా అతడిదేనే. సర్వకాలసర్వావస్థలలోనూ నా హితుడూ, స్నేహితుడూ అతడే. నా దుఃఖాన్ని సంతోషంగా, నా కన్నీటిని పన్నీటిగా, నా వ్యథని హృద్యంగా మార్చగలిగే మనిషి అతడు. అతడికి నేనేమౌతానూ అంటే నా దగ్గర జవాబు లేకపోతేనేం నాకు చింతామాత్రంగా అనంతమైన ఆనందాన్ని అందించే శ్రీకృష్ణుడతడు. అతడి కోసం బ్రతికే రాధను నేను, అందుకే మీ నాగరికులు ఆలోచించే సాంప్రదాయాలంటే నేను నవ్వుకుంటాను. నన్ను నిర్భంధించే విశ్వాసాలకన్నా నన్ను అనురాగంతో బంధించగల అతడి స్మృతులే గొప్పవని భావిస్తాను."
"ఓ. కె!" టక్కున అంది ఆర్తి. "ఇక ఆ టాపిక్ వదిలేద్దాం."
"భయంగా వుందా?"
"కాదు. నిన్ను చూస్తుంటే బాధగా వుంది. రేపు నువ్వు ఏమవుతావో అన్న బెంగగానూ వుంది."
ఫకాల్న నవ్వింది ఆమె. "ఇప్పుడు నీకు అలానే వుంటుంది ఆర్తీ! రేపు నీకు కూడా అలాంటి ఓ గొప్ప స్నేహితుడు దొరికాక...."
"ధీరా!" ఆర్దోక్తిగా ఖండించింది ఆర్తి. "నో ..ఐ కాంట్! అలాంటి స్నేహితుడి కోసం నీలా నేను వెంపర్లాడను. అశలు ఆ రూట్ లో అడుగుపెట్టే సాహసం చేయను."
"ఆదిలో నేనూ ఇలాగే ఆలోచించేదాన్నే ఆర్తీ నీకన్నా ఎక్కువగా ఆవేశపడినదాన్నే చివరికి ఏం చేశాను? ముందు నా వెలితి ఏమిటో అర్దంకాక మధనపడ్డాను. అర్దమయ్యేట్టు చేసిన ఓ మంచి స్నేహితుడు దొరికాక ఆ వెలితిని అతడితో నింపుకున్నాను. అలా కోపంగా చూడను. కోరి ఏ ఆడదీ అలాంటి రెండు గుర్రాల స్వారీని ఆశించదు. కానీ ఈ మనసుంది చూశావ్ - మహామొండిది. ఎప్పుడు ఎటు నెడుతుందో, ఏ క్షణంలో ఏ లాలసత్వానికి గురిచేస్తుందో చెప్పలేం."
"ఏ స్థితిలోనూ నేనలా జారిపోను" ఆర్తి కంపించిపోతూనే అంది - "ఇది నిజం."
"నువ్వు బ్రతికేది నిజంలోనే అయితే నేనూ నిజమే అని నీ మాటలని సమర్దించేదాన్ని ఆర్తీ! కానీ నువ్వూ నీడలోనే బ్రతుకుతున్నావు తప్ప నిజంలో కాదని నాకు అర్దమౌతూందిగా."
"ధీరా!" నుదుటి స్వేదాన్ని తుడుచుకుంటూ అంది ఆర్తి "ఈ ప్రపంచంలో చాలామంది దంపతులు విడిపోని జంటలంటే నేను అంగీకరిస్తాను కానీ సుఖపడటం లేదని భావిస్తున్న ప్రతి భార్యా నీలాంటి మార్గంలో అడుగుపెడుతుందంటే నేను ఒప్పుకోను."