Previous Page Next Page 
అభయారణ్యం పేజి 12


    "గుడ్!" అభినందనగా చూసింది ఆమె. "రాజీలేని పోరాటంతో నీ మనసు మీద నువ్వు గెలుపు సాధిచుకోగలిగిన ఆడపిల్లగా నువ్వు నిలబడతావని, అలా నిలబడాలని కోరుకుంటున్నాను ఆర్తీ! కానీ ఒక్క విషము గుర్తుంచుకో. నీకంటూ బాధకలిగినప్పుడు, నీ కళ్ల వెనుక దాగున్న నీటిబొట్లు నీ ప్రమేయం లేకుండా ఉబికినప్పుడు లాలనగా తుడిచే ఓ చేతికోసమో, ఓదార్పు నందించే ఓ మనిషినో నువ్వు తప్పకుండా ఆశిస్తావ్."

    "ఆశించవచ్చు. అలాంటి స్నేహితుడ్నో, స్నేహితురాలినో  సంపాదించుకోనూ వచ్చు. కానీ అంతమాత్రం చేత అది హద్దులుదాటే స్థితికి నెడుతుందని నేను అనుకోను ధీరా!"

    "జవాబుని కాలానకి వదిలేద్దాం" క్షణం ఆగి "అదిసరే! నువ్వు జాబెందుకు చేయడంలేదు?" అంది  ఆమె.

    "డబ్బు అవసరం లేక."

    "జాబ్ అన్నది ఆడదానికి డబ్బు మాత్రమే కాదు ఆర్తీ! ఆత్మస్థయిర్యాన్నీ యిస్తుంది."

    "అదే నిజమైతే మరి నువ్వెందుకు బేలగా మరో దారిలో అడుగుపెట్టావ్?"

    ఆర్తి మాటలకి షాక్ తిన్నట్టుగా చూసిందామె.

    "నేను బేలగా మారాక  ఆ దారిలో అడుగుపెట్టలేదు ఆర్తీ! నాకేం లేదే నేను గ్రహించాక కోరి ఆ మార్గాన్ని ఎన్నుకున్నాను" ఆమె ఇక ఆ ప్రసక్తిని పొడిగించడం ఇష్టం లేనట్టుగా చూసింది.  "అయినా నేను నిన్ను జాబ్ చేయమన్నది నీ అత్త ముందు పనిమనిషిలా తల వంచుకోవడాలు, లోలోనే  కుమిలిపోవడాల నుంచి కాపాడాలని. నీ ఇష్టం. మరి వెళ్లిరానా?"అంది.

    "ఎక్కడికి?"

    క్షణం సాలోచనగా చూశాక అంది ఆమె "నీకు తెలుసు."

    "తెలుసు ధీరా! దయాకర్ చెల్లి పెళ్ళికి కాక దయాకర్ కోసమే నువ్వు వచ్చావనీ తెలుసు."

    ఆమె కూడా నవ్వకుండా వుండలేకపోయింది. "నువ్వు తెలివైన దానివే ఆర్తీ! అందులో సందేహం లేదని అంగీకరిస్తాను."

    ఆమె వెళుతూ అంది  "బహుశా రేపు ఉదయానికిగానీ రాను"

    ఆమె వెళ్లిపోయింది.

    కానీ ఆర్తి వెంటనే తేరుకోలేకపోయింది.

    అసలు ధీర తను చేస్తున్నది రైటని తనకే అనిపిస్తే దయాకర్ చెల్లి పెళ్లని ముందు అబద్దం ఎందుకు చెప్పింది?

    అంటే....

    తను చేస్తున్న తప్పేమిటో తనకీ తెలుసుననేగా.

    తప్పు చేసే ఆడవాళ్లే ఇలా ప్రవర్తిస్తారో లేక తప్పుని తప్పుగా అంగీకరించలేని మొండితనంగల  అమ్మాయిలే ధీరలా మాట్లాడతారో ఆర్తికి అర్దంకాలేదు.

    గాలిని కౌగిలించుకుని సందిట్లో అల్లరి గాలిని కట్టేశానని మురిసిపోయే ధీరలాంటి అమ్మాయిలు విరిగన బ్రతుకు మోకాళ్ల బాధని అనుభవాల రాపిడితో మరిచిపోవాలని ప్రయత్నిస్తుంటారా?

    ఆందోళనగా నిలబడిపోయింది ఆర్తి.



                                                    *    *    *    *

           
    రాత్రి ఎనిమిది గంటల సమయం.

    భాస్వంత్ రాకతో చదువుకున్న నవల్లో నుంచి తల పైకెత్తి చూసింది ఆర్తి.

    "వంటయిందా?" అన్నాడు సీరియస్ గా చూస్తూ.

    ఆమె కంగారుగా కిచెన్ వైపు నడిచింది.

    మరో పది నిమిషాలలో డిన్నర్ పూర్తిచేసిన భాస్వంత్ బెడ్ రూమ్ లోకి నడవబోతుంటే సరస్వతమ్మ వచ్చింది.
 
    "నీతో మాట్లాడాలిరా."

    "చెప్పు" అన్నాడు.

    "నేను మీ అన్నయ్య వాళ్ళింటికి వెళదామనుకుంటున్నాను."

    ఎందుకూ అని అడగలేదు భాస్వంత్. నాన్న పోయాక తల్లి అలా కొడుకులందరి దగ్గరికీ వెళ్లి కొన్ని రోజులుండటం అలవాటుగా మార్చుకుంది.

    "పెద్దన్నయ్య దగ్గరికా?" అన్నాడు.

    "అవును" ఉక్రోషంగా అంది. "అక్కడ కోడలితోబాటు పిల్లలూ వుంటారుగా."

    "సరే" అన్నాడు భాస్వంత్.

    "ఇక జన్మలో నీ ఇంట అడుగు పెట్టను."

    దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న ఆర్తిని చూసిన భాస్వంత్ చాలా అర్దమైనట్లుగా "ఇలారా" అన్నాడు.

    "నిన్నే" భాస్వంత్ గొంతు స్థాయిని పెంచుకుని "ఏం జరిగింది? మాట్లాడవేం?"

    "తెలివైన ఆడదిరా... అదెందుకు మాట్లాడుతుంది. ఒళ్ళుమంటని మరెవరి ద్వారానో తీర్చుకుని ముచ్చటపడుతుంది గానీ."

    ఆర్తి కలవరపడుతూ "అత్తయ్యా! అసలు... "మరేదో చెప్పబోతుంటే సరస్వతమ్మ దురుసుగా పైకి లేచింది ఆర్దోక్తిగా.

    "అసలు అదెవర్తే?" ధీరని ఉద్దేశించి మాట్లాడుతూందని బోధపడిపోయింది ఆర్తికి. "ఆ నవ్వులూ, ఆ వికవికలూ... అమ్మో! సూటిపోటిమాటల్తో నన్ను సాధిస్తుంటే తప్పు అని ఒక్కమాటన్నా అన్నావటే. నీకు బాధ వుంటే నువ్వు నన్ను నిలదీయాలిగానీ పరాయి  ఆడదానిచేత  అనిపిస్తావా? అసలు ఇంటి పరువుని బజారుకెక్కించి మొగుడు గురించి మరో ఆడదానితో చెప్పుకుని ఏడుస్తావా?"

    "లేదు ....లేదత్తయ్యా! నేనలా చెప్పుకోలేదు. చెప్పే మనస్తత్వం కాదు నాది" ఆందోళనగా అందామె కంపించిపోతూ. కర్కశంగా చూస్తున్న భాస్వంత్ తో "నన్ను నమ్మండి! ధీరతో నేనేమీ చెప్పలేదు. అలాంటి అవసరం నాకు లేదు" అంటూ చేతులు జోడించి మరీ చెప్పింది.

    "అంటే తనంతట తానే అంతా వూహించిందా?"

    "ఏమో తెలీదు"
 

 Previous Page Next Page