Previous Page Next Page 
పడిలేచే కడలితరంగం పేజి 13

       
                                                      5)

    "శిల్పా...... నిన్ను నేను కోరుకున్నాను కాని కొనలేదు."

    "అవును..... కోరికతోనే కొన్నారు."

    "శిల్పా!" అతడిలోని సహనం నశించిపోతుంది.

    "శిల్పా....... ప్లీజ్...... ఐలైక్ యూ"

    వీలైనంత సౌమ్యంగా అన్నాడు.

    "ఇది లైక్ నెస్ కాదు...... తప్పించుకో వీలులేక తనకి చిక్కిన లేడిపిల్లపై పులి చూపించే అభిమానం."

    ఆమె మాటలకతడు దారుణంగా గాయపడ్డాడు.

    తనను తాను నిగ్రహించుకున్నట్టుగా చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు.

    "శిల్పా!" దూరంగా కార్పెట్ పై తలగడమీద తలపెట్టుకు పడుకున్న శిల్పను సమీపించాడు.

    "నీ అభిప్రాయం తెలుసుకోకుండా విషయాన్నీ ఓ బిజినెస్ వ్యవహారంలా డీల్ చేయటం పొరపాటే.... ఫర్ గివ్ మి" ప్రాధేయపూర్వకంగా అడిగాడు.

    అతడలా బాధపడుతుంటే ఆమెకు మహదానందంగా ఉంది.

    "అంత తేలిగ్గా మిమ్మల్ని క్షమించడం ఆత్మద్రోహమే మిస్టర్ కిరీటి....." ఆమె గొంతులో హేళన ధ్వనించింది.

    "ఇది మన తొలిరాత్రి....ప్లీజ్ శిల్పా!"

    "మలిరాత్రి అంటూ వుంటేగా తొలిరాత్రి గురించి ఆలోచించటానికి."

    "నా సహనానికి పరీక్ష పెట్టకు." రోషంగా అన్నాడు.

    ఆవేశంగా ఆమె పైకి లేచింది.

    "ఓహో బెదిరిస్తున్నారా! చెప్పండి.... ఏం చేస్తారు. మీ భార్య అనబడే ఈ ఆడపిల్లను బలవంతంగా అనుభవిస్తారు...... లీగల్ గా నన్ను రేప్ చేసి మీ అహంకారాన్ని చల్లార్చుకుంటారు. అంతేగా."

    సిగ్గుతో అతడి తల వాలిపోయింది.

    "సారీ శిల్పా! నేనంత పశువునికాను."

    "ఈజిట్.... అది నిజమే అయితే నిరూపించుకోటానికి ప్రయత్నించండి."

    పరాజితుడిలా ముందుకు నడుస్తున్న కిరీటిని చూసి గర్వంగా నవ్వుకుందామె.

    ఆమె మనసునిండా ఆలోచనలు ముసురుకున్నాయి.

    బాగా పరిచయమున్నట్టుగా అనిపిస్తున్న ఈ కిరీటి ఎవరు?

    తనకోసం ఉచ్చునెందురు పన్నాడు.....

    ఈ పన్నాగంలోని అంతరార్ధం ఏమిటి?

    తన జీవితానికి పర్యవసానం ఎలా వుంటుంది?

    ఆమెకు కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి.... తనకు పరిచయం వున్న అబ్బాయిల్ని గుర్తుకు తెచ్చుకుంది.

    ఎంత జ్ఞప్తికి తెచ్చుకుందామన్నా ఫలితం లేకపోవడంతో 'ఎవరీ కిరీటి..... ఎక్కడో చూసినట్టుందే' అనుకుంది ఎప్పటిలాగే.

                6

    మరుసటి రోజు ఉదయమే వైజాగ్ ప్రయాణమయ్యాడు కిరీటి.

    మరో రెండు రోజులపాటు ఉండమని రంగనాధంగారు బలవంతం చేసినా ససేమిరా వీలు కాదన్నాడు.

    పైగా కిరీటి ఎన్నో వ్యాపారాలతో పరిశ్రమలకధిపతిగా ఎంత బిజీగా వుండేది స్వయంగా చూశారు కాబట్టి ఆపటం భావ్యం కాదని తలపోశారు.

    పరువు బజారున పడకుండా కాపాడిన కిరీటి అంటే కృతజ్ఞత మాత్రమే గాకుండా కూతుర్ని సుఖపెట్టగల సమర్ధుడని కూడా అయనకు అపారమైన విశ్వాసముంది.

    అయినా కూతురు ఇల్లువదిలి వెళ్తుంటే ఆయన కళ్ళనీరు ఆగిందికాదు......

    అదీకాకుండా "పుట్టినింటికి అపఖ్యాతి రాకుండా కాపురాన్ని చక్కబెట్టుకో అమ్మా" అని అన్నప్పుడు శిల్ప ఇచ్చిన జవాబు ఆయన గుండెల్నింకా రంపపుకోత కోసింది.

    "ఈ ఇంటి పరువు బజారున పడకుండా నన్ను బలి పశువునుచేసి వధ్యశిల పైకి నెట్టేశారు... నేనెలా పోతే మీకెందుకు నాన్నా!"

    శిల్ప మాటల్ని ఎంత ప్రయత్నించినా ఆయన మరిచిపోలేకపోయారు.

 Previous Page Next Page