Previous Page Next Page 
పడిలేచే కడలితరంగం పేజి 14

    అందుకే కిరీటిని విడిగా పిలిచి, "చూడు బాబూ! శిల్ప అతిగారాబంగా పెరిగిన ఆడపిల్ల..... అహంకార పూరితమైన ఆలోచనలు తప్ప అనురాగానికి అర్థం తెలీని అమాయకురాలు. ఒక విధంగా ఇది నా పెంపకంలో జరిగిన పొరపాటేనని ఒప్పుకోడానికి నేను సిగ్గుపడను. తెలిసో తెలియకో అదిచేసే ఆకతాయి పనుల్ని, దురుసు ప్రవర్తనని అర్థం చేసుకుని కాపాడుకుంటావన్న నమ్మకంతో నీవెంట పంపుతున్నాను" అంటూ చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డారు.

    మరో గంటలో కారు వాల్తేర్ అప్ లేడ్స్ ని చేరుకుంది.

    మాలినీ నిలయంలో కారు ఆగగానే నౌకర్లంతా బారులు తీర్చి నిలబడ్డారు.

    భూషణ్ మొదలుకొని వంటమనిషి వరకు శిల్పకు అందర్నీ పరిచయం చేశాడు కిరీటి.

    డ్రాయింగుహాలు లగాయతూ వంటగదివరకూ విడివిడిగా చూపించి ఆమెతో సహా తన బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టాడు.

    అల్ట్రామోడర్న్ డిజైన్ తో అందమైన పూలచెట్లు మరింత సుందరమైన పరిసరాలతో సమీపంలో సముద్రపు హోరుతో ఆ భవంతి ఆమెకెంతో నచ్చింది.

    అయినా పెదవి కదిపి ఒక్క మాటా మాట్లాడలేదామె.

    మరో పదిహేను నిముషాలలో తయారైవచ్చిన కిరీటి "ఇదిగాక నాకు అఫీషియల్ కాలనీలో మరో బంగళా, శాంతి ఆశ్రమానికి చేరువగా ఓ గెస్ట్ హౌస్ ఉన్నాయి. ఇక్కడ విసుగనిపించినపుడు అక్కడకు వెళ్ళిరావచ్చు. డాట్సన్ ను డ్రైవరుతో సహా నీకోసం ఏర్పాటు చేశాను" అంటూ హడావుడిగా చెప్పి బయటకు వెళ్ళబోతూ ఒక్కక్షణం ఆగాడు.

    "మరో విషయం..... బిజినెస్ వ్యవహారాలల పడి ఒక్కోమారు నేను భోజనం కూడా మర్చిపోతుంటాను. నా కోసం ఎదురుచూడాల్సిన అగత్యం లేదు. నో ఫార్మాలిటీస్. అన్నట్టు షాపింగ్ కి డబ్బేమన్నా కావలసివస్తే లాకర్ లో వుంది."

    తాళాలు అందించబోతుంటే విసురుగా చేతిని వెనక్కి లాక్కుంది.

    "ఈ బంగారు పంజరంలో నాకోసం మీరు చేసిన ఏర్పాట్లకు చాలా సంబరంగా వుంది. మీరిచ్చిన డబ్బుకు బదులుగా బానిసనై మీ వెంట వచ్చిన నేను మీ డబ్బుని మరింత వాడుకుని ఋణగ్రస్తురాల్ని కాలేను. ఐమీన్ డబ్బుకు బదులుగా మీరు నాదగ్గర మరేమన్నా కోరితే ఇవ్వటానికింకేమీ లేదు."

    ఛెళ్ మనిపించిందామె జవాబు.

    అన్యమనస్కంగానే ఫ్యాక్టరీకి బయలుదేరిన కిరీటి ఆఫీసులో అందరి నమస్కారాలను అందుకుంటూ ఎమ్ డి చాంబర్ ను చేరుకున్నాడు.

    భూషణ్ అందించిన పెండింగ్ పేపర్సుని సైన్ చేసి ఎక్స్ పోర్టు మెటీరియల్స్ కి సంబంధించిన ఫైలును తిరగేస్తూ చాలాసేపు కూర్చున్నాడు.

    దేనిపైనా మనసు లగ్నం కావటంలేదు.

    ఫోన్ మ్రోగటంతో విసుగ్గా రిసీవర్ని అందుకున్నాడు.

    సేట్ ప్రమోద్ లాల్.... ఎల్ క్ట్రోడ్స్ కంపెనీ యజమాని.....

    "వ్వాట్ మిస్టర్ కిరీటి.... ఇట్స్ టూ బాడ్...."

    "యు మీన్....."

    "ది మేరేజ్ విచ్ యూ హావ్ డన్ వితౌట్ ఇన్ ఫార్మింగ్ ఎనీబడీ...." నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు.

    "ఏదో అలా అర్టెంటుగా జరిగిపోయింది."

    "నో నో నో..... నువ్వు చేసిన పొరపాటుకి చాలా హెచ్చు పెనాల్టీ చెల్లించుకోవాల్సి వుంటుంది."

    "విత్ ప్లెజర్...."

    "ఏమైనా లవ్ మేరేజ్.."

    "ఉహుఁ...."

    "ఇట్సాల్ రైట్.... మనవాళ్ళందరికీ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేయాలి."

    "అలాగే....."

    ఫోన్ పెట్టేసిన మరుక్షణం మరో ఫోన్.

    ఊపిరి తిరగలేదు కిరీటికి.

    చెప్పకుండా పెళ్ళిచేసుకున్నందుకు నొచ్చుకోవడాలూ, శుభాకాంక్షలూ..... అభినందనలూ....

    ఫోన్ల ఉధృతానికి తట్టుకోలేక 'ఎమ్ డి యీజ్ నాట్ ఎవైలబల్ ఇన్ సీట్' అని చెప్పమని ఎక్స్ ఛేంజ్ ఆపరేటర్ కు ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వమని భూషణ్ కు చెప్పేటంతలో మరో ఫోన్....

 Previous Page Next Page