కిరీటి ఒంటరివాడు కావటంతో అతని తరపున బంధువులెవరూ రాలేదు, ఒక్క భూషణ్ తప్ప.
అతడు కనీసం మిత్రుల్ని కూడా ఎవర్నీ పిలవకపోవటం రంగనాధంగార్కి బాధ అనిపించింది.
అందుకే ఇరువురి తరపున పెళ్ళి పెద్దగా వ్యవహరించారు.
గుట్టుచప్పుడు కాకుండా జరిగిన పెళ్ళి చివరికి ఆనోటా ఆనోటా పల్లెలోని ప్రజలకి తెలిసిపోవటంతో రంగనాధం గారు పొలంలో పనిచేసే పాలెకాపులకు మాత్రం చెప్పారు అబ్బాయి అభీష్టం ప్రకారం అలా చేయాల్సివచ్చిందని.
తరతరాలనుండి వస్తున్న సాంప్రదాయం ప్రకారం పెళ్ళి జరగకపోయినా పేదలకు మాత్రం అన్నవస్త్రాలను దానం చేశారు రంగనాధంగారు.
కిరీటి తనకు వ్యవధిలేదని ఎంత చెబుతున్నా చివరికి ఒప్పించి పెళ్ళయిన నాటిరాత్రి లోగిలిలోనే శోభనం ఏర్పాటు చేశారు రంగనాధంగారు.
మనసులో విపరీతంగా ఆలోచనలు ముప్పిరికొన్నప్పుడు తప్ప కిరీటి సిగరెట్ కాల్చడు.
ఖరీదైన అగరువత్తుల పరిమళంతోను, పందిరికోళ్ళ మంచాన్ని అందంగా అల్లుకున్న మల్లెమాలల సౌరభంతోను నిండిన గదిలోని వాతావరణం విచిత్రమైన మత్తుకి, పులకింతకీ కారణమౌతుంటే అతని పెదవులు సమ్మోహనంగా విచ్చుకున్నాయి.
దాంపత్య భవంతికి తొలిరాత్రి పునాది అంటారు భవిష్యత్తులో మోయాల్సిన బరువును మోయగల చిత్తస్థైర్యాన్ని అనురాగాల అంతస్థులనెన్నింటినైనా వేయగల మనోనిబ్బరాన్ని కలిగించే ఆ పునాది బలంగా ఉండాలన్నది అనాదిగా వస్తున్న ఆర్యోక్తి.
తత్తరపాటులాంటిది కలుగుతుంటే కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు.
చిరువెన్నెల నీడన పల్లె ఆదమరచి నిద్రపోతోంది.
ఆకాశంలోని చందమామ తప్పిపోయిన ప్రియురాలిని వెదుకుతున్నట్టుగా హడావుడిగా పరుగులు తీస్తున్నాడు.
చిరుగాలులు దోసిళ్ళతో ఒంపుకున్న నైట్ క్విన్ ల పరిమళం అతని శరీరానికి చందనమై అతని మనసును మధురోహల నందనవనంగా మారుస్తోంది.
గది తలుపులు తెరుచుకున్న చప్పుడుతో అతనిలోని తలపులు ముడుచుకున్నాయి.
భవనం నుండి అనుభవానికి లాక్కుపోయే వివశత్వం......
నెమ్మదిగా వెనక్కి తిరిగాడు.
పాల నురుగువంటి తెల్లని పట్టుచీరను ధరించి పసిమి ఛాయను పుణికి పుచ్చుకున్న కాంచనగంగలా, రసరమ్య గీతికల ఓలలాడింప దివినుండి దిగిన అప్సరసలా, తెలిమబ్బుల మేలి ముసుగులో నులివెచ్చని అనుభూతులనందించే తొలకరిజల్లులా, అల్లనల్లన నడచి వచ్చిన అజంతా చిత్రసుందరిలో అనిపించిన శిల్పను లాలనగా గుండెలకు హత్తుకోవాలని తీయని తొలిరాత్రిని మాయని ఓ మధురక్షణంగా మలుచుకోవాలనిపించింది.
"శిల్పా!"
ఏకవచనంతో సంబోధించాలని తమ మధ్య దూరం తరిగిపోయిందని చెప్పాలనిపించే లాలసత్వం....
చివాలున అతనివైపుకు తిరిగిందామె.
"ఏం..... మీ సొత్తుగా మారిన ఈ గాజుబొమ్మను పరామర్శిస్తున్నారా! లేక మీ ఆనందంకోసం కొనుక్కున్న ఈ వస్తువు అనుభవానికేమైనా ఉపయోగపడుతుందేమో పరీక్షించాలనుకుంటున్నారా?" ద్వేషంతో అదురుతున్న ఆమె పెదవుల్ని చూసి అప్రతిభుడయ్యాడు.
"శిల్పా!" ఆర్థ్రంగా మరేదో చెప్పాలనుకున్నాడు.
"మిస్టర్ కిరీటి.... మీరు కొన్నది నన్నే కానీ నా మనసును కాదు."
"శిల్పా! నిన్ను నేను కోరుకున్నది నా భార్యగానే కాని భోగ్య వస్తువుగా కాదు."
"సర్ ప్రైజింగ్..... భార్యకీ, భోగ్యవస్తువుకీ మధ్య తేడా కూడా ఉందని తెలుసన్నమాట మీకు."
"శిల్పా!"
"యస్ మిస్టర్ కిరీటి.... మీ ఫ్యాక్టరీలోని ఓ యంత్రంలా నన్ను ఖరీదుకట్టి కొనుక్కున్నారు."