ప్యాలెస్ 'గంధర్వ'లో వికీ కనిపించడంలేదని తెలిసి ధర్మలింగం రౌద్రమూర్తి అయిపోయాడు. అప్పటికప్పుడు అతడి బాడీగార్డ్స్ ని డిస్ మిస్ చేసి వికీని వెదకడానికి మనుషుల్ని పంపాడు.
అవమానభారంతో తిరిగి వస్తున్న వికీని వాళ్ళు మధ్యలోనే పట్టుకొన్నారు.
"చప్పాపెట్టకుండా ఇలా వచ్చేస్తే ఎలా బాబూ? మీకేదన్నా జరిగితే మేనేజరుగారు మా ఉద్యోగాలేకాదు, మాప్రాణాలే తీస్తారు. రండి! కారెక్కండి" వికీ నిశ్శబ్దంగా కారెక్కి కూర్చొన్నాడు.
బంగళా ఆవరణలో అతడు కారు దిగీ దిగగానే ధర్మలింగం "అమ్మయ్యా! క్షేమంగా తిరిగి వచ్చారు కదా? మీరు కనిపించడం లేదని నౌకర్లు చెప్పగానే నా ప్రాణం ఎగిరిపోయినట్టుగా అయ్యింది. వయసు పైబడుతున్నవాణ్ణి. హైరానా పెట్టడం భావ్యమా?" తేలిగ్గా ఊపిరిపీల్చుకొంటూ అన్నాడు.
ధర్మలింగానికి సమాధానం చెప్పలేదు వికీ. ముందుకు వచ్చిన నౌకరుకు సంచీ, బైనాక్యులర్ అందించి సరాసరి మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు.
ఎవరో సాదాసీదా మనిషిలా కారులేకుండా కాలినడకతో అలా అలా షికార్లు చేసొచ్చిన అతడిని చూసి ధర్మలింగం చిన్నగా నిట్టూర్చాడు. ఇతడికి తల్లి నాజూకైన రూపమేకాదు. ఆమె బుద్దులు కూడా వచ్చినట్టున్నాయి. లక్షలుపోసి కొన్న కార్లుండగా ఆవిడా ఇలాగే అతి సాదా దుస్తుల్లో నడిచి షికారు చేసొచ్చేది.
గుడిసెలు కనిపిస్తే వెళ్ళి వాళ్ళ కుక్కిమంచాల్లో కూర్చొని సరదాగా వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడేది. రాజాసాబ్ కోప్పడినా ఆ ఇంటి సంప్రదాయాలు గుర్తుచేసినా ఆవిడ పంథా ఆవిడదిగానే ఉండేది.
వికీ ఉదాశీనంగా తనగదిలోకి వచ్చి ఈజీచెయిర్ లో వాలి కణతలు రుద్దుకోసాగాడు.
ఎంతో ఆహ్లాదంగా గడిచిపోవలసిన సాయంత్రం ఎంతో అవమానంతో ముగిసింది. భ్రమరాంబిక పరిచయం తన జీవితంలో ఒక అందమైన అనుభూతిగా ముద్రింపబడడానికి బదులు ఎంతటి గాయాన్ని చేసింది?
'రక్తంలో వున్న బుద్దులు అప్పుడే బయటపడుతున్నాయన్న మాట' అంటే ఏమిటి అర్ధం?
"భోజనానికి లేవండి బాబూ!" తుంగభద్ర వచ్చి పిలిచింది. నలభయ్యేళ్ళుగా 'గంధర్వ'లో పనిచేస్తున్న పరిచారిక ఆమె! సుమారుగా ఏభైఏళ్ళ వయస్సుంటుంది మంచి రంగులో వయసులో ఉండగా మగ వాళ్ళను ఒక ఊపు ఊపినట్టుగా అనిపిస్తుంది. చక్కగా దువ్వుకొని, పూలూ కాటుక పెట్టుకొని పరిశుభ్రంగా ఉంటుంది.
"భోజనం సంగతి తరువాత. నిన్నొకమాట అడుగుతాను, చెబుతావా తుంగభద్రా?"
"అడగండి చినబాబూ!"
"రక్తంలో వున్న బుద్దులు అప్పుడే బయటపడుతున్నాయన్నమాట అంది ఈరోజు ఒకమ్మాయి. అంటే నా తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదనా అర్ధం?"
"ఎవరన్నారు చినబాబూ?"
"ఆ అమ్మాయి పేరు 'భ్రమరాంబిక' అట!"
తుంగభద్ర ముఖం పాలిపోయినట్టుగా అయ్యింది. షాక్ తగిలినట్టుగా కొద్ది క్షణాలు ఏం మాట్లాడలేకపోయింది. చివరికి మెల్లగా అడిగింది. "ఏం జరిగిందసలు, చినబాబూ?"
వికీ చెప్పాడు సాయంత్రం జరిగిన సంఘటన. "నువ్వు చెప్పు, తుంగభద్రా! ఆ అమ్మాయి నన్ను అపార్ధం చేసుకొందా లేదా?" కొంచెం ఉద్వేగంతో అడిగాడు.
సమాధానం చెప్పలేనట్టుగా ముఖం త్రిప్పేసుకుంది తుంగభద్ర.
"మాట్లాడు తుంగభద్రా! నువ్వూ నన్ను అపరాధిగానే భావిస్తున్నావా?"
"ఏం మాట్లాడను, బాబూ? భావం ఏదైనాకాని ఒక ఆడపిల్లను తాకడం తప్పే కదా?"
"నీ తీర్పూ నేను దోషిననేనా?" అతడి ముఖం నల్లటి మబ్బేదో క్రమ్మినట్టుగా అయ్యింది. "నా రక్తాన్ని నిందించడమంటే నా తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదనే కదా అర్ధం?"
"అమ్మగారివల్ల ఒకే ఒక్క తప్పు జరిగింది బాబూ! అది.......భార్యాబిడ్డలున్న వాడిని ప్రేమించి ఆయనతో జీవితం పంచుకోవడం! అంతకుమించి ఏ పాపమూ చేయలేదామె. కరుణగల తల్లిగా ఆమె పేరు తెచ్చుకొంది. ఎవరైనా ఆపద అని తల్లడిల్లితే, ఆడపిల్ల పెళ్ళి అని చెబితే వెనకా ముందూ చూడకుండా డబ్బులిచ్చి పంపేది. ఇక మీ తండ్రిగారు చెడ్డవారు ఏం కాదుగాని......"
"కాని.........?! ఏం విషయం దాచకుండా చెప్పు!"
"ఏ విషయంలోనైనా ఆయన హుందాగా ఉండేవారు. మంచి వ్యవహారదక్షులుగా, తెలివైనవారుగా పేరు తెచ్చుకొన్నారు. కాని, ఒకే ఒక్క బలహీనత......... తండ్రి తాతలనుండి సంక్రమించింది అది భోగలాలసత! కాస్త అందమైన స్త్రీలు ఈయన కంటబడితే వాళ్ళకిక ముప్పు తప్పదన్నమాటే! ఒకసారి.... ఆయన వయసులో ఉండగా......... అప్పటికి మీ అమ్మగారు ఆయన జీవితంలో అడుగుపెట్టలేదింకా......."
తుంగభద్ర మనసులో జ్ఞాపకాల పుటలు తెరుచుకొన్నాయి. దాదాపు ఇరవయ్యేళ్ళ క్రిందటి సంగతి!...........
....................................
మైసూర్ మహారాజా ప్యాలెస్ ను తలపిస్తున్నట్టుగా ఉన్న రాజభవనం..... 'గంధర్వ'
వెలుగుతున్న విద్యుద్దీపాలు భవనాన్ని, భవనం చుట్టూ వున్న తోటనీ అత్యద్భుత దృశ్యంగా మలుస్తున్నాయి, ఫౌంటెన్ల నుండి జారిపడుతున్న నీటిధారలు మెర్కూరీ దీపాల వెలుగులో యవ్వనకాంతలు హొయలు ఒలికిస్తున్నట్టుగా ఉన్నాయి. తోటలో అలుముకొన్న రకరకాల పూలపరిమళం అల్లరి పిల్లలా గాలి చెలికానితో కలిసి మత్తుగా తేలిపోతున్నది!
ప్యాలెస్ 'గంధర్వ' రాజా మోహనవంశీ గారిది!
అది శ్రావణమాసం! పౌర్ణమి ముందొచ్చిన రెండవ శుక్రవారం!
రాజావారి ధర్మపత్ని రాజ్యలక్ష్మీదేవి వరలక్ష్మీ అమ్మవారి వ్రతం నోచుకొని ఊరి ముత్తయిదువులందరినీ పేరంటం పిలిచింది.