Previous Page Next Page 
నిషా పేజి 12

    ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగేదే!

    ఇప్పుడేకాక నవరాత్రుల్లో బొమ్మలపేరంటం, కాళీపూజ జరుగుతాయి దాసీలను పంపి ఊళ్ళో ప్రతి ముత్తయిదువని, ఆడపిల్లల్ని బొట్టుపెట్టి పిలిపించడం జరుగుతుంది.

    'గంధర్వ' పేరంటం , అంటే ఊరి ముత్తయిదువలకీ, పిల్లలకీ జాతరకు వెడుతున్నట్టుగా సంబరం! ఎందుకంటే గంధర్వలో ప్రవేశం అప్పుడు తప్ప ఇంకెప్పుడూ వీలుకాదు! వాచ్ మెన్లు, గేటు దగ్గరుండే గూర్ఖా ఈగను కూడా లోపలికి చొరవనీయరు మామూలు సమయాల్లోనయితే.

    అడుగడుగునా సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తినట్టుగా అపూర్వమైన కట్టడపుపనితో, అపూర్వమైన వస్తుసముదాయంతో సామాన్యులు కలలో కూడా ఊహించుకోలేనట్టుగా ఉంటుంది ఆ భవనం!

    తాత ముత్తాతలు కట్టించిన పాతకోట శిధిలావస్థకు చేరుకోగా, దాన్నే పునరుద్దరించడం ఇష్టంలేక దాన్ని వదిలిపెట్టి, దానికి కొంచెం ఎడంగా ఈ క్రొత్త ప్యాలెస్ 'గంధర్వ'పేరుతో ఇటీవలే నిర్మింపజేశాడు మోహనవంశీ. డబ్బుకు వెనుకాడకుండా ఆయన అభిరుచుల కనుగుణంగా, అత్యద్భుతంగా రూపొందించబడిందీ 'గంధర్వ'

    రెండో అంతస్తుకు చేరుకోవడానికి అటువైపునుండి, ఇటువైపునుండి కట్టబడిన మెట్లు, ముందు ప్యాలెస్ ని కాపలాకాస్తున్నట్టుగా భీకరంగా నిలబడిన గోధుమరంగులో రెండు ఎత్తయిన సింహాలు, మెట్లు ఆకరైన చోట కత్తి చేతబట్టుకొన్న నిలువెత్తు సిపాయి బొమ్మలు, లోపలికి వెడితే దర్బార్ హాల్, వాళ్ళ పూర్వీకులు యుద్దాల్లో, వేటలో ఉపయోగించిన ఆయుధాలు, వేటాడిన జంతువుల బొమ్మలు, మయసభలా మైమరిపించే పెద్ద పెద్ద అద్దాలు, రాత్రికాగానే వెలుగులు విరజిమ్మే షాండియర్లు, క్రింద మెత్తటి తివాసీలు, పాలరాతి పలకలు అద్దిన గోడలు. వాళ్ళ వంశవృక్షాన్ని తెలుపుతూ వాళ్ళ పూర్వీకుల నిలువెత్తు పెయింటింగ్స్, క్రింద రాయబడిన వారి సాహసాలు, విజయాలు.....

    ఇవి ప్యాలెస్ ఆకర్షణలో కొన్ని అయితే అద్భుతసౌందర్యంతో అలరారే రాజ్యలక్ష్మీదేవి ఆకర్షణ మరో ఎత్తు. మల్లెమొగ్గ అప్పుడే రేకులు విడుతున్నంత సుతారంగా కనిపిస్తుందామె. బంగారంతో నేసినట్టుగా ఉండే చీరల్లో ఒంటినిండా బంగారం నగలతో, మందిరంలో వెలిగిపోయే మహాలక్ష్మిలా వుండే ఆమెను రెండు కళ్ళు చాలవన్నట్టుగా చూసేవాళ్ళు. ఆమె చేసే పన్నీటి స్నానాల గురించి , వాడే సౌందర్య పోషకాలగురించి, దాసీలు చేసే అలంకరణ గురించి కథలు కథలుగా చెప్పుకొనే వాళ్ళు జనం.

    పేరంటానికి వచ్చిన బ్రాహ్మణ ముత్తయిదువులకు ప్రత్యేక గౌరవం లభించేది. చాట వాయినంతో పాటు పట్టుచీరా పట్టురెవికా పెడుతుంది రాజ్యలక్ష్మీదేవి. స్వయంగా పసుపుకుంకుమలిచ్చి, తాంబూలదక్షిణలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొంటుంది.

    మిగతావాళ్ళకి రెవికగుడ్డ లిప్పించేది పూలు, తాంబూలం సరేసరి

    ఈసారి ఆస్థాన పండితుడు హయగ్రీవం భార్య రాలేదు! ఆయన కూతురు లలితాపరమేశ్వరి వచ్చింది. ఆ అమ్మాయికి ఈ సంవత్సరమే వివాహమైంది.

    "మీ అమ్మగారు రాలేదేమిటి?" అడిగింది రాజ్యలక్ష్మి.

    "అమ్మ బయటుందండి!"

    "మీ అత్తవారింటి నుండి ఎప్పుడొచ్చావు? అక్కడ మీ వాళ్ళంతా బావున్నారా?"

    "బావున్నారండీ! నేనొచ్చి వారం రోజులైంది. తొలిశ్రావణం కదా? వరలక్ష్మీ నోము పట్టిస్తామని తీసుకువచ్చి, తనేమో బయట చేరింది!"

    "అలాగా? పెళ్ళి చేసుకొని నీ పెనిమిటిని నాకు చూపలేదేమిటి?"

    రాజ్యలక్ష్మి చేసిన హాస్యానికి సిగ్గుపడిపోయింది లలితాపరమేశ్వరి.

    "అబ్బో! ఎంత సిగ్గో! మీ ఆన కోసం భద్రంగా దాచుకో పిల్లా!" వేళాకోళం చేసింది.  "అవునుగానీ, నువ్వు కీర్తనలు చక్కగా పాడతావని మీ అమ్మగారు చెబుతుంటారు. ఏదీ, ఒక కీర్తనపాడు!"

    "ఒక్కదాన్ని పాడటమంటే భయమేస్తుందండీ. అమ్మతోడుగా ఉంటే పాడేదాన్ని"

    "నేనుంటాను నీకు తోడు ఏం? తుంగభద్రా, వీణ తీసుకురా!"

    వీణ తీసుకువచ్చి తివాసీ ముందుంచింది తుంగభద్ర. రాజ్యలక్ష్మి వీణ మీటుతుంటే, "సరోజదళ నేత్రి........ హిమగిరి పుత్రి." అన్న శ్యామశాస్త్రివారి కృతి శంకరాభరణంలో పాడింది పరమేశ్వరి.

    "ఓహ్! చాలా చక్కటి గాత్రం! సంసారంలో పడి అలక్ష్యం చేయకేం?" ప్రశంసగా అంది రాజ్యలక్ష్మి.  "మీ అత్తారింట్లో ఇష్టపడతారా ఈ సంగీతం ఇదీ?"

    "ఇష్టపడతారండీ! మా మామగారు కర్ణాటక సంగీతంలో గొప్ప విద్వాంసులు, సుబ్రహ్మణ్యంగారని, కచేరీలు చేస్తుంటారు కూడా!"

    "ఆహా! అదృష్టవంతురాలివన్నమాట!"

    ఈసారి రాజ్యలక్ష్మి పాడింది. నటరాగంలో "సరసీరుహాసన ప్రియే......అంబ....." అంటూ.

    తుంగభద్ర కాళ్ళకు పసుపురాయగా, పసుపుకుంకుమలిచ్చి, చాటవాయినం ఇచ్చి, పట్టుచీరా రెవికగుడ్డా పెట్టింది రాజ్యలక్ష్మి పరమేశ్వరికీ, పురోహితుడి భార్య అరుంధతికీ.

    చివరగా దక్షిణ తాంబూలాలు పుచ్చుకొని వెళ్ళొస్తానండీ!" అంది పరమేశ్వరి.

    "మంచిదమ్మా!ఎప్పటికీ ఇలాగే రావాలి!"

    "ఆ చాటలు ఇక్కడే ఉంచేసి పొండి, అమ్మాయిగారూ! నేనొచ్చేప్పుడు తీసుకువస్తాను" అంది తుంగభద్ర. ఆమె ఇల్లు హయగ్రీవం ఇంటి వెనకాలే వుంటుంది.

 Previous Page Next Page