అతడు కీర్తిశేషులైన రాజామోహన్ వంశీ కొడుకు.
అందమైన ఆడది కంటబడితే వదిలిపెట్టని ఘనకీర్తి ఆ వంశానికుంది.
భ్రమర కళ్ళలో జుగుప్సతో కూడిన జలదరింపు చోటుచేసుకొంది.
తను ఎలాంటి మనిషిని తాకి పరిచర్యలు చేయడానికి పూనుకొంది.
అతడు ఎంతో సాదాసీదాగా వున్నాడు. చెబితేగాని ఒక రాజుగారి కొడుకని తెలియదు! వెంట నౌకర్లు చాకర్లు లేకుండా, కారు లేకుండా ఓ బట్టసంచీ భుజాన వ్రేళాడేసుకొని ఒక సాధారణ పౌరుడిలా ఊళ్ళో ఊరేగితే ఎవరుమాత్రం గుర్తుపట్టగలరు? అతడు ఇంకా అలాగే చూస్తున్నాడు. "నువ్వు ఈ లోకపు మనిషివి కావు. అవునా? అదిగో! అక్కడ కనిపించే బంగారు లోకం నుండి దిగి వచ్చావుకదూ? చెక్కిళ్ళా? చెక్కుటద్దాలా? మంచు శకలాలా? లేక శిరీష కుసుమాలా?" ఆ చెంపల నునుపుకు ముగ్ధుడై తన పొడవైన చేతులు చాచి సుతిమెత్తగా తాకాడు.
ఆ క్షణంలో బుసకొడుతున్న నాగకన్యే అయిపోయింది భ్రమర. ఆమె చెయ్యి పాము పడగలా కస్సుమని పైకి లేచి అతడి చెంపల్ని ఛెళ్ళుఛెళ్ళుమనిపించింది.
వికీ తెల్లటి చెంపలమీద ఆమె వ్రేళ్లగుర్తులు ఎర్రగా ముద్రింపబడి భగ్గుమన్నాయి!
ఇంతవరకు ఎంతో సహృదయంతో, సస్నేహంగా తన గాయాల్ని తుడిచిన చెయ్యే అంత నిర్దాక్షిణ్యంగా తన చెంపల్లో అగ్నిని ఎందుకు రగిల్చిందో తెలియలేదు.
తత్తరపాటుతో అయోమయంగా చూశాడు వికీ.
"సరిగా కూతైనా పట్టలేదు! అప్పుడే ఆడపిల్లల షికారీ మొదలు పెట్టావా? రక్తంలో వున్న బుద్దులు అప్పుడే బయటపడుతున్నాయన్నమాట!"
అతడి ముకం తెల్లకాగితం కన్నా తెల్లగా పాలిపోయింది.
"నేనేం చేశానిప్పుడు మిమ్మల్ని? అంతమాట ఎందుకన్నారు?" గాయపడ్డట్టుగా అడిగాడు.
"ఇంకా ఏం చేశానని అడుగుతున్నావా? నిరంతరం జపతపపూజల్లో నిమగ్నమై, సంగీత నృత్యాలతో దేవుడిని అర్చించే వేదప్రకాశంగారి అమ్మాయిని మోహావేశంతో తాకడానికి నీకెన్ని గుండెలుండాలి? నిప్పు......నిప్పుకణికలాంటి ఈ భ్రమరాంబిక దగ్గరా నీ రసిక ప్రదర్శన?" భ్రమర కళ్ళిప్పుడు కలువరేకులు కాదు, నిప్పులు చెరిగే అగ్నిగుండాలయ్యాయి.
"మీరు చాలా తప్పుగా అర్ధం చేసుకొన్నారు నన్ను"
"ఇంకేం మాట్లాడకు!" కొట్టినట్టుగా అంది.
"నువ్వు రాజావారి అబ్బాయివే కావచ్చు, నీకు ధనబలం ఉండొచ్చు. ఇంకే బలమైనా ఉండొచ్చు అయినా నాకేం భయంలేదు. వెనుదిరిగి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది.
వాళ్ళకు కొంచెం దూరంగా ఆగిపోయి చూస్తున్నాడు శిఖామణి. భ్రమర వెళ్ళగానే దగ్గరికి వచ్చాడు. "చాలా పొరపాటు చేశారు చినబాబు. ఆమె ఎవరనుకొన్నావు? హోమగుండంలాంటి వేదప్రకాశంగారి పెద్ద కూతురు భ్రమరాంబిక. శివుని గుడిలో పార్వతి అంత పవిత్రమైనది. మీరు తాకవలసిన మనిషికాదామె." మందలింపుగా అన్నాడు.
"ఈ చేతులంత అపవిత్రమైనవా? నాకు తెలిసినంతవరకు ఈ చేతులేమి పాపం చేయలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండీ ఈ చేతులతో బొమ్మలు వేయడం తప్ప ఇంకే అపవిత్రమైన పనీ చేయలేదే!" విచలితమైన స్వరంతో అన్నాడతను.
"ఆమెను చూసి మీలో ఏ చెడుభావం కలగందే ఆమె చెంపల్ని ఎందుకు స్పర్శించారు?" సూటిగా అడిగాడు శిఖామణి.
"అంతటి సౌందర్యం నేనెక్కడా చూడలేదు పూజారిగారూ! ఆమె మానవకాంత కాదనిపించింది. ఒకసారి ఆమెను తాకి చూడాలనిపించింది. కేవలం ఒక సౌందర్యభావం, మరే చెడు ఉద్దేశ్యంతోనూ తాకలేదు. అపరాధం ఏమీ లేకుండానే దండనా?"
"ఆమెను తాకాలన్న భావం కలగడమే మీరు చేసిన అపరాధం"
"సౌందర్యారాధన అపరాధం ఎలా అవుతుంది?"
"సౌందర్యారాధనకీ, శరీరాకర్షణకీ పెద్ద తేడా ఏముంటుంది చినబాబూ? రెంటిలోనూ రసికభావం చోటు చేసుకొనే ఉంటుంది కదా? సౌందర్యారాధన అంటే మనసుతో అనుభవించడమే కదా! శరీరంతో అనుభవిస్తే అపవిత్రం, మనసుతో అనుభవిస్తే పవిత్రమూ ఎలా అవుతుంది?"
"కాదు, కాదు. ఆరాధనవేరు. అనుభవించడం వేరు. మీరు గుడిలో దేవిని ఆరాధిస్తారు. అది అనుభవించడం అంటారా?" "ఆరాధన అంటే అర్చన. మీరిప్పుడు భ్రమర చెంపల్ని తాకి అదే అర్చన చేశారా?"
శిఖామణి చేసిన వ్యంగ్యానికి సమాధానం చెప్పలేనట్టుగా చూశాడు వికీ. కాని, అంతటి అభాండం నెత్తినవేసుకోడానికి బాధగా ఉంది. భ్రమరపట్ల తనకు ఎలాంటి చెడు తలపు కలుగలేదని ఎలా చెబితే వీళ్ళకి అర్ధమౌతుంది. ఏం చేస్తే వీళ్ళ అపార్ధం తొలగుతుంది.
చక్కటి ప్రకృతి సౌందర్యం వీక్షిస్తూ, హాయిగొలిపే పరిసరాల మధ్య కూర్చొని బొమ్మలు గీయాలని తెచ్చుకొన్న డ్రాయింగ్ షీట్ రంగు, బ్రష్ లు భుజాన వున్న సంచీలోనే వుండిపోయాయి. ఇక అక్కడ ఒక్క క్షణం వుండాలనిపించలేదతడికి.
వికీ చిన్నబుచ్చుకొన్న ముఖంతో గుట్టదిగి వెళ్ళిపోతుంటే శిఖామణి ముఖంలో అదే వ్యంగ్యహాసం మెదిలింది. వీళ్ళు చేసే సౌందర్యోపాసన ఎవరికి తెలియదని? అందమైన స్త్రీ ఎక్కడ వున్నా వీళ్ళ గెస్ట్ హౌస్ 'కృష్ణమహల్' చేరవలసిందే! వీళ్ళ రసిక ప్రదర్శనకు ఎందరు స్త్రీల జీవితాలు నిర్దాక్షిణ్యంగా నేలరాయబడలేదు. ఎందరి జీవితాలు విషాదగాధలు కాలేదు. పాపం, భ్రమర మేనత్త లలితా పరమేశ్వరి............
ఇరవయ్యేళ్ళ క్రితం........
ఈ కథ తుంగభద్ర చెబితేనే బాగుంటుంది.
* * *